ఎమ్మార్వోపై దాడి.. సీఎంతో చర్చిస్తాం: రెవెన్యూ సంఘాలు
ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే దాడి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సోమవారం చర్చిస్తామని, ఆ తర్వాత తమ తదుపరి కార్యాచరణ నిర్ణయించుకుంటామని రెవెన్యూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చెప్పారు. కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం చర్చించారు. ఈ చర్చలు ఫలప్రదం అయినట్లే నేతలు చెబుతున్నారు. ఎమ్మార్వోతో పాటు ఇతర సిబ్బందిపై పెట్టిన కేసులను రద్దు చేస్తున్నట్లు మంత్రి చెప్పారన్నారు.
ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రోద్బలంతో దాడి చేసిన వాళ్లందరినీ అరెస్టు చేయాలని ఎస్పీ, డీఐజీలకు చెప్పారని నాయకులు అన్నారు. అలాగే దాడి జరుగుతున్నా చూస్తూ ఊరుకున్న ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఎమ్మెల్యే గన్ మన్ (ఒక ప్రైవేటు వ్యక్తి) మీద చర్యలు తీసుకోవాలని సీఎం క్యాంపు కార్యాలయానికి నివేదిక పంపారని తెలిపారు. ముఖ్యమంత్రి వద్దకు దాడికి గురైన ఎమ్మార్వో, జిల్లా నాయకులను సోమవారం తీసుకెళ్తానని ఉమా హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఆయనతో చర్చించిన తర్వాత ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామని అన్నారు. వాళ్ల వైపు నుంచి నిర్ణయం వచ్చిన తర్వాత తమ కార్యాచరణ ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నామని, తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి తెలిపారన్నారు.
అయితే.. త్వరలో గోదావరి పుష్కరాలు ఉండటంతో ఆ సమయంలో రెవెన్యూ ఉద్యోగుల నుంచి సహకారం లేకపోతే పని జరగదన్న కారణంతో.. ఉద్యోగ సంఘాలను బుజ్జగించి కేసును డైల్యూట్ చేయాలన్న ప్రయత్నాలు ప్రభుత్వం వైపు నుంచి మొదలైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విషయంలో కూడా తగినంత సమయం తీసుకుని, ఈలోపు తమకు కావల్సినట్లుగా పరిస్థితులను మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా దాదాపు అలాంటి పరిస్థితులనే సృష్టించేలా వాతావరణం కనిపిస్తోంది.