సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ తదితరులు
సాక్షి, అమరావతి: ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి త్వరలోనే పీఆర్సీ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమకు తెలియజేశారని ఏపీఎన్‌జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నందున ముందు పీఆర్సీ ఇస్తామని, తరువాత డీఏలు ఇస్తామని సీఎం తమతో అన్నారని ఆయన వెల్లడించారు. సీపీఎస్ రద్దుపై ఇచ్చిన హామీ కూడా నిలబెట్టుకుంటామని చెప్పారన్నారు. సీఎం వైఎస్ జగన్‌ను బుధవారం ఏపీ ఎన్జీవో సంఘ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నేతలతో కలిసి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే..
► 11వ పీఆర్సీ నివేదిక ఇచ్చి చాలా రోజులవుతున్నందున జాప్యం లేకుండా 2018 జులై 1 నుండి 55 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని ఇవ్వాలని కోరాం.
► డీఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని అడిగాం.
► సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని కోరాం.
► ఉద్యోగులకు సంబంధించిన ఇతర సమస్యలను కూడా సీఎం దృష్టికి తీసుకొచ్చాం. వెంటనే ఆయన స్పందించి అక్కడే ఉన్న సీఎంఓ అధికారులకు వాటిని పరిష్కరించాలని ఆదేశించారు.
► కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణపైనా విజ్ఞప్తి చేశాం.
► అలాగే, నాలుగో తరగతి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుండి 62 ఏళ్ల వరకు పెంచాలని కోరాం.
► మొత్తం మీద ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయనకు ఉద్యోగులందరి తరపున కృతజ్ఞతలు తెలిపాం.
► సీఎం జగన్‌ను కలిసిన వారిలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి, మాజీ అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment