ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డితో మాట్లాడుతున్న టీడీపీ నేతలు
ఇంటింటికి వెళ్లి ఇవ్వాలని సీఎస్‌ను కోరిన టీడీపీ నేతలు
వలంటీర్ల ద్వారా తాము వద్దనలేదని బాబు బుకాయింపు
సాక్షి, అమరావతి: ఐదేళ్లుగా పక్కాగా, ఠంచన్‌గా జరుగుతున్న ఇంటి వద్దే పింఛన్ల పంపిణీని అడ్డుకునే వరకు నిద్రపోని టీడీపీ నాయకులు ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తుండటంపై లబ్ధిదారులు తీవ్రంగా మండిపడుతున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు వలంటీర్లు ప్రతి నెలా 1న ఇంటివద్దే పెన్షన్లు అందిస్తుండటాన్ని సహించలేని చంద్రబాబు దొడ్డిదారిన అడ్డుకున్నారు.
రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ నేతృత్వంలోని సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ ద్వారా వలంటీర్లపై వరుసగా ఫిర్యాదులు చేశారు. దీంతో కోడ్ ముగిసేవరకు వలంటీర్లను ఈ ప్రక్రియకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి అవాంతరాలు ఎదురయ్యాయి. కానీ, ప్రజాగ్రహంతో ఉలిక్కిపడ్డ టీడీపీ నేతలు నక్కా ఆనంద్‌బాబు, కన్నా లక్ష్మీనారాయణ, దేవినేని ఉమా తదితరులు ఇంటివద్దే పింఛన్లు అందించేలా చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు.
ఐదో తేదీ లోపు పింఛన్ల పంపిణీని పూర్తి చేయాలని వినతిపత్రం సమర్పించారు. వలంటీర్లు అర్థరాత్రి ఇళ్లకు వెళ్లి తలుపులు తడుతున్నారంటూ గతంలో ఇష్టానుసారంగా ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వకపోవడం వెనుక వైఎస్సార్‌సీపీ కుట్ర దాగి ఉందంటూ ఎదురుదాడికి దిగారు. వలంటీర్లతో పింఛన్ల పంపిణీ చేపట్టవద్దంటూ తాము ఎవరినీ కోరలేదంటూ తనకు అలవాటైన రీతిలో బుకాయించారు. టీడీపీ బూత్ కన్వీనర్లతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో సొంత పార్టీ నేతలే విస్తుపోయారు. పింఛన్లు అందకపోవటానికి సీఎం జగనే కారణమని ప్రచారం చేయాలని చంద్రబాబు వారికి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment