ఉద్యోగుల జేఏసీ ఆందోళన వాయిదా | Adjournment of JAC agitation of employees | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల జేఏసీ ఆందోళన వాయిదా

Published Mon, Feb 26 2024 4:58 AM | Last Updated on Mon, Feb 26 2024 11:58 AM

Adjournment of JAC agitation of employees - Sakshi

సాక్షి, అమరావతి: తమకు రావాల్సిన ఆర్థిక, ఆర్థికేతర ప్రయోజనాలు నెరవేర్చేందుకు ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇవ్వడంతో ఈ నెల 27న ఉద్యోగ సంఘాల రాష్ట్ర జేఏసీ తలపెట్టిన ‘బీఆర్‌­టీఎస్‌ మహా ఆందోళన’ను తాత్కా­­లికంగా వాయిదా వేసినట్లు జేఏసీ చైర్మన్, ఏపీ ఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడ ఏపీ ఎన్జీవో హోమ్‌లో ఆదివారం నిర్వహించిన విలేక­రుల సమావేశంలో ఆయన మాట్లా­డుతూ ఉద్యోగులకు సత్వరమే 12వ పీఆర్సీ ప్రయోజ­నాలు కల్పించేలా పీఆర్సీ కమిషన్‌ వేగంగా పనిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, కాబట్టి మధ్యంతర భృతి అవ­సరం లేదని ప్రభుత్వం చెప్పిందని తెలిపారు.

ఉద్యో­గు­ల వైద్య ఖర్చుల నిమిత్తం ఆస్పత్రులకు చెల్లించాల్సిన మొత్తంలో రూ.70 కోట్లు, సీపీఎస్‌ ఉద్యోగులకు టీఏ, డీఏల నిమిత్తం చెల్లించాల్సిన మొత్తంలో రూ.100 కోట్లను వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రుల బృందం స్పష్టం చేసినట్లు చెప్పారు. పెన్షనర్ల డిమా­ండ్లలో ప్రధానమైన క్వాంటం ఆఫ్‌ పెన్షన్‌­లో మార్పులకు చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు తెలిపారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణలో ఉన్న అవా­ంతరాలను అధిగమించి వారికి న్యాయం చేసేందుకు కూడా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని తమకు ఇచ్చిన ఒప్పంద పత్రంలో పేర్కొన్నట్లు వివరించారు.

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 30 శాతం జీతం పెంపు కూడా తమ ఒప్పందంలో ఉందన్నారు. ఉద్యోగ సంఘాలు కోరిన డిమాండ్లలో కొన్నింటిని సాధించుకున్నామని తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం రాతపూర్వకంగా చేసు­కున్న ఒప్పందం ప్రకారం డిమాండ్లను మార్చి నెలా­ఖరునాటికి పూర్తిగా నెరవేరుస్తుందనే ఆశాభావంతో తమ ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు తెలిపారు. అయినప్పటికీ తమ ఉద్యోగులను బెదిరించడాన్ని ఖండిస్తూ ఈ నెల 27వ తేదీన జిల్లాల్లో ఏపీ ఎన్జీవో కార్యా­ల­యాల వద్ద ఉద్యోగులు నిరసన తెలుపుతారని చెప్పారు. ఈ సమావేశంలో జేఏసీ కార్యదర్శి కేవీ శివారెడ్డి, జేఏసీ­లోని వివిధ సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement