
వైఎస్ కుటుంబానికి విధేయులం
ఆ పత్రికలోవి అసత్య కథనాలు
ఏపీ ఎన్‌జీవో నాయకుల సృష్టీకరణ
పులివెందుల, న్యూస్‌లైన్: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి తాము విధేయులుగానే ఉన్నామని.. తమపై ఓ దినపత్రిక అసత్య కథనాన్ని ప్రచురించిందని పులివెందుల ఎన్‌జీవో సంఘ నాయకులు స్పష్టంచేశారు. సోమవారం ఎన్‌జీవో కార్యాలయంలో అధ్యక్షుడు గురుప్రసాద్, ఉపాధ్యక్షులు నరేష్, ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పులివెందులలో ఎన్‌జీవో సంఘం అభివృద్ధికి వైఎస్ కుటుంబీకులు ఎంతో సహకరించారన్నారు. వారి చలువతోనే పట్టణ నడిబొడ్డున కార్యాలయాన్ని నిర్మించుకున్నామన్నారు. అశోక్‌బాబు, బషీర్‌లు తమ నాయకులేనని.. ఎవరు గెలిచినా వారి కింద పనిచేస్తామన్నారు. అశోక్‌బాబును ఓడించాలని.. బషీర్‌ను గెలిపించాలని వైఎస్ జగన్ తమకు చెప్పలేదన్నారు. కొంతమంది స్వార్థపరులు, సంఘంలో పదవులు పోగొట్టుకున్నవారు దుష్ర్పచారం చేయించారన్నారు. వైఎస్ కుటుంబానికి, ఉద్యోగుల మధ్య మనస్పర్థలు రావడానికి ఓ పత్రిక అసత్య కథనాన్ని ప్రచురించిందన్నారు. ఆ పత్రికపైన, కథనాన్ని రాసిన విలేకరిపైన పరువు నష్టం దావా వేస్తామన్నారు. సమావేశం అనంతరం వారు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిశారు.