APNGO Leaders
-
ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలం
సాక్షి, అమరావతి: ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి త్వరలోనే పీఆర్సీ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తమకు తెలియజేశారని ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నందున ముందు పీఆర్సీ ఇస్తామని, తరువాత డీఏలు ఇస్తామని సీఎం తమతో అన్నారని ఆయన వెల్లడించారు. సీపీఎస్ రద్దుపై ఇచ్చిన హామీ కూడా నిలబెట్టుకుంటామని చెప్పారన్నారు. సీఎం వైఎస్ జగన్‌ను బుధవారం ఏపీ ఎన్జీవో సంఘ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నేతలతో కలిసి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే.. ► 11వ పీఆర్సీ నివేదిక ఇచ్చి చాలా రోజులవుతున్నందున జాప్యం లేకుండా 2018 జులై 1 నుండి 55 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని ఇవ్వాలని కోరాం. ► డీఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని అడిగాం. ► సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని కోరాం. ► ఉద్యోగులకు సంబంధించిన ఇతర సమస్యలను కూడా సీఎం దృష్టికి తీసుకొచ్చాం. వెంటనే ఆయన స్పందించి అక్కడే ఉన్న సీఎంఓ అధికారులకు వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ► కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణపైనా విజ్ఞప్తి చేశాం. ► అలాగే, నాలుగో తరగతి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుండి 62 ఏళ్ల వరకు పెంచాలని కోరాం. ► మొత్తం మీద ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయనకు ఉద్యోగులందరి తరపున కృతజ్ఞతలు తెలిపాం. ► సీఎం జగన్‌ను కలిసిన వారిలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి, మాజీ అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
నోటిఫికేషన్ వెనక్కు తీసుకోకుంటే సమ్మెకు దిగుతాం
సాక్షి, అమరావతి: కరోనా ముప్పు ఇంకా కొనసాగుతున్న సమయంలో పంచాయతీ ఎన్నికలు ప్రస్తుతానికి సాధ్యం కాదంటున్నా మొండిగా వ్యవహరిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ నోటిఫికేషన్ జారీ చేయడంపై ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, ఇతర సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఏపీ ఎన్జీవో అసోసియేషన్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య సహా వివిధ ప్రభుత్వ, ఉపాధ్యాయ సంఘాల నేతలు శనివారం వేర్వేరుగా మాట్లాడుతూ నోటిఫికేషన్ విడుదలను తప్పుపట్టారు. ఉద్యోగుల ప్రాణాలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ఇది సమయం కాదు.. ఉద్యోగులకు వ్యాక్సినేషన్ ఇచ్చాక ఎన్నికలు నిర్వహించాలని ఎంత వేడుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు, ఉద్యోగుల ప్రాణాలు పోయినా పర్వాలేదు.. ఎన్నికలు మాత్రం జరపాలని అనుకోవడం ఏమిటని ఆక్రోశం వెలిబుచ్చారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నికలకు వెళ్లాలని కోరారు. తమ వినతిని పట్టించుకుని నోటిఫికేషన్‌ను వెనక్కు తీసుకోవాలని, లేనిపక్షంలో ఎన్నికలు బహిష్కరిస్తామని, అవసరమైతే సమ్మెకు దిగుతామని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరించారు. వ్యాక్సిన్ ఇచ్చేవరకూ ఎన్నికల్లో పాల్గొనం ఉద్యోగులందరికీ వ్యాక్సిన్ ఇచ్చేవరకూ ఎన్నికల్లో పాల్గొనేది లేదు. ఎన్నికల కమిషనర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తన పంతం కోసం ఉద్యోగుల ప్రాణాలు బలిపెట్టడం ఏమిటి? ఎన్నికలకు మేం సిద్ధం.. కానీ దానికంటే ముందుగా ఉద్యోగులందరికీ వ్యాక్సిన్ ఇవ్వాల్సిందే. ఎన్నికలు పెట్టాలని ఆయన నిర్ణయం తీసుకుని ప్రభుత్వాన్ని, ఉద్యోగుల ప్రాణాలను లెక్క చేయకుండా ముందుకెళ్లడం అన్యాయం. ఉద్యోగులుగా మా ప్రాణాలు రక్షించుకునే హక్కు మాకుంది. మూడున్నర లక్షల ఓట్లు పోయినా పర్వాలేదు.. ఉద్యోగులు, ఓటర్లు చనిపోయినా తాను మాత్రం ఎన్నికలు నిర్వహిస్తాననే రీతిలో ఎన్నికల కమిషనర్ చెప్పడం దారుణం. – వెంకట్రామిరెడ్డి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ బలవంతపెడితే.. బహిష్కరిస్తాం ఒకవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించిన సమయంలోపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పట్టుదలకు దిగడం దారుణం. ఎన్నికలు వాయిదా వేయాలి. కాదని ఎన్నికలకు బలవంతపెడితే ఎన్నికలను బహిష్కరిస్తాం. సమ్మె తప్పదు. – లెక్కల జమాల్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య కోచైర్మన్ మీకు రక్షణ కావాలి, ఉద్యోగులకు అక్కర్లేదా? పకడ్బందీగా గ్లాస్ షీల్డ్ అడ్డం పెట్టుకుని మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉద్యోగుల రక్షణ గురించి పట్టించుకోకపోవడం అన్యాయం. నోటిఫికేషన్ ఇవ్వడానికే అంత పకడ్బందీగా అద్దాలు పెట్టుకున్న ఎస్ఈసీ.. లక్షా 40 వేల పోలింగ్ స్టేషన్లలో లక్షలాదిమంది ఉద్యోగులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకున్నారో చెప్పాలి. ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ అనివార్యత అంటున్న ఆయన 2018 నుంచి ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదు? – బొప్పరాజు వెంకటేశ్వర్లు, రెవెన్యూ సర్వీసెస్ అధ్యక్షుడు, అమరావతి ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ పంతానికి పోకుండా ఎన్నికలు వాయిదా వేయాలి ఏ వ్యవస్థ అయినా ప్రజాసంక్షేమమే అంతిమ లక్ష్యమనే విషయాన్ని గుర్తెరిగి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పంతాలకు పోకుండా ఎన్నికలను వాయిదా వేయాలి. ముఖానికి ఫేస్‌షీల్డ్ అడ్డుపెట్టుకుని ఎన్నికల కమిషనర్ మీడియా సమావేశంలో పాల్గొనడం చూస్తుంటే కరోనా అంటే భయం ఆయనకు మాత్రమే ఉందా? ఉద్యోగుల ప్రాణాలు ప్రాణాలు కాదా? కరోనా తీవ్రత లేకుండా ఉండుంటే.. ముఖానికి షీల్డ్ అడ్డుపెట్టుకుని మీడియా సమావేశాన్ని ఎందుకు నిర్వహించారో ఆయన సమాధానం చెప్పాలి. – వాసా శామ్యూల్ దివాకర్, రాష్ట్ర రెవెన్యూ జేఏసీ చైర్మన్ మెరుపు సమ్మె చేస్తాం.. ఒకపక్క ఉద్యోగులకు కరోనా వ్యాక్సినేషన్ జరుగుతుంటే ఎన్నికలు ఏవిధంగా నిర్వహించాలి? ఉద్యోగుల ప్రాణాలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ చెలగాటం ఆడుతున్నారు. ఎన్నికలు ప్రస్తుతం సాధ్యం కాదని సీఎస్ చెప్పినా వినకుండా మొండిగా వ్యవహరించటం ప్రజాస్వామ్యానికే తీరనిమచ్చ. నోటిఫికేషన్ వెనక్కు తీసుకోకపోతే మెరుపు సమ్మె చేయటానికైనా తగ్గేది లేదు. – బండి శ్రీనివాసరావు, ఏపీఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆందోళన కలిగిస్తోంది.. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవ్వకుండానే టీచర్లు ఎన్నికల విధులకు హాజరవ్వాలన్న ఎన్నికల కమిషనర్ ఆదేశం చాలా ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కరోనా వ్యాక్సినేషన్ అవగానే ఎన్నికల విధులకు వెళ్లేందుకు సిద్ధమే. వ్యాక్సినేషన్ పూర్తి కాకుండా బలవంతంగా విధులు వెయ్యొద్దని కోరుతున్నాం. – సామల సింహాచలం, ఏపీ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రెండు డోసుల టీకా ఇచ్చాకే ఎన్నికలు జరపాలి వ్యాక్సిన్ రెండు డోసులూ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను చేపట్టాలి. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణను పూర్తి క్రియాశీలకంగా, సజావుగా జరిపించాల్సిన బాధ్యత ఎంపీడీవోలపైన, పంచాయతీరాజ్ ఉద్యోగులు, గ్రామ సచివాలయ సిబ్బందిపైనే ఉంది. ఈ తరుణంలో మేం ఎన్నికల నిర్వహణను కోరుకోవడం లేదు. – వై.బ్రహ్మయ్య, జి.వి.నారాయణరెడ్డి, డి.వెంకట్రావు, కె.శ్రీనివాస్‌రెడ్డి, కేఎన్వీ ప్రసాద్‌రావు, రాష్ట్ర ఎంపీడీవోల సంఘం నేతలు -
కరోనాతో ఉద్యోగులు మరణిస్తే ఎన్నికల కమిషన్ బాధ్యత వహిస్తుందా?
సాక్షి, అమరావతి: ‘స్థానిక ఎన్నికలు కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత పెడితే ఏమవుతుంది? తగ్గక ముందే ఎన్నికలు నిర్వహించడం వల్ల విధుల్లో పాల్గొనే ఉద్యోగులెవరికైనా వైరస్ సోకి మరణిస్తే అందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ బాధ్యత వహిస్తుందా?’ అని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి నిలదీశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చంద్రశేఖరరెడ్డి, సంఘ ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావులు ప్రకటించారు. మంగళవారం విజయవాడలో ఏపీ ఎన్జీవో సంఘం వెబ్సైట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ‘కరోనా వల్ల రాష్ట్రంలో ఇప్పటికీ రోజూ పదుల సంఖ్యలో చనిపోతున్నారు. ఇప్పటిదాకా ఉద్యోగులతో సహా మొత్తం 7 వేల మంది చనిపోయారు. ఇలాంటి సమయంలో ఎన్నికలు పెడతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చెబుతున్నారు. రాష్ట్రంలో రోజుకు కేవలం 20 కేసులు వచ్చినప్పుడే ఎన్నికలను వాయిదా వేసి, ఇప్పుడు వేలల్లో నమోదవుతుంటే ఎన్నికలు పెట్టి ఎంత మందిని చంపాలని చూస్తున్నారు?’ అని చంద్రశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు జరపాలన్న ఎన్నికల కమిషనర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. అవసరమైతే ఉద్యోగ సంఘాల పక్షాన కోర్టుల్లో ఇంప్లీడ్ అయ్యి వాదనలు వినిపిస్తాం. ఉద్యోగులు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పుడు ఎన్నికలు మంచిది కాదన్నారు. కరోనా తగ్గిన తర్వాతే ఎన్నికలు జరపాలి. అప్పుడు పని చేసేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు..’ అని తెలిపారు. వచ్చే ఏప్రిల్ కల్లా ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కారిస్తానని సీఎం హామీ ఇచ్చారని చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ను ప్రకటించారని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని శ్రీనివాసరావు గుర్తు చేశారు. సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ అజయ్‌కుమార్, అసోసియేటెడ్ ప్రెసిడెంట్ పురుషోత్తంనాయుడు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ సెక్రటరీ జనరల్ జోసెఫ్ సుధీర్‌బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా సంక్షేమంతో పాటే ఉద్యోగుల సంక్షేమం: సజ్జల వీలైనంత ఎక్కువమందికి వీలైనంత ఎక్కువ ప్రయోజనం కలిగించాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచన అని వెబ్సైట్ ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కొంత జాప్యం జరిగినప్పటికీ, రానున్న రోజుల్లో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశలో సీఎం జగన్ ముందడుగు వేస్తారని చెప్పారు. ప్రజలకే సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న జగన్ వాటిని అమలు చేసే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ఎందుకు వెనుకాడుతారని ప్రశ్నించారు. -
ఏపీ ఎన్జీఓ నేతల కుట్ర
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో గచ్చి బౌలి హౌసింగ్ సొసైటీకి ఇచ్చిన భూములను అమ్ముకునేందుకు ఏపీ ఎన్జీఓ నేతలు కుట్రలు చేశారని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. ఉద్యోగులు కష్టపడి కూడబెట్టుకుని పైసలతో ఏపీ ఎన్జీఓలు జల్సాలు చేశారని, ప్లాట్లు ఇప్పిస్తామంటూ మాయ మాటలు చెప్పి వసూళ్లకు పాల్పడ్డారని టీజీఓ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్, టీఎస్పీఎస్సీ సభ్యుడు విఠల్, టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, టీజీవో అధ్యక్షురాలు మమత మండిపడ్డారు. ఇటీవల గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ నూతన కార్యవర్గం ఎంపికైన విషయం తెలిసిందే. భాగ్యనగర్ టీఎన్జీఓ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణగౌడ్ చైర్మన్‌గా, పి.బలరాం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యా రు. ఈ సందర్భంగా గచ్చి బౌలి హౌసింగ్ సొసైటీ నూతన కార్యవర్గ సమావేశంలో నాంపల్లిలోని ఇంది రా ప్రియదర్శిని ఆడిటోరి యంలో సోమవారం నిర్వహించారు. ఏపీ ఎన్జీఓగా ఉన్న పేరును గచ్చిబౌలి హౌసిం గ్ సొసైటీగా మార్చుతూ తీర్మానం చేసి నోటీసులిచ్చారు. సొసైటీ కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు. ఆంధ్రా నేతలు అమ్ముకునేవారే.. గచ్చిబౌలిలో ఉద్యోగులకు కేటాయించిన స్థలాన్ని రక్షించేందుకే సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెమో జారీ చేశారని శ్రీనివాస్‌గౌడ్, దేవీప్రసాద్, కారం రవీందర్‌రెడ్డి, మమత చెప్పారు. ప్రభుత్వం మెమో జారీ చేయకుంటే ఉన్న భూమిని మొత్తం ఆంధ్రా నేతలు అమ్ముకునేవారన్నారు. ఏపీ ఎన్జీఓలో సభ్యులుగా ఉంటూ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ కోసం సత్యనారాయణ బృందం చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతలు పద్మాచారి, రేచల్, రామినేని శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
మద్యంమత్తులో ఎన్జీవో నేతల చిందులు
సాక్షి, పోలవరం (పశ్చిమ గోదావరి జిల్లా) : ఉదయం కార్యవర్గ సమావేశం.. చీకటి పడిన తర్వాత మందు, చిందు.. ఇదీ ఏపీ ఎన్జీవో నేతల నిర్వాకం.. సాక్షాత్తు ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు సమక్షంలో నేతలంతా ఫుల్‌గా మందుకొట్టి చిందులేశారు. పోలవరంలోని గౌతమీ గెస్ట్‌హౌస్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఎన్జీవో నేతల సమావేశం అంటూ పిలుపు అందండంతో చాలామంది శనివారం ఉదయం ఇక్కడికి చేరుకున్నారు. ఉదయం ఏపీఎన్జీవోల కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు మద్యం మత్తులో ఏపీ ఎన్జీవో నేతలు వయసును మరిచి చిందులేశారు. -
అశోక్ బాబు సమక్షంలో ఏపీ ఎన్జీవో నేతలు మందు, చిందు..
-
పనబాక దర్శన భాగ్యం కష్టమే!
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు దేశ రాజధాని నగరంలో ఉద్యమిస్తున్న ఏపీ ఎన్జీవో నాయకులకు కేంద్ర మంత్రి, బాపట్ల ఎంపీ పనబాక లక్ష్మి దర్శన భాగ్యం దొరకలేదు. ఎంత ప్రయత్నించినా కేంద్ర మంత్రిని కలవడం మాత్రం వారికి సాధ్యం కాలేదు. తమకు మద్దతు చెబుతారేమోనన్న ఆశతో ఏపీఎన్జీవో నాయకులు కొందరు ఢిల్లీలోని పనబాక లక్ష్మి నివాసానికి బుధవారం నాడు వెళ్లారు. కానీ, కలిసేందుకు మంత్రిగారి నుంచి ముందస్తు అనుమతి మీకు లేదంటూ పోలీసులు వారిని బలవంతంగా బయటకు పంపేశారు. ఒక్కసారి కలిసి మాట్లాడి వెళ్లిపోతామని చెప్పినా ఏమాత్రం వినిపించుకోలేదు. దాంతో ఏమీ చేయలేని ఏపీఎన్జీవో నాయకులు సమైక్య నినాదాలు చేసుకుంటూ వెనుదిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. -
వైఎస్ కుటుంబానికి విధేయులం
ఆ పత్రికలోవి అసత్య కథనాలు ఏపీ ఎన్జీవో నాయకుల సృష్టీకరణ పులివెందుల, న్యూస్‌లైన్: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి తాము విధేయులుగానే ఉన్నామని.. తమపై ఓ దినపత్రిక అసత్య కథనాన్ని ప్రచురించిందని పులివెందుల ఎన్జీవో సంఘ నాయకులు స్పష్టంచేశారు. సోమవారం ఎన్జీవో కార్యాలయంలో అధ్యక్షుడు గురుప్రసాద్, ఉపాధ్యక్షులు నరేష్, ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పులివెందులలో ఎన్జీవో సంఘం అభివృద్ధికి వైఎస్ కుటుంబీకులు ఎంతో సహకరించారన్నారు. వారి చలువతోనే పట్టణ నడిబొడ్డున కార్యాలయాన్ని నిర్మించుకున్నామన్నారు. అశోక్‌బాబు, బషీర్‌లు తమ నాయకులేనని.. ఎవరు గెలిచినా వారి కింద పనిచేస్తామన్నారు. అశోక్‌బాబును ఓడించాలని.. బషీర్‌ను గెలిపించాలని వైఎస్ జగన్ తమకు చెప్పలేదన్నారు. కొంతమంది స్వార్థపరులు, సంఘంలో పదవులు పోగొట్టుకున్నవారు దుష్ర్పచారం చేయించారన్నారు. వైఎస్ కుటుంబానికి, ఉద్యోగుల మధ్య మనస్పర్థలు రావడానికి ఓ పత్రిక అసత్య కథనాన్ని ప్రచురించిందన్నారు. ఆ పత్రికపైన, కథనాన్ని రాసిన విలేకరిపైన పరువు నష్టం దావా వేస్తామన్నారు. సమావేశం అనంతరం వారు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిశారు. -
సోనియా ముందు పిల్లుల్లా కేంద్ర మంత్రులు: ఏపీ ఎన్జీవో
రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర మంత్రులు సోనియా గాంధీ ముందు పిల్లుల్లా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి వాళ్లను మళ్లీ గెలిపించే పరిస్థితి లేదని ఏపీ ఎన్జీవో నేత సత్యనారాయణ మండిపడ్డారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు హాజరై తిరిగి వెళ్తూ హయత్ నగర్ ప్రాంతంలో తెలంగాణ వాదుల రాళ్లదాడికి గురైన ఆయన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. రాజ్యాంగ సంక్షోభం ద్వారానే విభజనను అడ్డుకోవాలని నాయకులకు సత్యానారాయణ పిలుపునిచ్చారు. -
ప్రధానితో ఏపీఎన్జీవో నేతల భేటీ
-
ప్రధానితో ఏపీఎన్జీవో నేతల భేటీ
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఏపీఎన్జీవో, విద్యుత్, ఆర్టీసీ, విద్యార్థి సంఘాల నేతలు కలిశారు. వీరిని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు, కాంగ్రెస్ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, కనుమూరి బాపిరాజు.. ప్రధాని వద్దకు తీసుకెళ్లారు. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యల గురించి ప్రధానికి వీరు వివరించినట్టు సమాచారం. మీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరఫున కమిటీ వేస్తామని ఏపీఎన్జీవోలకు ప్రధాని హామీయిచ్చారు. విభజన జరగనందున అప్పుడే ఆందోళన చెందాల్సిన పనిలేదని ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రధాని అన్నట్టు తెలిసింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు ఇప్పటికే సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.