Tirupati Bandh
-
14, 15 తేదీల్లో తిరుమలకు వాహనాల బంద్
సమైక్య ఉద్యమాన్ని తీవ్రతరం చేయూలని తిరుపతి ఉద్యోగ, కార్మిక జేఏసీ నిర్ణయించింది. జేఏసీ చైర్మన్ ఆర్డీవో రామచంద్రారెడ్డి నేతృత్వంలో మంగళవారం జరిగిన జేఏసీ సమావేశం ఉద్యమ తీవ్రతను పెంచుతూ కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ నెల 14, 15 తేదీల్లో 48 గంటల పాటు తిరుపతి నుంచి తిరుమలకు ఆర్టీసీ, ప్రయివేటు వాహనాలతో పాటు, ద్విచ క్రవాహనాలను కూడా అనుమతించకూడదని నిర్ణయించింది. తిరుమలకు బంద్‌ను మినహాయించాలని కోరుతూ ఆర్డీవో రామచంద్రారెడ్డితో టీటీడీ అధికారుల సంఘం నేతలు టి.రవి, శేషారెడ్డి, చెంచులక్ష్మి చర్చలు జరిపారు. దాదాపు గంట పాటు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీనిపై రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తమకు తిరుమలకు వచ్చే భక్తులపై వ్యతిరేకత లేదని, ఇక్కడ జరిగే బంద్ ప్రభావం ఢిల్లీకి తెలియూలనే ఉద్దేశంతోనే 48 గంటల పాటు తిరుమల బంద్‌కు పిలుపునిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు కూడా ఇందుకు మద్దతు ప్రకటించారని తెలిపారు. తిరుమలకు ఏ వాహనం వెళ్లకుండా ఉండేందుకు ప్రయివేటు టాక్సీల యూనియన్ను కూడా ఈ బంద్‌లో సహకరించాలని కోరనున్నామని చెప్పారు. భక్తులు కూడా ఈ రెండు రోజులు తిరుమల పర్యటనను రద్దు చేసుకోవాలని కోరారు. తిరుపతిలో ఈ నెల 14వ తేదీ రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది వరకు విద్యుత్ సరఫరాను ఆపివేస్తామని, ఈ సమయంలో ప్రజలు కొవ్వొత్తులతో దేవదేవునికి అఖండ జ్యోతిని వెలిగించాలని కోరారు. -
నేడు, రేపు తిరుపతి బంద్
తిరుపతి కార్పొరేషన్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర సాధనలో భాగంగా నేడు, రేపు తిరుపతి బంద్‌కు స్వచ్ఛంద, ఉద్యోగ సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. మంగళవారం మబ్బు చెంగారెడ్డి ఆధ్వర్యంలో టౌన్‌క్లబ్‌లో అన్ని ఉద్యోగ, స్వచ్ఛంద సంస్థల జేఏసీ నాయకులు సమావేశమయ్యారు. బుధ, గురువారాల్లో బంద్‌ను ఏవిధంగా నిర్వహించాలన్నదానిపై సుదీర్ఘం గా చర్చించారు. అనంతరం ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులతో జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్, జాయింట్ కలెక్టర్ వినయ్‌చంద్, ఎస్పీ రాజశేఖర్‌బాబు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో గంటపాటు సమావేశం అయ్యారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. తిరుపతికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా బంద్ నుంచి యాత్రికులు, భక్తులకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఇస్కాన్ ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలకు దాదాపు 2 లక్షల మంది దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తుంటారని వారికి ఇబ్బంది కలిగించవద్దని సూచించారు. రైల్వే స్టేషన్ నుంచి తిరుమలకు వె ళ్లే భక్తుల సౌకర్యార్థం టీటీడీ 10 ఉచిత బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బంద్ నేపధ్యంలో నగరంలో టీటీడీ బస్సుల్లో ప్రయాణించే భక్తులకు ఆహారపొట్లాలు ఉచితంగా సరఫరా చేయనున్నారు. శాంతియుతంగానే బంద్ రాజకీయాలకు అతీతంగా 48 స్వచ్ఛంద, ఉద్యోగ సంఘాలతో రెండు రోజులబంద్ చేస్తున్నామని మబ్బు చెంగారెడ్డి తెలిపారు. ఒక్కో బ్యాచ్‌కు 500 మంది చొప్పున నగరంలో మొత్తం 20 బృందాలతో రౌండ్ద క్లాక్ పద్ధతిలో బంద్‌ను పర్యవేక్షిస్తారన్నారు. నగరంలో ద్విచక్ర వాహనాలు మినహా ఆటో, రిక్షా, జీపు, ట్యాక్సీలు, లారీలు తిరగవన్నారు. అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల జోలికి వెళ్లేది లేదన్నారు. బెంగళూరు మార్గం నుంచి ఎవరైనా తిరుమలకు వెళ్లాలంటే బైపాస్ మీదుగా చెర్లోపల్లె, జూపార్కు మీదుగా అలిపిరికి, ఎయిర్‌పోర్టు నుంచి వచ్చే వారు కరకంబాడి మీదుగా లీలామహల్, కపిలతీర్థం అలిపిరి వరకు చేరుకోవచ్చన్నారు. పాలు, మెడికల్ షాపులతో పాటు హాస్పిటల్ సేవలు మినహాయింపు ఉంటుందన్నారు. తిరుపతి, తిరుమలలో పెళ్లిళ్లు చేసుకునే వారు వాహనాలకు జై సమైక్యాంధ్ర స్టిక్కర్, పెళ్లి కార్డుతోపాటు, పెళ్లికొడుకు,పెళ్లికూతురు ఫొటోలు అతికించాలన్నారు. -
బంద్ నేపథ్యంలో టీటీడీ ఉచిత బస్సులు: జిల్లా కలెక్టర్
రాష్ట్ర విభజన కు నిరసనగా 48 గంటల పాటు తిరుపతి బంద్ నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలుగకుండా జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. భక్తుల సౌకర్యం కోసం ట్రాఫిక్ నిబంధనలను సడలించారు. తిరుమల చేరుకునే విధంగా బైపాస్ మార్గం గుండా భక్తులను అనుమతించనున్నారు. రేపటి నుంచి 48 గంటల పాటు తిరుపతి బంద్ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ట్రాఫిక్ నిబంధనల సడలించాం. బైపాస్ మార్గం గుండా తిరుమలకు వెళ్లేలా చర్యలు తీసుకుంటాం. తిరుమల ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం ఉండదు. భక్తుల సౌకర్యార్ధం టీటీడీ ఉచిత బస్సులు నడుపుతుంది. జిల్లా కలెక్టర్ ఆరోగ్యరాజు వెల్లఢించారు.