పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో పింఛన్ డబ్బుల కోసం మండుటెండలో బ్యాంకు ముందు పడిగాపులు కాస్తున్న వృద్ధులు
విలవిల్లాడిన వృద్ధులు.. బ్యాంకుల ముందు క్యూ లైన్లలో నరకయాతన.. నలుగురు మృతి
ఐదేళ్ల తర్వాత అవ్వాతాతలకు చంద్రబాబు మార్కు దురవస్థ
ఊళ్లకు ఊళ్లే తరలి రావడంతో కిక్కిరిసిన బ్యాంకులు.. డబ్బులు పడ్డా.. ఇన్‌యాక్టివ్ ఖాతాలతో పెద్ద ప్రాణాలకు మరో కష్టం
బ్యాంకుల్లోనే పింఛను జమ చేయాలన్న నిమ్మగడ్డ.. ఢిల్లీ వెళ్లి ఈసీకి ఫిర్యాదు
కేంద్రం అన్నీ డీబీటీతో ఇస్తుంటే పింఛన్లు మాత్రం ఎందుకివ్వరంటూ పురందేశ్వరి డిమాండ్
నిత్యం ఫిర్యాదులతో డీబీటీతో బ్యాంకుల్లో జమకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఈసీ
గత 58 నెలలుగా కరోనాలోనూ నిర్విఘ్నంగా కొనసాగిన పింఛన్ల పంపిణీ
లబ్ధిదారులకు ఇళ్ల వద్ద వలంటీర్ల ద్వారా చేతికే అందించిన రాష్ట్ర ప్రభుత్వం
కోడ్‌ను అడ్డం పెట్టుకొని వలంటీర్లపై రెచ్చిపోయిన బాబు బ్యాచ్
2 నెలలుగా పింఛన్ల పంపిణీకి వరుసగా ఆటంకాలు.. గత నెలలో సచివాలయాల వద్ద పంపిణీ చేసినా ఆగని ఫిర్యాదులు
ఉన్నతాధికారులను బ్లాక్‌మెయిల్ చేసేలా పచ్చ మీడియాలో కథనాలు
ఈసీ ఆదేశాలతో బ్యాంకుల్లో డబ్బులు జమ
వరుసబెట్టి పదేపదే ఫిర్యాదులతో..
మేం 2024 మార్చి 30న ఇచ్చిన ఆదేశాల ప్రకారం బ్యాంకు ఖాతాలున్న లబ్ధిదారులకు డీబీటీ (నగదు రూపంలో కాకుండా బ్యాంకు ఖాతాలో జమ) విధానంలో ఫింఛన్ల పంపిణీకే పాధాన్యం ఇవ్వండి. లేదంటేనే శాశ్వత ఉద్యోగుల ద్వారా పంపిణీ చేపట్టండి. – ఏప్రిల్ 26న సీఎస్‌కు ఈసీ జారీ చేసిన ఆదేశాల సారాంశం.
(ఏప్రిల్‌లో దివ్యాంగులకు ఇళ్ల వద్ద, మిగిలిన వారికి సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీపై టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు గత 20 రోజులుగా ఫిర్యాదులు చేయడంతో ఈసీ తమ ఆదేశాలను పాటించాలంటూ మరోసారి ఉత్తర్వులిచ్చిది)
విలన్ నంబర్–1
పింఛను లబ్ధిదారుల్లో బ్యాంకు అకౌంట్ ఉన్నవారికి నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ చేయాలని ఎన్నికల కమిషన్ అధికారులకు చెప్పి వస్తున్నాం. బ్యాంకు అకౌంట్లు లేని వారికి సచివాలయం వద్ద పింఛను డబ్బులు తీసుకునే అవకాశం కల్పించాలని చెప్పాం. దివ్యాంగులకు మాత్రం మినహాయింపు ఇవ్వొచ్చు.
– 20 రోజుల క్రితం సచివాలయంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన అనంతరం మాజీ ఎస్‌ఈసీ
నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యాఖ్యలివీ.
(ఇతను చంద్రబాబు ఏజెంట్‌గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే.)
విలన్ నంబర్ 2
కేంద్ర ప్రభుత్వం అన్ని పథకాల లబ్ధిని డీబీటీ(నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ) రూపంలో అందజేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పింఛన్ డబ్బులను అలా ఎందుకు పంపిణీ చేయదు?
– 10–15 రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి డిమాండ్
(ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఉన్న సంగతి తెలిసిందే.)
సహాయ పాత్రధారులు
బ్యాంకు అకౌంట్లు ఉన్న వారికి ఖాతాల్లోనే పెన్షన్ వేయాలి. మిగిలిన వారికి ఇళ్లకే వెళ్లి ఇస్తే సిబ్బందికి శ్రమ తగ్గుతుంది. ఏప్రిల్ 28న ఏపీ బీజేపీ నేతల సూచన
సాక్షి, అమరావతి: బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసి ఐదేళ్లుగా ప్రతి నెలా ఠంచన్‌గా ఇంటివద్దే చేతికి ఇస్తున్న పెన్షన్లకు అడ్డుపడి రచ్చ చేసిన పచ్చ బృందం సచివాలయాల్లో అందిస్తున్నా శాంతించలేదు! మండుటెండల్లో తిరగలేక పండుటాకుల ప్రాణాలు విలవిల్లాడే పరిస్థితికి తెచ్చిది. అవ్వాతాతల ఉసురు మూటగట్టుకుంటూ పెద్ద ప్రాణాలు బ్యాంకుల వద్ద పడిగాపులు కాసేలా వికృత రాజకీయాలకు బాబు బృందం తెర తీసింది! అవ్వాతాతల ఫించన్ల కష్టాలకు చంద్రబాబు, ఆయన సన్నిహితులు, మిత్ర పార్టీల నిర్వాకాలే కారణం.
చంద్రబాబు కనుసన్నల్లో నడుచుకుంటూ ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్, దగ్గుబాటి పురందేశ్వరి, కొందరు ఏపీ బీజేపీ నాయకులు ఖాతాలున్న వారికి బ్యాంకుల్లోనే పింఛను డబ్బులు జమ చేయాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చారు. పింఛన్‌దారులకు ఇళ్ల వద్ద కాకుండా బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఈసీకి తానే చెప్పానంటూ ఫిర్యాదు చేసి బయటకు వచ్చిన అనంతరం నిమ్మగడ్డ ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. ఇలా ఈసీకి వరుస ఫిర్యాదులతోపాటు ఉన్నతాధికారులను బెదిరించేలా ఎల్లో మీడియాలో కథనాలు వెలువరించేలా చంద్రబాబు పక్కా ప్రణాళికతో వ్యవహరించారు. మరోవైపు ఇంటి వద్దే ఇవ్వాలంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు.
ఐదేళ్ల తరువాత మళ్లీ అవే అవస్థలు
ఐదేళ్ల తర్వాత మళ్లీ అవ్వాతాతలు పింఛన్ల కోసం అవస్థ పడుతూ ఊరు దాటారు! తెల్లవారుజామునే బ్యాంకుల వద్దకు చేరుకుని చాంతాడంత క్యూలో నిలబడి నానా అగచాట్లు పడ్డారు. గత 58 నెలలుగా ప్రతి నెలా ఏ కష్టం లేకుండా కరోనాలో సైతం ఠంఛన్‌గా ఇంటి వద్దే వలంటీర్ల ద్వారా పింఛన్ మొత్తాన్ని అందుకున్న లక్షలాది మంది పింఛన్‌దారులు ఈసారి కొత్తగా బ్యాంకు ఖాతాలో జమ అయిన డబ్బులను తీసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొత్తం 65.49 లక్షల మంది పింఛనుదారుల్లో ఎక్కువ మంది ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంఛన్‌గా అందే ఆ డబ్బులనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు.
ఖాతాల్లో జమ అయిన డబ్బులను తీసుకునేందుకు ఒక్కసారిగా బ్యాంకుల వద్దకు చేరుకోవడంతో గురువారం రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్ల బ్యాంకులు పింఛన్ లబ్ధిదారులతో నిండిపోయాయి. ఎండ తీవ్రత కారణంగా ఎక్కువ మంది అవ్వాతాతలు బ్యాంకులు తెరవక ముందే ఉదయం 9 గంటల నుంచే చేరుకుని ఎదురు చూస్తూ ఉండిపోయారు. బ్యాంకు అందుబాటులో లేని గ్రామాలకు చెందిన వారు పనులు మానుకుని 10 కి.మీ. దూరంలోని ప్రాంతాలకు తరలి వచ్చారు. పలుచోట్ల ఊళ్లకు ఊళ్లే తరలిరాగా పింఛను డబ్బులు పడ్డ బ్యాంకు ఖాతాలు చాలా కాలంగా వినియోగంలో లేని కారణంగా ఇన్ యాక్టివ్‌లో ఉన్నట్లు తెలుసుకుని ఉసూరుమన్నారు. బ్యాంకు అకౌంట్ తిరిగి యాక్టివేట్ చేసుకునేందుకు ఒకేసారి వందల మంది రావడంతో బ్యాంకు సిబ్బంది సైతం సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డారు.
బాబు సేవలో వీర విధేయులు..
పింఛను డబ్బులు బ్యాంకుల్లో జమ చేయాలంటూ ఈసీని కలిసి ఫిర్యాదు చేసిన నిమ్మగడ్డ రమేష్కుమార్ ఎవరో అందరికీ తెలుసు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన నిమ్మగడ్డ రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారు. 2020లో మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలకు నోటిఫికేషన్లు జారీ చేయగా ఆ ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌సీపీ అత్యధిక స్థానాలు ఏకగ్రీవంగా గెలుస్తున్న పరిస్థితి ఉండడంతో చంద్రబాబు ప్రయోజనాల కోసం ఎన్నికల ప్రక్రియను అర్థాంతరంగా నిలిపివేశారు.
చంద్రబాబు కుటుంబ బంధువైన పురందేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగుతూ పొత్తులో దక్కిన సీట్లను 20–30 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్న వారికి కాకుండా చంద్రబాబు వీర విధేయులుగా ముద్రపడ్డ బీజేపీలో ఉన్న టీడీపీ నేతలకు ఇచ్చారు. దీనికిపై సొంత పార్టీ నుంచే ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. పింఛన్ల పంపిణీపై ఈసీకి ఫిర్యాదు చేయడంలోనూ నిమ్మగడ్డ, పురందేశ్వరి లాంటి వారిని ముందు పెట్టి చంద్రబాబు రాజకీయ డ్రామాలకు తెర తీశారు.
మొదలు పెట్టిందే టీడీపీ
రాష్ట్రంలో నాలుగున్నరేళ్లకు పైగా వలంటీర్ల ఆధ్వర్యంలో ప్రతి నెలా ఠంఛన్‌గా లబ్ధిదారుల ఇంటి వద్దే చిన్న అవాంతరం కూడా లేకుండా పింఛన్ల పంపిణీ కొనసాగగా ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే దీన్ని అడ్డుకుంటూ చంద్రబాబు సన్నిహితులంతా వరుసపెట్టి ఈసీకి ఫిర్యాదులు చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ ఏడాది మార్చి ఒకటో తేదీన ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి స్వయంగా ఫిర్యాదు చేశారు.
చంద్రబాబుకు సామాజికవర్గం పరంగా, రాజకీయ ప్రయోజనాల పరంగా వివిధ సందర్భాల్లో అనుకూలంగా వ్యవహరించిన మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ పేరుతో ఫింఛన్ల పంపిణీకి వలంటీర్లను దూరంగా ఉంచాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 23, 25వ తేదీల్లో రెండు విడతలుగా ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి వరకు ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంఛన్‌గా లబ్ధిదారుల ఇళ్ల వద్దనే వలంటీర్ల ద్వారా జరిగిన పింఛన్ల పంపిణీకి బ్రేక్‌లు వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చిది.
టీడీపీ నేతలు, చంద్రబాబు సన్నిహితుల ఫిర్యాదుల మేరకే వలంటీర్లు పింఛన్ల పంపిణీ తదితర కార్యక్రమాలకు వినియోగించే మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. ఫలితంగా ఏప్రిల్‌లో పింఛను డబ్బుల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు చేపట్టారు. దివ్యాంగులు, కదలలేని స్థితిలో ఉన్న అవ్వాతాతలకు ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేసి మిగిలిన వారికి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద అందించేలా నిర్ణయం తీసుకున్నారు.
దాదాపు ఐదేళ్ల పాటు ఏ కష్టం లేకుండా పింఛను తీసుకున్న వారికి ఈ నిర్ణయం కాస్త కష్టంగా అనిపించినా కేవలం ఐదు రోజులోనే అందరికీ సజావుగా డబ్బులు చేతికి అందాయి. అయినా సరే ఆగకుండా టీడీపీ – జనసేన – బీజేపీ నాయకులు ఉమ్మడిగా గత నెల రోజులుగా దాదాపు రోజు మార్చి రోజు పింఛన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. మరోపక్క తమ అనుకూల మీడియాలో రాష్ట్ర ఉన్నతాధికారులను బ్లాక్‌మెయిల్ చేసేలా నిత్యం కథనాలు వెలువరించి ఒత్తిడి తెచ్చి ఇప్పుడు బ్యాంకుల ద్వారా పింఛన్లు పంపిణీ చేసేదాకా పరిస్థితి తీసుకొచ్చారు. తిరిగి రాష్ట్ర ప్రభుత్వం, అధికారులపై నెపం వేస్తూ చంద్రబాబు, టీడీపీ నాయకులు బురద చల్లుతున్నారు.
చంద్రబాబు మమ్మల్ని ఇబ్బందులు పెట్టాడు
పది కిలోమీటర్ల దూరం నుంచి పింఛన్ సొమ్ము తీసుకునేందుకు జంగారెడ్డిగూడెం వచ్చా. ఉదయం 9 గంటలకే ఇక్కడకొచ్చిన నేను పింఛన్ సొమ్ము తీసుకుని ఇంటికి చేరుకునేసరికి మధ్యాహ్నం రెండు గంటలైంది. మండుటెండలో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిది. చంద్రబాబు ఎన్నికల ప్రయోజనం కోసం మమ్మల్ని ఇబ్బందులు పెట్టాడు. దాని పర్యావసానాలు చంద్రబాబు అనుభవించాల్సిందే.
– రాయల మునేశ్వరరావు, పింఛన్ లబ్ధిదారుడు, కేతవరం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా
ముసలివాళ్లపైనా మీ ప్రతాపం
ప్రతినెలా 1వ తేదీన వలంటీర్ వచ్చి పింఛన్ ఇచ్చేవారు. గత నెల సచివాలయానికి వెళ్లి పింఛన్ తీసుకున్నాం. ఈ నెల బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చిది. మండుటెండలో ఎలా వెళ్లగలం. చంద్రబాబు, ఆయన మనుషులు చేసిన ఫిర్యాదుతో వలంటీర్ల సేవలు అందకుండా పోయాయి. ముసలివాళ్లపై ఇలా అక్కసు చూపడం తగదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారికి ఉసురు తగులుతుంది.
– పెసర పోలమ్మ, పాలమెట్ట, వీరఘట్టం మండలం, పార్వతీపురం మన్యం జిల్లా
నా అకౌంట్ రన్నింగ్‌లో లేదంటున్నారు
సీఎం వైఎస్ జగన్ ప్రతినెలా వలంటీర్‌ను మా ఇంటికి పంపించి పింఛన్ డబ్బులు ఇచ్చేవాడు. వలంటీర్లను ఇంటికి రాకుండా చంద్రబాబు అడ్డుకున్నాడు. ఈ నెల పింఛన్ డబ్బు బ్యాంకులో వేశారని చెప్పారు. ఇండియన్ బ్యాంకుకు వెళ్లి అడిగితే నా అకౌంట్ రన్నింగ్‌లో లేదని చెప్పారు. ఎండలోనే వెళ్లి ఎండలోనే ఇంటికి తిరిగివచ్చా. ప్రతినెల మందులు వాడుతున్నా. ఇప్పుడు పింఛన్ డబ్బులు రాలేదు. ఏం చేయాలో తెలియడం లేదు.
– షేక్ గాలిబ్‌సాహెబ్, పింఛన్‌దారుడు, పెండ్యాల, కంచికచర్ల మండలం, ఎన్టీఆర్ జిల్లా
చంద్రబాబు ఏం కిరికిరి చేసినాడో
నా వయసు 70 ఏళ్లు పైనే. పింఛన్ తీసుకోలేకపోతున్నా. ఈ నెల పింఛన్ బ్యాంకులో జమ చేసినారంట. అక్కడికెళ్లాలంటే.. రెండు కిలోమీటర్లు నడిసి హైవే కాడికి పోవాల. ఆటి నుంచి బస్సో, ఆటోనో ఎక్కి మళ్లీ 5 కిలోమీటర్ల దూరంలోని వెల్దుర్తి మండల కేంద్రానికి పోవాల. అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరం బస్సులో డోన్‌కి పోవాల. అక్కడ బ్యాంకులో పింఛన్ జమ చేసి ఉంటే సరి. లేదంటే నేను ఎన్ని తిప్పలు పడాలో. ఎన్నికల సమయంలో మళ్లీ ఆ చంద్రబాబు ఏం కిరికిరి చేసినాడో ఏమో పింఛన్ తీసుకోవడానికి ఈ ఎండల్లో సచ్చి బతుకుతున్నాం
– సుబ్బయ్య, అల్లుగుండు గ్రామం, వెల్దుర్తి మండలం, కర్నూలు జిల్లా
మా ఉసురు తగలకపోదు
నా వయసు 70 సంవత్సరాలు. గతంలో 1వ తారీఖు తెల్లవారుజామునే తలుపుతట్టి వలంటీర్లు పింఛన్లు ఇచ్చేవారు. చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేయించాడంటగా.. మాకు ఇంటి దగ్గరకొచ్చి పింఛన్ ఇవ్వడం లేదు. పింఛన్ కోసం ఎండలో వచ్చి బ్యాంకు దగ్గర పడిగాపులు కాస్తున్నా. గంటల కొద్దీ లైన్‌లో నిలబడాలంటే వయసు సహకరించడం లేదు. ముసలోళ్లపై కక్ష గట్టిన చంద్రబాబుకు మా ఉసురు తగలకపోదు.
– దిబ్బమ్మ, నాగెళ్లముడుపు, తర్లుపాడు మండలం, ప్రకాశం జిల్లా
పింఛన్ కోసం తిరగలేక అల్లాడుతున్నాం
వృద్ధాప్య పింఛన్‌ను ప్రతి నెలా ఇంటికే వచ్చి ఇచ్చేవారు. అయితే చంద్రబాబు కుట్ర ఫలితంగా ఇప్పుడు ఎక్కడెక్కడో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పింఛన్ కోసం సచివాలయానికి వెళ్తే ఇక్కడ కాదు.. బ్యాంకులో జమవుతుందన్నారు. దుత్తలూరులోని యూనియన్ బ్యాంక్‌కు వెళ్తే నగదు జమ కాలేదని తెలిపారు. ఈ రోజంతా ఇలానే గడిచిపోయింది. ఎండలో అవస్థలు పడాల్సి వచ్చిది. ముసలోళ్లను ఇంత ఇబ్బందికి గురిచేసిన వారికి తగిన బుద్ధి చెప్తాం.
– దుగ్గినబోయిన పెద్దగురవయ్య, చింతలగుంట, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment