సాక్షి, అమరావతి: కరోనా ముప్పు ఇంకా కొనసాగుతున్న సమయంలో పంచాయతీ ఎన్నికలు ప్రస్తుతానికి సాధ్యం కాదంటున్నా మొండిగా వ్యవహరిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ నోటిఫికేషన్ జారీ చేయడంపై ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, ఇతర సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఏపీ ఎన్జీవో అసోసియేషన్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య సహా వివిధ ప్రభుత్వ, ఉపాధ్యాయ సంఘాల నేతలు శనివారం వేర్వేరుగా మాట్లాడుతూ నోటిఫికేషన్ విడుదలను తప్పుపట్టారు. ఉద్యోగుల ప్రాణాలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ఇది సమయం కాదు.. ఉద్యోగులకు వ్యాక్సినేషన్ ఇచ్చాక ఎన్నికలు నిర్వహించాలని ఎంత వేడుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు, ఉద్యోగుల ప్రాణాలు పోయినా పర్వాలేదు.. ఎన్నికలు మాత్రం జరపాలని అనుకోవడం ఏమిటని ఆక్రోశం వెలిబుచ్చారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నికలకు వెళ్లాలని కోరారు. తమ వినతిని పట్టించుకుని నోటిఫికేషన్‌ను వెనక్కు తీసుకోవాలని, లేనిపక్షంలో ఎన్నికలు బహిష్కరిస్తామని, అవసరమైతే సమ్మెకు దిగుతామని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరించారు.
వ్యాక్సిన్ ఇచ్చేవరకూ ఎన్నికల్లో పాల్గొనం
ఉద్యోగులందరికీ వ్యాక్సిన్ ఇచ్చేవరకూ ఎన్నికల్లో పాల్గొనేది లేదు. ఎన్నికల కమిషనర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తన పంతం కోసం ఉద్యోగుల ప్రాణాలు బలిపెట్టడం ఏమిటి? ఎన్నికలకు మేం సిద్ధం.. కానీ దానికంటే ముందుగా ఉద్యోగులందరికీ వ్యాక్సిన్ ఇవ్వాల్సిందే. ఎన్నికలు పెట్టాలని ఆయన నిర్ణయం తీసుకుని ప్రభుత్వాన్ని, ఉద్యోగుల ప్రాణాలను లెక్క చేయకుండా ముందుకెళ్లడం అన్యాయం. ఉద్యోగులుగా మా ప్రాణాలు రక్షించుకునే హక్కు మాకుంది. మూడున్నర లక్షల ఓట్లు పోయినా పర్వాలేదు.. ఉద్యోగులు, ఓటర్లు చనిపోయినా తాను మాత్రం ఎన్నికలు నిర్వహిస్తాననే రీతిలో ఎన్నికల కమిషనర్ చెప్పడం దారుణం.
– వెంకట్రామిరెడ్డి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్
బలవంతపెడితే.. బహిష్కరిస్తాం
ఒకవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించిన సమయంలోపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పట్టుదలకు దిగడం దారుణం. ఎన్నికలు వాయిదా వేయాలి. కాదని ఎన్నికలకు బలవంతపెడితే ఎన్నికలను బహిష్కరిస్తాం. సమ్మె తప్పదు.
– లెక్కల జమాల్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య కోచైర్మన్
మీకు రక్షణ కావాలి, ఉద్యోగులకు అక్కర్లేదా?
పకడ్బందీగా గ్లాస్ షీల్డ్ అడ్డం పెట్టుకుని మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉద్యోగుల రక్షణ గురించి పట్టించుకోకపోవడం అన్యాయం. నోటిఫికేషన్ ఇవ్వడానికే అంత పకడ్బందీగా అద్దాలు పెట్టుకున్న ఎస్‌ఈసీ.. లక్షా 40 వేల పోలింగ్ స్టేషన్లలో లక్షలాదిమంది ఉద్యోగులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకున్నారో చెప్పాలి. ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ అనివార్యత అంటున్న ఆయన 2018 నుంచి ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదు?
– బొప్పరాజు వెంకటేశ్వర్లు, రెవెన్యూ సర్వీసెస్ అధ్యక్షుడు, అమరావతి ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్
పంతానికి పోకుండా ఎన్నికలు వాయిదా వేయాలి
ఏ వ్యవస్థ అయినా ప్రజాసంక్షేమమే అంతిమ లక్ష్యమనే విషయాన్ని గుర్తెరిగి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పంతాలకు పోకుండా ఎన్నికలను వాయిదా వేయాలి. ముఖానికి ఫేస్‌షీల్డ్ అడ్డుపెట్టుకుని ఎన్నికల కమిషనర్ మీడియా సమావేశంలో పాల్గొనడం చూస్తుంటే కరోనా అంటే భయం ఆయనకు మాత్రమే ఉందా? ఉద్యోగుల ప్రాణాలు ప్రాణాలు కాదా? కరోనా తీవ్రత లేకుండా ఉండుంటే.. ముఖానికి షీల్డ్ అడ్డుపెట్టుకుని మీడియా సమావేశాన్ని ఎందుకు నిర్వహించారో ఆయన సమాధానం చెప్పాలి.
– వాసా శామ్యూల్ దివాకర్, రాష్ట్ర రెవెన్యూ జేఏసీ చైర్మన్
మెరుపు సమ్మె చేస్తాం..
ఒకపక్క ఉద్యోగులకు కరోనా వ్యాక్సినేషన్ జరుగుతుంటే ఎన్నికలు ఏవిధంగా నిర్వహించాలి? ఉద్యోగుల ప్రాణాలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ చెలగాటం ఆడుతున్నారు. ఎన్నికలు ప్రస్తుతం సాధ్యం కాదని సీఎస్ చెప్పినా వినకుండా మొండిగా వ్యవహరించటం ప్రజాస్వామ్యానికే తీరనిమచ్చ. నోటిఫికేషన్ వెనక్కు తీసుకోకపోతే మెరుపు సమ్మె చేయటానికైనా తగ్గేది లేదు.
– బండి శ్రీనివాసరావు, ఏపీఎన్‌జీవో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఆందోళన కలిగిస్తోంది..
వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవ్వకుండానే టీచర్లు ఎన్నికల విధులకు హాజరవ్వాలన్న ఎన్నికల కమిషనర్ ఆదేశం చాలా ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కరోనా వ్యాక్సినేషన్ అవగానే ఎన్నికల విధులకు వెళ్లేందుకు సిద్ధమే. వ్యాక్సినేషన్ పూర్తి కాకుండా బలవంతంగా విధులు వెయ్యొద్దని కోరుతున్నాం.
– సామల సింహాచలం, ఏపీ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
రెండు డోసుల టీకా ఇచ్చాకే ఎన్నికలు జరపాలి
వ్యాక్సిన్ రెండు డోసులూ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను చేపట్టాలి. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణను పూర్తి క్రియాశీలకంగా, సజావుగా జరిపించాల్సిన బాధ్యత ఎంపీడీవోలపైన, పంచాయతీరాజ్ ఉద్యోగులు, గ్రామ సచివాలయ సిబ్బందిపైనే ఉంది. ఈ తరుణంలో మేం ఎన్నికల నిర్వహణను కోరుకోవడం లేదు.
– వై.బ్రహ్మయ్య, జి.వి.నారాయణరెడ్డి, డి.వెంకట్రావు, కె.శ్రీనివాస్‌రెడ్డి, కేఎన్వీ ప్రసాద్‌రావు, రాష్ట్ర ఎంపీడీవోల సంఘం నేతలు
Comments
Please login to add a commentAdd a comment