bandi srinivasa rao
-
దాడులు సరికాదు.. చంద్రబాబుకు బండి శ్రీనివాసరావు బహిరంగ లేఖ
సాక్షి, విజయవాడ: టీడీపీ, జనసేన కార్యకర్తల దాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. సీఎం చంద్రబాబుకు ఏపీఎన్జీవో సంఘ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగులపై దాడులు చేయడం సరికాదని వారిని దూషిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగులు.. ప్రభుత్వంలో భాగస్వాములు.. వారికి అండగా ఉండి మానసికస్థైర్యం కల్పించాలని కోరారు.‘‘రాష్ట్ర అభివృద్ధిలో వారిదే కీలకపాత్ర. ఉద్యోగులకు వ్యక్తిగత అజెండాలు ఉండవు. రాజ్యాంగాన్ని సంరక్షిస్తూ విధులు నిర్వర్తించడమే ఉద్యోగుల కర్తవ్యం. రాజకీయ పార్టీలతో ఉద్యోగులకు సంబంధంలేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే విధులు నిర్వహిస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన దగ్గర నుంచి టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు ఉద్యోగులను దూషిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. నర్సీపట్నంలో టీడీపీ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు నడిరోడ్డుపై మున్సిపల్ అధికారులను బూతులు తిట్టి దౌర్జన్యపూరితంగా మాట్లాడారు. ఇది ఉద్యోగులను తీవ్ర భయాందోళనలకు గురిచేసే విధంగా ఉంది’’ అని బండి శ్రీనివాస్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.‘‘అనంతపురంలో టీడీపీ నేత జేసి ప్రభాకర రెడ్డి.. రవాణా శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు, డీటీసీ శివరాంప్రసాద్‌లను నా కొడకల్లారా.. నరుకుతా... అంటూ బహిరంగంగా మీడియా ముందు మాట్లాడటం వారిని దూషించడాన్ని ఖండిస్తున్నాం. ఉద్యోగులను బెదిరించడం ఆ ఉద్యోగుల కుటుంబసభ్యులను సైతం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎలక్ట్రికల్ డీఈ మన్నెం విజయ భాస్కరరావు ఇంటిలోకి వెళ్లి జనసేన కార్యకర్తలు బలవంతంగా క్షమాపణలు చెప్పించారు. విధినిర్వహణలో తప్పుచేసి ఉంటే ఆయనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేయడం దారుణం. ఉద్యోగులతో సమస్యలు ఉంటే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి. ఉద్యోగులపై బెదిరింపులకు, దాడులకు దిగడం, విధులకు ఆటంకం కలిగించడం వంటివి విడనాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అంటూ లేఖలో బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు. -
ఉద్యోగుల జేఏసీ ఆందోళన వాయిదా
సాక్షి, అమరావతి: తమకు రావాల్సిన ఆర్థిక, ఆర్థికేతర ప్రయోజనాలు నెరవేర్చేందుకు ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇవ్వడంతో ఈ నెల 27న ఉద్యోగ సంఘాల రాష్ట్ర జేఏసీ తలపెట్టిన ‘బీఆర్టీఎస్ మహా ఆందోళన’ను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు జేఏసీ చైర్మన్, ఏపీ ఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడ ఏపీ ఎన్జీవో హోమ్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు సత్వరమే 12వ పీఆర్సీ ప్రయోజనాలు కల్పించేలా పీఆర్సీ కమిషన్ వేగంగా పనిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, కాబట్టి మధ్యంతర భృతి అవసరం లేదని ప్రభుత్వం చెప్పిందని తెలిపారు. ఉద్యోగుల వైద్య ఖర్చుల నిమిత్తం ఆస్పత్రులకు చెల్లించాల్సిన మొత్తంలో రూ.70 కోట్లు, సీపీఎస్ ఉద్యోగులకు టీఏ, డీఏల నిమిత్తం చెల్లించాల్సిన మొత్తంలో రూ.100 కోట్లను వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రుల బృందం స్పష్టం చేసినట్లు చెప్పారు. పెన్షనర్ల డిమాండ్లలో ప్రధానమైన క్వాంటం ఆఫ్ పెన్షన్‌లో మార్పులకు చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణలో ఉన్న అవాంతరాలను అధిగమించి వారికి న్యాయం చేసేందుకు కూడా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని తమకు ఇచ్చిన ఒప్పంద పత్రంలో పేర్కొన్నట్లు వివరించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం జీతం పెంపు కూడా తమ ఒప్పందంలో ఉందన్నారు. ఉద్యోగ సంఘాలు కోరిన డిమాండ్లలో కొన్నింటిని సాధించుకున్నామని తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం రాతపూర్వకంగా చేసుకున్న ఒప్పందం ప్రకారం డిమాండ్లను మార్చి నెలాఖరునాటికి పూర్తిగా నెరవేరుస్తుందనే ఆశాభావంతో తమ ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు తెలిపారు. అయినప్పటికీ తమ ఉద్యోగులను బెదిరించడాన్ని ఖండిస్తూ ఈ నెల 27వ తేదీన జిల్లాల్లో ఏపీ ఎన్జీవో కార్యాలయాల వద్ద ఉద్యోగులు నిరసన తెలుపుతారని చెప్పారు. ఈ సమావేశంలో జేఏసీ కార్యదర్శి కేవీ శివారెడ్డి, జేఏసీలోని వివిధ సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. -
త్వరలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ పేరు మార్పు
సాక్షి, అమరావతి: ఇప్పటివరకు ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌గా ఉన్న తమ సంఘం పేరును త్వరలో ఏపీ నాన్ గెజిటెడ్ అండ్ గెజిటెడ్ ఆఫీసర్స్ (ఎన్జీజీవో) అసోసియేషన్‌గా మార్పు చేయనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ప్రకటించారు. సంఘం రాష్ట్ర 21వ కౌన్సిల్ సమావేశాల్లో రెండో రోజు ఆయన మాట్లాడారు. సంఘం పేరు మార్చేందుకు తీర్మానం చేసినట్లు చెప్పారు. గెజిటెడ్ అధికారులకు సంఘంలో సభ్యత్వం ఇచ్చేందుకు అనుగుణంగా ఈ మార్పు చేసినట్లు తెలిపారు. గతంలో తమ సంఘంలో ఉన్న ఉద్యోగులు కొందరు గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంకులోకి వెళ్లారని, దీంతో వారిని కూడా సంఘంలో చేర్చుకోవాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచామని, వీలైనంత వేగంగా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని వెల్లడించారు. ప్రభుత్వంతో సామరస్యంగా ఉండి డిమాండ్లను సాధించుకుంటామన్నారు.సంఘం నిర్వహించే మహాసభలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించడం 7 దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోందని, అందులో భాగంగానే సీఎం జగన్‌ను ఆహ్వానించామని చెప్పారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించేందుకు ప్రభుత్వం అంగీకరించడం శుభ పరిణామమన్నారు. కౌన్సిల్ సమావేశాల ముగింపు సందర్భంగా జిల్లాల పునర్విభజనతో కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు కొత్త కార్యవర్గాలను ఎన్నుకోవాలని, మరింత మంది మహిళలకు నూతన కార్యవర్గంలో చోటు కల్పించాలని తీర్మానించారు. ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు సురేష్ లాంబ, 26 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
దశాబ్దాల సమస్యలను నాలుగేళ్లలో పరిష్కరించారు
సాక్షి, అమరావతి: దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను సీఎం జగన్ నాలుగేళ్లలోనే పరిష్కరించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఏపీ ఎన్జీవోల సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వపరంగా ముఖ్యమంత్రి తీసుకునే విధానపరమైన నిర్ణయాలను ప్రజల చెంతకు చేర్చాల్సిన బాధ్యత ఉద్యోగులదే కాబట్టి వారు ప్రశాంతంగా పనిచేసుకునేలా అనువైన వాతావరణాన్ని కల్పించారని చెప్పారు. ఉద్యోగులకు సమస్యలు లేకుండా ఉంటే మరింత మనసుపెట్టి పని చేయగలరని బలంగా విశ్వసిస్తూ వారి సమస్యలన్నీ సీఎం జగన్ పరిష్కరించారని తెలిపారు. ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులను రాజకీయాల కోసం వాడుకోకూడదని సీఎం దృఢంగా భావిస్తారని చెప్పారు. అలాంటి స్థిరమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే పరిపాలన ఎలా ఉంటుందో, సమస్యలను పరిష్కరించే ఆలోచన, ఎంత తక్కువ సమయం తీసుకుంటారో ఈ నాలుగేళ్లలో అందరూ చూశారన్నారు. కోవిడ్ సంక్షోభం సమయంలో అన్ని రకాలుగా ప్రజలకు తామున్నామని ప్రభుత్వం ముందడుగు వేయడంలో సీఎం ఆలోచనకు తోడు ఉద్యోగుల పాత్ర కూడా కీలకమన్నారు. స్వల్ప వ్యవధిలో కీలక మార్పులు: బండి శ్రీనివాసరావు ప్రభుత్వ వ్యవస్థలో అతి తక్కువ కాలంలో అనేక మార్పులు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో గ్రామాల రూపరేఖలనే మార్చేశారన్నారు. 1.35 లక్షల ఉద్యోగాలు కలి్పంచి గ్రామ స్థాయికే పరిపాలనను వికేంద్రీకరించారని గుర్తు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేసిన ఘనత కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని ప్రశంసించారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దికరించాలని కోరితే సుప్రీంకోర్టు తీర్పు ఉందని గత ప్రభుత్వం తప్పించుకుందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వారిని క్రమబద్దికరించడం గొప్ప విషయమన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులకు హెచ్ఆర్ఏ 16 శాతం పెంచిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిదేనన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు ఒకటో తేదినే జీతాలు ఇవ్వడం కూడా ఈ ప్రభుత్వంలోనే మొదలైందన్నారు. జీపీఎస్ విధానానికి ఏపీ ఎన్జీవో సంఘం ఆమోదం తెలుపుతున్నట్లు ప్రకటించారు. సంయమనంతో పనిచేశారు: సీఎస్ ఉద్యోగులకు సంబంధించిన అంశాలన్నింటినీ సానుకూలంగా పరిష్కరించామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. కష్టకాలంలో ఉద్యోగులు ఎంతో సంయమనంతో పనిచేశారని అభినందించారు. సమావేశాల్లో ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డి, ఎన్జీవోల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి, మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురే‹Ù, జోగి రమేష్, ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
అక్టోబర్ 2న ‘సెల్యూట్ సీఎం సర్’
సాక్షి, అమరావతి: సచివాలయ ఉద్యోగులు అక్టోబర్ 2న ప్రతి సచివాలయం పరిధిలో సెల్యూట్ సీఎం సర్ కార్యక్రమం నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు ఎండీ జానీ పాషా పిలుపునిచ్చారు. విజయవాడలో ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్. చంద్రశేఖర్‌రెడ్డి, ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తదితరులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నూతన పేస్కేల్‌తో కూడిన కొత్త జీతాలు వచ్చాయని, ఈరోజు తమకు శుభ దినమని తెలిపారు. సచివాలయ ఉద్యోగుల చరిత్రలో ఇది ఒక నూతన అధ్యాయమని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ 1.30 లక్షల మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని, ఇది చెరగని చరిత్ర అని తెలిపారు. సచివాలయ ఉద్యోగుల జీవితాల్లో ఇది సువర్ణ అధ్యాయమన్నారు. తమకు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ నూతన పేస్కేళ్ళు వర్తింపచేయడంతో విమర్శలు చేసిన వారి నోళ్లు మూగబోయాయని అన్నారు. ఇంత మందికి మంచి జరగడం సహించని వారు ఈ ఉద్యోగాలు పర్మినెంట్ కాదని, తాత్కాలికమేనని, రూ.15 వేలకు మించి జీతం పెరగదంటూ ఉద్యోగులను కించపరిచేలా అనేక అవాస్తవాలు ప్రచారం చేశారని చెప్పారు. పేస్కేల్స్‌తో జీతం ఇవ్వడం తమకు వరమైతే కొందరు కుట్రదారులకు చెంపపెట్టులా నిలిచిందన్నారు. సీఎం మాట నిలబెట్టుకున్నారు: చంద్రశేఖర్‌రెడ్డి మాట తప్పని, మడమ తిప్పని సీఎం మాట ఇస్తే ఎలా ఉంటుందో మరోసారి నిరూపితమైందని ప్రభుత్వ సలహాదారు ఎన్. చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి జూలై ఒకటి నుంచి సచివాలయ ఉద్యోగులకు నూతన పేస్కేల్ ప్రకారం జీతం అందించారని కొనియాడారు. నవ చరిత్రకు నాంది: బండి శ్రీనివాసరావు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ సీఎం చేయని సాహసాన్ని ఏపీ సీఎం జగన్ చేశారని, నవ చరిత్రకు నాంది పలికారని తెలిపారు. ఇంత గొప్ప వ్యవస్థను సృష్టించి యువతకు శాశ్వత భరోసా కల్పించడం గొప్ప విషయమన్నారు. తమ కలలు సాకారమైన వేళ గుండెలు నిండా అభిమానంతో ఈ సమావేశంలో పలువురు సచివాలయ ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ‘సెల్యూట్ సీఎం సర్’ అంటూ నినాదాలు చేశారు. -
సీఎం హామీ ఇచ్చిన తర్వాత నిరసనలెందుకు?
అమలాపురం టౌన్: పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీపై ఉద్యోగులకు పూర్తి నమ్మకం ఉందని రాష్ట్ర రెవెన్యూ జేఏసీ చైర్మన్ వీఎస్ దివాకర్ తెలిపారు. సీఎం హామీ ఇచ్చిన తర్వాత కూడా నిరసనలు ఎందుకని ప్రశ్నించారు. పీఆర్సీ సాధన కోసం ఉద్యమిస్తున్నామని చెప్పుకుంటున్న రెండు జేఏసీల నిరసనల్లో రెవెన్యూ ఉద్యోగులెవరూ పాల్గొనడం లేదన్నారు. మంగళవారం తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో వీఎస్ దివాకర్ మీడియాతో మాట్లాడారు. రెవెన్యూ జేఏసీలో భాగస్వాములుగా ఉన్న ఏపీ గ్రామ సహాయకుల సంఘం, ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం, ఏపీ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్, ఏపీ తహసీల్దార్ అసోసియేషన్, డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్లు జేఏసీల నిరసనల్లో పాల్గొనడం లేదని చెప్పారు. జేఏసీల చైర్మన్లు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు వెనుక రెవెన్యూ ఉద్యోగులెవరూ లేరన్నారు. పీఆర్సీ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత ఉద్యమ కార్యాచరణలోకి దిగడమేమిటని ప్రశ్నించారు. వారి తీరు అనుమానాస్పదంగా ఉందన్నారు. 2019 ఎన్నికలప్పుడు రాష్ట్ర సచివాలయం నుంచి బొప్పరాజు వెంకటేశ్వర్లు తహసీల్దార్లకు ఫోన్లుచేసి టీడీపీకి ఓటు వేయించాలంటూ ఆదేశాలిచ్చారని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు పీఏ డైరీలో బొప్పరాజుకు రూ.2 కోట్లు ఇచ్చినట్లు రాసి ఉందంటూ వచ్చిన వార్తలపై దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవన నిర్మాణాల కోసం చేసిన వసూళ్లపైనా బొప్పరాజు సమాధానం చెప్పాలన్నారు. సీఎంపై ఉద్యోగులకు నమ్మకముంది ఏపీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సామల సాక్షి, అమరావతి: పీఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి న్యాయం చేస్తారని నమ్ముతున్నట్లు ఏపీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ను ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఇటీవల వరద ప్రాంతాల పర్యటన సందర్భంగా కలసిన ఉద్యోగులకు సీఎం పీఆర్సీ అమలు చేస్తామని ప్రకటించడాన్ని గమనించాలన్నారు. -
నా మాటలను వక్రీకరించారు
శ్రీకాకుళం అర్బన్: రాజకీయ స్వలాభం కోసం తన మాటలను కొన్ని పత్రికలు, మీడియా వక్రీకరించి కథనాలు ఇచ్చాయని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు చెప్పారు. సోమవారం శ్రీకాకుళంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన 71 సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. ఉద్యోగ సంఘాల ఉద్యమాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య సఖ్యత చెడగొట్టేందుకే కొన్ని మీడియా సంస్థలు తన మాటలను వక్రీకరించాయని చెప్పారు. ఉద్యోగ సంఘాలు ఏ పార్టీకీ తొత్తులు కాదని, ఉద్యోగుల సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఉద్యోగులకు కష్టమొస్తే ప్రభుత్వంపైనే అలుగుతామని, సమస్యలు పరిష్కరిస్తే అదే ప్రభుత్వానికి, సీఎంకు పాలాభిషేకం చేస్తామని పేర్కొన్నారు. పీఆర్సీ నిరసనల్లో పాల్గొనం ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్, గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం సాక్షి, అమరావతి: పీఆర్సీ ప్రకటించాలంటూ ఉద్యోగ సంఘాల జేఏసీలు మంగళవారం నుంచి తలపెట్టిన నిరసన కార్యక్రమాల్లో తాము పాల్గొనడం లేదని ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్, ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరమ్ తెలిపింది. ఈ మేరకు ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.రవికుమార్, ప్రధాన కార్యదర్శి డి.రమణారెడ్డి, గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరమ్ అధ్యక్షుడు ఏవీ పటేల్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పీఆర్సీని పది రోజుల్లో ప్రకటిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలియజేసినందున.. మంగళవారం నుంచి జేఏసీలు చేపట్టే నిరసన కార్యక్రమాల్లో తాము పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. ఉద్యోగుల, అధికారుల సంక్షేమం విషయంలో సీఎం జగన్‌పై తమకు విశ్వాసం ఉందన్నారు. -
పీఆర్సీ ప్రక్రియ నెలాఖరుకు పూర్తి
సాక్షి,అమరావతి: అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించి 11వ పీఆర్సీ ప్రక్రియను తక్షణమే ప్రారంభించి ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి హామీ లభించిందని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల హెల్త్ కార్డులు పొడిగించేందుకు అంగీకరించారని, సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని సీఎంవో నుంచి హామీ లభించిందని తెలిపారు. జేఏసీల తరపున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగుల సంక్షేమం కోసమే రెండు జేఏసీలు కృషి చేస్తాయని, సీపీఎస్ రద్దు, పీఆర్సీ, ఫిట్మెంట్ సాధన కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు. సీఎం అదనపు కార్యదర్శి కె.ధనంజయరెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి సీఎంవోలో ఉద్యోగ సంఘాలతో సుదీర్ఘంగా చర్చించి తాము ఇచ్చిన వినతి పత్రంలోని అంశాలను పరిగణలోకి తీసుకున్నారని తెలిపారు. ఉద్యోగుల సహకారం మరువలేనిదని, కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక ఇబ్బందులతో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరిస్తామని చెప్పారన్నారు. 18, 19న సీఎస్‌తో భేటీ! సీపీఎస్ రద్దు, పీఆర్సీ, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపు తదితర అంశాలను ప్రస్తావించినట్లు ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. నెట్వర్క్ ఆస్పత్రులతో సమావేశం ఏర్పాటు చేసి హెల్త్ కార్డు ద్వారా ఉత్తమ వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. 45 రోజుల్లోనే కారుణ్య నియామకాలు ఇవ్వాలని కోరగా సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 17, 18వ తేదీలలో జరుగుతుందన్నారు. పీఆర్సీపై ఈ నెల 18, 19వ తేదీల్లో ఉద్యోగ సంఘాలతో సీఎస్ సమావేశాన్ని నిర్వహించి చర్చించే అవకాశం ఉందన్నారు. ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడంపై ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు. సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు జి.హృదయరాజు, వైవీ రావు, కేవీ శివారెడ్డి, జీవీ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలం
సాక్షి, అమరావతి: ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి త్వరలోనే పీఆర్సీ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తమకు తెలియజేశారని ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నందున ముందు పీఆర్సీ ఇస్తామని, తరువాత డీఏలు ఇస్తామని సీఎం తమతో అన్నారని ఆయన వెల్లడించారు. సీపీఎస్ రద్దుపై ఇచ్చిన హామీ కూడా నిలబెట్టుకుంటామని చెప్పారన్నారు. సీఎం వైఎస్ జగన్‌ను బుధవారం ఏపీ ఎన్జీవో సంఘ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నేతలతో కలిసి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే.. ► 11వ పీఆర్సీ నివేదిక ఇచ్చి చాలా రోజులవుతున్నందున జాప్యం లేకుండా 2018 జులై 1 నుండి 55 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని ఇవ్వాలని కోరాం. ► డీఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని అడిగాం. ► సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని కోరాం. ► ఉద్యోగులకు సంబంధించిన ఇతర సమస్యలను కూడా సీఎం దృష్టికి తీసుకొచ్చాం. వెంటనే ఆయన స్పందించి అక్కడే ఉన్న సీఎంఓ అధికారులకు వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ► కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణపైనా విజ్ఞప్తి చేశాం. ► అలాగే, నాలుగో తరగతి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుండి 62 ఏళ్ల వరకు పెంచాలని కోరాం. ► మొత్తం మీద ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయనకు ఉద్యోగులందరి తరపున కృతజ్ఞతలు తెలిపాం. ► సీఎం జగన్‌ను కలిసిన వారిలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి, మాజీ అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
కోవిడ్ వల్లనే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు
నెల్లూరు (అర్బన్): కరోనా మహమ్మారి వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ఛిన్నాభిన్నమైందని, అందుకే ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు కాస్త ఆలస్యమయ్యాయని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక దర్గామిట్టలోని ఎన్జీవో భవన్లో ఆ సంఘం నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. జీతాలు కాస్త ఆలస్యం కావడానికి గత ప్రభుత్వం తెచ్చిన సీఎఫ్ఎంఎస్ విధానం కూడా మరో కారణమన్నారు. ఇటీవల ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ సీఎఫ్ఎంఎస్ వల్ల నష్టం జరుగుతుందని, ఈ విధానం పనికిరాదన్నారని గుర్తు చేశారు. అందువల్ల సీఎఫ్ఎంఎస్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని కోరారు. అడగకుండానే ప్రభుత్వం 27 శాతం ఐఆర్ ఇచ్చిందన్నారు. త్వరలోనే ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించనుందన్నారు. ముఖ్యమంత్రి ఆగస్టు 15న మాట్లాడుతూ సీపీఎస్ రద్దు చేస్తామని తెలిపారన్నారు. ఆ హామీని త్వరగా అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నేపల్లి పెంచలరావు, నాయుడు వెంకటస్వామి పేర్కొన్నారు. -
కాంట్రాక్టు ఉద్యోగులను వంచిస్తున్న చంద్రబాబు
ఏపీఎన్ జీవో అసోసియేషనన్ జిల్లా అధ్యక్షుడు బండి ఒంగోలు టౌన్: రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వంచిస్తున్నారని ఏపీ ఎన్ జీఓ అసోసియేషన్జిల్లా అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు విమర్శించారు. ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టోలో, ప్రచారంలో కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్లను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు, ఆ తరువాత మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం, సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపి తప్పించుకునే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో విధాన నిర్ణయం తీసుకొని ఆ దిశగా చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటే కోర్టు తీర్పులు ఏ మాత్రం అడ్డంకి కాదన్నారు. క్రమబద్ధీకరణ ప్రభుత్వ చిత్తశుద్ధిపైనే ఆధారపడి ఉందని, ఇప్పటిౖకెనా కుంటి సాకులు ఆపి కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు లెక్చరర్ల పోరాటానికి మద్దతుగా ప్రత్యక్ష పోరుకు ఏపీఎన్ జీఓ సిద్ధంగా ఉంటుందని బండి శ్రీనివాసరావు ప్రకటించారు. ఎన్ జీవో అసోసియేషన్ జిల్లా నాయకులు శరత్‌బాబు, కృష్ణారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎస్డీ సర్దార్, ఎయిడెడ్ లెక్చరర్ల సంఘం మాజీ అధ్యక్షుడు బాపట్ల వెంకటనరసింహారావు దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. గురువారం దీక్షలు చేపట్టిన వారిలో గాలంకి ఆనంద్, టి.వాసుబాబు, బి.వెంకటరావు, వెంకటేశ్వర్లు, చింతగుంట్ల హిమశేఖర్, పద్మారావు, జయసుధ, కే సంయుక్త, సుజాత, నంద్యాల కాశింపీరా, వి.వెంకటేశ్వరరెడ్డి, కుసుమకుమార్, రమామాధవి, జె.ఈశ్వరుడు, బీడీ సుందర్ ఉన్నారు. ఈ కార్యక్రమానికి కాంట్రాక్టు లెక్చరర్ల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు కుమ్మరకుంట సురేష్, పి.మాధవరావు, ఆర్సీహెచ్ రంగయ్య, సుంకరి కృష్ణయ్య, పిల్లి సుబ్బారెడ్డి, పి.సత్యనారాయణ, వి.కోటేశ్వరరావు, షేక్ ఖాదర్‌వలి, బాబూరావు, చల్లా శ్రీనివాసరావు, కొప్పుల కొండారెడ్డి, కట్టా కిషోర్ తదితరులు నాయకత్వం వహించారు. -
పెట్రోల్ బంకులు, సినిమా థియేటర్ల మూత
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రభుత్వ ఉద్యోగుల నిరవధిక సమ్మె మంగళవారం నాటికి ఏడో రోజుకు చేరుకుంది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని పెట్రోల్ బంకు, సినిమా థియేటర్లను మూతవేయించారు. ఉదయం ఆరు గంటలకల్లా అసోసియేషన్ నాయకులు పెట్రోల్ బంకుల వద్దకు చేరుకుని వాటిని మూసివేయించారు. 11 గంటలకు సినిమా థియేటర్ల వద్దకు చేరుకుని సినిమా ప్రదర్శనలను నిలిపివేయాలని కోరారు. దీంతో థియేటర్ల యజమానులు సినిమా ప్రదర్శనలను నిలిపివేశారు. నగరంలో మోటార్ సైకిళ్లతో ర్యాలీగా బయలుదేరి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అవకాశవాద రాజకీయాలను ఎండగట్టారు. అనంతరం ప్రకాశం భవనం వద్ద సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీఎన్జీఓ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతున్న సమయంలో కొంతమంది రాజకీయ నాయకులు తెలంగాణ చిచ్చు రగిల్చారని విమర్శించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగు మాట్లాడే వారందరినీ రెండుగా చీల్చేందుకు కుట్ర పన్నారన్నారు. తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ఏ విధంగా తిప్పికొట్టారో పార్లమెంటులో కూడా సీమాంధ్రకు చెందిన మంత్రులు, ఎంపీలు అదే విధంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బిల్లు విషయంలో సీమాంధ్రుల మనోభావాలను గుర్తెరిగి ముందుకు సాగాలని, లేకుంటే వారికి రాజకీయ మనుగడ ఉండదని బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విద్యాశాఖ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర నాయకుడు ఏ స్వాములు మాట్లాడుతూ అసెంబ్లీలో తిరస్కరించిన తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెట్టడం నిరంకుశ విధానాలకు అద్దం పడుతుందన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల సంఘ నాయకుడు కే శరత్‌బాబు మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం చివరి దశకు చేరుకుందని, ఈ తరుణంలో ఉద్యోగస్తులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. విభజన విషయంలో డ్రామాలాడితే సీమాంధ్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఏపీఎన్జీఓ అసోసియేషన్ నగర అధ్యక్షుడు సయ్యద్నాసర్మస్తాన్వలి మాట్లాడుతూ సీమాంధ్ర ఎంపీలు తెలంగాణ బిల్లును అడ్డుకోకుంటే వారికి రాజకీయ సమాధి కట్టేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోయ కోటేశ్వరరావు, జిల్లాపరిషత్ ఉద్యోగుల సంఘ నాయకులు శ్యాంసన్, విజయలక్ష్మి, వీరనారాయణ, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పీ మాధవి, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు మూర్తి, సర్వే ఉద్యోగుల సంఘం నాయకుడు కే శివకుమారి, ప్రభుత్వ డ్రైవర్ల సంఘ జిల్లా కార్యదర్శి ప్రసన్నకుమార్, నీటిపారుదల ఉద్యోగుల సంఘ నాయకులు ఆర్సీహెచ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు జాతీయ రహదారి దిగ్బంధనం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయకుండా సమైక్యంగా ఉంచాలని కోరుతూ సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఏపీఎన్జీఓ అసోసియేషన్ జిల్లా శాఖ బుధవారం జాతీయ రహదారి దిగ్బంధం చేయాలని నిర్ణయించింది. జాతీయ రహదారి దిగ్బంధనం తీవ్రత ఢిల్లీ పెద్దలను కదిలించే విధంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలను సమీకరించి జాతీయ రహదారిని దిగ్బంధించనున్నారు. ఆఖరి పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నాయకులు కోరారు.