సమైక్య ఉద్యమాన్ని తీవ్రతరం చేయూలని తిరుపతి ఉద్యోగ, కార్మిక జేఏసీ నిర్ణయించింది.
సమైక్య ఉద్యమాన్ని తీవ్రతరం చేయూలని తిరుపతి ఉద్యోగ, కార్మిక జేఏసీ నిర్ణయించింది. జేఏసీ చైర్మన్ ఆర్డీవో రామచంద్రారెడ్డి నేతృత్వంలో మంగళవారం జరిగిన జేఏసీ సమావేశం ఉద్యమ తీవ్రతను పెంచుతూ కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ నెల 14, 15 తేదీల్లో 48 గంటల పాటు తిరుపతి నుంచి తిరుమలకు ఆర్టీసీ, ప్రయివేటు వాహనాలతో పాటు, ద్విచ క్రవాహనాలను కూడా అనుమతించకూడదని నిర్ణయించింది.
తిరుమలకు బంద్‌ను మినహాయించాలని కోరుతూ ఆర్డీవో రామచంద్రారెడ్డితో టీటీడీ అధికారుల సంఘం నేతలు టి.రవి, శేషారెడ్డి, చెంచులక్ష్మి చర్చలు జరిపారు. దాదాపు గంట పాటు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీనిపై రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తమకు తిరుమలకు వచ్చే భక్తులపై వ్యతిరేకత లేదని, ఇక్కడ జరిగే బంద్ ప్రభావం ఢిల్లీకి తెలియూలనే ఉద్దేశంతోనే 48 గంటల పాటు తిరుమల బంద్‌కు పిలుపునిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు కూడా ఇందుకు మద్దతు ప్రకటించారని తెలిపారు.
తిరుమలకు ఏ వాహనం వెళ్లకుండా ఉండేందుకు ప్రయివేటు టాక్సీల యూనియన్‌ను కూడా ఈ బంద్‌లో సహకరించాలని కోరనున్నామని చెప్పారు. భక్తులు కూడా ఈ రెండు రోజులు తిరుమల పర్యటనను రద్దు చేసుకోవాలని కోరారు. తిరుపతిలో ఈ నెల 14వ తేదీ రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది వరకు విద్యుత్ సరఫరాను ఆపివేస్తామని, ఈ సమయంలో ప్రజలు కొవ్వొత్తులతో దేవదేవునికి అఖండ జ్యోతిని వెలిగించాలని కోరారు.