ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ నేతల వేధింపులు
విజయవాడ: కృష్ణాజిల్లా నూజివీడు తహశీల్దార్ వనజాక్షిపై టీడీపీ నేతల కక్ష సాధింపు కొనసాగుతోంది. ఆర్థికంగా ఉన్నతస్థాయిలో ఉన్న టీడీపీ నాయకులకు సంబంధించి 150 రేషన్ కార్డులను ఆమె ఇటీవలే తొలగించారు. విచారణలో భాగంగా తెల్ల రేషన్ కార్డులు కలిగినవారు కార్లు, ఇళ్లు కలిగి ఉన్నట్లు తేలడంతో వారి రేషన్ కార్డులను వనజాక్షి తొలగించారు. దీంతో అప్పటి నుంచి టీడీపీ నేతలు ఎమ్మార్వో వనజాక్షిని టార్గెట్ చేశారు. విజిలెన్స్ తనిఖీలు పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు మూడుసార్లు తనిఖీలు చేయించారు. ఆమెను నూజివీడు నుంచి మరోచోటుకు బదిలీ చేసేందుకు టీడీపీ నేతలు ముమ్మరంగా పావులు కదుపుతున్నారు. ఇందుకోసం వారు... మంత్రులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల తీరుతో అధికార వర్గాల్లో అసహనం వ్యక్తం అవుతోంది.
కాగా గతంలో అక్రమ ఇసుక రవాణా వ్యవహారంలో ముసునూరు ఎమ్మార్వోగా విధులు నిర్వహిస్తున్న సమయంలో వనజాక్షిపై పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడికి పాల్పడ్డారు. అయితే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం... ఎమ్మెల్యేను వెనకేసుకు వచ్చి, తప్పంతా ఎమ్మార్వోదేగా చిత్రీకరించడం కూడా జరిగింది. వనజాక్షి పరిధి దాటి వ్యవహరించారని ఆయన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.