employee union leaders
-
ప్రభుత్వం పిలిచినా ఉద్యోగులు చర్చలకు రాకపోవడం కరెక్ట్ కాదు: సజ్జల
సాక్షి, అమరావతి: చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ప్రభుత్వం పిలిచినా ఉద్యోగులు చర్చలకు రాకపోవడం కరెక్ట్ కాదని అన్నారు. ఈ రోజు కూడా పీఆర్సీ సాధన కమిటీ వాళ్ళు చర్చలకు రాలేదని తెలిపారు. తమ పిలుపు మేరకు కొన్ని సంఘాల నాయకులు వచ్చారని, సమస్యలు ప్రస్తావించారని పేర్కొన్నారు. చర్చలకు ఎవరు వచ్చినా మాట్లాడుతామన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో అంతర్భాగమేనని, ఉద్యోగులు, ప్రభుత్వం వేరు కాదని వ్యాఖ్యానించారు. చదవండి: అనంతపురం జిల్లాకు ఇదొక మంచి శుభవార్త: సీఎం జగన్ -
నోటిఫికేషన్ వెనక్కు తీసుకోకుంటే సమ్మెకు దిగుతాం
సాక్షి, అమరావతి: కరోనా ముప్పు ఇంకా కొనసాగుతున్న సమయంలో పంచాయతీ ఎన్నికలు ప్రస్తుతానికి సాధ్యం కాదంటున్నా మొండిగా వ్యవహరిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ నోటిఫికేషన్ జారీ చేయడంపై ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, ఇతర సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఏపీ ఎన్జీవో అసోసియేషన్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య సహా వివిధ ప్రభుత్వ, ఉపాధ్యాయ సంఘాల నేతలు శనివారం వేర్వేరుగా మాట్లాడుతూ నోటిఫికేషన్ విడుదలను తప్పుపట్టారు. ఉద్యోగుల ప్రాణాలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ఇది సమయం కాదు.. ఉద్యోగులకు వ్యాక్సినేషన్ ఇచ్చాక ఎన్నికలు నిర్వహించాలని ఎంత వేడుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు, ఉద్యోగుల ప్రాణాలు పోయినా పర్వాలేదు.. ఎన్నికలు మాత్రం జరపాలని అనుకోవడం ఏమిటని ఆక్రోశం వెలిబుచ్చారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నికలకు వెళ్లాలని కోరారు. తమ వినతిని పట్టించుకుని నోటిఫికేషన్‌ను వెనక్కు తీసుకోవాలని, లేనిపక్షంలో ఎన్నికలు బహిష్కరిస్తామని, అవసరమైతే సమ్మెకు దిగుతామని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరించారు. వ్యాక్సిన్ ఇచ్చేవరకూ ఎన్నికల్లో పాల్గొనం ఉద్యోగులందరికీ వ్యాక్సిన్ ఇచ్చేవరకూ ఎన్నికల్లో పాల్గొనేది లేదు. ఎన్నికల కమిషనర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తన పంతం కోసం ఉద్యోగుల ప్రాణాలు బలిపెట్టడం ఏమిటి? ఎన్నికలకు మేం సిద్ధం.. కానీ దానికంటే ముందుగా ఉద్యోగులందరికీ వ్యాక్సిన్ ఇవ్వాల్సిందే. ఎన్నికలు పెట్టాలని ఆయన నిర్ణయం తీసుకుని ప్రభుత్వాన్ని, ఉద్యోగుల ప్రాణాలను లెక్క చేయకుండా ముందుకెళ్లడం అన్యాయం. ఉద్యోగులుగా మా ప్రాణాలు రక్షించుకునే హక్కు మాకుంది. మూడున్నర లక్షల ఓట్లు పోయినా పర్వాలేదు.. ఉద్యోగులు, ఓటర్లు చనిపోయినా తాను మాత్రం ఎన్నికలు నిర్వహిస్తాననే రీతిలో ఎన్నికల కమిషనర్ చెప్పడం దారుణం. – వెంకట్రామిరెడ్డి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ బలవంతపెడితే.. బహిష్కరిస్తాం ఒకవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించిన సమయంలోపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పట్టుదలకు దిగడం దారుణం. ఎన్నికలు వాయిదా వేయాలి. కాదని ఎన్నికలకు బలవంతపెడితే ఎన్నికలను బహిష్కరిస్తాం. సమ్మె తప్పదు. – లెక్కల జమాల్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య కోచైర్మన్ మీకు రక్షణ కావాలి, ఉద్యోగులకు అక్కర్లేదా? పకడ్బందీగా గ్లాస్ షీల్డ్ అడ్డం పెట్టుకుని మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉద్యోగుల రక్షణ గురించి పట్టించుకోకపోవడం అన్యాయం. నోటిఫికేషన్ ఇవ్వడానికే అంత పకడ్బందీగా అద్దాలు పెట్టుకున్న ఎస్ఈసీ.. లక్షా 40 వేల పోలింగ్ స్టేషన్లలో లక్షలాదిమంది ఉద్యోగులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకున్నారో చెప్పాలి. ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ అనివార్యత అంటున్న ఆయన 2018 నుంచి ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదు? – బొప్పరాజు వెంకటేశ్వర్లు, రెవెన్యూ సర్వీసెస్ అధ్యక్షుడు, అమరావతి ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ పంతానికి పోకుండా ఎన్నికలు వాయిదా వేయాలి ఏ వ్యవస్థ అయినా ప్రజాసంక్షేమమే అంతిమ లక్ష్యమనే విషయాన్ని గుర్తెరిగి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పంతాలకు పోకుండా ఎన్నికలను వాయిదా వేయాలి. ముఖానికి ఫేస్‌షీల్డ్ అడ్డుపెట్టుకుని ఎన్నికల కమిషనర్ మీడియా సమావేశంలో పాల్గొనడం చూస్తుంటే కరోనా అంటే భయం ఆయనకు మాత్రమే ఉందా? ఉద్యోగుల ప్రాణాలు ప్రాణాలు కాదా? కరోనా తీవ్రత లేకుండా ఉండుంటే.. ముఖానికి షీల్డ్ అడ్డుపెట్టుకుని మీడియా సమావేశాన్ని ఎందుకు నిర్వహించారో ఆయన సమాధానం చెప్పాలి. – వాసా శామ్యూల్ దివాకర్, రాష్ట్ర రెవెన్యూ జేఏసీ చైర్మన్ మెరుపు సమ్మె చేస్తాం.. ఒకపక్క ఉద్యోగులకు కరోనా వ్యాక్సినేషన్ జరుగుతుంటే ఎన్నికలు ఏవిధంగా నిర్వహించాలి? ఉద్యోగుల ప్రాణాలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ చెలగాటం ఆడుతున్నారు. ఎన్నికలు ప్రస్తుతం సాధ్యం కాదని సీఎస్ చెప్పినా వినకుండా మొండిగా వ్యవహరించటం ప్రజాస్వామ్యానికే తీరనిమచ్చ. నోటిఫికేషన్ వెనక్కు తీసుకోకపోతే మెరుపు సమ్మె చేయటానికైనా తగ్గేది లేదు. – బండి శ్రీనివాసరావు, ఏపీఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆందోళన కలిగిస్తోంది.. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవ్వకుండానే టీచర్లు ఎన్నికల విధులకు హాజరవ్వాలన్న ఎన్నికల కమిషనర్ ఆదేశం చాలా ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కరోనా వ్యాక్సినేషన్ అవగానే ఎన్నికల విధులకు వెళ్లేందుకు సిద్ధమే. వ్యాక్సినేషన్ పూర్తి కాకుండా బలవంతంగా విధులు వెయ్యొద్దని కోరుతున్నాం. – సామల సింహాచలం, ఏపీ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రెండు డోసుల టీకా ఇచ్చాకే ఎన్నికలు జరపాలి వ్యాక్సిన్ రెండు డోసులూ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను చేపట్టాలి. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణను పూర్తి క్రియాశీలకంగా, సజావుగా జరిపించాల్సిన బాధ్యత ఎంపీడీవోలపైన, పంచాయతీరాజ్ ఉద్యోగులు, గ్రామ సచివాలయ సిబ్బందిపైనే ఉంది. ఈ తరుణంలో మేం ఎన్నికల నిర్వహణను కోరుకోవడం లేదు. – వై.బ్రహ్మయ్య, జి.వి.నారాయణరెడ్డి, డి.వెంకట్రావు, కె.శ్రీనివాస్‌రెడ్డి, కేఎన్వీ ప్రసాద్‌రావు, రాష్ట్ర ఎంపీడీవోల సంఘం నేతలు -
ఉద్యోగులకు శుభవార్త: ఫిట్మెంట్ 20 శాతం..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేతన సవరణ సంఘం (పీఆర్సీ) సిఫారసుల నివేదిక ప్రభుత్వానికి అందింది. తెలంగాణ తొలి పీఆర్సీ కమిటీ చైర్మన్ చిత్తరంజన్ బిస్వాల్, సభ్యుడు మహమ్మద్ అలీ రఫత్ గురువారం ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమక్షంలో సీఎస్ సోమేశ్‌కుమార్‌కు నివేదిక అందజేశారు. 25% ఫిట్మెంట్తో ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయాలని కమిటీ సిఫారసు చేసినట్టు సమాచారం. మూడేళ్లుగా దేశంలో, రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం నెలకొనడం, కరోనాతో ఆర్థిక వ్యవస్థ పతనమైన నేపథ్యంలో 25% ఫిట్మెంటే సాధ్యమని కమిటీ అభిప్రాయపడినట్టు తెలిసింది. 1% ఫిట్మెంట్ అమలుకు ఏటా రూ.300 కోట్లు లెక్కన 25% ఫిట్మెంట్తో వేతన సవరణ చేయడానికి రూ.7,500 కోట్ల భారం పడనుంది. రెండున్నరేళ్ల తర్వాత నివేదిక..: చివరిసారిగా ఉమ్మడి ఏపీలో నియమించిన పదో పీఆర్సీ కమిటీ 29 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫారసు చేయగా, 43 శాతానికి పెంచి వేతన సవరణను ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 ఫిబ్రవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వేతన సవరణ గడువు 2018 జూన్‌తో ముగిసిపోయింది. జూలై 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సవరించిన వేతనాలను అమలు చేయాల్సి ఉంది. సీఆర్ బిస్వాల్‌ను చైర్మెన్‌గా, రిటైర్డు ఐఏఎస్‌లు మహమ్మద్ అలీ రఫత్, సి.ఉమామహేశ్వర్‌రావులను సభ్యులుగా నియమిస్తూ 2018 మేలో పీఆర్సీ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పీఆర్సీతో పాటు ఉద్యోగుల సర్వీసు రూల్స్ సరళీకరించడం, కొత్త జోనల్ వ్యవస్థ అమలు అంశాలపై ఈ కమిటీ అధ్యయనం జరపాలని ప్రభుత్వం ఈ కమిటీని ఆదేశించింది. చదవండి: (చిక్కుముడులు వీడినట్టే!) ఉద్యోగ సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించిన అనంతరం పీఆర్సీ నివేదికను బిస్వాల్ కమిటీ సిద్ధం చేసింది. నివేదిక సమర్పించడంలో ఆలస్యం జరగడంతో ప్రభుత్వం ఇప్పటివరకు నాలుగు పర్యాయాలు గడువు పొడిగించింది. డిసెంబర్ 31తో గడువు ముగుస్తుండగా, ఎట్టకేలకు చివరిరోజు గురువారం పీఆర్సీ నివేదికను సమర్పించింది. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, టీజీవోల అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, టీఎన్జీవోల అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి ఆర్.ప్రతాప్, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎం.నరేందర్‌రావు, ప్రధనా కార్యదర్శి యూసుఫ్ మియా పాల్గొన్నారు. తొలివారంలో చర్చలు.. సీఎస్ సోమేశ్‌కుమార్ నేతృత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు కె.రామకృష్ణారావు, రజత్‌కుమార్‌లతో నియమించిన హైలెవల్ కమిటీ పీఆర్సీ నివేదికపై జనవరి 2, 3 తేదీల్లో క్షుణ్ణంగా అధ్యయనం జరపనుంది. అనంతరం జనవరి 5 నుంచి 7 తేదీల మధ్య రెండ్రోజుల పాటు ఉద్యోగ సంఘాలతో చర్చలు నిర్వహించనుంది. పెంచిన వేతనాల చెల్లింపులు ఎప్పట్నుంచి అమలు చేయాలి? పీఆర్సీ బకాయిలను ఎలా, ఎప్పుడు చెల్లించాలన్న అంశంపై ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను ఈ కమిటీ ముందుంచనున్నారు. ఫిట్మెంట్ శాతంపై ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు అనంతరం జనవరి రెండో వారంలోగా సీఎం కేసీఆర్‌కు నివేదికను సమర్పించనుంది. జనవరి మూడో వారంలో ముఖ్యమంత్రి ఫిట్మెంట్ శాతాన్ని పెంచి వేతన సవరణ అమలుపై కీలక ప్రకటన చేయనున్నారు. చదవండి: (సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం) బిస్వాల్ కమిటీ గడువు పొడిగింపు.. పీఆర్సీ నివేదిక సమర్పించినప్పటికీ, ఇంకా ఉద్యోగుల కొత్త సర్వీసు రూల్స్, కొత్త జోనల్ వ్యవస్థ అమలు, కేడర్ స్ట్రెంథ్ తదితర అంశాలపై బిస్వాల్ కమిటీ ప్రభుత్వానికి నివేదికను సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మరో మూడు నెలల పాటు ఈ కమిటీ గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.. -
జనవరి లోపు ప్రమోషన్లు పూర్తి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నూతన సంవత్సరం శుభవార్త. జనవరి మూడో వారంలో ఉద్యోగులకు వేతన సవరణ కమిటీ (పీఆర్సీ) ఫిట్ మెంట్ శాతంతోపాటు పదవీ విరమణ వయసు పెంపుపై ప్రకటన చేస్తానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. ఉద్యోగుల వేతన సవరణపై నియమించిన వేతన సవరణ కమిటీ (పీఆర్సీ) గురువారం బీఆర్కేఆర్ భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను కలసి నివేదిక సమర్పించింది. సీఎస్ నేతృత్వంలోని ముగ్గురు ఐఏఎస్ అధికారుల కమిటీ రెండు, మూడు రోజుల్లో నివేదికపై అధ్యయనం జరుపుతుందని, అనంతరం జనవరి తొలి వారం లో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమై చర్చలు జరుపుతుందని సీఎం ప్రకటించారు. జనవరి 6, 7 తేదీల్లో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని సీఎస్ కు సూచించారు. ఈ చర్చల సారం ఆధారంగా రెండోవారంలో తనకు నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించారు. ఈ నివేదిక అందిన తర్వాత జనవరి మూడో వారంలో పీఆర్సీ ఫిట్మెంట్ శాతా న్ని ప్రకటిస్తానని ముఖ్యమంత్రి పేర్కొ న్నారు. అదే సమయంలో ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై సైతం మరో కీలక ప్రకటన చేస్తానని సీఎం తెలియజేశారు. ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ మరో దఫా చర్చలు జరిపి ఈ ప్రకటన చేయనున్నారు. టీఎన్జీవో, టీజీవో, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం, రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ల డైరీలు, క్యాలెండర్లను గురువారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం వారితో కలసి మధ్యాహ్న భోజనం చేశారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం ఈ సందర్భంగా కీలక హామీలు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు అన్ని రకాల ఉద్యోగుల వేతనాలను పెంచనున్నామని తెలియజేశారు. ఈ సమావేశంలో టీఎన్జీవోల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మామిండ్ల రాజేందర్, ప్రతాప్, టీజీవోల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మమత, సత్యనారాయణ, హైదరాబాద్ అధ్యక్షుడు ఎంబీ కృష్ణ యాదవ్, నాలుగో తరగతి ఉద్యోగల సంఘం నాయకుడు జ్ఞానేశ్వర్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వంగ రవీందర్‌రెడ్డి, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. టీచర్లతో త్వరలో సీఎం భేటీ..: ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఎమ్మెల్సీలతో త్వరలో సమావేశమై వారి సమస్యలపై చర్చిస్తానని సీఎం ప్రకటించారు. టీచర్ల బదిలీలు, పదోన్నతులపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. జనవరిలోనే పదోన్నతులు అన్ని శాఖలు, హెచ్‌వోడీల్లోని అన్ని కేడర్ల ఉద్యోగులకు జనవరిలోనే పదోన్నతులు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఏపీలో పనిచేస్తున్న 857 మంది తెలంగాణ ప్రాంత 4వ తరగతి ఉద్యోగులు, ఎన్జీవోలను అంతర్రాష్ట బదిలీల ద్వారా తెలంగాణకు తీసుకొస్తామన్నారు. -
సీఎంతో చర్చిస్తాం: రెవెన్యూ సంఘాలు
-
ఎమ్మార్వోపై దాడి.. సీఎంతో చర్చిస్తాం: రెవెన్యూ సంఘాలు
ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే దాడి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సోమవారం చర్చిస్తామని, ఆ తర్వాత తమ తదుపరి కార్యాచరణ నిర్ణయించుకుంటామని రెవెన్యూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చెప్పారు. కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం చర్చించారు. ఈ చర్చలు ఫలప్రదం అయినట్లే నేతలు చెబుతున్నారు. ఎమ్మార్వోతో పాటు ఇతర సిబ్బందిపై పెట్టిన కేసులను రద్దు చేస్తున్నట్లు మంత్రి చెప్పారన్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రోద్బలంతో దాడి చేసిన వాళ్లందరినీ అరెస్టు చేయాలని ఎస్పీ, డీఐజీలకు చెప్పారని నాయకులు అన్నారు. అలాగే దాడి జరుగుతున్నా చూస్తూ ఊరుకున్న ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఎమ్మెల్యే గన్ మన్ (ఒక ప్రైవేటు వ్యక్తి) మీద చర్యలు తీసుకోవాలని సీఎం క్యాంపు కార్యాలయానికి నివేదిక పంపారని తెలిపారు. ముఖ్యమంత్రి వద్దకు దాడికి గురైన ఎమ్మార్వో, జిల్లా నాయకులను సోమవారం తీసుకెళ్తానని ఉమా హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఆయనతో చర్చించిన తర్వాత ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామని అన్నారు. వాళ్ల వైపు నుంచి నిర్ణయం వచ్చిన తర్వాత తమ కార్యాచరణ ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నామని, తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి తెలిపారన్నారు. అయితే.. త్వరలో గోదావరి పుష్కరాలు ఉండటంతో ఆ సమయంలో రెవెన్యూ ఉద్యోగుల నుంచి సహకారం లేకపోతే పని జరగదన్న కారణంతో.. ఉద్యోగ సంఘాలను బుజ్జగించి కేసును డైల్యూట్ చేయాలన్న ప్రయత్నాలు ప్రభుత్వం వైపు నుంచి మొదలైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విషయంలో కూడా తగినంత సమయం తీసుకుని, ఈలోపు తమకు కావల్సినట్లుగా పరిస్థితులను మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా దాదాపు అలాంటి పరిస్థితులనే సృష్టించేలా వాతావరణం కనిపిస్తోంది.