సమస్యలు పరిష్కరించకుంటే దశల వారీగా ఉద్యమానికి కార్యాచరణ
పోరాటానికి వివిధ సంఘాల నుంచి 15 మందితో స్టీరింగ్ కమిటీ
డీఏ బకాయిలు, పీఆర్సీ, సీపీఎస్ రద్దు వంటి ప్రధాన డిమాండ్ల సాధనే లక్ష్యం
కొత్త ప్రభుత్వంలో తొమ్మిది నెలలు ఎదురు చూశాం..
ఒక్క సమస్యా పరిష్కరించలేదు... ఉద్యోగ సంఘాల జేఏసీ ఆవేదన
అమెరికా పర్యటన తర్వాత సీఎం దృష్టికి తీసుకెళ్తాం..
జేఏసీ చైర్మన్ జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ శ్రీనివాసరావు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరి 9 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క హామీ అమలు కాకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పోరాట ప్రణాళికను రచిస్తున్నారు. ఇప్పటివరకు వేర్వేరుగా ప్రభుత్వానికి తమ డిమాండ్లను ముందుంచిన ఉద్యోగ సంఘాల నేతలు ఒకే వేదికపైకి వచ్చారు. సోమవారం నాంపల్లిలోని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం కేంద్ర కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఉమ్మడి కార్యాచరణ సమితి(జేఏ సీ) ఏర్పాటుకు సంఘాల నేతలు ఏకగ్రీవంగా మద్దతు పలికారు. జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ)గా ఏర్పాటైన ఈ కమిటీకి చైర్మన్‌గా టీఎన్జీఓ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ వ్యవహరిస్తారు. జేఏసీ సెక్రటరీ జనరల్‌గా ఏలూరి శ్రీనివాసరావు కొనసాగుతారు. ఈ కమిటీలో తెలంగాణ ఎంప్లాయిస్, గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్, పెన్షనర్స్ సంఘాలు ప్రాతినిధ్యం వహించనున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హర్షవర్దన్‌రెడ్డి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న పీఆర్టీయూ టీజీ సైతం ఇదే జేఏసీలో భాగస్వామ్యమైంది. ప్రస్తుతం 15 మందితో స్టీరింగ్ కమిటీని వేసినప్పటికీ వారం, పది రోజుల్లో అన్ని సంఘాలను సంప్రదించి వారి ఆమోదంతో పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాయి.
ముందుగా ప్రభుత్వానికి సమాచారం అందించాలనీ, అప్పటికీ సమస్యల పరిష్కారానికి చొరవ చూపకుంటే 15 రోజుల్లో తమ కార్యాచరణను ప్రకటించాలని సోమవారం నాటి సమావేశంలో వివిధ సంఘాల నేతలు కమిటీ ముందు స్పష్టం చేయగా... ఆమేరకు తీర్మానించాయి. తర్వాత జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ కార్యాచరణకు సంబంధించి వివరాలు వెల్లడించారు.
హక్కుల కోసం కొట్లాడతాం:మారం జగదీశ్వర్
‘రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైంది. ప్రస్తుతం ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు అందించడం ఎంతో సంతోషకరం. ఆర్థిక స్థితిని ఆగం చేసి అప్పులపాలు చేసిన గత ప్రభుత్వ తీరును పరిగణించి కొంత సమయం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో సూచించారు.
ప్రస్తుతం వేచి చూసే పరిస్థితి దాటింది. సీఎం నుంచి ఇప్పటివరకు ఎలాంటి పిలుపు రాలేదు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం.. రాష్ట్రానికి వచ్చిన తర్వాత జేఏసీ తరపున కలిసి పరిస్థితిని వివ రిస్తాం. ఆయన నుంచి వచ్చే స్పందన బట్టి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం.
నాలుగు డీఏ బకాయిలు, సీపీఎస్ రద్దు, పీఆర్సీ ఖరారు, హెల్త్ కార్డుల జారీ ప్రక్రియ, జీవో 317 సమస్యల పరిష్కారం ప్రధాన సమస్యలుగా గుర్తించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాం. గచి్చ»ౌలి, భాగ్యనగర్ సొసైటీ స్థలాలనూ ఉద్యోగులకు అప్పగించాలి.’
జేఏసీ నిర్ణయంతోనే పోరాడుతాం: ఏలూరి శ్రీనివాసరావు
ప్రభుత్వ శాఖల్లో దాదాపు 53 సంఘాల ప్రతినిధులతో చర్చించి జేఏసీ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశాం. ఉద్యోగుల సమస్యలను జేఏసీ ద్వారానే ప్రభుత్వానికి వివరిస్తాం. సమస్యలు వందల్లో ఉన్నప్పటికీ 36 అంశాలను ప్రాధాన్యత క్రమంలో కూర్పు చేసి ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం తీసుకున్నాం.
ఇందులో ఆర్థిక పరమైన భారం లేనివి కూడా ఉన్నాయి. ఇలాంటి సమస్యలను వేగవంతంగా పరిష్కరించే అవకాశం ఉంది. వీటన్నింటినీ సీఎం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వచ్చే స్పందన ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం. 010 పద్దు కింద లేని ఉద్యోగులకు, మోడల్ స్కూల్, కేజీబీవీలు తదితర సంస్థల్లో పనిచేస్తున్న వారికి వేతనాలు ఆలస్యంగా అందుతున్నాయి. ముందుగా ఈ–కుబేర్ అనేది రద్దు చేయాలి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలి.
తీర్మానించిన వాటిలో ప్రధానాంశాలు..
» సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
» మెరుగైన ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు
» పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలి
» ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వి సు నిబంధనల అమలు
» ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపు
» జీవో 317 సమస్యల సత్వర పరిష్కారం
»కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణ
Comments
Please login to add a commentAdd a comment