Vanajakshi MRO
-
తీరుమారని టీడీపీ... తహసీల్దార్ వనజాక్షిపై ఫిర్యాదు
‘ఈనాడు’సంస్థల యజమాని చెరుకూరి రామోజీరావుది పెదపారుపూడి. స్వగ్రామంలో తాగునీటి చెరువు ఆక్రమణ అంశం ఈనాడు దృష్టికి రాలేదా? లేక టీడీపీ వారి వ్యవహారం కాబట్టి పట్టించుకోవడం లేదా? అనే అభిప్రాయాలు గ్రామస్తుల నుంచి వ్యక్తమవుతుండటం చర్చనీయాంశం. సాక్షి, మచిలీపట్నం: ద్రోణవల్లి వనజాక్షి. కృష్ణా జిల్లాలో తహసీల్దార్. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ముసునూరు ఎమ్మార్వోగా తమ్మిలేరులో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేతిలో అవమానానికి, ఆయన అనుయాయుల చేతిలో దాడికి గురైన అధికారి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేత చీవాట్లు తప్పని బాధితురాలు. ఇప్పటికీ తెలుగుదేశం ఆమెను వెంటాడుతూనే ఉంది. తాజా అంశం చెరువును ఆక్రమించి ఆలయ నిర్మాణం చేపట్టవద్దని గ్రామస్తులతో కలిసి టీడీపీ నేతలకు అభ్యంతరం చెప్పడం, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడమే. నీటి వనరును ఆక్రమించి నిర్మాణ యత్నం.. కృష్ణా జిల్లా ఉంగుటూరు తహసీల్దార్‌గా పనిచేస్తున్న వనజాక్షి మెట్టినిల్లు మండల కేంద్రమైన పెదపారుపూడి. రెండున్నర వేల మందికి పైగా రక్షితనీటి సరఫరాకు ఉద్దేశించిన తాగునీటి చెరువు ఉంది. ఇందులో ‘శ్రీశ్రీశ్రీ గంగాపార్వతీ దేవి సమేత జ్ఞానమహేశ్వరస్వామి వార్ల దేవస్థానం’ నిర్మాణానికి గారపాటి వీరనాగబాబు, వెనిగండ్ల వెంకట్రావు తదితర స్థానిక టీడీపీ నాయకులు ప్రణాళిక చేశారు. మహిళా సర్పంచ్ (రిజర్వుడు) అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని పలువురు అనుకూలురు నుంచి సంతకాలు సేకరించిన టీడీపీ బృందం ఈనెల 19వ తేదీన భూమిపూజ ముహూర్తాన్ని ఖరారు చేసింది. దేవస్థాన భక్తబృందం పేరిట కరపత్రాలను ముద్రించి విరాళాల సేకరణ ముసుగులో వసూళ్లు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 203/1 సర్వే నంబర్లోని చిన్నచెరువుగా పిలుచుకునే సుమారు 70 సెంట్ల స్థలం ఆక్రమణల బారిన పడనుంది. సెంటు రూ. 5 లక్షల చొప్పున ఈ స్థలం విలువ రూ.3.50 కోట్లు పైమాటే. తప్పు చేయవద్దన్నందుకు.. నీటివనరులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను వివరిస్తూ గ్రామస్తులతో కలిసి తహసీల్దార్ వనజాక్షి అభ్యంతరం చెప్పా రు. టీడీపీ నాయకులు పెడచెవిన పెట్టడంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తులకు వందేళ్లుగా ఉపయోగపడుతున్న తాగు నీటి చెరువును రక్షించాల ని కోరారు. దీంతో తహసీల్దార్‌పై టీడీపీ నాయకులు కక్షకట్టి గ్రామంలో తాటి చెట్లు కొట్టించి, మట్టి తోలించి రోడ్డు వేయించారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. భూముల రీసర్వేతో.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న రీ సర్వేతో పెదపారుపూడిలో దారులు, డొంకలు తదితర ప్రభుత్వ భూముల వివరాలు వెలుగులోకి వచ్చాయి. పలు ఆక్రమణలు తొలగాయి. ఆ క్రమంలోనే సుమారు ఏడు వందల మీటర్ల మేర డొంక ఆక్రమణలను రెవెన్యూ అధికారులు తొలగించారు. ఈ నేపథ్యంలో వనజాక్షి కుటుంబంతో పాటు మరో పదిహేను మంది రైతులు సుమారు 150 ఎకరాల్లోకి రాకపోకలు సాగించేందుకు, తమ పంట ఉత్పత్తుల రవాణాకు వీలుగా స్వచ్ఛందంగా డొంకను బాగుచేసుకున్నారు. ఆ క్రమంలో అడ్డుగా ఉన్న తాటిచెట్లను తొలగించి, వాటిని వినియోగించుకుని సుమారు 15 అడుగుల మట్టి రోడ్డును ఏర్పాటు చేసుకున్నారు. తమ పొలాల రాకపోకలకు, పంట ఉత్పత్తుల రవాణాకు వీలుగా గ్రావెల్ రోడ్డు నిర్మింపజేయాలని ప్రభుత్వానికి రైతులు విన్నవించుకున్నారు కూడా. ఎంతకీ మారరా? గత ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమాలను అడ్డుకుని చంద్రబాబు ఆగ్రహానికి గురైన ఆనాటి ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై తాజాగా టీడీపీ పెద్దలు దురుద్ధేశపూర్వకంగానే ఫిర్యాదులు చేయించారని పెదపారుపూడి వాసులు అభిప్రాయపడుతున్నారు. నాడు ఇసుక అక్రమాలు వద్దన్నందుకు, నేడు తాగునీటి చెరువు ఆక్రమణ సరికాదన్నందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారే తప్ప ఆ పార్టీ నాయకుల తీరు మాత్రం మారడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆలయ నిర్మాణానికి గ్రామానికి చెందిన సూరపనేని వెంకటరమణబాబు, సురేంద్రబాబులు ఆర్ఎస్ నంబర్ 210లో పది సెంట్లు స్థలం దానమిచ్చారని, అందులో నిర్మాణం చేపట్టవచ్చని గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణం ముసుగులో చెరువు ఆక్రమణలకు గురికాకుండా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. -
తహసీల్దార్ వనజాక్షిపై మరోసారి టీడీపీ దాడి
సాక్షి, అమరావతి బ్యూరో : విజయవాడ రూరల్ మండలం తహసీల్దార్ డి. వనజాక్షిపై టీడీపీ నాయకుల ప్రోద్బలంతో కొందరు నేతలు, మహిళలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం కృష్ణాజిల్లా కొత్తూరు తాడేపల్లిలో చోటుచేసుకుంది. పేదల ఇళ్ల స్థలాల కోసం భూములు కొనుగోలు చేసేందుకు సోమవారం రెవెన్యూ అధికారులు గ్రామసభ నిర్వహించారు. ముందస్తు ప్రణాళిక మేరకు టీడీపీ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, మహిళల్ని రెచ్చగొట్టి గ్రామసభను అడ్డుకున్నారు. తహసీల్దారు వారికి సర్దిచెబుతూ ‘మాకు రూ.2 లక్షలు కమీషన్ ఇస్తే మీకు ఎకరాకు రూ.50 లక్షల పరిహారాన్ని ప్రభుత్వంతో ఇప్పిస్తామని కొందరు దళారులు ప్రతిపాదనలు చేసినట్లు నా దృష్టికొచ్చింది. ముందుగా అలాంటి బ్రోకర్లు ఎవరైనా ఉంటే గ్రామ సభ నుంచి బయటకెళ్లాలి’ అని ఆమె కోరారు. ‘పట్టా భూములకు ఎకరానికి రూ.40 లక్షలు, అసైన్డ్ భూములకు ఎకరానికి రూ.30 లక్షలు, పీఓటీ భూములకు ఎకరానికి రూ.25 లక్షల చొప్పున ప్రభుత్వం ధర ప్రకటించింది’అని తెలిపారు. అయితే, ఆమె మాటలను లెక్కచేయకుండా.. ‘మమ్మల్ని బ్రోకర్లుగా సంబోధిస్తారా..’ తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ మాజీమంత్రి అనుచరుడు బొర్రా పున్నారావుతోపాటు మరికొందరు టీడీపీ నేతలు తహసీల్దారు వనజాక్షికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రభస సృష్టించారు. ఆమె నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. ఆ సమయంలో టీడీపీ నేతలతోపాటు వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు కోట కళ్యాణ్ మహిళల్ని రెచ్చగొట్టారు. దీంతో రెచ్చిపోయిన మహిళలు వనజాక్షిని చుట్టుముట్టి.. ఆమె చీరను చింపేసి దాడి చేశారు. గోళ్లతో రక్కేశారు. కొందరు పురుషులు ఆమెను దుర్భాషలాడుతూ దాడికి యత్నించారు. దీంతో పోలీసులు వనజాక్షికి రక్షణగా నిలిచి ఆమెను గ్రామసభ నుంచి బయటకు తీసుకొచ్చారు. మహిళలు కొట్టండి.. కొట్టండి అంటూ ఆమెను వెంబడించారు. దీంతో తహసీల్దార్ తన వాహనం వద్దకు వెళ్లగా ఆందోళనకారులు ఆమె కారు తాళాలను తీసుకోవడంతో పోలీసు వాహనంలో విజయవాడ చేరుకున్నారు. జిల్లా ఉన్నతాధికారులకు జరిగిన ఘటన గురించి ఆమె తెలియజేశారు. అనంతరం వారి ఆదేశాల మేరకు తనపై దాడికి పాల్పడ్డ వారిపై టూటౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతంలోనూ తహసీల్దారు వనజాక్షిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. -
నాపైనే దాడి జరిగితే సామాన్యులకేది రక్షణ..?
స్వప్రయోజనాలు ఆశించే ఏ నాయకత్వమైనా బాధితులకు, ఉద్యోగులకు న్యాయం చేస్తుందని ఎలా అనుకోగలం? ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిణి పట్ల ఒక మంత్రి వ్యవహార శైలిని రాష్ట్ర పెద్ద దృష్టికి తీసుకెళితే ఏం జరిగింది?మహిళలు, యువతులు, ముక్కుపచ్చలారని బాలికలపై వెలుగు చూడని అకృత్యాలెన్నో.. మహిళలపై ప్రజాప్రతినిధుల నేరాల్లో మన రాష్ట్రం టాప్‌లో ఉందని పలు నివేదికల్లో వెల్లడైంది.. ఇసుక దోపిడిని అడ్డుకునేందుకు వచ్చినతహశీల్దార్పై దాడి... ఈ రాష్ట్ర రైతన్నలపై..ఈ రాష్ట్ర పంటలపై.. ఈ రాష్ట్ర జలవనరులపై..ఈ రాష్ట్ర పర్యావరణంపై.. ఈ రాష్ట్ర భావితరాలపైదాడి! ఇసుక దోపిడీతో రాష్ట్రంలోని కొందరులక్షలు, కోట్లు కొల్లగొట్టుకుంటూరాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీస్తున్నారు.భావితరాలకు తప్పనిసరైననీటి వనరులు ఎండిపోతే.. పంటలుపండకపోతే.. పర్యావరణ సమతుల్యతదెబ్బతింటే.. 70 శాతం వ్యవసాయంపైఆధారపడి జీవిస్తున్న రైతన్నలు ఏం కావాలి?కరవు కాటకాలతో ఏటేటా అల్లాడుతున్నఆంధ్రప్రదేశ్ ఏమవ్వాలి..? అనేది పాలకులు,ఇసుక దోపిడీదారులు ఒక్క క్షణమైనాఆలోచిస్తున్నారా? అన్నదే ఈనాటి సూటి ప్రశ్న . ప్రజాప్రతినిధులేఇష్టానుసారంవ్యవహరిస్తుంటే.. వారినిసరిదిద్దలేని ముఖ్యులు అయిదుకోట్ల మంది రక్షణ బాధ్యతకుఏం భరోసా ఇవ్వగలరు?ఈ కోణంలో ప్రజలుఆలోచించరని అనుకుంటేఎలా? తప్పులు చేసిన వారిపైనచర్యలు తీసుకుంటే..మరొకరు అలా దురుసుగా,బాధ్యతారహితంగాప్రవర్తించగలరా? నాగా వెంకటరెడ్డి, సాక్షి ప్రత్యేక ప్రతినిధి:ఇసుకను ట్రాక్టర్లలో అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆ రోజు ఫోన్ వచ్చింది. విజయవాడలో కలెక్టరుగారి మీటింగ్‌లో ఉన్నా. అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు అప్పగించాలని ఆర్ఐ, వీఆర్వోకు సూచించా. వారిపై దాడి జరిగిందని కలెక్టర్, జేసీల దృష్టికి తీసుకెళ్లగానే.. మీరు వెళ్లి ఆపేయండన్నారు. సంఘటనా స్థలానికి వెళ్లి ఇసుక తీసుకెళ్లొద్దని, హద్దుల తేడాలుంటే.. సర్వేయర్ల ద్వారా నిర్ధారించుకున్న తరువాత నిర్ణయానికి వద్దామని కోరా. వాదనలు జరుగుతున్నప్పుడే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ డ్వాక్రా మహిళలతో సహా మందీ మార్బలంతో వచ్చారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఇసుకతో నింపిన ట్రాక్టర్లు కదిలాయి. అక్కడే వాటికి అడ్డంగా కూర్చోవడంతో పరుష పదజాలంతో దాన్ని ఈడ్చిపారేయండిరా అంటూ.. మహిళలను ఎమ్మెల్యే గారు ఉసిగొల్పారు. అన్నింటికన్నా అత్యంత బాధాకరమైన అంశం ఏంటంటే.. ఆ రోజంతా అక్కడ ఎస్ఐ ఉన్నారు. ప్రేక్షకపాత్ర పోషించారు. ఇసుక ట్రాక్టర్లను అడ్డుకోవడం నాకు కొత్తేమీ కాదు ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్లను అడ్డుకోవడం నాకు ఆ రోజు కొత్తేమీ కాదు. అర్ధరాత్రి వేళల్లో కూడా పదులసార్లు వెళ్లి పదుల సంఖ్యలో ట్రాక్టర్లను స్టేషన్‌కు చేర్చి రెండన్నర లక్షల రూపాయలు ఫైన్ వేసి రాబట్టా. ఇసుక విషయంలో అంత గట్టిగా ఉండటానికి బలమైన కారణాలు ఉన్నాయి. ముసునూరు మండలంలోని 16 గ్రామాల్లో 11 గ్రామాలు డార్క్ ఏరియాలోకి చేరాయి. 800 నుంచి 1000 అడుగులు లోతు బోర్లు వేస్తేగాని భూగర్భ జలాలు అందని పరిస్థితి. తమ్మిలేరు హద్దుగా మండలం ఉందనేగాని నీటి జాడ తక్కువ. నీళ్లు లేక నష్టపోయామనే రైతుల కన్నీటి ఆవేదన దాదాపు ప్రతిరోజూ వినాల్సి వచ్చేది. తమ్మిలేరుతో సహా పరిసరాల్లోని జలవనరుల్లో నీటి చెమ్మ కనిపించేది కాదు. ఇసుక ఇంకా ఇంకా తోడేస్తుంటే.. చివరకు తాగడానికి కూడా ఆ ప్రాంత ప్రజలకు నీళ్లుండవని గ్రహించా. సాధ్యమైనంత వరకు ఇసుక రవాణాను నియంత్రించాలనేది నా ఆలోచన. మహిళలపై ప్రజాప్రతినిధుల నేరాల్లో రాష్ట్రం టాప్ రాష్ట్రంలో మహిళల పరిస్థితి గురించి నేను చెప్పేది, చెప్పాల్సింది ఏముంది?ఒక రిషితేశ్వరి, ఒక వనజాక్షి... కాల్‌మనీ కేసులు... ఇంతకన్నా ఇంకేం చెప్పాలి. 2018 మార్చి2వ తేదీ ఐక్యరాజ్య సమితి కమిటీ విడుదల చేసిన నివేదికప్రకారం–మహిళల అక్రమ రవాణాలో దేశంలోనే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఏడీఆర్ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం–మహిళలపై నేరాలకు పాల్పడుతున్న ప్రజా ప్రతినిధులున్న రాష్ట్రాల్లో మన రాష్ట్రం టాప్‌లో ఉందని చూశాను. ఇతర నివేదికలు ఇంతకన్నా ఎక్కువ గణాంకాలతోనే వివరిస్తున్నాయి. నా సంగతి అలా ఉంచండి. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిణి పట్ల ఒక మంత్రి వ్యవహారశైలిని రాష్ట్ర పెద్ద దృష్టికి తీసుకెళితే ఏం జరిగింది? ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ అధికారిని విజయవాడ నడిబొడ్డున ప్రభుత్వ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు బెదిరిస్తే, గన్‌మెన్‌పై చేయిచేసుకుంటే.. పరిస్థితి ఏంటో మీడియాలో చూశాం. ఇక మహిళలు, యువతులు, ముక్కుపచ్చలారని బాలికలపై ఎన్నెన్ని అకృత్యాలు జరుగుతున్నాయో.. వాటిలో అసలు ఎన్ని వెలుగుచూస్తున్నాయి? బాధితుల పట్ల బాధ్యత తీసుకుని వాటిని వెలుగులోకి తీసుకొచ్చి న్యాయం జరిగేంత వరకు కృషి చేయాల్సిన మీడియా.. ఎంతవరకు ఆ పని చేస్తుందనేది వారి మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉంది కాబట్టి సరిపోతోంది. నాలుగున్నరేళ్లలో 5 బదిలీలు గడచిన నాలుగన్నరేళ్లలో అయిదు బదిలీలు అయ్యాయి.ముసునూరు తహశీల్దారుగా 2014 జూన్ నుంచి 2016 జూన్ వరకు పనిచేశా. ఈ సమయంలోనే తమ్మిలేరు వద్ద ఇసుక రగడ జరిగింది. ఆ తర్వాత నూజివీడు తహశీల్దారుగా బదిలీ చేశారు. తరువాతనూజివీడు సబ్ కలెక్టరు కార్యాలయానికి మార్చారు. ఎన్నికల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి తహశీల్దారుగా బదిలీ అయ్యా. అక్కడ కేవలం 11 రోజులే పనిచేశా. ఎన్నికల సమయంలో మాకు ఈ తహశీల్దారు వద్దని అధికారపార్టీ నాయకుడు చెప్పడంతో.. కాకినాడ కలెక్టరేట్‌కు బదిలీ అయింది. నూజివీడులో ఉన్నప్పుడు ఏసీబీ దాడులు చేయించడానికి విశ్వప్రయత్నాలు జరిగాయి. ఫలించక మౌనం వహించారు. ఇతరులతో ఫిర్యాదులు చేయించారు. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుకు యోచించారు కూడా. తమ్ముడు వేలేరులో ఇల్లు కట్టుకుంటే.. అభ్యంతరం చెప్పారట. ఇసుక దోపిడీని అడ్డుకోవడమంటే అది ప్రభుత్వ వ్యతిరేక చర్యనా? ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలా? లేదా? నేను ఒక్కదాన్ని అడ్డుకుంటేనే ఇసుక అక్రమ రవాణా ఆగిపోదు. కానీ ఎవరో ఒకరు అడుగు ముందుకు వేయాలి కదా. నాది తహశీల్దారు స్థాయే. కానీ రాష్ట్రంలో నా కన్నా పై స్థాయిలో ఆర్డీవోలు, జాయింట్ కలెక్టర్లు, కలెక్టర్లు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ పెద్దలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారు సరైన నిర్ణయాలు తీసుకుంటే.. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుపడుతుందనేది నా ఆలోచన. కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార.. ఇలా రాష్ట్రంలోని నదులు, వాగులు, వంకలు అన్నింటి నుంచి వందల సంఖ్యలో ట్రాక్టర్లు, లారీల్లో ఇసుక తరలిపోతుంటే జలవనరులు ఏమవ్వాలి? భూగర్భ జలాలు ఎంత లోతుకు పడిపోతాయి? ఈ విషయాలను ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలా? లేదా? ఇంకెన్ని ఆపాదించేవారో ప్రజలకు సేవ చేయాలని రెవెన్యూ సర్వీస్‌కు వచ్చా. వచ్చే సంపాదనతో హాయిగా గడిపేద్దామనేఆలోచన నాకు లేదు. నాకు సబ్‌రిజిస్ట్రార్, ఏసీటీవో, ఎక్సైజ్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్... తదితర విభాగాలకు కూడా ఆప్షన్ ఉన్నా ఆలా చూడలేదు. మాది కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరు గ్రామం. ముగ్గురం ఆడపిల్లల్లో నేనే పెద్దదాన్ని. ఒక తమ్ముడు. నన్ను ఐఏఎస్ అధికారిగా చూడాలని అమ్మ కోరుకునేది. కానీ పదో తరగతితోనే చదువు చాలని నాన్న కట్టడి చేశారు. పెళ్లయ్యాక చాలా కాలానికి చదువు ఆరంభించి ఉద్యోగం సంపాదించుకున్నా. ఇక్కడో విషయం స్పష్టం చేయాలి.. నేను మరేదైనా సామాజికవర్గానికి చెందిన అధికారిణై ఉంటే ఇంకెన్ని ఆపాదించేవారో! ఎన్నో బెదిరింపులు,హెచ్చరికలు వచ్చాయి. ఆకాశరామన్న ఉత్తరాలు రాశారు. పార్టీపై పిచ్చి అభిమానంతో కొందరు వాస్తవాలు తెలుసుకోకుండా.. ఫేస్బుక్లో, వాట్సాప్‌ల్లో ఏవేవో కామెంట్లు. మీ కామెంట్లకు మీరు నిలబడతారా? అని నా తరఫు వాళ్లు ప్రశ్నించడంతో.. ఆ తరువాత వెనక్కు తగ్గారు. నేనేమీ పెద్దఆఫీసర్ను కాదు. నాయకురాలిని కూడా కాదు. ఒకవేళ నాకు పలుకుబడి ఉంటే.. నాలుగన్నరేళ్లలో అయిదు బదిలీలు కావు కదా? నేనేమైనా సంపాదించానా? కోట్లుకూడపెట్టుకున్నానా? కుటుంబంఅండగా నిలిచింది ఇదంతా చూసి ఒక్క క్షణం బాధ అనిపించింది. నేనేం తప్పు చేశానని భయపడాలి. ఎందుకు ఆందోళన చెందాలి? నిజాయితీగా, ముక్కుసూటిగా ఉన్నప్పుడు ఇలాంటివి తప్పవని, కాసే చెట్టుకే రాళ్లు పడతాయని నాకు నేను సర్దిచెప్పుకున్నా. నా భర్త, కుటుంబం ధైర్యం చెప్పారు. ముఖ్యంగాఖరగ్పూర్ ఐఐటీలో చదువుకుంటున్న నా ఒకే ఒక్క కుమారుడు సంఘటన గురించి తెలియగానేనా వద్దకు వచ్చేశాడు. అప్పుడు ఇక్కడే ఉన్నాడు. ఏం ఫర్వాలేదమ్మా. ఇలాగే పనిచెయ్. నిజాయితీగా ఉండు. ఏమైతే అదే కానీయ్ చూద్దాం.. అంటూ ధైర్యం చెప్పాడు. నాతోనే ఉన్నాడు. కుటుంబసభ్యులు అందరు, కొందరు సహచర ఉద్యోగులు నాకు అండగా నిలిచారు. చట్టం ప్రకారం వెళదామన్నారు. భావితరాల భవిష్యత్తేంటి? ఎక్కువగా ఇసుక తోడేయడం వలన, నీటిలభ్యత తగ్గుతుంది.భూగర్భ జలాలు అడుగంటుతాయి. ముసునూరు మండల రైతులకన్నీళ్లను, వారి బాధలను నేరుగా చూశా. నేను ఒక రైతు బిడ్డను. ప్రకృతి ప్రేమికురాలిని. పర్యావరణం బాగుండాలని కోరుకునేదాన్ని. మనం అన్నీ సంపాదించుకోవచ్చు. పర్యావరణం పాడైపోతే భవిష్యత్తు ఏమవుతుంది? భావితరాల భవిష్యత్తేంటి? అంతెందుకు సీఎం గారి నివాసం పక్కన కృష్ణా నదిలో ఇసుకను దారుణంగా తోడేస్తున్నారని, ఇది పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తుందని, ఇసుక రవాణాను నిలిపేయాలని ప్రముఖ పర్యావరణవేత్త మేథాపాట్కర్ డిమాండ్ చేశారు. ఆమె అక్కడ నేరుగా చూసిన తరువాతే.. రాబోయే ప్రమాదాన్ని గుర్తించే చెప్పారు. అదేవిధంగా నీటివనరుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణఉద్యమకారులు రాజేంద్రసింగ్ రాజధాని ప్రాంతంలో, కృష్ణా,గోదావరి నదులను చూశారు. ఇసుకను ఇష్టానుసారం తోడేయడాన్ని తప్పుపట్టారు. రాష్ట్రంలోని ఇతర నదులు, వాగులు, వంకలు..అన్ని చోట్లా జరుగుతున్న ఇసుక దందా అంతా ఇంతా కాదు. రూల్ ప్రకారం వెళితే ఏమీ కాదుఉద్యోగస్తులు ఎవరికీ అనుకూలం,ఎవరికీ వ్యతిరేకం కాదు. మనం ఏదో ఒకవైపు పనిచేస్తున్నామని రూఢీ అయితే ఎదుటి పక్షం నుంచి తిప్పలు తప్పవు. రూల్ ప్రకారం వెళితే ఏమీ కాదు. మహా అయితే బదిలీలు. ప్రజల నుంచి మన్ననలు. మహిళలు ఏ విషయాల్లోనూ, ఏ పరిస్థితుల్లోనూ దేనికీ లొంగవద్దు. కుంగిపోవద్దు.ఆదర్శప్రాయంగా ఉండాలి. ప్రతితల్లి తన బిడ్డకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇప్పించాలి. తనను రక్షించుకునే శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. సమాజం మనల్ని గౌరవించే స్థితిలోకి చేరుకోవాలి. వృద్ధాశ్రమంప్రారంభించాలని ఉంది రాజకీయాల్లోకి ఆహ్వానించారు. కాని వాటికి ఇప్పుడు ఓ నమస్కారం. నిరాదరణకు గురవుతున్న వృద్ధులకు ప్రకృతి ఒడిలో సేదతీరేలా మంచి వృద్ధాశ్రమం నిర్మించి నిర్వహించాలనే ఆశ ఉంది. ఇప్పటికి మాత్రం నాకు చేతనైనంతలో అయిదుగురు ఆడబిడ్డల చదువుకు సహకరిస్తున్నా. ఇద్దరు జీవితంలో సెటిల్ అయ్యేలా చదువు, శిక్షణ ఇప్పించా. ఒకరిని దత్తత తీసుకున్నా... ఏది ఏమైనా మనం సంపాదించింది మనం మాత్రమే తినకూడదు. ఎంతో కొంత అవసరమైన వారికి ఉపయోగపడేలా.. అలా ముందుకు.. మున్ముందుకు.. అంతే. ప్రజాప్రతినిధులేఇష్టానుసారంవ్యవహరిస్తుంటే రాజ్యాంగ వ్యవస్థలో ఒకబాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నప్పుడు తప్పులను సరిదిద్దడం బాధ్యత. ఇక్కడ హోదా, కులం, మతం... అవన్నీ అప్రస్తుతం. నేను మహిళను. ఉద్యోగిని. చట్టం అమలుకు నాకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చానా? లేదా? అన్నది చూడాలి. అందులో తప్పులుంటే చర్యలు తీసుకోవాలి. లేదంటే బాధ్యులను సరిదిద్దాలి. ప్రజాప్రతినిధులే ఇష్టానుసారం వ్యవహరిస్తుంటే.. వారిని సరిదిద్దలేని ముఖ్యులు అయిదు కోట్ల మంది రక్షణ బాధ్యతకు ఏం భరోసాఇవ్వగలరు? ఈ కోణంలో ప్రజలు ఆలోచించరని అనుకుంటే ఎలా? తప్పులు చేసిన వారిపైన చర్యలు తీసుకుంటే.. మరొకరు అలాదురుసుగా, బాధ్యతారహితంగాప్రవర్తించగలరా? అన్ని కోణాల్లో ఆలోచించాల్సింది, చూడాల్సింది మాత్రం పెద్దలే. ఇక కొందరు ఉద్యోగ సంఘాల నాయకుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో. స్వప్రయోజనాలు ఆశించే ఏ నాయకత్వమైనాబాధితులకు, ఉద్యోగులకు న్యాయం చేస్తుందని ఎలా అనుకోగలం?! -
వనజ.. అనే నేను..!
వెనుకబాటుతనం నుంచి పురోగతి దిశగాకట్టుబాట్లు, వెలివేత నుంచి సర్పంచ్ వరకుచదువు, కుటుంబ పోషణతో పాటు ప్రజాసేవపోటీ పరీక్షల్లోనూ ప్రతిభ చాటుకుని ఉద్యోగంసంగారెడ్డికి చెందిన ఓ మహిళ ప్రస్థానం వెనుకబాటు తనం.. బాల్య వివాహం.. సామాజిక వివక్ష.. కుటుంబ పోషణ.. మహిళా పురోగతికి అవరోధాలు. వీటన్నింటినీ అధిగమిస్తూ తనను తాను ఆవిష్కరించుకునే ప్రయత్నంలో ముందుకు సాగుతోంది ఈ ముపై ్ప నాలుగేళ్ల వనిత. సామాజిక కార్యకర్తగా, సర్పంచ్‌గా పనిచేసి పలువురి మన్ననలు అందుకున్న మహిళ.. ఇటీవలి పంచాయతీ కార్యదర్శుల పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకుంది. ఓ వైపు భర్తకు వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూనే జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపనతో ముందుకు సాగుతున్న సంగారెడ్డి జిల్లా కల్పగూరు గ్రామ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ తాలెల్మ వనజ సక్సెస్ అండ్ స్ట్రగుల్ సోరీ.. ఆమె మాటల్లోనే:‘‘మా నాయిన ఉపాధి కోసం పుల్కల్ మండలం ఇసోజిపేట నుంచి మంజీర డ్యాం కట్టే సమయంలో వలస వచ్చిండు. మేం మొత్తం నలుగురం. ఇద్దరు అక్కచెల్లెళ్లం. ఇద్దరు అన్నదమ్ములు. డ్యాం నిర్మాణం పూర్తికావడంతో మా నాయిన గంగారాం ఇక్కడే డ్యాం దగ్గర చిన్న ఉద్యోగం సంపాదించిండు. మా బాల్యమంతా మంజీర డ్యాం పరిసరాల్లోనే సాగింది. పక్కనే ఉన్న కల్పగూరు స్కూళ్లో పదో తరగతి వరకు చదివిన. స్కూల్లో చదువులో ముందున్నా.. తాగుడుకు బానిసైన మా నాయిన ఏ విషయాన్నీ పట్టించుకునే వాడు కాదు. పది తర్వాత దగ్గరలో ఉన్న సంగారెడ్డి బాలికల కాలేజీలో ఇంటర్మీడియెట్‌లో చేరిన. చదువు ఆగిపోతుందనుకునే సమయంలో మా బాబాయి సంగారెడ్డిలో ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ బీఎస్సీ కోర్సులో చేర్పించిండు. డిగ్రీ రెండో సంవత్సరంలో ఉండగానే కల్పగూరుకు చెందిన జనార్దన్‌తో పెళై్లంది. పదో తరగతి చదివిన ఆయన హైదరాబాద్‌లో కుష్టు వ్యాధి నిర్మూలనకు సంబంధించిన లెప్రా సొసైటీలో చిరుద్యోగం చేసేవారు. డిగ్రీ ఫైనల్ ఇయర్లో గర్భవతిని కావడంతో కాలేజీకి వెళ్లలేక పోయా. దీంతో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో చదువు అర్ధంతరంగా నిలిచిపోయింది. బాబు పుట్టడంతో ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువయ్యాయి. లెప్రా సొసైటీ శాఖ సంగారెడ్డిలో ప్రారంభించడంతో అందులో నేనూ చేరి ఉద్యోగం చేయడం మొదలుపెట్టా. ఉద్యోగం చేస్తూనే.. తీరిక సమయాల్లో చదివి డిగ్రీ పూర్తి చేశా. ఆ వెనువెంటనే బీఈడీ ఎంట్రన్స్‌లో సీటు సాధించినా, మా నాన్న చనిపోవడంతో చేరలేకపోయా. మరుసటి ఏడాది పటాన్‌చెరులోని ఓ బీఈడీ కాలేజీలో చేరి పూర్తి చేశా. బోధన అనుభవం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఓ ప్రై వేటు స్కూల్లో టీచర్‌గా చేరా. సర్పంచ్‌గా కొత్త బాధ్యత ఓ వైపు ప్రై వేటు స్కూళ్లో టీచర్‌గా పనిచేస్తూనే 2012 డీఎస్సీకి ప్రిపేరయ్యా. కేవలం అరమార్కు తేడాతో ఉద్యోగాన్ని దక్కించుకోలేకపోయా. కొద్ది నెలలకే 2013లో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. మా గ్రామం కల్పగూరు సర్పంచ్ పదవిని ఎస్సీ మహిళలకు రిజర్వు చేసింది. మాకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా.. చదువుకున్న అమ్మాయి సర్పంచ్ అయితే బాగుంటుందని కొందరు గ్రామస్తులు నా భర్తను సంప్రదించారు. అయితే మా సామాజిక వర్గంలోనే కొందరు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు. తమ మాటను ధిక్కరించి పోటీ చేస్తే కుల బహిష్కరణ చేస్తామని తీర్మానం కూడా చేశారు. ఈ హెచ్చరికను సవాలుగా తీసుకుని పోటీలో దిగి గ్రామస్తుల మద్దతుతో సర్పంచ్‌గా గెలుపొందా. ఐదేళ్ల పదవీ కాలం నాకు అనేక విషయాలను నేర్పింది. గ్రామ పాలనకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు, మెటీరియల్, అధికారుల సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయి. మొదట్లో గ్రామ సభల్లో కొంత తడబాటుకు గురైనా, నిబంధనలపై పట్టుచిక్కిన తర్వాత.. ఎవరితోనూ మాట పడకుండా పాలన సాగించా. భర్త చాటు భార్య అనే మచ్చ రాకుండా పనిచేయడంపైనే నా దృష్టి ఉండేది. వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన మహిళగా అక్కడక్కడా కొంత వివక్ష ఎదురైనా.. పెద్దగా పట్టించుకునే దాన్ని కాదు. ఐదేళ్ల కాలంలో గ్రామ పంచాయతీకి కొత్త భవనం సమకూర్చడంతో పాటు, దాదాపు గ్రామం అంతా సీసీ రోడ్లు నిర్మించాం. సర్పంచ్‌గా పనిచేసిన ఐదేళ్ల కాలంలో 2016 ఏప్రిల్‌లో జంషెడ్‌పూర్‌లో ప్రధాని మోడీ మొదలుకుని, మంత్రులు, కలెక్టర్లను కలిసే అవకాశం దక్కింది. దీంతో కొత్త విషయాలు తెలుసుకోవాలనే తపన మరింత పెరిగింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కోరికను ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదు. సర్పంచ్‌గా పనిచేస్తున్న కాలంలో కొందరు ఉద్యోగుల పనితీరు అంత సంతృప్తిగా అనిపించేది కాదు. ఉద్యోగం చేయడం కూడా ఓ రకమైన సేవ అనే అవగాహన ఏర్పడింది. దీంతో సర్పంచ్‌గా పనిచేస్తూనే, వ్యవసాయంలో నా భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపరేషన్ ప్రారంభించా. సంగారెడ్డి అంబేడ్కర్ స్టడీ సర్కిల్లో జరిగే పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వో తదితర పరీక్షలకు ప్రిపేర్ అయ్యా. ఇద్దరు బాబుల బాగోగులను చూసుకుంటూనే, వీలు చిక్కినప్పుడు స్టడీ మెటీరియల్‌ను తిరగేసేదాన్ని. ఈ ఏడాది ఆగస్టులో సర్పంచ్‌గా పదవీ కాలం పూర్తయినా, గ్రామస్తుల బాగోగుల్లో నా వంతు పాత్ర పోషిస్తూనే పంచాయతీ కార్యదర్శి పరీక్ష రాశా. సర్పంచ్‌గా పనిచేసిన అనుభవం పరీక్షలో ఉపయోగపడటం.. ఉద్యోగ సాధనలో కలిసి వచ్చింది. నా ప్రస్థానంలో ఇది ఒక అడుగు మాత్రమే అనుకుంటున్నా.. పీజీ చదువుతో పాటు గ్రూప్ పరీక్షలపై దృష్టి పెట్టాలన్నదే నా సంకల్పం.. రాజ్యాంగం.. అంబేడ్కర్.. ఇవన్నీ బాల్యం నుంచి వింటున్నా.. పూర్తిగా అర్థమయ్యేది కాదు.. ఆయన ఇచ్చిన శక్తి ఏంటో.. తెలిసిన కొద్దీ ఉత్సాహం పెరుగుతోంది. – కల్వల మల్లికార్జున్‌రెడ్డి, సాక్షి, సంగారెడ్డి -
చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి
పెళ్లకూరు: ఆత్మహత్యాయత్నానికిపాల్పడ్డ మండలంలోని శిరసనంబేడు గ్రామానికి చెందిన దాసరి వనజ (18) అనే విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృత్యువాత పడింది. గ్రామానికి చెందిన దాసరి వెంకటాద్రి, మణెమ్మ దంపతుల రెండో కుమార్తె వనజ. నెల్లూరు డీకేడబ్ల్యూ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. పరీక్ష ఫలితాల్లో నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్థాపంతో నాలుగురోజుల క్రితం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆమె శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వనజను తిరుపతికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సోమవారం మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. వనజ కుటుంబసభ్యులను నాయకులు మురళీకృష్ణారెడ్డి, సుధాకర్‌రెడ్డి, వెంకటకృష్ణారెడ్డి, హరిబాబురెడ్డి, శ్యాంరెడ్డి తదితరులు పరామర్శించారు. -
ఇసుక పిండి ధైర్యం ఇచ్చింది
నూరు దుర్మార్గాలు పళ్లు నూరినా కలత చెందని మహాధీర ఆమె. ఇసుక మాఫియాను బ్యాండ్ వాయించి... వారి మోసాన్ని లోకానికి చాటి చెప్పింది. ఇంకా ఇలాంటి మహా మహిళామతల్లులు ఉన్నారు కాబట్టే... భూమి మీద ఇసుక ఉంది. ఇసుక కింద తడి ఉంది. రైతు నాలుగు గింజలు పండించగలుగుతున్నాడు. ‘‘మాది కృష్ణాజిల్లా బాపులపాడు మండలంలోని వేలేరు గ్రామం. మా నాన్న దోనవల్లి భాస్కర్‌రావు సాధారణ రైతు. ముగ్గురమ్మాయిల్లో నేనే పెద్దదాన్ని. తమ్ముడు అందరికంటే చిన్నవాడు. అప్పట్లో అమ్మాయిలు ఎక్కువ చదువుకుంటే పెళ్లి పెద్ద సమస్య అయ్యేది. నాకు పద్దెనిమిదేళ్లకి పెళ్లి కావడానికి ఇవన్నీ కారణాలే. అయితే నా అదృష్టం ఏమిటంటే... నా చదువు గురించి మా వారు శ్రద్ధ చూపించడం. పెళ్లయిన కొత్తలో ఓ సారి... నాకు చదువుకోవాలని ఉంటే నాన్న పెళ్లి చేసుకోమన్నాడని చెప్పాను. ఆ తర్వాత ఆ మాటే మరిచిపోయాను. ఓ రోజు ఓ పేపర్ కటింగ్ తెచ్చి ఇచ్చారు. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానంలో డిగ్రీ చదవడానికి ఇచ్చిన నోటిఫికేషన్ అది. బి.ఎ. నుంచి ఎల్ఎల్బి బి.ఎ, ఎం.ఎ, ఎల్ఎల్బి చేశాను. ఎల్ఎల్బి పూర్తయ్యే నాటికి గ్రూప్ 2 నోటిఫికేషన్ పడింది. తొలి పోస్టింగ్ ఉంగుటూరుకి డిప్యూటీ తాసీల్దారుగా. ముసునూరు మండలానికి ఎంఆర్వోగా బాధ్యతలు తీసుకునే వరకు నేను బయట ఎవరికీ తెలియదు, ముసునూరు బాధ్యతలు నన్ను రెండు రాష్ట్రాలకు తెలియచేశాయి. డ్యూటీ కచ్చితంగా చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో తెలియచేశాయి, ఎలాంటి కష్టాలు ఎదురైనా వృత్తి నిబద్ధతను వదలకూడదనే దృఢ సంకల్పాన్ని పెంచాయి. ఇసుక తోడేస్తే ఏమవుతుంది? నేను ముసునూరులో బాధ్యతలు తీసుకునే నాటికే మండలంలో 16 గ్రామాలుంటే అందులో పదకొండు గ్రామాలు డార్క్లిస్ట్లో ఉన్నాయి. డార్క్ లిస్ట్ అంటే... గ్రౌండ్ వాటర్ లెవెల్ బాగా తగ్గిపోయినప్పుడు ఇక అక్కడ బోర్ వేయడానికి అనుమతించరు. అలా బోరు వేయకూడని స్థితిలో ఉన్నాయి ఆ గ్రామాలు. వాటర్ లెవెల్ ఏడు వందల అడుగుల నుంచి తొమ్మిది వందలకు వెళ్లింది. డార్క్ లిస్ట్ గ్రామాల్లో బోర్ వేయడానికి మా డిపార్ట్మెంట్ అనుమతివ్వదు. మా సర్టిఫికెట్ లేకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కనెక్షన్ ఇవ్వదు. ఇసుక తవ్వే కొద్దీ నీటి లెవెల్ ఇంకా కిందకు వెళ్లిపోతుంటుంది. మిగిలిన గ్రామాల్లోనైనా వాటర్ లెవెల్ ఉన్న స్థితిలో మెయిన్‌టెయిన్ అవ్వాలంటే ఇసుక నిల్వలు తగ్గకూడదు. కండిషన్ అలా ఉండడంతో కలెక్టర్ ఇసుక తవ్వకాలను ఆపేయాలని ఆదేశాలిచ్చారు. కలెక్టర్ ఆదేశాలను పాటించడం నా విధి. పైగా నేను రైతు బిడ్డను. మా నాన్న ఉదయం ఐదింటికి పొలానికి వెళ్తే, రాత్రి ఎనిమిదింటికి ఇల్లు చేరేవాడు. రైతు కష్టం నాకు తెలుసు. అందుకే కమర్షియల్ అవసరాలకంటే రైతు కనీస అవసరాల కోసం పని చేయడమే నా ధర్మం అని నమ్ముతాను. దాంతో ఎక్కడ ఇసుక అక్రమ తవ్వకం, రవాణా జరుగుతున్నా వెళ్లి అడ్డుకునేదాన్ని. నేను పర్టిక్యులర్‌గా ఉన్నానని తెలిసి రాత్రిళ్లు తరలించసాగారు. విఆర్వోలు, నేను వెళ్లి లారీలు, ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేశాం. చంపేస్తామని బెదిరింపు ఉత్తరాలు వచ్చాయి. వాటికి నేను భయపడలేదు. దాదాపు ఇరవై ట్రాక్టర్లను సీజ్ చేయించి, ప్రభుత్వానికి రెండున్నర లక్షల రూపాయల చలానా కట్టించాను. అది ఎమ్మెల్యేకి, వారి మనుషులకు నచ్చలేదు. నా మీద దాడికి పాల్పడ్డారు. ఆ సంఘటన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు నాయకుల నుంచి ఎదురయ్యే కష్టాలు చాలా మందికి తెలిశాయి. ఇప్పటికీ వనజాక్షి అనగానే ఇసుక తవ్వకాన్ని అడ్డుకున్న అధికారిగానే నన్ను గుర్తుపడతారు. మంచి కుటుంబం! విధుల్లో కచ్చితంగా ఉండాలని చాలా మందికి ఉంటుంది. కానీ కొందరికి ఇంటి పరిస్థితులు సహకరించవు. నా విషయంలో మా నాన్న, మా వారు, మా అబ్బాయి, చెల్లెళ్లు, తమ్ముడు, బంధువులు ఎవరూ వెనక్కు లాగలేదు సరికదా నా పోరాటాన్ని గర్వంగా ఫీలయ్యారు. మా అబ్బాయి ఐఐటి ఖరగ్‌పూర్‌లో చదువుతున్నాడప్పుడు. తనైతే ‘అమ్మా నీ డ్యూటీ నువ్వు కచ్చితంగా చేశావు, అన్ని పరిస్థితులనూ ధైర్యంగా ఎదుర్కొంటున్నావు. భయపడాల్సింది, వెనక్కి ఆలోచించుకోవాల్సిందేమీ లేదు’ అన్నాడు. శర్మగారి కమిటీ ముందు ‘ఆ రోజు ఏం జరిగిందో చెప్పాల్సినప్పుడు... నాకు నేను చెప్పుకున్న మాట ఒక్కటే. నా తరవాత తరానికి నేను ఓ మంచి సందేశాన్నివ్వాలంటే ఇదే కరెక్ట్ టైమ్. ఇప్పుడు నేను స్థిరంగా, హుందాగా వ్యవహరిస్తేనే నన్ను రోల్‌మోడల్‌గా తీసుకుంటారెవరైనా’ అనుకున్నాను. అలాగే అనేక ప్రతికూల పరిస్థితులను గంభీరంగా ఎదుర్కొన్నాను. ఉద్యోగంలో ప్రతి క్షణం నేను ఏది సరైన పని అనుకుంటే దానిని నేను అనుకున్నట్లే చేస్తూ వచ్చాను. ఇకపై కూడా అలాగే చేస్తాను. ‘ఉద్యోగంలో స్ట్రెయిట్ ఫార్వార్డ్‌గా ఉండాలి. సర్వీస్ మోటోతో పని చేయాలి. మరొకరితో బేరీజు వేసుకోవడం ఎప్పుడు కూడా ఆరోగ్యకరంగా మన ఉన్నతికి దోహదం చేయాలి తప్ప ఇతరుల మీద ఈర్ష్య, అసూయలను పెంచేదిగా ఉండకూడదు’ ఈ సూత్రాన్ని నేను పాటిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇలా ఉండాలనే కోరుకుంటాను’’. అమ్మాయిలంటే ఇష్టం! నాకు అమ్మాయిలంటే స్వతహాగానే చాలా ఇష్టం. మేఘనకు తల్లి లేదు. తండ్రి కూడా చివరి దశలో ఉన్నాడు. అందుకే ఆ అమ్మాయిని దత్తత తీసుకున్నాను. మగపిల్లాడికి చదువుకు పోషణకు ఆర్థిక సహాయం చేస్తే సరిపోతుంది. కానీ అమ్మాయి విషయంలో ‘ఈ అమ్మాయికి రక్షణగా ఫలానా వాళ్లు ఉన్నారు’ అనుకుంటేనే ఆ అమ్మాయికి భద్రత. రక్షణ ఉందని తెలియకపోతే ఆడపిల్లల మీద పలువురి చూపులు పడుతుంటాయి. అందుకే సమాజంలో ఒక హోదా ఉండే వాళ్లు ఇలాంటి హోమ్స్‌లో ఉండే ఆడ పిల్లలను దత్తత తీసుకోవాలి. ఇదీ నా లైఫ్‌స్టయిల్! నా పోస్టింగ్ నూజివీడుకు మారడంతో మా వారు విజయనగరంలో ఉద్యోగం మానేసి నూజివీడులో జాబ్‌లో చేరారు. ఆయనకు వ్యవసాయం హాబీ. ఆయనను చూస్తూ నాక్కూడా ఇష్టం పెరిగింది. కూరగాయలు మా ఇంట్లోనే పండించుకుంటున్నాం. వనరులను వృథా చేయకుండా పొదుపుగా వాడడం నా హాబీ. కరెంట్, నీరు దేనిని వృథా చేయను. సొంత ఇల్లు కట్టుకునేటప్పుడు సోలార్ ప్లాంట్ పెట్టుకోవాలని ఆలోచన. బాల్కనీలో పక్షులకు గింజలు వేసి నీళ్లు పెడతాను. రెండు పెట్ డాగ్స్‌ను పెంచుతున్నాను. మరో ఆరు స్ట్రీట్ డాగ్స్‌కి ఆహారం పెడతాను. కుక్కలను తరిమేయడానికి బదులు వాటికి వ్యాక్సినేషన్ చేయించి కాలనీలో తిరగనిస్తే చిన్న చిన్న దొంగతనాల వంటి కొన్ని నేరాలు తగ్గిపోతాయి. రిటైర్మెంట్ తర్వాత ప్రకృతి వ్యవసాయం చేయాలని ఉంది. నిరాదరణకు గురైన పిల్లలకు, వృద్ధులకు ఆసరాగా ఏదైనా చేయాలి. ఇప్పుడు సమాజంలో ప్రధాన సమస్య వార్ధక్యంలో ఉన్న అమ్మానాన్నలను పిల్లలు నిర్లక్ష్యం చేయడమే. అలాంటి వారికి నీడనివ్వాలని నా ఆకాంక్ష. – వనజాక్షి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (తాసీల్దార్), సబ్ కలెక్టర్ ఆఫీస్, నూజివీడు - వాకా మంజులారెడ్డి -
గొంతుల గుంపు
‘రేయ్.. రేయ్.. రేయ్... స్కౌండ్రల్’... పెద్దగా అరిచింది. పరిగెత్తబోయింది. పట్టుకోబోయింది. బైక్ క్షణాల్లో పికప్ అయ్యి మాయమైపోయింది. ఎవడు వాడు.. ఎలా ఉన్నాడు... సన్నమా లావా పొడువా పొట్టా... ఏమీ గుర్తు లేదు. ఒక్క విషయమే గుర్తు ఉంది. మగాడు. నడి ఎండ. మధ్యాహ్నపు వేడి. నిర్మానుష్యమైన వీధి. ఒక్కతే తను. ఏం చేయాలి. దుఃఖం వస్తోంది. అవమానంతో ముఖం ఎర్రగా అయిపోయింది. ఛాతీ దగ్గర మంటగా ఉంది. నొప్పిగా ఉంది. పాలు చిమ్మినట్టయ్యి బ్రా తడిసింది. ‘రేయ్.. రేయ్... రాస్కెల్’... క్యాకరిస్తున్నట్టుగా మళ్లీ తిట్టుకుంది. ఇలా ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు ఎలా రియాక్ట్ కావాలో తెలియడం లేదు. పాపకు ఆరు నెలలు. పాలు ఇచ్చి తల్లికి అప్పజెప్పి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని మధ్యాహ్నపు షిఫ్ట్‌కు బయలుదేరింది. డెలివరీ తర్వాత నిజానికి పూర్తిగా కోలుకోనట్టే లెక్క. సిజేరియన్ అయ్యింది. డెలివరీకి ముందు లీవు డెలివరీ తర్వాత లీవు అనంటే ఆఫీసులో ఊరుకోరు. వెళ్లకతప్పదు. రెండు వారాలుగా వెళుతుంది. ఇవాళ కూడా రోజూలాగే బస్టాప్ దగ్గరే కదా అని నడుస్తూ ఉంటే ఎదురుగా బైక్ వాడు. మెల్లగా వస్తున్నాడు. తన వైపే వస్తున్నాడు. ఎవరబ్బా... తెలిసిన మనిషా అని చూస్తోంది. ఇంకా దగ్గరకు వస్తున్నాడు. ఏదైనా అడ్రస్ అడగడానికా. మరింత దగ్గరకు వచ్చి, రెప్పపాటులో చేయి విసిరి, కండ నొక్కి.... ‘రేయ్... రేయ్... లోఫర్... ఏం ఆనందంరా నీకు’ దుఃఖంగా అనుకుంది. ఏం పని చేయబుద్ధి కావడం లేదు. ఆఫీసులో కూచోబుద్ధి కావడం లేదు. ‘ఊరుకో. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మన ఖర్మ. మర్చిపోయి పని చేసుకోవాలి’ అంది కలీగ్. ఎలా మర్చిపోవడం. పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసింది. ‘అంటే ఏం చేశాడు?’ అవతలి వైపు అడుగుతున్నారు. ‘చేయి వేశాడు’ ‘వేసి’ ‘ఇంకా వివరంగా చెప్పాలా... డెమో ఇవ్వనా?’ అరిచింది. ‘ఓకే మేడమ్... రేపోసారి వచ్చి కంప్లయింట్ రాసివ్వండి. నంబర్ గుర్తుందంటున్నారుగా’ అంటున్నారు. ఆఫ్ డే లీవ్ పెట్టి ఇంటికి వచ్చేసింది. తల్లి వస్తే పాపకు తెలుస్తుంది. నిద్ర నుంచి మేలుకొని కళ్లు తెరిచి నవ్వింది. పాల కోసం పెదాలు కదిల్చింది. దుస్తులు తప్పించి పాల కోసం ఒడిలోకి తీసుకుంది. రోజూ పాలిచ్చేటప్పుడు ఎంతో పరవశంగా ఉంటుంది. ఇవాళ దహించుకుపోతూ ఉంది. ‘నన్ను ఇలా అవమానించే హక్కు వాడికెవరు ఇచ్చారు’ అనుకుంది. రాత్రి భార్య కోపాన్ని భర్త గమనించాడు. ‘వీధిలో ఎవరూ లేనప్పుడు కొంచెం గమనించుకుని నడవాలి’ అన్నాడు. ‘ఇదా మీరిచ్చే సలహా’ చురుగ్గా అడిగింది.తెల్లారింది. రెడీ అవుతోంది. స్టేషన్లో ఏం చెప్పాలో ఎలా చెప్పాలో మననం చేసుకుంటూ ఉంది. భర్త ఏం పట్టనట్టుగా తల దువ్వుకుంటున్నాడు. ‘ఏంటి... స్టేషన్‌కు రావడం లేదా మీరు?’ అడిగింది.‘ఏం స్టేషను... ఇలాంటివి స్టేషను దాకా ఎందుకు? నాకు తెలిసిన ఎస్.ఐ ఉన్నాడు. అతనికి చెప్తాను. చూసుకుంటాడు’‘అది కాదు’‘ఇక వదిలేయ్ అన్నానా’ విసుక్కున్నాడు. చేతులు రుద్దుకుంది. పడినవాళ్లకు తెలుస్తుంది ఇది ఎలాంటి అవమానమో. కాదు ఆడవాళ్లకే తెలుస్తుంది ఇది ఎంతటి అవమానమో.ఏమీ చేయడానికి లేదు.ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తానంటే స్కూటర్ ఎక్కి కూచుంది.దారిలో ఏదో ఊరేగింపు జరుగుతోంది. చాలామంది ఆడవాళ్లు, మగవాళ్లు ప్లకార్డులు పట్టుకుని నడుస్తున్నారు. నినాదాలు ఇస్తున్నారు.‘ఆడవాళ్ల మీద అత్యాచారాలు... నశించాలి.. నశించాలి’‘లైంగిక జులుం... నశించాలి... నశించాలి’‘యాసిడ్ దాడులు... నశించాలి... నశించాలి’భర్త ఆ ఊరేగింపు క్రాస్ చేస్తూ కనీసం తల తిప్పి కూడా చూడకుండా ‘ఇలా అరిస్తే నశిస్తాయా... పని లేని చేష్టలు కాకపోతే’ అన్నాడు.ఒక్కసారిగా లోపల నుంచి ఏదో తన్నుకొచ్చినట్టయ్యింది.‘స్కూటర్ ఆపండి’ అరిచింది.‘ఎందుకు?’‘ఆపండన్నానా?’ఆపాడు. ‘చూడండి. కొంచెమైనా సహానుభూతి, సంస్కారం పెంచుకోవడానికి ట్రై చేయండి. మీలాంటి వాళ్లు జరుగుతున్న అన్యాయాలని ఎదిరించరు. పోనీ ఎవరైనా ఇలా ప్రయత్నిస్తుంటే మద్దతు ఇవ్వరు. మీటింగులకు రారు. ఊరేగింపులలో పాల్గొనరు. పోనీ పెళ్లాం మీద చెయ్యేస్తే కంప్లయింట్ ఇస్తారా అంటే అదీ చెయ్యరు. ఏదీ చేయకపోతే అన్యాయానికి ప్రతిఘటన ఉంటుందని ఎలా తెలుస్తుంది? ఇలాంటి ఊరేగింపులు అవసరం. ఎందుకు అంటారా? వీటి వల్ల చిన్న కదలిక వస్తుంది... చైతన్యం వస్తుంది... నాబోటి స్త్రీలకు ధైర్యం వస్తుంది. చేతులతో, చేతలతోనే కాదు... గొంతుతో కూడా కొన్ని ఆపొచ్చు’... అని ఊరేగింపు వైపు నడవబోతూ ఆగింది. మళ్లీ అంది– ‘అవమానం అంటే ఏమిటో తెలుసా? అవమానం జరిగిందని తెలిశాక కూడా దానిని ఎదిరించక పోవడమే అసలైన అవమానం’ విసురుగా కదిలింది. కథ ముగిసింది. సి.వనజ రాసిన ‘అవమానం’ కథ ఇది. ఆడవాళ్లను సమర్థిస్తూ సమాజంలో ఉద్యమాలో కార్యక్రమాలో జరుగుతుంటాయ్. ఎంతమంది పాల్గొంటాము? పోనీ మంచి పని చేయండి అని ఎంకరేజ్ చేస్తాము? నేను సమర్థిస్తున్నాను అని ఫేస్బుక్లో ఒక పోస్టింగ్ పెడతాము? సమాజం మొత్తం చైతన్యం అయినప్పుడు ఆ చైతన్యపు ఛాయ ఫలితాన్ని ఇస్తుంది. తాము చేయక, చేసే వాళ్లను వెక్కిరిస్తూ కూచుంటే... బైక్ మీద తిరిగేవాడు తిరుగుతూనే ఉంటాడు... చేయి విసురుతూనే ఉంటాడు. కుదరదు. స్త్రీ శక్తి సంఘటితం కావాల్సిందే. స్త్రీ– శక్తి. స్త్రీయే శక్తి. పునః కథనం – మహమ్మద్ ఖదీర్‌బాబు గమనిక: ఈ శీర్షిక నేటితో ముగిసింది. - సి. వనజ -
ఎమ్మార్వో వనజాక్షికి బదిలీల శిక్ష
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: అవినీతి, అక్రమాలను ఎంతమాత్రం సహించను.. ఒక్క ఫోన్ చేస్తే చాలు అవినీతిపరుల నుంచి తిన్నదంతా కక్కిస్తా.. అని ముఖ్యమంత్రి ఒకవైపు గర్జిస్తుంటారు. మరోవైపు అధికార పార్టీ నేతలు అవినీతిని అడ్డుకునే అధికారులపై చిందులు తొక్కుతుంటారు. చెప్పినట్లు వినకపోతే దాడులకు దిగుతారు. తమ కార్యకలాపాలకు సహకరించకపోతే బదిలీ చేయిస్తారు. కేసుల్లో ఇరికించేందుకు కుట్రలు పన్నుతారు. తహశీల్దారు వనజాక్షి ఉదంతమే ఇందుకు తార్కాణం. జులై 8, 2015 పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దారు ద్రోణవల్లి వనజాక్షిపై దాడికి పాల్పడ్డారు. తమ్మిలేరు నుంచి అక్రమంగా ఇసుక తీసుకెళ్లవద్దంటూ ట్రాక్టర్లను అడ్డుకున్నందుకు తహశీల్దారు, ఆమె సిబ్బందికి పోలీసుల సాక్షిగా చింతమనేని, ఆయన వర్గీయులు పట్టపగలే చుక్కలు చూపించారు. ఈ వ్యవహారంలో తహశీల్దారు వనజాక్షిదే తప్పు అని ముఖ్యమంత్రి తేల్చేశారు. జూన్ 25, 2016 వనజాక్షిని ముసునూరు నుంచి నూజివీడు తహశీల్దారుగా బదిలీ చేశారు. భూ వివాదంలో తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని టీడీపీ నేతలు ఆమెపై ఒత్తిడి పెంచారు. టీడీపీ నేతల ఒత్తిళ్లకు వనజాక్షి లొంగకుండా నిక్కచ్చిగా వ్యవహరించారు. దీంతో అధికార పార్టీ నాయకులు మరో ఎత్తు వేశారు. మీర్జాపురం గ్రామానికి చెందిన వక్కలగడ్డ విజయభాస్కర్ కుల ధ్రువీకరణ పత్రం కావాలంటూ తహసీల్దారును సంప్రదించారు. ఆయన బీసీ–సి (క్రిస్టియన్)గా నిర్ధారించి నూజివీడు ఆర్డీవోకు నివేదించగా ఆ మేరకు సర్టిఫికెట్ జారీ అయ్యింది. వనజాక్షి తనను కులం పేరుతో దూషించారని విజయభాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూన్ 25, 2017 తహశీల్దారు, ఫిర్యాదుదారు కులాలను ధ్రువీకరించాలని నూజివీడు పోలీసు సబ్ డివిజనల్ ఆఫీసరు ఆర్డీవో కార్యాలయాన్ని కోరారు. ఫిర్యాదుదారు బీసీ–సి, తహశీల్దారు కమ్మ సామాజికవర్గానికి చెందిన వారని అప్పటి నూజివీడు ఆర్డీవో సిహెచ్ రంగయ్య వివరాలు పంపారు. నవంబరు 1, 2017 ఫిర్యాదుదారు విజయభాస్కర్ హిందు–మాదిగ(ఎస్సీ)గా కుల ధ్రువీకరణ పత్రం ఆర్డీవో కార్యాలయం నుంచి అందిందని, తొలుత బీసీ–సి అని ఇచ్చారని, దేన్ని పరిగణనలోకి తీసుకోవాలో తేల్చిచెప్పాలని నూజివీడు డీఎస్పీ ఆర్డీవో కార్యాలయాన్ని వివరణ కోరుతూ ఈ నెల 15న లేఖ రాశారు. కాగా, ఈ రెండు సర్టిఫికెట్లను ఆర్డీవో సీహెచ్ రంగయ్య జారీ చేయడం గమనార్హం. ఎస్సీ సర్టిఫికెట్ ఫిర్యాదుదారుడికి అనుకూలంగా ఉండటంతోపాటు తహశీల్దారు వనజాక్షిపై కక్ష సాధింపునకు ఉపయోగపడుతుందనేది పాలకపక్ష నేతల వ్యూహమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బదిలీల బంతాట ఎమ్మెల్యే చింతమనేని దాడి తరువాత వనజాక్షిని గత ఏడాది జూన్ 25న ముసునూరు నుంచి నూజివీడుకు బదిలీ చేశారు. అక్కడి టీడీపీ నేతలు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా భూ కుంభకోణాలకు అనుకూలంగా వ్యవహరించడం లేదని అక్టోబరు 27న విస్సన్నపేటకు బదిలీ చేశారు. తమ మండలానికి ఆమె వద్దంటూ విస్సన్నపేటలోని భూమాఫియా.. మంత్రులను కోరడంతో బదిలీ ఉత్తర్వులను నిలిపేశారు. నూజివీడు నుంచి తక్షణమే రిలీవ్ కావాలంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు తహశీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. చివరకు ఆమెను నూజివీడు ఆర్డీవో కార్యాలయం ఏవోగా నియమించారు. -
వనజాక్షి గీత దాటలేదు
♦ అది ముసునూరు పరిధే ♦ ద్విసభ్య కమిటీ నివేదిక సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దారు డి.వనజాక్షి గీత దాటలేదని ద్విసభ్య కమిటీ తేల్చింది. ముసునూరు మండలంలోని తమ్మిలేరులో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అనుచరులు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ హోదాలో వెళ్లి అడ్డుకున్నందుకు ఆమె దాడికి గురైన విషయం విదితమే. చింతమనేని పె చర్యలు తీసుకునే వరకూ ఆందోళన చేస్తామని రెవెన్యూ ఉద్యోగుల సంఘం హెచ్చరించడంతో సీఎం చంద్రబాబు వారిని పిలిపించి మాట్లాడి విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. దీంతె ప్రభుత్వం ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జగదీష్ చంద్ర శర్మ, ఐఏఎస్ అధికారి సాల్మన్ ఆరోఖ్యరాజ్‌లతో కూడిన ద్విసభ్య కమిటీ ఈ అంశంపై విచారణ జరిపింది. నివేదిక రూపొందించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) దినేష్ కుమార్‌కు సమర్పించింది. దీనిని సీఎస్ ముఖ్యమంత్రికి పంపించారు. అది ముసునూరు తహసీల్దారు పరిధిలోనిదే విశ్వసనీయ సమాచారం ప్రకారం నివేదికలోని వివరాలిలా ఉన్నాయి. ఇసుక అక్రమ తవ్వకాలను వనజాక్షి అడ్డుకున్న తమ్మిలేరు ప్రాంతం ముసునూరు తహసీల్దారు పరిధిలోకే వస్తుంది. తహసీల్దారు తన పరిధికి చెందని ప్రాంతంలోకి వచ్చి అనవసర రాద్ధాంతం చేశారని చింతమనేని చేసిన వాదనలో నిజం లేదు. చింతమనేని మందిని తీసుకెళ్లి దాడికి దిగడం తప్పు. అలాగే వనజాక్షి కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నట్లు వ్యవహరించి ఉండరాదు. పోలీసులకు, ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసి చర్యలు తీసుకుని ఉండాల్సింది. విప్ చింతమనేనిదే ఎక్కువ తప్పు ఉన్నట్లు తేలినందున ముఖ్యమంత్రి ఏమి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. -
ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ నేతల వేధింపులు
విజయవాడ: కృష్ణాజిల్లా నూజివీడు తహశీల్దార్ వనజాక్షిపై టీడీపీ నేతల కక్ష సాధింపు కొనసాగుతోంది. ఆర్థికంగా ఉన్నతస్థాయిలో ఉన్న టీడీపీ నాయకులకు సంబంధించి 150 రేషన్ కార్డులను ఆమె ఇటీవలే తొలగించారు. విచారణలో భాగంగా తెల్ల రేషన్ కార్డులు కలిగినవారు కార్లు, ఇళ్లు కలిగి ఉన్నట్లు తేలడంతో వారి రేషన్ కార్డులను వనజాక్షి తొలగించారు. దీంతో అప్పటి నుంచి టీడీపీ నేతలు ఎమ్మార్వో వనజాక్షిని టార్గెట్ చేశారు. విజిలెన్స్ తనిఖీలు పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు మూడుసార్లు తనిఖీలు చేయించారు. ఆమెను నూజివీడు నుంచి మరోచోటుకు బదిలీ చేసేందుకు టీడీపీ నేతలు ముమ్మరంగా పావులు కదుపుతున్నారు. ఇందుకోసం వారు... మంత్రులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల తీరుతో అధికార వర్గాల్లో అసహనం వ్యక్తం అవుతోంది. కాగా గతంలో అక్రమ ఇసుక రవాణా వ్యవహారంలో ముసునూరు ఎమ్మార్వోగా విధులు నిర్వహిస్తున్న సమయంలో వనజాక్షిపై పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడికి పాల్పడ్డారు. అయితే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం... ఎమ్మెల్యేను వెనకేసుకు వచ్చి, తప్పంతా ఎమ్మార్వోదేగా చిత్రీకరించడం కూడా జరిగింది. వనజాక్షి పరిధి దాటి వ్యవహరించారని ఆయన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
కత్తితో భార్య గొంతు కోశాడు
గుంటూరు: జిల్లాలోని చిలకలూరిపేట కుమ్మరిపేటలో ఆదివారం ఉదయం దారుణం జరిగింది. మాణిక్యాలరావు అనే వ్యక్తి కుటుంబకలహాలతో భార్య శిఖా వనజాక్షి (40)ని కిరాతకంగా చంపాడు. నిద్రిస్తున్న వనజాక్షి గొంతుకోసి హత్యచేశాడు. గత కొంత కాలంగా దంపతుల మధ్య గొడవలు జరిగేవని ఇరుగుపొరుగువారు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు మాణిక్యాలరావు పరారీలో ఉన్నాడు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఓవరాల్ చాంప్ ముసునూరు
ముసునూరు : నాలుగు రోజులుగా రసవత్తరంగా సాగిన ఎనిమిది జిల్లాల స్థాయి గురుకుల బాలికల క్రీడా పోటీల్లో కృష్ణాజిల్లా ముసునూరు ఓవరల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. ముసునూరు, గుంటూరు జిల్లా కావూరు జట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనగా, చివరికి ముసునూరు జట్టు విజేతగా నిలిచింది. శనివారం ఉదయం జరిగిన 800 మీటర్ల రిలే పోటీల సైతం ముసునూరు విజయం సాధించింది. పోటీగా నిలిచిన కావూరు రెండోస్థానాన్ని సరిపెట్టుకుంది. కబడ్డీ పోటీ కూడా ఉత్కంఠ మధ్య జరిగాయి. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.సురేష్‌బాబు అధ్యక్షతన బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఉత్తమ పారిశ్రామిక వేత్త అవార్డు గ్రహీత మూల్పురి లక్ష్మణస్వామి విజేతలకు బహుమతులతో పాటు నోట్ పుస్తకాలను అందజేశారు. నూజివీడుకు చెందిన వస్త్ర వ్యాపారి మిరియాల కృష్ణకిషోర్ దంపతులు విజేతలకు నూతన వస్త్రాలతోపాటు బాలికలందరికీ పౌచ్‌లు పంపిణీ చేశారు. ప్రిన్సిపాల్, పిఈటీ బృందాన్ని సన్మానించారు. విజేతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో కొర్లకుంట సొసైటీ అధ్యక్షుడు మూల్పురి నాగమల్లేశ్వరరావు, ప్రాంతీయ ఉపకార్యదర్శి కె.భారతీదేవి, పలు గురుకులాల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
భారతీయులను అవమానించేలా సీఎం వ్యాఖ్యలు!
అమరావతి: రాజకీయాలను పక్కా వ్యాపారంగా మార్చి అవినీతిని పెంచి పోషించిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. ఇప్పుడు నంగనాచి కబుర్లు చెబుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఎద్దేవా చేశారు. విజయవాడలో గురువారం జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలను వ్యాపారంగా మార్చి, ఇప్పుడేమో రాజకీయాలు అవినీతిమయం అయ్యాయంటూ చంద్రబాబు మహాపతివ్రతలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇసుక మాఫియాను అడ్డుకున్న తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనితో పాటు రైల్వే కాంట్రాక్టర్‌ను రూ.5 కోట్లు ఇవ్వాలని బెదిరించిన టీడీపీ ఎమ్మెల్యేపై క్రమశిక్షణ చర్యలెందుకు తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను రూ.కోట్లు పెట్టి సంతల్లో పశువుల్లా కొనుగోలు చేసింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. తప్పుడు పనులు చేసే చంద్రబాబుతో రాజకీయ అవినీతి, రాష్ట్ర ప్రయోజనాల గురించి నీతులు చెప్పించుకోవడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో డబ్బులు పంచనంటూ శపథం చేయాలని రామకృష్ణ సవాల్ విసిరారు. భారతీయులను చంద్రబాబు అవమానించారు.. పుట్టుక మా చేతుల్లో ఉంటే తాను, వెంకయ్యనాయుడు అమెరికాలో పుట్టి ఉండేవారమని సీఎం చేసిన వ్యాఖ్యలు భారతీయులను తీవ్రంగా అవమానించడమేనన్నారు. అమెరికాలో పుడితే గొప్పవాళ్లు, భారత్‌లో పుడితే తక్కువ వాళ్లు అనే భావన సరికాదని, మహనీయులు పుట్టిన ఈ గడ్డపై జన్మించడం మన అదృష్టమని రామకృష్ణ హితవు పలికారు. కాగా, అగ్రిగోల్డ్ బాధితుల్ని ఆదుకోకుంటే సీఎం కార్యాలయాన్ని ముట్టడించాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో తీర్మానించినట్లు చెప్పారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సమస్యలపై జిల్లాల వారీగా చైతన్య కార్యక్రమాలు నిర్వహించి, ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించినట్టు సీపీఐ నేత రామకృష్ణ తెలిపారు. -
గొలుసును పోగొట్టుకుని..చైన్ స్నాచింగ్ అంటూ ఫిర్యాదు
తన గొలుసును ఎక్కడో పోగొట్టుకున్న ఓ మహిళ.. కుటుంబసభ్యులకు చెప్పేందుకు భయపడి... చైన్‌స్నాచింగ్ జరిగిందంటూ నాటకమాడింది. చివరికి పోలీసుల దర్యాప్తులో దొరికిపోయింది. సరూర్‌నగర్ సీఐలు లింగ య్య, సునీల్ తెలిపిన వివరాలివీ... తమ ఇంటి సమీపంలోని దుకాణానికి నడిచి వెళుతుండగా వెనక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు తన మెడలోని మూడు తులాల బంగారు గొలుసు తెంచుకు పోయారని మాతాలక్ష్మీనగర్ కాలనీలోని సాయి ఎన్క్లేవ్ అపార్టుమెంటులో నివసించే గెంటి వనజాక్షి(43) బుధవారం సాయంత్రం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన సీఐ సునీల్, సీఐ శ్రీనివాసులు కేసు విచారణలో భాగంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫిర్యాదు చేసిన మహిళ వనజాక్షిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమె ఉండే అపార్టుమెంట్లో ఉన్న సీసీ ఫుటేజి పరిశీలించగా చైన్‌స్నాచింగ్ సమయంలో కానీ, అంతకు ముందు కానీ వనజాక్షి బయటకు వెళ్లలేదని గుర్తించారు. దీంతో ఆమెను గట్టిగా ప్రశ్నించగా చైన్ స్నాచింగ్ జరగలేదని స్పష్టం చేసింది. కొన్ని రోజుల క్రితం గొలుసు ఎక్కడో పడిపోయిందని కుటుంబ సభ్యులు ఏమైనా అంటారేమోనని అబద్ధం చెప్పినట్లు ఒప్పుకుంది. ఇంటి పక్కన నివసించే ఓ వ్యక్తి స్నాచింగ్ జరిగిందని ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎలాగోలా గొలుసు రికవరీ చేసి ఇస్తారని చెప్పటంతో ఈ పని చేసినట్టు చెప్పింది. తప్పుడు పిర్యాదు చేస్తే చర్యలు... ఎవరైనా ఇలాంటి తప్పుడు పిర్యాదుచేస్తే వారిపైనే కేసులు నమోదు చేస్తామని సీఐలు లింగయ్య, సునీల్ స్పష్టం చేశారు. తప్పుడు ఫిర్యాదుల కారణంగా వాస్తవంగా నష్టపోయిన వారికి అన్యాయం జరిగే ప్రమాదముందని తెలిపారు. -
ఉద్యోగానికి వెళ్లమందని తల్లిని చంపేసింది...
కేకేనగర్: ఉద్యోగానికి వెళ్లమని ఒత్తిడి చేసిన తల్లిని కుమార్తె కత్తెరతో పొడిచి హత్య చేసింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. పల్లావరం సమీపంలోని అనకాపుత్తూరు, గురుసామి నగర్ నాలుగవ వీధికి చెందిన మహిళ వనజ (58). టైలర్‌గా పనిచేస్తున్నారు. ఇంట్లో కుట్టుపనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇలావుండగా ఆమె భర్త బాలవరదరాజన్ గత ఏడాది అనారోగ్య కారణంగా మృతిచెందారు. వనజ కుమార్తె గాయత్రి (26) బీఎస్సీ చదివి ప్రైవేటు కంపెనీలో పనిచేసింది. ఆరు నెలలుగా ఉద్యోగానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోవడంతో కుమార్తెపై వనజ ఒత్తిడి తెచ్చింది. బెంగళూరులో ఉద్యోగం దొరికిందని అక్కడికి వెళతానని గాయత్రి చెప్పడంతో వనజ అంతదూరం వద్దు, ఇక్కడే చూసుకోమని తెలిపింది. దీంతో తల్లి, కుమార్తెల మధ్య వాగ్వాదం పెరిగింది. ఆదివారం ఇద్దరి మధ్య జరిగిన తగాదాలో ఆగ్రహించిన గాయత్రి తన తల్లిపై కత్తెరతో దాడి చేసింది. దీంతో వనజ అక్కడికక్కడే మృతిచెందింది. 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఆమె మృతిచెందింది. దీనిపై క్రోంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం జరిపి కుటుంబీకులకు అప్పగించారు. దీనిపై క్రోంపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
నేరానికి హద్దుల ముసుగేస్తారా?
పరిధి దాటి పోతే దొంగను వదిలేయాలా? ముసునూరు వ్యవహారంలో ముఖ్యమంత్రి వింత భాష్యాలు అయినా తహశీల్దారు ‘హద్దు’ దాటలేదు దాడి జరిగిన ప్రాంతం ముసునూరు పరిధిలోనిదే.. శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి పచ్చి అబద్దం ఎమ్మెల్యేని కాపాడుకునేందుకే హద్దులపై అవాస్తవాలు ఎన్నో ఏళ్లుగా వివాదంలో బలివె ఇసుక రేవు తాత్కాలిక హద్దుల ప్రకారం ఇసుక క్రయవిక్రయాల అధికారం ముసునూరుకే.. నాటి గొడవపై ఐఎఎస్ విచారణ నివేదికా అందలేదు అయినా తహశీల్దారు వనజాక్షిదే తప్పిదమని తేల్చేసిన సీఎం సాక్షి, హైదరాబాద్: ఆ తహశీల్దారు ఒక మహిళ. ఒక ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతుండగా తెలిసి ప్రాణాలకు తెగించి అడ్డుకుని ప్రజాధనాన్ని దోచుకుపోకుండా కాపాడడానికి ఆమె ప్రయత్నించారు. మహిళ అయినా ధైర్యంగా వ్యవహరించిన ఆ అధికారిణిని మెచ్చుకోవలసింది పోయి ఆ ప్రాంతం నీ పరిధిలో లేదంటూ ఆమెను ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుబట్టడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి చెప్పేది ఎలా ఉందంటే... దొంగను పట్టుకోవడానికి వెంటాడే పోలీసు తన పరిధి దాటగానే ఆగిపోవాలన్నట్లుంది. పరిధుల గురించి ముఖ్యమంత్రి మాట్లాడడం చూస్తుంటే ఆయన చట్టాన్ని గౌరవిస్తున్నారా.. లేక దొంగకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారా అన్న సందేహం రావడం సహజమే. తహశీల్దారు ద్రోణవల్లి వనజాక్షి తన పరిధిలో లేని ప్రాంతానికి వెళ్లి తప్పిదం చేశారని ముఖ్యమంత్రి శాసనసభ సాక్షిగా అభాండాలు వేయడం ఈ కోవలోకే వస్తుంది. నిజంగానే తహశీల్దారు తన పరిధిలో లేని ప్రాంతానికి వెళ్లారా.. అని చూస్తే.. అది కూడా అబద్దమేనని తేలింది. ఇసుక అక్రమంగా తవ్వుతూ ప్రజాధనానికి గండి కొట్టడమే కాక తహశీల్దారుపై దాడి చేసిన తన పార్టీ ఎమ్మెల్యేని కాపాడుకోవడం కోసం తమ్మిలేరులో హద్దులను తన అబద్దాలతో చెరిపేయడానికి ముఖ్యమంత్రి ప్రయత్నించడం గమనార్హం. అది ముసునూరు పరిధిలోనిదే... కృష్ణా జిల్లా ముసునూరు మండలం బలివె పంచాయతిలోని రంగంపేట, పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం విజయరాయి మధ్య తమ్మిలేరులో సరిహద్దు వివాదం దశాబ్దాలుగా నలుగుతోంది. సారా పాటలు, ఇసుక రేవు అంశాల్లో ఇరు ప్రాంతాల మధ్య విభేదాలు ఉన్నాయి. గతంలో ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు హయాంలో సారా పాటలు జరిగాయి. ప్రస్తుతం ఇసుక వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచిన హద్దుకు సుమారు రెండు వందల మీటర్ల అవతల (పశ్చిమగోదావరి జిల్లా) వరకు రంగంపేట పరిధి (అంటే ముసునూరు మండలం పరిధి)లోకి వస్తుందని గతంలోనే అధికారులు నిర్ణయానికి వచ్చారు. దాన్నే తాత్కాలిక హద్దుగా నిర్ణయించారు. ఆ ప్రాంతంలోని ఇసుక విక్రయాలకు సంబంధించిన ఆదాయం స్థానిక సంస్థల వాటా కింద ముసునూరు మండలానికే ఎపుడూ అందుతుందని స్థానిక నాయకులు, అధికారులు స్పష్టంగా చెపుతున్నారు. అయితే వనజాక్షి వివాదం తర్వాత కృష్ణాజిల్లా రంగంపేట (బలివె), పశ్చిమగోదావరి జిల్లా విజయరాయి గ్రామాల మధ్య సరిహద్దును ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చేసి చెబుతున్నది. బలివె గ్రామంలో సర్వేనెంబర్లు 201, 202, 203 ఉన్నాయి. ఇందులో సర్వేనెంబరు 203 స్మశానవాటికగా రంగంపేట గ్రామస్తులు ఎన్నో ఏళ్లుగా వినియోగిస్తున్నారు. ఆ స్మశాన ప్రాంతం విజయరాయి గ్రామానికి చెందిందని ప్రభుత్వం తాజాగా చెబుతోంది. దీన్ని రంగంపేట గ్రామస్తులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే... ముసునూరు మండలం రంగంపేట వద్ద తమ్మిలేరు నుంచి ఇసుక అక్రమంగా తరలించుకుపోతున్నారని తహశీల్దారుకు జులై 8వ తేదీ ఉదయం 9.30 గంటల సమయంలో స్థానికుల నుంచి ఫోన్లో ఫిర్యాదులు అందాయి. విజయవాడలోని కలెక్టరు క్యాంపు కార్యాలయంలో అటవీ భూములపై ఉమ్మడి సర్వేకి సంబంధించి రెవెన్యూ, అటవీశాఖల సమావేశంలో పాల్గొనేందుకు తహశీల్దారు మార్గమద్యంలో ఉన్నారు. తనతో పాటు ఉన్న సర్వేయరుతో చర్చించగా ఆ ప్రాంతం ముసునూరు పరిధిలోకి వస్తుందని, గత మాసంలో నిర్వహించిన సర్వేలో తాత్కాలిక నిర్ణయం జరిగిందని వివరించారు. దీంతో ఇసుక అక్రమ రవాణాను నిలిపివేయాలని వీఆర్వో, ఆర్ఐలను వనజాక్షి ఆదేశించారు. మీరెవరు చెప్పడానికంటూ ఇసుకాసురులు దౌర్జన్యం చేసి వారిని ఓ గదిలో నిర్భందించారు. విజయవాడలో సమావేశం ముగిసిన తరువాత అక్కడ జరిగిన సంఘటనలు తెలుసుకున్న తహశీల్దారు కలెక్టరుకు పరిస్థితిని వివరించారు. కలెక్టరు సూచనలతో సంఘటనా స్థలానికి చేరుకుని తమ సిబ్బందికి ఆమె మద్దతుగా నిలిచారు. అప్పుడే ఇసుకాసురులు తహశీల్దారుపై దౌర్జన్యానికి దిగారు. కమిటీ ఏం చెప్పకున్నా చంద్రబాబు అత్యుత్సాహం.. ఇసుక వివాదంపై విచారించి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి జేసీ శర్మ నేతత్వంలో కమిటీని ప్రభుత్వం నియమించింది. కమిటి సభ్యునిగా సెర్ప్ సీఈవో సాల్మన్ ఆరోగ్యరాజ్ కూడా విచారణకు వెళ్లారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, తహశీల్దారు వనజాక్షి సహా 25 మందిని విచారించారు. అయితే ఆ కమిటీ ప్రభుత్వానికి ఇంకా నివేదిక ఇవ్వలేదు. కానీ చంద్రబాబు మాత్రం తహశీల్దారుదే తప్పంటూ తీర్పు చెప్పేశారు. -
చిన్నారి ప్రాణం తీసిన విక్స్..
విక్స్ డబ్బా ఓ చిన్నారి ప్రాణం తీసింది. ఆడుకుంటూ నోట్లో పెట్టుకోవడంతో అది గొంతులో ఇరుక్కుని మృతి చెందింది. ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం మహాగాం గ్రామంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. కారగిరి గణేశ్, వనజ దంపతుల 15 నెలల సాయికృతిక్ష మంగళవారం రాత్రి మంచంపై ఆడుకుంటూ అక్కడే ఉన్న విక్స్ డబ్బాను తీసుకుని నోట్లో పెట్టుకుంది. అది గొంతులోకి జారి ఇరుక్కుపోయింది. పక్కనే ఉన్న తల్లిదండ్రులు విక్స్ డబ్బాను తీసేందుకు ప్రయత్నించారు. రాకపోవడంతో వెంటనే భైంసా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ చిన్నారి ఊపిరాడక మృతి చెందింది. చేతిలో ఆడుకోవడానికి తీసుకున్న విక్స్ డబ్బా తమ పాప పాలిట మృత్యువుగా మారుతుందని ఊహించలేకపోయామని తల్లిదండ్రులు కంటతడి పెట్టడం అక్కడున్న వారిని కదిలించింది. -
'నా తప్పుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా..'
కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై దాడి కేసులో విచారణ నిమిత్తం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురువారం సబ్ కలెక్టరేట్‌కు వచ్చారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో దాడి ఘటనపై జేసీ శర్మ కమిటీ విచారణ ప్రారంభించింది. ముందుగా వనజాక్షి ...త్రిసభ్య కమిటీ ఎదుట తన వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఈ ఘటనలో తన తప్పుందని తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు. వనజాక్షి సరిహద్దులు దాటి ఇసుక ర్యాంపులోకి వచ్చారని చింతమనేని అన్నారు. ఆమెపై తాను ఎటువంటి దాడి చేయలేదని ఆయన పేర్కొన్నారు. డ్వాక్రా మహిళల పట్ల వనజాక్షి దురుసు ప్రవర్తనను కమిటీకి వివరించినట్లు ఎమ్మెల్యే చింతమనేని తెలిపారు. తన పై తప్పుడు ప్రచారం చేయడం వెనుక చాలా కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. -
వనజాక్షి ఘటనపై విచారణ ప్రారంభం
పశ్చిమగోదావరి: ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేయాలని చూసిన కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన ఘటనపై ఐఏఎస్ అధికారుల బృంధం విచారణ ప్రారంభించింది. విచారణలో భాగంగా రంగంపేట ఇసుక రీచ్‌ను ఐఏఎస్ బృందం పరిశీలించనుంది. ఇసుకు రీచ్ పరిశీలన అనంతరం ఏలూరులో రెవెన్యూ అధికారులతో భేటీ కానున్నారు. ముసునూరు రెవెన్యూ అధికారులను కూడా ఈ బృందం విచారించనుంది. -
పిట్ట గోడ
వనజ: పిన్నిగారూ... ఇది విన్నారా? పిన్నిగారు: ఏంటి వనజా... అంత గొప్ప విషయమా? వనజ: మన కాలనీలో ఉండే ఆటో శీనయ్యను పోలీసులు పట్టుకెళ్లారట. పిన్నిగారు: అమ్మో... పోలీసులే?! వనజ: ఆ... పోలీసులూ జీప్‌లో రాలేదు. పెద్ద వ్యాన్‌లో వచ్చారట. పోలీసులతో పాటు పెద్ద ఎస్పీ గారే స్వయంగా వచ్చారంట! పిన్నిగారు: వ్యాన్లోనా? పైగా ఎస్పీ గారు! ఒక్క జవాను సరిపోడా వీడొక్కణ్ణీ తీసుకెళ్లేందుకూ? వనజ: అదేగద వింత! పిన్నిగారు: అంత ఘనకార్యం ఏం చేశాట్ట? వనజ: ఏం చేశాడా...? ఎవడో వీడి ఆటోలో ఒక పావుకిలో ఉల్లిపాయలు మరచిపోయాట్ట. మన కాలనీలో వీడే తెగ నిజాయితీపరుడైనట్టూ...ఉల్లిపాయలు రిటర్న్ ఇచ్చాడట. వాడికి అవార్డు ఇవ్వడానికి సీఎం పిలిపించుకున్నాట్ట. పిన్నిగారు: అందుకేనా... వాడి పెళ్లాం తెగ బడాయిపోతోంది. అమ్మా...! -
వడ్డీ వ్యాపారి వనజాక్షి దాష్టీకం
తిరుపతి: ఆమె పేరు వనజాక్షి. తిరుపతిలో వడ్డీ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో కాలనీలోని పారిశుధ్య కార్మికులకు రూ.100కు రూ.12 వడ్డీ ఒప్పందం ప్రకారం డబ్బులు అప్పుగా ఇచ్చింది. వారికి సంబంధించిన ఏటీఎం కార్డులన్నీ తన వద్దే ఉంచుకుంది. ఇదేంటని ప్రశ్నించిన వారిని తన మనుషులతో దాడి చేయిస్తోంది. బాధితులు సమీపంలోని పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు వనజాక్షిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
అనంతపురం : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామంలో వనజ (22) అనే యువతి ఆదివారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మరణించింది. వనజ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వనజ మృతిపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దాంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వనజ మృతదేహన్ని స్వాధీనం చేసుకుని.... పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా వనజ కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. -
బెదిరింపులకు భయపడను
తహసీల్దార్ వనజాక్షి స్పష్టీకరణ ముసునూరు: బెదిరింపు ఫోన్‌కాల్స్, లేఖలకు భయపడి బదిలీ చేయించుకోనని కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ డి.వనజాక్షి స్పష్టం చేశారు. ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు. నిజాయతీ, నిబద్ధతతో పనిచేసే అధికారులకు బెదిరింపులు రావడం సహజమేనన్నారు. ఇక్కడి నుంచి బదిలీ చేయించుకోవాలని, లేకుంటే చంపేస్తామంటూ సోమవారం తన కార్యాలయానికి పంపిన లేఖకు భయపడేదిలేదన్నారు. మండలంలోని కొన్ని గ్రామాల నుంచి అక్రమంగా ఇసుకను తరలించే వ్యక్తులు తనను మానసికంగా కుంగదీసి, భయభ్రాంతులకు గురి చేసేందుకే ఈ లేఖను పంపారని చెప్పారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు ముసునూ రు పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. విధి నిర్వహణలో ఇప్పటివరకు తాను ఎలాంటి తప్పు చేయలేదని వెల్లడించారు. బెదిరింపు లేఖపై దర్యాప్తు ప్రారంభం తహసీల్దార్ వనజాక్షిని చంపుతామని వచ్చిన బెదిరింపు లేఖపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బెదిరింపు లేఖను ఆమె వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. దాన్ని ఎక్కడ పోస్టు చేశారో తెలిపే స్టాంపు సక్రమంగా లేకపోవడంతో ముసునూరు సబ్ పోస్టుమాస్టర్ బి.సత్యనారాయణను కలిసి ప్రశ్నించారు. -
'వనజాక్షికి రక్షణ కల్పించాలని కలెక్టర్ ను కోరాం'
విజయవాడ: కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి ఘటనపై ఏపీ ఎన్జీవో చైర్మన్ విద్యాసాగర్ స్పందించారు. వనజాక్షికి రక్షణ కల్పించాలని కలెక్టర్ ను కోరినట్లు ఆయన స్పష్టం చేశారు. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈనెల 7వ తేదీన జంతర్ మంతర్ వద్ద ఏపీ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాకు ఏపీ ఎన్జీవో, జేఏసీల నుంచి తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ధర్నాకు హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ధర్నాకు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆహ్వానిస్తామన్నారు. ఈనెల 8వ తేదీన రాష్ట్ర ఉద్యోగ నేతలంతా కేంద్ర హోంమంత్రిని, మిగిలిన కేంద్ర మంత్రులను ఏపీ విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చమని కోరతామన్నారు. దీంతో పాటు ఈనెల 10 వ తేదీన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్షకు కూడా తాము సంఘీ భావం తెలుపుతామన్నారు. రాజకీయాలకు అతీతంగా ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు ఎవరు ఉద్యమం చేసినా తమ మద్దతు ఉంటుందన్నారు. ఈ నెల 16వ తేదీన జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో నెల్లూరులో విభజన హామీలపై సమావేశం ఏర్పాటు చేసి.. తమ భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. -
డబ్బుతో సెటిల్ చేయాలనుకోవడం దుర్మార్గం
తిరుపతి : వనజాక్షి, రిషితేశ్వరి ఘటనలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు డబ్బుతో సెటిల్ చేయాలని చంద్రబాబు చూస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఇది దుర్మార్గమైన చర్యగా ఆమె వర్ణించారు. మంగళవారం తిరుపతిలో యాంటి ర్యాగింగ్ పోస్టర్‌ను రోజా విడుదల చేశారు. అనంతరం రోజా మాట్లాడుతూ.... చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేదని విమర్శించారు. రిషితేశ్వరి ఘటనలో రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప స్పందించలేదన్నారు. ఆర్కిటెక్చర్ విద్యార్థి రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో నాగార్జున యూనివర్శిటీ వీసీ, ప్రిన్సిపల్‌ను తక్షణం అరెస్ట్ చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిషితేశ్వరి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రభుత్వానికి రోజా సూచించారు. కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్వార్వో డి. వనజాక్షిపై పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే సీహెచ్ ప్రభాకర్‌తో పాటు ఆయన అనుచరులు దాడి చేసిన సంగతి తెలిసిందే. అలాగే ర్యాగింగ్ కారణంగా ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థి రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరుగుతుందని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. -
వనజాక్షికి అండగా ఉంటా: హరికృష్ణ
హైదరాబాద్ : కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షికి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణ మద్దతుగా నిలిచారు. ఆమెను వచ్చిన బెదిరింపు లేఖను ఆయన మంగళవారమిక్కడ తీవ్రంగా ఖండించారు. వనజాక్షి పోరాటానికి అండగా ఉంటామని, ఆమెను చంపుతామని బెదిరింపు లేఖ రాసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని హరికృష్ణ డిమాండ్ చేశారు. ఇంతకాలం పార్టీలో మౌనంగా ఉన్న హరికృష్ణ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా మహిళలకు రక్షణ కల్పించడంలో తెలుగుదేశం ప్రభుత్వ విఫలమవుతోందనే అభిప్రాయాన్ని తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రెండు కేసులు వనజాక్షి, రిషితేశ్వరి కేసుల గురించి హరికృష్ణ తన సన్నిహితుల వద్ద ప్రస్తవించినట్లు ప్రచారం జరుగుతోంది. నిజాయితీగా పని చేసిన ముసునురు ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసిన ఎమ్మెల్యేలకు అండగా నిలవడంపై హరికృష్ణ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆమెకు రక్షణ నిలవాల్సిన ప్రభుత్వం అమెను దోషిగా నిలబెడ్డమేంటని ప్రశ్నించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వనజాక్షి కుంటంబాన్ని చంపుతామని బెదిరింపు లేకలు వారిసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని హరికృష్ణ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మృతికి కారణమైన వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని హరికృష్ణ డిమాండ్ చేశారు. వారు ఎంతటి వారైనా సరే వదిలి పెట్టకూడదని ఆయన కోరారు. సీనియర్ల ర్యాగింగ్ చేయటంతో మనస్తాపం చెంది రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా తాను ముసునూరు వదిలి వెళ్లే ప్రసక్తే లేదని ఎమ్మార్వో వనజాక్షి స్పష్టం చేశారు. బెదిరింపులకు తాను లొంగనని, ఉద్యోగుల ప్రాణాలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఆమె అన్నారు. తన కుటుంబానికి హాని ఉన్నందున భద్రత కల్పించాలని వనజాక్షి ప్రభుత్వాన్ని కోరారు. -
'మిమ్మల్ని చంపడానికి ప్లాన్ సిద్ధం చేశాం'
విజయవాడ: 10 రోజుల్లో ఊరు విడిచి వెళ్లాలి... లేకుంటే చంపేస్తాం అంటూ ఆగంతకుల నుంచి కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో డి వనజాక్షికి సోమవారం బెదిరింపు లేఖ అందింది. మిమ్మల్ని చంపేందుకు ఇప్పటికే రెండుసార్లు మీ ఇంటి వద్ద రెక్కీ కూడా నిర్వహించామని ఆగంతకులు ఆ లేఖలో పేర్కొన్నారు. మీ భర్త, పిల్లల్ని వదిలి మిమ్మల్ని చంపడానికి ప్లాన్ సిద్ధం చేశామని ఆగంతకులు పేర్కొన్నారు. అందుకోసం ఇసుక రీచ్‌లో గొడవ జరిగిన 8వ రోజే మిమ్మల్ని చంపమని మాకు సుఫారీ ఇచ్చారని లేఖలో ఆగంతకులు పేర్కొన్నారు. దాంతో వనజాక్షి ముసునూరు పోలీసులకు ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, అధికార టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆయన అనుచరులు కృష్ణాజిల్లా నూజివీడు తాలుక మునుసూరు మండలంలోని ఇసుక రీచ్‌లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు.ఆ విషయంపై సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మార్వో వనజాక్షితో పాటు సిబ్బంది అక్కడికి చేరుకుని.... ఇసుక తవ్వకాలు అక్రమం అని వారిని నిలదీశారు.దాంతో ఎమ్మెల్యే అనుచరులు ఆమెపైనా రెవెన్యూ సిబ్బందిపైనా దాడి చేశారు. జూలై మొదటి వారంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సిబ్బంది ఆందోళనకు దిగి... తమ సేవలను స్తంభింప చేశారు. ఆ తర్వాత ఈ పంచాయితీ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరింది. బాధితురాలు వనజాక్షితోపాటు రెవెన్యూ శాఖకు చెందిన నాయకులు... చంద్రబాబు స్వయంగా కలసి మాట్లాడారు. అయితే ఇసుక అక్రమ తవ్వకాలపై సమాచారం అందినప్పుడు మీరు కాకుండా పోలీసులను పంపితే సరిపోయేదిగా అంటూ చంద్రబాబు... వనజాక్షితో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై ఐఏఎస్ అధికారి జేసీ శర్మ విచారణ జరుపుతుందని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
అక్కడ వనజాక్షి.. ఇక్కడ ఆసిఫా
మహిళా తహసిల్దార్లపై టీడీపీ నేతల రాజకీయం బుట్టాయగూడెం తహసిల్దార్ ఆసిఫాపై బదిలీ వేటు వేసేందుకు యత్నాలు రెవెన్యూ రికార్డుల తారుమారును అడ్డుకున్న ఫలితం అక్రమార్కులకు టీడీపీ నేత అండ ఏలూరు : ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేయాలని చూసిన కృష్ణాజిల్లా తహసిల్దార్ వనజాక్షిపై దాడిచేసి.. ఆనక తప్పంతా ఆమెపైనే నెట్టేసిన టీడీపీ నేతలు ఇప్పుడు మరో మహిళా తహసిల్దార్పైనా అలాంటి రాజకీయాలే ప్రయోగిస్తున్నారు. రెవెన్యూ రికార్డులు తారుమారు చేసిన అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. అక్రమాలను వెలుగులోకి తెచ్చిన బుట్టాయగూడెం తహసిల్దార్ ఆసిఫాను బదిలీ చేయించేందుకు కుట్రలు పన్నుతున్నారు. బుట్టాయగూడెంలో రెండు నెలల క్రితం బయటపడిన నకిలీ పాస్ పుస్తకాల కుంభకోణంలో పాత్రధారులు, సూత్రధారులకు అండగా నిలుస్తూ తహసిల్దార్‌ను బలి చేసేందుకు పావులు కదుపుతున్నారు. నకిలీ పాస్ పుస్తకాలు, రెవెన్యూ రికార్డులు సృష్టిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో బుట్టాయగూడెంలో బాజీ అనే యువకుడి ఇంటిపై ఏప్రిల్ 30న తహసల్దార్ ఆసిఫా ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు దాడులు చేపట్టారు. రెవెన్యూ కార్యాలయంలో ఉండాల్సిన రికార్డులన్నీ గతంలో వీఆర్ఏగా పనిచేసిన బలాల్ సాహెబ్ కుమారుడైన బాజీ ఇంట్లో లభ్యమయ్యాయి. అతని ఇంటినుంచి జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, సివిల్ సప్లయ్స్ రిజిస్టర్లు, పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై నిష్కర్షగా విచారణ జరిపిన తహసిల్దార్ ఆసీఫా తెరవెనుక సూత్రధారులపై కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. సూత్రధారి మాజీ ఎమ్మార్వోనే కుంభకోణంలో పాత్రధారి బాజీ కాగా.. ప్రధాన సూత్రధారి బుట్టాయగూడెంలోనే పనిచేసిన ఓ మాజీ ఎమ్మార్వోనేనని అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. మాజీ ఎమ్మార్వో, ప్రస్తుతం తహసిల్దార్ కార్యాలయంలో కీలక విభాగంలో పనిచేస్తున్న ఆయన బంధువు అండతోనే బాజీ ఇష్టారాజ్యాంగా రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారన్న వాదనలు ఉన్నాయి. ఈ ముగ్గురూ కలసి విలువైన భూముల రికార్డులను మాయం చేశారన్న ఆరోపణలున్నాయి. సదరు మాజీ ఎమ్మార్వో ఇక్కడ పనిచేస్తున్న కాలంలోనే అవినీతి ఆరోపణలు రావడంతో సీబీసీఐడీ విచారణ ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆయన సతీమణి టీడీపీ తరఫున స్థానికసంస్థల ప్రజాప్రతినిధిగా ఉండటంతో అడ్డూఅదుపు లేకుండా తహసిల్దార్ కార్యాలయాన్ని అక్రమాల అడ్డాగా మార్చివేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వీరి ఆగడాలకు చెక్ పెట్టాలని చూస్తున్న తహసిల్దార్ బదలీ కోరుతూ ఏలూరుకు టీడీపీ నేతను ఆశ్రయించినట్టు తెలిసింది. రెండు నెలలైనా చర్యల్లేవ్ బాజీ భాగోతం వెలుగులోకి వచ్చి రెండు నెలలైనా ఉన్నతాధికారులు కనీస మాత్రంగానైనా స్పందించకపోవడం వెనుక ఏలూరుకు చెందిన టీడీపీ సీనియర్ నేత ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ కుంభకోణంలో పాత్రధారులు, సూత్రధారులను వెనకేసుకుని వస్తున్న టీడీపీ నేత ఇప్పుడు అక్కడి తహసిల్దార్ ఆసిఫాను బదిలీ చేయాలంటూ ఉన్నతాధికారుల వద్ద పట్టుబడుతున్నట్టు సమాచారం. పక్కా ఆధారాలతో అక్రమాలు బయటపెట్టిన తహసిల్దార్ లక్ష్యంగా టీడీపీ నేతలు చేస్తున్న రాజకీయం ఎటువైపు వెళ్తుందో చూడాలి. -
ఆమెదే తప్పని ఎలా నిర్ణయిస్తారు ?
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ కేబినెట్ అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు పట్టింది. ఈ వ్యవహారంపై గురువారం హైదరాబాద్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు స్పందించారు. ఈ అంశంలో ఎమ్మార్వో వనజాక్షిదే తప్పని ఏపీ కేబినెట్ అభిప్రాయాన్ని ధర్మాన ప్రసాదరావు తీవ్రంగా ఖండించారు. వనజాక్షి వ్యవహారంలో దర్యాప్తే జరగకుండా ఆమెదే తప్పని ఎలా నిర్ణయిస్తారని ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణంపై చంద్రబాబు సింగపూర్ సంస్థలతో ముందే ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణంలో వ్యాపార ఉద్దేశం తప్పా ప్రజా ప్రయోజనాలు లేవని విమర్శించారు. పుష్కరాల తొక్కిసలాటపై కేబినెట్ మంత్రులే కేసు పక్కదోవ పట్టేలా మాట్లాడితే... నిష్పక్షపాత దర్యాప్తు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. చంద్రబాబు పాలన రోజురోజుకు దిగజారిపోతుందన్నారు. మీకు పరిపాలన అనుభవం ఉందని ఓటు వేస్తే మరీ ఇంతదిగజారి వ్యవహరిస్తారా అని చంద్రబాబును ధర్మాన ప్రశ్నించారు. -
'ఆమెకే అలా అయితే.. ఇక సాధారణ మహిళలు'
తిరుపతి:ఏపీ కేబినెట్ సమావేశంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు క్లీన్ చిట్ ఇవ్వడం దుర్మార్గం అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. చింతమనేనిని వెనకేసుకు రావడానికి తహశీల్దార్ వనజాక్షిని బలిపుశువును చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మార్వోకే రక్షణ లేదంటే ఇక రాష్ట్రంలో సాధారణ మహిళల పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. వనజాక్షి తరుఫున రెవెన్యూ ఉద్యోగ సంఘాలు పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.ఆ పోరాటానికి వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పారు. బుధవారం అయిన కేబినెట్ సమావేశం ఎమ్మార్వో వనజాక్షిదే తప్పని తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఆమె తన అధికార పరిధిని దాటి జోక్యం చేసుకున్నారని చింతమనేని ప్రభాకర్‌ను వెనకేసుకొని వచ్చిన నేపథ్యంలో ఏపీ సర్కార్‌పై విమర్శలు పెల్లుభుకుతున్నాయి. -
తప్పంతా ఆమెదేనా..
సాక్షి ప్రతినిధి, విజయవాడ : నిబద్ధతతో పని చేస్తూ ప్రజా ధనాన్ని కాపాడేందుకు చిత్తశుద్ధితో అడుగులు వేసిన ముసునూరు తహశీల్దార్ వనజాక్షి ఉదంతంలో తప్పంతా ఆమెదేనంటూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించడం అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇసుక దందా చేస్తుంటే.. ప్రశ్నించి అడ్డుకున్న తహశీల్దార్ వనజాక్షిని అవమానించడమే కాకుండా ఈడ్చి వేశారు. అడ్డుపడిన రెవెన్యూ సిబ్బందిపై దాడి చేశారు. పైగా ఆయన అనుచర వర్గం ఏలూరులో చిందులు వేసి తహశీల్దార్‌పై ఎదురు దాడికి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా వనజాక్షి చర్యను సమర్థించిన పలు ఉద్యోగ, కార్మిక సంఘాలు ఇప్పుడు సీఎం తీరునుచూసి విస్తుపోతున్నాయి. తాను దుడుకు స్వభావినని, అందువల్ల తాను తప్పుచేసి ఉంటే క్షమించాలని ఎమ్మెల్యేనే స్వయంగా చెప్పినా మంత్రులు ఆయన తప్పు చేయలేదని తీర్మానించడాన్ని ఉద్యోగ సంఘాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. మచ్చుకైనా ఎమ్మెల్యే చేత భవిష్యత్‌లో ఇటువంటి తప్పులు జరగకుండా చూస్తానని చెప్పిండడంలో చంద్రబాబు విఫలం కావడమే కాకుండా తమ ఎమ్మెల్యేలు ఎవరినైనా ఇలాగే చేస్తారని పరోక్షంగా హెచ్చరించారు. పాశవిక పాలనకు తెర తీశారు... రాజమండ్రిలో బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో తహశీల్దార్ వనజాక్షే తప్పు చేశారంటూ మంత్రులు నిర్ణయించడంతో చంద్రబాబు తన పాశవిక పాలనకు తెరతీసినట్లయిందని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్యేను అరెస్టు చేసే వరకు తన పోరాటం ఆగదని, ఇటువంటి పాలకులు ఉంటే తనలాంటి అధికారి ఉరివేసుకొని చావడమే మేలని బహిరంగంగా తహశీల్దార్ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయినా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తీవ్ర గర్హనీయమని పేర్కొంటున్నారు. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ వారు కూడా చంద్రబాబు తన ఇంటికి వనజాక్షిని పిలిపించి హెచ్చరించడంతో వెనకడుగు వేశారనేది పలువురి వాదన. మీరు అక్కడికి ఎందుకు వెళ్లారని సీఎం స్వయంగా అధికారిని ఇంటికి పిలిపించి నిలదీశారంటే.. తమ ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో దందాలకు పాల్పడినా వాటిని పట్టించుకోవద్దని స్పష్టం చేసినట్లయిందనే భావన వ్యక్తమవుతోంది. తహశీల్దారు తన ఇంటి ఆస్తులను కాపాడుకునేందుకు అక్కడికి వెళ్లలేదని, ప్రజల ఆస్తి, ప్రకృతి సంపదను కాపాడేందుకు వెళ్లారని, పరిధి తేలిన తర్వాత తీసుకుపోవచ్చని తాను అడ్డుకున్న రోజునే వెల్లడించారని.. అయినా ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండా పాలకులు తీసుకున్న నిర్ణయంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కమిటీ కథ కంచికేనా? వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని దాడి చేసిన విషయంపై విచారణ కోసం ఐఏఎస్ అధికారితో కమిటీ వేస్తున్నట్లు ప్రకటించిన సీఎం చంద్రబాబు ఇంతవరకు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. పైగా బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కూడా ఈ విషయం చర్చకు రాలేదు. దీనిని బట్టి కమిటీ వ్యవహారం కంచికి పోయినట్లేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చిత్త శుద్ధి ఉన్న ఐఏఎస్‌ను నియమిస్తే ఎమ్మెల్యే చేసిన తప్పు ఎక్కడ బయటకు వస్తుందోననే భయం టీడీపీ నేతల్లో ఉంది. ఈ వ్యవహారంపై రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకుల్లో కూడా తీవ్ర అసంతృప్తి ఉంది. అయితే సీఎం చర్యను ఖండించేందుకు నాయకులు ముందుకు రావడం లేదు. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ వారు ప్రశ్నించలేకపోతున్నారు. తాము ఉద్యోగులమని, తమపై కక్షగట్టే అవకాశం ఉందని, తమను వదిలేయండంటూ కొందరు ఉద్యోగ సంఘాల నేతలు 'సాక్షి'కి చెప్పడం గమనార్హం. ఎంపీలు, ఎమ్మెల్యేలకే అప్పగించండి రాష్ట్రంలో పోలీసు, రెవెన్యూ వ్యవస్థలను రద్దు చేసి ఎమ్మెల్యేలు, ఎంపీలకే రాజ్యాలను అప్పగించినట్లు జిల్లాలను, నియోజ కవర్గాలను అప్పగిస్తే వారే దందాలు చేసి ప్రజల నుంచి మామూళ్లు వసూలు చేసుకుంటారు. నిజాయతీగా పనిచేసిన తహశీల్దార్ వనజాక్షిని తప్పు చేసిందంటూ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించడం ప్రభుత్వ అవినీతికి పరాకాష్ట. మహిళా అధికారిపై దాడి చేసిన ఎమ్మెల్యేను చంద్రబాబు వెనుకేసుకురావడం ఆయన చేతకానితనానికి నిదర్శనం. - వంగవీటి రాధాకృష్ణ, వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు ప్రభుత్వం పరిధి దాటింది తహశీల్దార్ వనజాక్షి తన పరిధి దాటలేదు.. రాష్ట్ర ప్రభుత్వమే తన అధికార పరిధిని దాటి వ్యవహరించింది. ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళా అధికారిని పరిధి దాటిం దంటూ నిస్సిగ్గుగా రాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయిం చడం సిగ్గుచేటు. మహిళా అధికారిపై దౌర్జనానికి పాల్పడిన ఎమ్మెల్యేకు మద్దతుగా నిలవటం దారుణం. -బాబూరావు, సీపీఎం రాజధాని ప్రాంత సమన్వయ కమిటీ కన్వీనర్ ఎన్జీవో నేతలు తేల్చుకోవాలి నిజాయతీగా పనిచేసిన వనజాక్షినే రాష్ట్ర క్యాబినెట్ తప్పుపట్టింది. ఇప్పుడు ఎన్జీవో నేతలు న్యాయం పక్షం నిల బడి పోరాడతారా? లేక చంద్రబాబుకు తొత్తులుగా మారతారా అనేది తేల్చుకోవాలి. రాష్ట్ర క్యాబినెట్ ఇసుక మాఫియాకు మద్దతుగా నిలబడటం హేయం. మహిళలకు రక్షణ కల్పిస్తానని హామీలు గుప్పించిన చంద్రబాబు.. ఇప్పుడు మహిళా అధికారిపై దాడి జరిగితేనే పట్టించుకోకపోవడం బాధాకరం. - మల్లాది విష్ణు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు క్యాబినెట్ నిర్ణయం కోరలేదు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైనప్పుడు వన్‌మేన్ కమిటీ వేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. కమిటీ నివేదిక ఆధారంగా తప్పొప్పులు నిర్ణయిస్తామని పేర్కొన్నారు. క్యాబినెట్లో చర్చించడం సరి కాదు. క్యాబినెట్ నిర్ణయంతో మాకు సంబంధం లేదు. సీఎం హామీ మేరకు సీనియర్ ఐఏఎస్ అధికారితో వన్‌మేన్ కమిటీ వేయాలి. - పి.వాసు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్,రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం తహశీల్దార్ వనజాక్షిపై ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన ఘటనపై ఐఏఎస్ అధికారితో విచారణ చేయిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కమిటీ నిర్ణయానికే కట్టుబడి ఉంటాం. బుధవారం రాజమండ్రిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం నాకు తెలియదు. -చంద్రశేఖరరావు , రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, జిల్లా అధ్యక్షుడు -
నిబద్ధతతో పనిచేస్తే.. అవమానమా!
మహిళా అధికారి మనోధైర్యాన్ని దెబ్బతీసిన క్యాబినెట్ వనజాక్షిదే తప్పని నిర్ణయించడంపై అంతటా విస్మయం సీఎం నియంతృత్వ పోకడకు ఇది నిదర్శనమని విమర్శ చంద్రబాబు సర్కారు తన నిజ నైజాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టింది. ప్రజాధనాన్ని కాపాడేందుకు ప్రయత్నించిన ముసునూరు తహశీల్దారు వనజాక్షిదే తప్పంటూ క్యాబినెట్ సమావేశంలో తీర్మానించింది. తమ పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మహిళా అధికారిపై దాడిచేసినా అడ్డగోలుగా సమర్థించింది. తమ ఎమ్మెల్యేలు, నేతల అక్రమాలకు అడ్డొస్తే.. ఎవరికైనా ఇదే గతని స్పష్టం చేసింది. విజయవాడ : నిబద్ధతతో పని చేస్తూ ప్రజా ధనాన్ని కాపాడేందుకు చిత్తశుద్ధితో అడుగులు వేసిన ముసునూరు తహశీల్దార్ వనజాక్షి ఉదంతంలో తప్పంతా ఆమెదేనంటూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించడం అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇసుక దందా చేస్తుంటే.. ప్రశ్నించి అడ్డుకున్న తహశీల్దార్ వనజాక్షిని అవమానించడమే కాకుండా ఈడ్చి వేశారు. అడ్డుపడిన రెవెన్యూ సిబ్బందిపై దాడి చేశారు. పైగా ఆయన అనుచర వర్గం ఏలూరులో చిందులు వేసి తహశీల్దార్‌పై ఎదురు దాడికి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా వనజాక్షి చర్యను సమర్థించిన పలు ఉద్యోగ, కార్మిక సంఘాలు ఇప్పుడు సీఎం తీరునుచూసి విస్తుపోతున్నాయి. తాను దుడుకు స్వభావినని, అందువల్ల తాను తప్పుచేసి ఉంటే క్షమించాలని ఎమ్మెల్యేనే స్వయంగా చెప్పినా మంత్రులు ఆయన తప్పు చేయలేదని తీర్మానించడాన్ని ఉద్యోగ సంఘాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. మచ్చుకైనా ఎమ్మెల్యే చేత భవిష్యత్‌లో ఇటువంటి తప్పులు జరగకుండా చూస్తానని చెప్పిండడంలో చంద్రబాబు విఫలం కావడమే కాకుండా తమ ఎమ్మెల్యేలు ఎవరినైనా ఇలాగే చేస్తారని పరోక్షంగా హెచ్చరించారు. పాశవిక పాలనకు తెర తీశారు... రాజమండ్రిలో బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో తహశీల్దార్ వనజాక్షే తప్పు చేశారంటూ మంత్రులు నిర్ణయించడంతో చంద్రబాబు తన పాశవిక పాలనకు తెరతీసినట్లయిందని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్యేను అరెస్టు చేసే వరకు తన పోరాటం ఆగదని, ఇటువంటి పాలకులు ఉంటే తనలాంటి అధికారి ఉరివేసుకొని చావడమే మేలని బహిరంగంగా తహశీల్దార్ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయినా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తీవ్ర గర్హనీయమని పేర్కొంటున్నారు. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ వారు కూడా చంద్రబాబు తన ఇంటికి వనజాక్షిని పిలిపించి హెచ్చరించడంతో వెనకడుగు వేశారనేది పలువురి వాదన. మీరు అక్కడికి ఎందుకు వెళ్లారని సీఎం స్వయంగా అధికారిని ఇంటికి పిలిపించి నిలదీశారంటే.. తమ ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో దందాలకు పాల్పడినా వాటిని పట్టించుకోవద్దని స్పష్టం చేసినట్లయిందనే భావన వ్యక్తమవుతోంది. తహశీల్దారు తన ఇంటి ఆస్తులను కాపాడుకునేందుకు అక్కడికి వెళ్లలేదని, ప్రజల ఆస్తి, ప్రకృతి సంపదను కాపాడేందుకు వెళ్లారని, పరిధి తేలిన తర్వాత తీసుకుపోవచ్చని తాను అడ్డుకున్న రోజునే వెల్లడించారని.. అయినా ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండా పాలకులు తీసుకున్న నిర్ణయంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కమిటీ కథ కంచికేనా? వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని దాడి చేసిన విషయంపై విచారణ కోసం ఐఏఎస్ అధికారితో కమిటీ వేస్తున్నట్లు ప్రకటించిన సీఎం చంద్రబాబు ఇంతవరకు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. పైగా బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కూడా ఈ విషయం చర్చకు రాలేదు. దీనిని బట్టి కమిటీ వ్యవహారం కంచికి పోయినట్లేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చిత్త శుద్ధి ఉన్న ఐఏఎస్‌ను నియమిస్తే ఎమ్మెల్యే చేసిన తప్పు ఎక్కడ బయటకు వస్తుందోననే భయం టీడీపీ నేతల్లో ఉంది. ఈ వ్యవహారంపై రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకుల్లో కూడా తీవ్ర అసంతృప్తి ఉంది. అయితే సీఎం చర్యను ఖండించేందుకు నాయకులు ముందుకు రావడం లేదు. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ వారు ప్రశ్నించలేకపోతున్నారు. తాము ఉద్యోగులమని, తమపై కక్షగట్టే అవకాశం ఉందని, తమను వదిలేయండంటూ కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ‘సాక్షి’కి చెప్పడం గమనార్హం. ఎంపీలు, ఎమ్మెల్యేలకే అప్పగించండి రాష్ట్రంలో పోలీసు, రెవెన్యూ వ్యవస్థలను రద్దు చేసి ఎమ్మెల్యేలు, ఎంపీలకే రాజ్యాలను అప్పగించినట్లు జిల్లాలను, నియోజ కవర్గాలను అప్పగిస్తే వారే దందాలు చేసి ప్రజల నుంచి మామూళ్లు వసూలు చేసుకుంటారు. నిజాయతీగా పనిచేసిన తహశీల్దార్ వనజాక్షిని తప్పు చేసిందంటూ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించడం ప్రభుత్వ అవినీతికి పరాకాష్ట. మహిళా అధికారిపై దాడి చేసిన ఎమ్మెల్యేను చంద్రబాబు వెనుకేసుకురావడం ఆయన చేతకానితనానికి నిదర్శనం. - వంగవీటి రాధాకృష్ణ, వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు ఆటవిక పాలనకు నాంది ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ దాడికి పాల్పడిన ఘటనలో వనజాక్షిదే తప్పంటూ ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు తప్పుబట్టారు. రౌడీషీటర్‌గా ఉన్న వ్యక్తిని కేబినెట్ ఎలా సమర్థిస్తుం దంటూ మండిపడ్డారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఆటవిక పాలనకు నాంది పలికారని ధ్వజమెత్తారు. నిజాయతీగల అధికారులకు చంద్రబాబు ప్రభుత్వంలో తావులేదనడానికిది నిదర్శనమని విమర్శించారు. క్యాబి నెట్ నిర్ణయంపై స్పందించేందుకు కొందరు ఎన్జీవో నేతలు ముందుకు రాకపోగా, మరికొందరు తమదైన శైలిలో స్పందించారు. - గాంధీనగర్ ప్రభుత్వం పరిధి దాటింది తహశీల్దార్ వనజాక్షి తన పరిధి దాటలేదు.. రాష్ట్ర ప్రభుత్వమే తన అధికార పరిధిని దాటి వ్యవహరించింది. ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళా అధికారిని పరిధి దాటిం దంటూ నిస్సిగ్గుగా రాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయిం చడం సిగ్గుచేటు. మహిళా అధికారిపై దౌర్జనానికి పాల్పడిన ఎమ్మెల్యేకు మద్దతుగా నిలవటం దారుణం. -బాబూరావు, సీపీఎం రాజధాని ప్రాంత సమన్వయ కమిటీ కన్వీనర్ ఎన్జీవో నేతలు తేల్చుకోవాలి నిజాయతీగా పనిచేసిన వనజాక్షినే రాష్ట్ర క్యాబినెట్ తప్పుపట్టింది. ఇప్పుడు ఎన్జీవో నేతలు న్యాయం పక్షం నిల బడి పోరాడతారా? లేక చంద్రబాబుకు తొత్తులుగా మారతారా అనేది తేల్చుకోవాలి. రాష్ట్ర క్యాబినెట్ ఇసుక మాఫియాకు మద్దతుగా నిలబడటం హేయం. మహిళలకు రక్షణ కల్పిస్తానని హామీలు గుప్పించిన చంద్రబాబు.. ఇప్పుడు మహిళా అధికారిపై దాడి జరిగితేనే పట్టించుకోకపోవడం బాధాకరం. - మల్లాది విష్ణు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు క్యాబినెట్ నిర్ణయం కోరలేదు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైనప్పుడు వన్‌మేన్ కమిటీ వేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. కమిటీ నివేదిక ఆధారంగా తప్పొప్పులు నిర్ణయిస్తామని పేర్కొన్నారు. క్యాబినెట్లో చర్చించడం సరి కాదు. క్యాబినెట్ నిర్ణయంతో మాకు సంబంధం లేదు. సీఎం హామీ మేరకు సీనియర్ ఐఏఎస్ అధికారితో వన్‌మేన్ కమిటీ వేయాలి. - పి.వాసు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్,రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం తహశీల్దార్ వనజాక్షిపై ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన ఘటనపై ఐఏఎస్ అధికారితో విచారణ చేయిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కమిటీ నిర్ణయానికే కట్టుబడి ఉంటాం. బుధవారం రాజమండ్రిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం నాకు తెలియదు. -చంద్రశేఖరరావు , రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, జిల్లా అధ్యక్షుడు ప్రస్తావన వచ్చినట్లు తెలిసింది.. కేబినెట్ ఎజెండాలో వనజాక్షిపై జరిగిన దాడి ఘట నకు సంబంధించిన అంశం లేదు. దీనిపై ఈరోజు కేబినెట్లో ప్రస్తావన వచ్చినట్లు తెలిసింది. వనజాక్షి హద్దులు దాటారని, విప్ చింతమనేని ప్రభాకర్ తొందరపడ్డారని చర్చ సందర్భంగా అభిప్రాయపడినట్లు సమాచారం అందింది. కమిటీ రిపోర్ట్ వస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. - ఎ.విద్యాసాగర్, ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు ఆటవిక పాలన చంద్రబాబు ప్రభుత్వంలో నిజాయతీ గల అధికారులకు తావు లేదు. ప్రభుత్వ విప్‌గా ఉన్న వ్యక్తి ఇసుక అక్రమ రవాణా చేస్తూ అడ్డుకున్న అధికారిపై దాడికి పాల్పడ్డాడు. రౌడీషీటర్‌ను ప్రభుత్వ విప్‌గా ఎలా కొనసాగిస్తున్నారు. అతను చేసిన తప్పును కేబినెట్ సమర్థించడం ఆటవిక పాలనకు నాంది. అధికార దుర్వినియోగానికి, చంద్రబాబు దురహంకారానికి పరాకాష్ట. - దోనేపూడి శంకర్, సీపీఐ నగర కార్యదర్శి -
తహశీల్దార్‌పై దాడి: ఏపీ సర్కార్‌కు నోటీసులు
న్యూఢిల్లీ: తహశీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించింది. ఎన్హెచ్ఆర్సీ ఈ కేసును సుమోటాగా తీసుకుంది. కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. రెవెన్యూ సంఘాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వనజాక్షికి మద్దతుగా నిలిచి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అయితే ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అంతేగాక ఈ కేసులో రాజీపడాలని ప్రభుత్వ పెద్దలు వనజాక్షిపై ఒత్తిడి తీసుకువచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. -
'చంద్రబాబు వనజాక్షిని తప్పుపట్టడం దారుణం'
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఖజానా లూటీ కాకుండా అడ్డుకున్న ముసునూరు తహశీల్దార్ వనజాక్షిని ఏపీ సీఎం చంద్రబాబు తప్పుపట్టడం దారుణమని కాంగ్రెస్ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చోరీని అడ్డుకోవడమే వనజాక్షి చేసిన నేరమా? అని ప్రశ్నించారు. చంద్రబాబు తీరు ఉద్యోగుల్లో అభద్రత భావాన్ని పెంచుతుందని వీహెచ్ అన్నారు. ఈ నెలలో ఏపీ పర్యటించనున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని టీడీపీ అడ్డుకోజూస్తే ప్రతిగా చంద్రబాబును అడ్డుకుంటామని హెచ్చరించారు. -
సాక్ష్యాలున్నా చింతమనేనిని అరెస్టు చేయరేం?
సీఎంపై వైఎస్సార్సీపీ నేతలు పార్థసారథి, గురునాథరెడ్డి ఆగ్రహం హైదరాబాద్: తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ విప్ చింతమనేని ప్రభాకర్ చేసిన దాడికి సాక్ష్యాలుంటే ఆయనపై చర్యలు తీసుకోకుండా సీఎం చంద్రబాబు సెటిల్మెంట్ చేయడం ఏమిటని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. ప్రభాకర్ చేసిన దాడికి సంబంధించిన ఫొటోలను చూపిన ఆయన.. సాక్ష్యాలను పట్టించుకోకుండా కమిటీ వేస్తానని సీఎం చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు ముఠానాయకునిగా వ్యవహరిస్తున్నారని, టీడీపీ నేతలను కాపాడుకునే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వనజాక్షి బంధువులతో చంద్రబాబు మాట్లాడించి, ఆమెపై ఒత్తిడి తెచ్చి, రాజీకి వచ్చేలా చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. -
అంతా.. నీవల్లే!
ఉద్యోగులు మొండిగా ఉంటే ఎలా?! మీవల్లే ఎమ్మెల్యే అనుచరులు రెచ్చిపోయారు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే {పయత్నం కేసుపై రాజీకి వచ్చేలా సీఎం ఎత్తుగడ ఉద్యోగ సంఘాలనేతలతో చంద్రబాబు భేటీ హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై చేసిన దాడి వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం సెటిల్ చేశారు. తహసీల్దార్ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసి, ఆమె రాజీకి సిద్ధపడేలా కొంత బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ముఖ్యమంత్రి శనివారం తన నివాసంలో తహసీల్దార్‌తోపాటు ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే చింతమనేనితోనూ ఆయన మాట్లాడినట్లు తెలిసింది. ఎమ్మెల్యే అనుచరులు దాడి నేపథ్యంలో మానసిక వేదన అనుభవిస్తున్న వనజాక్షిపై సీఎం కనీసం సానుభూతి చూపలేదు. పైగా తప్పంతా ఆమెదేనన్న భావన కలిగించేందుకు ప్రయత్నించారు. ‘‘ఉద్యోగాలు చేయాలి.. కానీ మొండిగా ఉంటే ఎలా? అది జిల్లా సరిహద్దుకు సంబంధించిన సమస్య అని ఎమ్మెల్యే చెప్పారు. ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాలి. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఇసుక ర్యాంప్ వద్దకు ఎవరు వెళ్లమన్నారు? మీరు వెళ్లి ట్రాక్టర్లకు అడ్డంగా కూర్చోవటం వల్లే ఎమ్మెల్యే అనుచరులు రెచ్చిపోయారు. నేరుగా స్పాట్‌కు వెళ్లి గొడవ చేస్తే ప్రభుత్వానికి వచ్చే ప్రయోజనం ఏమిటి? వెళ్లిన తర్వాతైనా.. అవతలి వాళ్లు తమదే అని గట్టిగా చెప్పినప్పుడు వెనక్కి తగ్గి ఉండాల్సింది. ట్రాక్టర్లకు అడ్డంగా కూర్చోవడం ఏమిటి? గొడవ చేయడం ఎందుకు? ఎస్ఐ కూడా మౌనంగా ఉండటం తప్పు. గొడవ జరుగుతుంటే సర్ది చెప్పడానికి ప్రయత్నించలేదు. తహసీల్దార్‌ను అక్కడి నుంచి తీసుకెళితే సరిపోయేది. అదీ చేయలేదు. ఈ మొత్తం వ్యవహారం వల్ల ప్రభుత్వానికి నష్టమే తప్ప లాభం లేదు’’ అని సీఎం అన్నారు. విచారణ నివేదిక వచ్చాక అరెస్టుపై నిర్ణయం చింతమనేనిపై చర్య తీసుకోవాలంటూ ఎలాంటి ఒత్తిడి చేయొద్దని ఉద్యోగ సంఘాల నేతలను చంద్రబాబు కోరారు. పరిస్థితులను అర్థం చేసుకొని, ఆందోళన కార్యక్రమాలను విరమించుకోవాలని చెప్పారు. తహసీల్దార్‌పై దాడి చేసిన తమ పార్టీ ఎమ్మెల్యేపై ప్రస్తుతం చర్య తీసుకోలేమని, సీనియర్ ఐఏఎస్ అధికారితో కమిటీ వేసి విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు. విచారణ నివేదిక వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అరెస్టుపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. పుష్కరాల సమయంలో విధులు బహిష్కరిస్తామనటం సరికాదని, వెంటనే విధుల్లో చేరాలని సూచించారు. నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు దాడికి పాల్పడిన ఎమ్మెల్యేను అరెస్టు చేయాల్సిందేననే వాదనను ముసునూరు తహసీల్దార్ వనజాక్షి, ఉద్యోగ సంఘాల నాయకులు చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి వద్ద గట్టిగా వినిపించారు. విధి నిర్వహణలో ఉన్న తన పట్ల అత్యంత దురుసుగా ప్రవర్తించారని, దాడి చేశారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడానికి, విశ్వసనీయతను పెంచడానికే తాను గట్టిగా నిలబడ్డానని, అందులో తమ స్వార్థం లేదని ఆమె వివరించారు. మహిళ అని కూడా చూడకుండా దాడులు చేయడం, తనను తీవ్రంగా అవ మానించడం.. తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాయని గద్గద స్వరంతో చెప్పారు. విధి నిర్వహణకు ఈ విధంగా ఆటంకం కలిగిస్తే కృష్ణా జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడా రెవెన్యూ సిబ్బంది ఉద్యోగాలు చేయలేరని స్పష్టం చేశారు. ఇకపై ఇలా జరగకుండా జాగ్రత్తలు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయడాన్ని ప్రభుత్వం వద్దనలేదని, విచారణ తర్వాత నిజానిజాలను నిర్ధారించి అరెస్టుపై నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి చె ప్పారు. ‘‘ఐఏఎస్ అధికారిని నియమించి మొత్తం వ్యవహారంలో ఎవరిది తప్పుందో తేల్చమంటాను. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సిబ్బంది వ్యవహరించాల్సిన విధానాన్ని సిఫారసు చేసే బాధ్యతనూ ఆ అధికారికి అప్పగిస్తాను. ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటా’’ అని పేర్కొన్నారు. చర్చల్లో ఏపీ రెవిన్యూ సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరరావుతో పాటు రెవెన్యూ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు, కార్యదర్శి బి.భోజరాజు, ఉపాధ్యక్షుడు అనిల్ జన్నీసన్, కృష్ణా జిల్లా ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు విద్యాసాగర్ పాల్గొన్నారు. వనజాక్షి, ఉద్యోగ సంఘాల నేతలతో కూడిన ప్రతినిధి బృందంతో, ఎమ్మెల్యేతో వేర్వేరుగా సీఎం భేటీ అయ్యారు. సీఎం హామీ మేరకు విధుల బహిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేశామని చర్చల అనంతరం రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు మీడియాకు తెలిపారు. సీఎంతో చర్చలపై విలేకరులు పలు ప్రశ్నలు వేయగా ‘కమిటీ వేశారు. విచారణ జరిపిస్తామన్నారు..’ అని వనజాక్షి బదులిస్తుండగానే ఏపీ రెవిన్యూ సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరరావు జోక్యం చేసుకుని మాట్లాడారు. -
ఎమ్మార్వోపై దాడిని సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్
హైదరాబాద్: కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి పట్ల మహిళా కమిషన్ గర్హం వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ మేరకు దాడి ఘటనపై నాలుగు వారాల్లోగా సంపూర్ణ నివేదికను అందజేయాల్సిందిగా జిల్లా ఎస్సీకి శనివారం ఆదేశాలు జారీచేసింది. -
'తప్పు నీదే.. అక్కడికి వెళ్లడం వల్లే గొడవ'
హైదరాబాద్ : దాడి చేసిన పార్టీ ఎమ్మెల్యేపై చర్య తీసుకోవాల్సిన చంద్రబాబు నాయుడు...ఎమ్మార్వో వనజాక్షిపై ఎదురుదాడికి దిగినట్లు సమాచారం. న్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిని కలిసిన కృష్ణాజిల్లా ముసునూరు తహశీల్దార్ వనజాక్షికి మరింత అవమానం జరిగినట్టు తెలుస్తోంది. మొత్తం వ్యవహారంలో తప్పు నీదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు - వనజాక్షితో అన్నట్టు తెలుస్తోంది. అసలు ఘటన ఎలా జరిగింది, ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా సీఎం చేయనట్టు సమాచారం. 'తహసీల్దార్ అయిఉండి ఎందుకు ఇసుక ర్యాంప్ వద్దకు వెళ్లావని, నువ్వు వెళ్లకుండా పోలీసులను పంపిస్తే సరిపోయేది కదా, నీవు అక్కడికి వెళ్లడం వల్లే గొడవ జరిగిందని వనజాక్షిపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ట్రాక్టర్లకు అడ్డుగా కూర్చొవడం వల్లే ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడికి ప్రయత్నించి ఉంటారని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యేపైగాని, ఆయన అనుచరులపై ఎటువంటి చర్యలు ఉండవని సీఎం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. తక్షణం ఆందోళన విరమించాలని ముఖ్యమంత్రి రెవెన్యూ ఉద్యోగులపై ఒత్తిడి చేశారని, ఎమ్మార్వో వనజాక్షి, రెవెన్యూ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు చంద్రబాబుతో మాట్లాడుతున్నప్పుడు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అక్కడే ఉండటం గమనార్హం. -
దాడిని సీఎం సమర్థించడమా ?
హైదరాబాద్: కృష్ణాజిల్లాలో ఎమ్మార్వో వనజాక్షిపై అధికార పార్టీ ఎమ్మెల్యే దాడి విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కె. పార్థసారధి ఖండించారు. ఈ అంశంలో చంద్రబాబు తీరు ప్రజాస్వామ్యానికే సిగ్గు చేటుగా ఉందని ఆరోపించారు. ముఖ్యమంత్రే సెటిల్మెంట్కు దిగడం దారుణమన్నారు. వనజాక్షి పెట్టిన కేసును నీరుగార్చేందుకు సాక్షాత్తూ చంద్రబాబే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. మహిళా అధికారి వనజాక్షిని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈడ్చి పారేసినా పట్టించుకోకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఇలా సెటిల్మెంట్లు చేస్తే అధికారులు ఎలా ధైర్యంగా పని చేయగలగుతారని చంద్రబాబును పార్థసారధి సూటిగా ప్రశ్నించారు. అవినీతిని అడ్డుకున్న ఎమ్మార్వోపై జరిగిన దాడిని సీఎం సమర్థించడమా ? అంటూ పార్థసారధి అశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఇసుక మాఫియాను చంద్రబాబే ప్రోత్సహిస్తున్నారనేది స్పష్టమయిందన్నారు. వైఎస్ఆర్ సీపీకి చెందిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై దౌర్జన్యంగా కేసులు బనాయించి జైల్లో పెట్టారని గుర్తు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను మాత్రం చంద్రబాబు వెనకేసుకొస్తున్నారని పార్థసారధి విమర్శించారు. -
ఒక్కముక్కలో ముగించేసిన వనజాక్షి
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉద్యోగ సంఘాల భేటీ అనంతరం ఎమ్మార్వో వనజాక్షిపై దాడి వ్యవహారంలో సీన్ మారిపోయింది. విషయం కాస్త పక్కదారి పట్టింది. ఎమ్మార్వోపై దాడి అంశం మరుగున పడి, చివరికి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య సరిహద్దులు అనే అంశం తెరమీదకు వచ్చింది. శనివారం ఉదయం వరకూ మహిళ ఉద్యోగిపై దాడి చేసిన ఎమ్మెల్యేను అరెస్ట్ చేయలంటూ డిమాండ్ చేసిన రెవెన్యూ ఉద్యోగులు...సీఎంతో సమావేశం అనంతరం ... ఈ ఘటనపై ఓ సీనియర్ అధికారితో కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తారని హామీ ఇచ్చారని, అందుకే తమ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించేశారు. 'జరిగిందేదో జరిగిపోయింది...జరగాల్సిన దానిపై దృష్టి పెట్టాలని' శుక్రవారం చంద్రబాబు ఢిల్లీలో మీడియా సమావేశంలో అన్నప్పుడే...విషయం అర్థం అవుతుంది. ఈ వ్యవహారంతో ప్రభుత్వం పరువు బజారున పడటంతో చంద్రబాబు అక్కడ నుంచే పావులు కదిపారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నివాసంలో ఉద్యోగ సంఘాలు ఇవాళ ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు... రెవెన్యూ ఉద్యోగులు తక్షణమే ఆందోళన విరమించి వివాదాన్ని ముగించాలని ప్రత్యక్షంగా ఒత్తిడి చేసినట్టు సమాచారం. కంటితుడుపు చర్యగా... ఓ ఐఏఎస్ అధికారితో కమిటీ వేస్తామని ప్రకటించి చేతులు దులుపుకోవటం విశేషం. మరోవైపు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ...ఎమ్మార్వోపై ప్రత్యక్షంగా దాడి చేసినా చర్యలు తీసుకోకుండా కమిటీతో విచారణ ఏంటని విమర్శలు వస్తున్నాయి. అయితే దానిపై ధైర్యంగా మాట్లాడేందుకు మాత్రం ఉద్యోగులు సాహసించడం లేదు. నిజాయితీగా మా విధులు నిర్వహిస్తే మా పై దాడులా? ఇలా అయితే మహిళ ఉద్యోగులు ఉద్యోగం చేయలేరు... ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే... దాడి చేయటమే కాకుండా, నా పర్సనల్ గురించి అసభ్యంగా మాట్లాడతారా? తనపై దాడి చేసిన ఎమ్మెల్యేను తక్షణమే అరెస్ట్ చేయాలి... అంటూ మీడియా ముందు కంటతడి పెట్టిన కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి... చంద్రబాబు నాయుడి కలిసిన అనంతరం ఒక్క నిమిషం కూడా ధైర్యంగా మీడియాతో మాట్లాడలేకపోయారు. సీనియర్ ఐఏఎస్ అధికారితో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు ఆమె ఒక్క ముక్కలో ముగించేశారు. -
వనజాక్షిపై దాడి ఘటనపై విచారణ కమిటీ
హైదరాబాద్: ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన ఘటనపై కమిటీ వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు తెలిపారు. ఓ మహిళా అధికారిపై దాడి జరగటం దురదృష్టకరమని చంద్రబాబు అన్నట్టు ఆయన చెప్పారు. ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల భేటీ అనంతరం బొప్పరాజు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులపై దాడి చేస్తే ఎలా పని చేస్తామని ముఖ్యమంత్రిని అడిగామని బొప్పరాజు తెలిపారు. ఎమ్మెల్యే దాడి చేసిన వివరాలను చంద్రబాబుకు వివరించినట్లు చెప్పారు. కాగా సీఎం హామీతో రెవెన్యూ ఉద్యోగులు సమ్మె విరమించారు. కాగా దాడి ఘటనపై ఐఏఎస్ అధికారితో విచారణ జరిపించాలని ఎమ్మార్వో వనజాక్షి డిమాండ్ చేశారు. విచారణ కమిటీలో అన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు. -
ఆరడుగుల బుల్లెట్ ఎక్కడ దాక్కున్నాడు?
కాకినాడ : ఉద్యోగులపై దాడులు జరుగుతుంటే ఆరడుగుల బుల్లెట్ ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఎక్కడ దాక్కున్నాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ప్రశ్నించారు. ఏ ఒక్క పార్టీకి, ప్రభుత్వానికి అశోక్ బాబు వత్తాసు పలకడం సరైంది కాదని ఆయన శనివారమిక్కడ అన్నారు. తహసీల్దార్ వనజాక్షి ఇచ్చిన ఫిర్యాదుపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని మధు డిమాండ్ చేశారు. లేదంటే కృష్ణాజిల్లా ముసునూరులో ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ఆయన హెచ్చరించారు. చింతమనేనికి ముఖ్యమంత్రి చంద్రబాబు వత్తాసు పలుకుతున్నారని మధు ఆరోపించారు. -
'కేసులు ఎత్తేయకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమమే'
ఏలూరు: ఉద్యోగ సంఘాల రాష్ట్ర నేతలపై బనాయించిన అక్రమ కేసులు వెంటనే తొలగించాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతామని ఏపీఎన్జీవో నేతలు యోగానందం, శ్రీనివాస్ హెచ్చరించారు. శనివారం వారు ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అరెస్టు చేయాలని కోరితే తమపైనే కేసులు పెడతారా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అక్రమ కేసులు వెంటనే ఎత్తేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా యోగానందం, శ్రీనివాస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
చంద్రబాబుతో ఉద్యోగ సంఘాల భేటీ
హైదరాబాద్: కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి పంచాయితీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. ఈ అంశంపై ఏపీ రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలతోపాటు బాధితురాలు వనజాక్షి శనివారం ఉదయం చంద్రబాబుతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. దాడికి చోటుచేసుకున్న పరిణామాలను వనజాక్షి స్వయంగా చంద్రబాబుకు వివరించారని సమాచారం. అనంతరం రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన దిగిన వైనంపై కూడా ఉద్యోగ సంఘాల నేతలు బాబుకు వివరించారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అరెస్ట్ చేయాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలోపాటు వనజాక్షి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే ప్రభాకర్‌ను అరెస్ట్ చేసేంత వరకు విధులను బహిష్కరిస్తామని రెవెన్యూ ఉద్యోగులు ఇప్పటికే ప్రభుత్వాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు బాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఎమ్మెల్యే ప్రభాకర్‌కు ప్రభుత్వం షోకాజ్ నోటిసులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు ఎమ్మెల్యే చింతమనేని కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
చింతమనేనిపై చర్యలు సీఎం నిర్ణయిస్తారు
విజయవాడ: మహిళా తహశీల్దార్‌పై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఎలాంటి చర్యలు తీసుకోవాలో తమ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయిస్తారని మంత్రి దేవినేని ఉమ అన్నారు. పుష్యరాల దృష్ట్యా ఆందోళన విరమించాల్సిందిగా ఉద్యోగులను కోరినట్లు ఆయన మీడియాకు తెలిపారు. తహశీల్దార్‌పై పెట్టిన అక్రమ కేసులన్నింటిని ఎత్తివేయాలని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీకి సూచించామన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు తనపై దాడి చేశారని, తనను ఇసుకలో ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని ముసునూరు మహిళా ఎమ్మార్వో వనజాక్షి తెలిపిన విషయం తెలిసిందే. జరిగిన ఘటనపై ఆమె కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతోపాటు ఆమెతో రెవెన్యూ ఉద్యోగ సంఘాలు కలిసివచ్చి దర్నాలకు దిగిన నేపథ్యంలో ప్రభుత్వం తరుపున చర్చలు దేవినేని చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడి ఈ విషయాలు వెల్లడించారు. -
'చింతమనేనిని విప్ పదవి నుంచి తొలగించాలి'
నూజివీడు (కృష్ణా జిల్లా) : ముసునూరు మహిళా ఎమ్మార్వో వనజాక్షితో అనుచితంగా ప్రవర్తించిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను టీడీపీ వెంటనే విప్ పదవి నుంచి తొలగించాలని ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శుక్రవారం కృష్ణా జిల్లా నూజివీడులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ అధికారులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. రెవెన్యూ అధికారులు ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గకుండా వ్యవహరించాలని రామకృష్ణ కోరారు. -
'ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేయాలి'
హైదరాబాద్:కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై దాడిని ఏపీ పంచాయతీ రాజ్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీకృష్ణ ఖండించారు. ఆమె దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వనజాక్షికి ఉద్యోగులమంతా అండగా ఉంటామని మురళీకృష్ణ హామీ ఇచ్చారు. -
శిక్షించకుండా కాలం గడుపుతున్నారు
విజయవాడ: చింతమనేని ప్రభాకర్‌ను వెంటనే విప్ పదవి నుంచి తొలగించాలని ఆర్టీఐ యాక్ట్ కమిషనర్ విజయబాబు డిమాండ్ చేశారు. తహశీల్దారు వనజాక్షిపై దాడి విషయంలో ప్రభుత్వ వైఖరి దారుణం అని అన్నారు. ఎగ్జిక్యూటివ్ వ్యవస్థపై ఇది రాజకీయ దాడి అని అభివర్ణించారు. దాడి చేసిన వారిని శిక్షించకుండా కాలం గడుపుతున్నారని ఆరోపించారు. -
భూమా కేసుతో చింతమనేని కేసు పోల్చలేం: బాబు
ఢిల్లీ: తహశీల్దార్ వనజాక్షిపై దాడి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. జరిగిందేదో జరిగిపోయింది.. అసలు ఎందుకు జరిగిందో తెలుసుకుంటానని ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో అన్నారు. ఇప్పటికే తాను వనజాక్షితో, ఉద్యోగ సంఘాలతో మాట్లాడానని, చట్టప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు. అయితే, భూమా నాగిరెడ్డి కేసుతో చింతమనేని ప్రభాకర్ కేసును పోల్చలేమని ఆయన అన్నారు. మరోపక్క, ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో సెక్షన్ 8పై హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మాట్లాడినట్లు తెలిపారు. విభజన చట్టంలో అంశాలు అమలు చేయాల్సిన బాధ్యత హోమంత్రిదేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మొన్నటి వరకు విద్యుత్ సమస్యలపై తెలంగాణప్రభుత్వం విమర్శించిందని, ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టుపై తమను విమర్శిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తనకు లేదని, సముద్రంలోకి వృథాగా పోయే నీటికోసమే పట్టిసీమ ప్రాజెక్టు కడుతున్నామని ఆయన అన్నారు. పాలమూరు ప్రాజెక్టుపై ఏకపక్షంగా ఉండేది లేదని, ఇరు రాష్ట్రాలు దీనిపై చర్చించాల్సిందేనని చెప్పారు. -
ఎమ్మార్వోపై దాడి.. సీఎంతో చర్చిస్తాం: రెవెన్యూ సంఘాలు
ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే దాడి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సోమవారం చర్చిస్తామని, ఆ తర్వాత తమ తదుపరి కార్యాచరణ నిర్ణయించుకుంటామని రెవెన్యూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చెప్పారు. కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం చర్చించారు. ఈ చర్చలు ఫలప్రదం అయినట్లే నేతలు చెబుతున్నారు. ఎమ్మార్వోతో పాటు ఇతర సిబ్బందిపై పెట్టిన కేసులను రద్దు చేస్తున్నట్లు మంత్రి చెప్పారన్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రోద్బలంతో దాడి చేసిన వాళ్లందరినీ అరెస్టు చేయాలని ఎస్పీ, డీఐజీలకు చెప్పారని నాయకులు అన్నారు. అలాగే దాడి జరుగుతున్నా చూస్తూ ఊరుకున్న ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఎమ్మెల్యే గన్ మన్ (ఒక ప్రైవేటు వ్యక్తి) మీద చర్యలు తీసుకోవాలని సీఎం క్యాంపు కార్యాలయానికి నివేదిక పంపారని తెలిపారు. ముఖ్యమంత్రి వద్దకు దాడికి గురైన ఎమ్మార్వో, జిల్లా నాయకులను సోమవారం తీసుకెళ్తానని ఉమా హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఆయనతో చర్చించిన తర్వాత ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామని అన్నారు. వాళ్ల వైపు నుంచి నిర్ణయం వచ్చిన తర్వాత తమ కార్యాచరణ ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నామని, తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి తెలిపారన్నారు. అయితే.. త్వరలో గోదావరి పుష్కరాలు ఉండటంతో ఆ సమయంలో రెవెన్యూ ఉద్యోగుల నుంచి సహకారం లేకపోతే పని జరగదన్న కారణంతో.. ఉద్యోగ సంఘాలను బుజ్జగించి కేసును డైల్యూట్ చేయాలన్న ప్రయత్నాలు ప్రభుత్వం వైపు నుంచి మొదలైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విషయంలో కూడా తగినంత సమయం తీసుకుని, ఈలోపు తమకు కావల్సినట్లుగా పరిస్థితులను మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా దాదాపు అలాంటి పరిస్థితులనే సృష్టించేలా వాతావరణం కనిపిస్తోంది. -
ఎమ్మార్వోపై టీడీపీ ఎమ్మెల్యే దాడి
-
ఎమ్మార్వో వనజాక్షికి చంద్రబాబు ఫోన్
విజయవాడ : ఎమ్మార్వో వనజాక్షిపై దాడి కేసును నీరుగార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒత్తిడి చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన వ్యాఖ్యానించారు. ఆమె శుక్రవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ చింతమనేని ప్రభాకర్‌ను కాపాడేందుకు ప్రభుత్వం వనజాక్షిపై తప్పుడు కేసులు పెట్టేందుకు సిద్ధమైందన్నారు. ప్రభుత్వం బ్లాక్మెయిల్ చర్యలకు ఉద్యోగ సంఘాలు భయపడాల్సిన అవసరం లేదని ఉప్పులేటి కల్పన అన్నారు. మరోవైపు వనజాక్షిపై దాడికి నిరసనగా ధర్నాకు దిగిన రెవెన్యూ ఉద్యోగులకు వైఎస్ఆర్ సీపీ, సీపీఐ, సీపీఐ పార్టీలు మద్దతు ప్రకటించాయి. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ...ఎమ్మార్వో వనజాక్షితో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా దాడి ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. కాగా ఈ వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతను మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చంద్రబాబు అప్పగించారు. -
'ప్రభుత్వం స్పందించక పోవటం దారుణం'
పశ్చిమ గోదావరి: ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేసినా ప్రభుత్వం స్పందించకపోవటం దారుణం అని సీపీఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. గూండా యాక్ట్ కింద చింతమనేని ప్రభాకర్‌ను అరెస్టు చేసి ఆయనను విప్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇసుక మాఫియాను టీడీపీ ప్రభుత్వమే పెంచి పోషిస్తోందని విమర్శించారు. ఏపీ ప్రత్యేక హోదాపై పవన్ కల్యాణ్.. వెంకయ్యనాయుడును ప్రశ్నించక పోవటం వెనుక ఉన్న ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై పవన్ కల్యాణ్‌కు బాధ్యత ఉంటే సీపీఐతో కలిసి పోరాడవచ్చునని ఆయన సూచించారు. -
కృష్ణా జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన
విజయవాడ: కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆయన అనుచరులు దాడిని జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు ఖండించారు. ఎమ్మార్వోపై దాడికి నిరసనగా శుక్రవారం వివిధ ప్రాంతాలలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ముసునూరు మండలం నేలపాటివారికుంట సమీపంలోని రహదారిపై రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు దిగి..బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అలాగే నందిగామ ఎమ్మార్వో కార్యాలయానికి రెవెన్యూ ఉద్యోగులు తాళాలు వేసి తమ నిరసన తెలిపారు. -
ఆ ఎస్ఐ తీరుపై సర్వత్రా విమర్శలు
పశ్చిమ గోదావరి: పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మహిళా ఎమ్మార్వో వనజాక్షి పై పెదవేగి పోలీస్ స్టేషన్లో డ్వాక్రా మహిళలు ఇంతకు ముందు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అక్కడ నమోదైన ఫిర్యాదును ఎస్ఐ ముసునూరు పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఆ ఎస్ఐ వ్యవహార శైలిపై పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మళ్లీ అదే చీప్ ట్రిక్...ఎమ్మెల్యే హల్చల్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: తనకు నచ్చని అధికారులపై అనుచరవర్గంలోని మహిళలు, దళితులను ఉసిగొల్పి తప్పుడు కేసులు పెట్టించడం.. వంటి వాటితో ఐదారేళ్లుగా దందా చేస్తున్న దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ గురువారం మరోసారి అదే చీప్ ట్రిక్‌ను ప్రయోగించారు. కృష్ణాజిల్లా ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై బుధవారం చింతమనేని, ఆయన అనుచరుల దాడిని నిరసిస్తూ రాష్ర్టవ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు రోడ్డెక్కారు. దీంతో చింతమనేని మరోసారి తనదైన శైలిలో ఎదురుదాడికి దిగారు. ముసునూరు ఇసుక ర్యాంపు వద్ద తహశీల్దార్ వనజాక్షి తమపై దాడి చేశారని, కులం పేరుతో దుర్భాషలాడారని విజయరాయి ఇసుక సొసైటీ సభ్యులైన మీసాల కుమారి, సేసం నాగలక్ష్మిలతో పెదవేగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. ఇసుక సొసైటీ సభ్యులపై దాడి చేసిన తహశీల్దార్‌ను వెంటనే అరెస్ట్ చేసి విధుల నుంచి తొలగించాలని గురువారం ఉదయం కలెక్టర్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే అనుచరులు భారీఎత్తున ధర్నా చేపట్టారు. అనంతరం ఎస్పీ భాస్కర్‌భూషణ్‌కు వినతిపత్రం సమర్పించారు. చింతమనేని ఏలూరు రేంజి డీఐజీ హరికుమార్‌తో భేటీ అయ్యారు. -
చింతమనేనిని అరెస్ట్ చేయాలి
- రెవెన్యూ ఉద్యోగుల డిమాండ్ - విధులను బహిష్కరిస్తామని హెచ్చరిక ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : కృష్ణాజిల్లా ముసునూరు తహసిల్దార్‌పై దాడి చేయించిన ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను వెంటనే విప్ పదవి నుంచి తొలగించి అరెస్ట్ చేయాలని రెవెన్యూ అసోషియేషన్ రాష్ర్ట కార్యదర్శి ఎల్వీ సాగర్ డిమాండ్ చేశారు. చింతమనేనిని అరెస్ట్ చేయాలంటూ రెవెన్యూ ఉద్యోగులు గురువారం సాయంత్రం కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ నేర చరిత్ర ఉన్న చింతమనేని ప్రభాకర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ విప్‌గా ఎలా ఎంపిక చేశారని ప్రశ్నించారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రభాకర్‌ను అరెస్టు చేయించిన విషయం మరిచారా అని చంద్రబాబును ప్రశ్నించారు. అనేక కేసులలో ముద్దాయిగా ఉన్న విప్ ప్రస్తుతం తనకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతుంటే డీఐజీని దర్జాగా కలిసి వెళ్లడం చూస్తే ఆయన అధికార దర్పం అర్థమవుతుందని విమర్శించారు. పాలకులే దగ్గరుండి దాడులు చేయిస్తే ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఆంధ్రా ఉద్యోగులకు కేంద్ర బలగాలతో రక్షణ ఇవ్వాలని గవర్నర్‌ను ఇటీవలే కోరామన్నారు. రాష్ట్రంలో మాత్రం పాలకులే దాడులకు పాల్పడుతున్నారన్నారు. చింతమనేనిని శుక్రవారం 10 గంటలలోగా అరెస్ట్ చేయకపోతే రెవెన్యూ కార్యాలయాలకు తాళాలు వేసి ఆందోళన చేపడతామన్నారు. మిగిలిన శాఖల ఉద్యోగులు నల్లబ్యాడ్జీలను ధరించి విధులకు హాజరవుతారని, వర్క్‌టు రూల్ పాటిస్తామని సాగర్ స్పష్టం చేశారు. దర్నాకు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.రమేష్‌కుమార్, కలెక్టరేట్ విభాగ అధ్యక్షుడు ఎన్వీ నాంచారయ్య, జిల్లా సహాయ కార్యదర్శి డీవీఎన్ సత్యనారాయణ నాయకత్వం వహించారు. కలెక్టరేట్లోని రెవిన్యూ విభాగ ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఇక తాడో పేడో..
రెవెన్యూ అసోసియేషన్ సమరశంఖం ఎమ్మెల్యే చింతమనేనిని అరెస్టు చేయాలని డిమాండ్ ‘తెలుగుదేశం పార్టీ నేతల నైజం బయటపడింది. గతంలో మాదిరిగానే అధికారులు, ఉద్యోగులపై టీడీపీ నాయకులు, కార్యకర్తల వేధింపులు, దాడులు మొదలయ్యాయి. ఛోటా మోటా నాయకుల పైరవీలు, ఒత్తిళ్లను ఇకపై ఉపేక్షించకూడదు. ఇటువంటి ఘటనలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయాలి. లేదంటే వరుస దాడులు జరుగుతాయి..’ ముసునూరు తహశీల్దారుపై టీడీపీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడికి పాల్పడిన ఘటనపై రెవెన్యూ అసోసియేషన్ నాయకులు వెల్లడించిన అభిప్రాయాలివి. విజయవాడ : తహశీల్దారు వనజాక్షిపై దాడికి పాల్పడటం, ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలో డ్వాక్రా మహిళలతో ఆమెపై కేసు కూడా పెట్టించడంపై రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. తహశీల్దార్‌పై దాడికి పాల్పడిందిగాక ఆమెపై తప్పుడు కేసు పెట్టించి ఎమ్మెల్యే డబ్బులిచ్చి ధర్నా జరిపించటంపై రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా రెవెన్యూ అసోసియేషన్.. రాష్ట్రంలోని మిగిలిన 12 జిల్లాల రెవెన్యూ అసోసియేషన్లతో సంప్రదింపులు జరిపి కేవలం కొద్ది గంటల్లో ఏకతాటిపైకి తీసుకువచ్చింది. ఇప్పటికే అసోసియేషన్ రాష్ట అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు హైదరాబాద్‌లో చీఫ్ సెక్రటరీకి, ఇతర రెవెన్యూ ఉన్నతాధికారులకు ముసునూరు తహశీల్దార్‌పై జరిగిన దాడి విషయమై ఫిర్యాదు చేశారు. రౌడీ రాజకీయాలకు తలొగ్గం... ఎమ్మెల్యేను అరెస్టు చేయకపోతే పోరాటం ఉధృతం చేయాలని గురువారం సబ్-కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ సమావేశం తీర్మానించింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ తహశీల్దార్ వనజాక్షికి రాష్ట్రంలోని రెవెన్యూ కుటుంబమంతా అండగా ఉంటుందన్నారు. రౌడీ రాజకీయాలకు రెవెన్యూ అసోసియేషన్ తలొగ్గదని స్పష్టం చేశారు. ఈ సంఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను, అతని అనుచరులను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సంఘటన జరిగినప్పుడు ప్రేక్షకప్రాత్ర పోషించిన ముసునూరు ఎస్ఐని, ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయాలన్నారు. నేడు కార్యాలయాలకు తాళాలు... అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనీల్ జన్నిసన్ మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 10 గంటలలోపు ఎమ్మెల్యేను అరెస్టు చేయాలన్నారు. లేకుంటే జిల్లాలో అన్ని తహశీల్దార్ కార్యాలయాలకు తాళాలు వేసి రోజంతా ధర్నాలు చేస్తామన్నారు. తక్షణమే రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఇసుక విధులను బహిష్కరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ కేసులో న్యాయం కోసం పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామన్నారు. జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కార్యదర్శి బోజరాజు మాట్లాడుతూ అధికార పార్టీ నేతల ఆగడాలపై సమైక్య పోరాటం అవసరమన్నారు. అన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపట్టాలన్నారు. న్యాయ పోరాటం చేస్తా ఈ ఘటనలో తాను న్యాయ పోరాటం చేస్తానని ముసునూరు తహశీల్దార్ వనజాక్షి అన్నారు. తనపై జరిగిన దాడి ఘటనను వివరిస్తూ.. తన సిబ్బందిని నిర్బంధించారని తెలిసి.. తాను ఆ ప్రదేశానికి వెళ్లానని చెప్పారు. అప్పటికే దెందులూరు ఎమ్మెల్యే, అతని అనుచరులు 25 ట్రాక్టర్లతో ఇసుకను తరలించుకుపోతున్నారని తెలిపారు. ట్రాక్టర్లను ఆపమంటూ తాను అడ్డుకోగా ఎమ్మెల్యే తనపై దాడి చేయించారని వివరించారు. సర్వే జరిపి సరిహద్దులు నిర్ణయించిన తరువాత ఇసుక తవ్వుకోండని ఎమ్మెల్యేకు చెప్పినా ఆయన తనపై దాడిచేయించారని చెప్పారు. 500 మీటర్లు దాటి లోపలకు వచ్చి ఇసుకను తవ్వుకుపోతున్నారనే ఫిర్యాదుపై తాను అక్కడకు వెళ్లగా ఈ సంఘటన జరిగిందని ఆమె వివరించారు. ఈ ఘటనపై ఎట్టి పరిస్థితిలోనూ వెనక్కి తగ్గేదిలేదని, తనకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అర్బన్ తహశీల్దార్ ఆర్.శివరావు, గన్నవరం తహశీల్దార్ మాధురి, కలెక్టరేట్ రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధి పాల్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సంఘీభావం తహశీల్దార్ వనజాక్షికి జిల్లా కలెక్టర్ బాబు.ఎ సంఘీభావం తెలిపారు. ఈ విషయంలో తాను పూర్తి మద్దతు ఇచ్చి రెవెన్యూ అసోసియేషన్‌కు అండగా ఉంటానన్నారు. విజయవాడ సబ్-కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, నూజివీడు ఆర్డీవో రంగయ్య తదితరులు కూడా తమ సంఘీభావం తెలిపారు. ఎంపీడీవోల అసోసియేసన్, వ్యవసాయ శాఖ అధికారులు, వీఆర్వో, వీఆర్ఏల అసోసియేషన్లు కూడా ఈ ఘటనను ఖండించి పోరాటానికి సిద్ధమయ్యాయి. ఐద్వా మహిళలు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు తహశీల్దార్ వనజాక్షిపై జరిగిన దాడిని ఖండించారు. -
తహశీల్దార్‌పై దాడి అమానుషం
శ్రీకాకుళం పాతబస్టాండ్: విధి నిర్వహణలో ఉన్న కృష్ణ జిల్లా ముసునూరు మండల తహశీల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేయడాన్ని ఏపీ రెవెన్యూ సర్వీసుల సంఘం జిల్లా శాఖ తీవ్రంగా ఖండించింది. మహిళ అని కూడా చూడకుండా తన అనుచరులతో కలిసి దాడి చేయడం అమానుషమని సంఘ ప్రతినిధులు అన్నారు. శ్రీకాకుళంలోని రెవెన్యూ సర్వీసుల సంఘ కార్యాలయంలో గురువారం సంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా శాఖ అధ్యక్షుడు ఎం.కాళీప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి జె.రామారావు తదితరులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో రెవెన్యూ ఉద్యోగులపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు వారి కార్యకర్తలు, అనుచరుల అక్రమాలను కాపాడేందుకు, తప్పులు కప్పి పుచ్చుకునేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇసుక నిర్వహణపై ప్రభుత్వం చట్టం చేసి, కమిటీలను వేసిందని, అయితే ప్రభుత్వంలో కీలక భాధ్యతలు వహిస్తున్న వారే ఇటువంటి దాడులు చేయడం విచారకరమన్నారు. ఈ దాడులు ముఖ్యమంత్రికి తెలిసే జరిగితే..అతను కూడా దాడులను ప్రోత్సహిస్తున్నట్టే భావించాల్సి ఉంటుందన్నారు. వీఆర్ఏ నుంచి ఎస్డీసీ వరకు అన్నిస్థాయిల రెవెన్యూ ఉద్యోగులు ఎకతాటిపై దాడికి నిరసనగా పోరాడాలని పిలుపునిచ్చారు. దాడులకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని, దాడులు పునరావృత్తం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కలుగజేసుకొని దాడికి పాల్పడినవారిపై తగిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రస్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు బి.శాంతి, వేణుగోపాల్, చంద్రశేఖర్, పి.రాంబాబు, పి.సంఘమేశ్వరరావు పాల్గొన్నారు. చింతమనేనిని అనర్హుడిని చేయాలి శ్రీకాకుళం: దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్‌ను ఆ పదవికి అనర్హుడిని చేయాలని పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కిలారి నారాయణరావు డిమాండ్ చేశారు. ఎంఆర్ఓ వనజాక్షిపై దాడి చేయించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అధికారులపైన, తోటి ప్రజాప్రతినిధులపైన దురుసుగా ప్రవర్తించడం చింతమనేనికి పరిపాటి అయిందని, ఇతనికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. -
దాడులను ఉపేక్షించేది లేదు: డిప్యూటీ సీఎం
హైదరాబాద్: విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై దాడిని ఆయన ఖండించారు. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ను ఆయన ఆదేశించారు. నివేదిక వచ్చిన తర్వాత సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తహసీల్దార్ ఫిర్యాదుపై పోలీసుల విచారణ జరుగుతుందన్నారు. ఉద్యోగులకు భద్రత కల్పించే విషయంలో తమ ప్రభుత్వం ముందు ఉంటుందన్నారు. ఇసుక అక్రమ రవాణాను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. -
అలా అని కొడతారా?
ఏలూరు: ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పశ్చిమగోదావరి జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విద్యాసాగర్ అన్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను ప్రభుత్వ విప్ పదవి నుంచి తొలగించి శుక్రవారం ఉదయంలోగా అరెస్ట్ చేయకుంటే పుష్కరాల విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఉద్యోగులు తిరగబడితే ప్రభుత్వం కూలుతుందన్నారు. సాక్షాత్తూ ప్రభుత్వ విప్ దాడికి పాల్పడితే ఉద్యోగులు ఎవరికి మొరపెట్టుకోవాలని ప్రశ్నించారు. 'మీరు చెప్పినట్టు చేస్తున్నాం. మీరు తిడుతుంటే పడుతున్నాం. అలా అని కొడతారా' అని నిలదీశారు. ఈ ప్రభుత్వంలో తమకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. చింతమనేని నేర చరిత్ర గురించి పశ్చిమగోదావరి జిల్లా ప్రజానీకానికి తెలుసునని చెప్పారు. తన సామ్రాజ్యానికి అడ్డొచ్చిన వారిపై దాడులు చేయడం చింతమనేనికి మామూలేనని అన్నారు. నిన్న సంఘటనా స్థలంలో ఉన్న పోలీసు ఎస్సై చోద్యం చూశారని, ఆయనను ముందుగా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇసుక మాఫియా డబ్బులతోనే ప్రజలను, మహిళలను ఉసిగొల్పి ఈరోజు కలెక్టరేట్ కు ధర్నాగా పంపారని విద్యాసాగర్ ఆరోపించారు. -
చింతమనేనీ.. ఇదేం పని?
'ఎవరైనా ఎదురు తిరిగితే తొక్కించేస్తా.. తేడాలొస్తే నేనే తొక్కేస్తా... ఎవరైనా ఎదురుతిరిగితే ఇదేగతి' ఎవరో వీధిరౌడీ నోటి నుంచి వచ్చిన కూతలు కావు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ ఓటర్లను బెదిరించిన క్రమం ఇది. రౌడీ ముదిరి రాజకీయ నాయకుడు అవుతాడేనేది వర్తమాన సామెత. చింతమనేని లాంటి ఎమ్మెల్యేలు ఈ సామెతకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నారు. 'దాదాగిరి'ని తన దారిగా మార్చుకున్న ఈ 'పచ్చ' నాయకుడు మహిళా అధికారిపై దౌర్జన్యంతో మరోసారి తన వార్తలకెక్కారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్ హోదా వెలగబెడుతున్నా పాత పనులు మానలేదు. ఆయనపై నమోదైన కేసులే ఇందుకు నిలువెత్తు రుజువు. ఇసుక మాఫియాను అడ్డుకున్నారన్న అక్కసుతో కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై చింతమనేని, ఆయన వందిమాగధులు విరుచుకుపడ్డారు. మహిళా అధికారి అని కూడా చూడకుండా ఇసుకలో ఈడ్చిపడేశారు. తనకెవరైనా ఎదురు చెబితే ఎవరికైనా ఇదే గతి పడుతుందన్న తరహాలో ఆయన చెలరేగిపోయారు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని 'పచ్చ'బాబుల గూండాగిరి గురైన మహిళా అధికారి వాపోయారంటే అధికార పార్టీ ఆగడాలు ఎంతగా మితిమీరిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మండల మేజిస్ట్రేట్ పైనే దౌర్జన్యం చేస్తే ఇక సామాన్యుల గతి ఏంటి? తన నియోజకవర్గంలో యూపీ తరహా 'గుండారాజ్' నడిపిస్తున్న చింతమనేనికి దౌర్జన్యాలు కొత్తేంకాదు. గతేడాది స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా డబ్బులు పంచుతున్న తన చెంచాలను చెరసాలలో వేశారనే అక్కసుతో పెదవేగి ఎస్సైపై దాదాగిరి చెలాయించారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో తన అనుచరులను ఉసిగొలిపి కావూరి సాంబశివరావు ఇంటికిపై దాడి చేయించారు. పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేసి సంక్రాంతి సమయంలో కోడిపందాలు నిర్వహించడం చింతమనేనికి సరదా. తనకెదురు చెప్పినవారిపై రౌడీయిజం చేయడం ఆయనకు అలవాటైన విద్య. 'రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తా'నని సందు దొరికినప్పుడల్లా ఊదరగొట్టే సీఎం చంద్రబాబు సొంత పార్టీ ఎమ్మెల్యే విషయంలో మాత్రం మౌనముద్ర దాలుస్తారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు తెగబడుతున్నా ఇప్పటివరకు ఒక్కరిపైనా చర్య తీసుకున్న పాపాన పోలేదు. ఆశ్రిత పక్షపాతానికి అతీతుడునని ప్రచారం చేసుకునే సైకిల్ పార్టీ అధినేత టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆగడాలపై మాత్రం అస్సలు స్పందించరు. ఏమన్నా అంటే ఎదురుదాడి చేస్తారు. తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యాల నుంచి ప్రజలను కాపాడేదెవరో? -
ఆయనకలా.. ఈయనకిలా..
హైదరాబాద్ : ఇద్దరూ ప్రజాప్రతినిధులు...వేర్వేరు జిల్లాలు..ఒకరిపైన పోలీసులను దూషించారని ఆరోపణ.. వెనువెంటనే అరెస్ట్.. రిమాండ్.. జైలుకు తరలింపు... ఆరోగ్యం బాగాలేదని నిమ్స్‌కు తరలించమంటే.. మీనమేషాలు.. వైద్యబృందంతో పరీక్షలు..చివరకి బెయిల్ వచ్చే వరకు తాత్సారం మరొకరు.. అదేస్ధాయి ప్రజాప్రతినిధి...ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న మహిళా ఎమ్మార్వోపై బూతుల దండకం అందుకొని దాడి చేసి... బెదిరింపులు.. ఒక్క ఎమ్మార్వోనే కాదు.. మిగతా రెవెన్యూ సిబ్బందిపై దాడి... పోలీసులు వచ్చి దాడి చేసిన వారిని బుజ్జగించి పంపేశారు.. దాడి విషయం బయటకు పొక్కి రభస జరుగుతుంటే అప్పుడు పోలీసులు అప్రమత్తమై ఇలా కేసులు బుక్ చేసి అలా వదిలేశారు. మొదటిది కర్నూలు జిల్లా.. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, తన కూతురు ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పట్ల పోలీసులు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నందుకు అడ్డు పడితే ఆగమేఘాలపై కేసు ..అరెస్ట్... రెండవది పశ్చిమగోదావరి జిల్లాకి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ చింతమనేని ప్రభాకర్ అంశం. కృష్ణాజిల్లా ముసునూరు మండలం రంగంపేట ఇసుక రేవులో బుధవారం ... ఎమ్మెల్యే అనుచరులు అక్రమంగా ఇసుక తవ్వకం జరుపుతున్నారు. ఆ విషయం తెలిసి స్థానిక ఎమ్మార్వో వనజాక్షి... తన సిబ్బందితో కలసి ఆ ప్రాంతానికి వెళ్లారు. ఇదేం పని అని ప్రశ్నించిన ఆమెపై ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరణగణం దాడి చేసింది. దీనిపై బుధవారం మధ్యాహ్నం...రెవెన్యూ ఉద్యోగులు సమ్మెబాట పట్టినా, జిల్లా కలెక్టర్‌తో మొరపెట్టుకున్నా పోలీసుల నుంచి ఇప్పటి వరకు స్పందన లేదు. సరికదా డ్వాక్రా మహిళల ఫిర్యాదుతో బాధిత ఎమ్మార్వో వనజాక్షిపై పశ్చిమ గోదావరి జిల్లాలో ఎదురు కేసు పెట్టారు. ఒకవైపు ఇంత హడావిడి జరుగుతుంటే అధికార పార్టీ ఎమ్మెల్యే తాపీగా విలేకరుల సమావేశం పెట్టి వనజాక్షి వ్యక్తిగత విషయాల పట్ల అసభ్యంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. ' ఇలా అయితే ఉద్యోగాలు ఎలా చేస్తాం.. ఆత్మహత్య మినహా మరో మార్గంలేదు ' అని వనజాక్షి కన్నీటిపర్యంతమయ్యారు. ఇలాంటి సంఘటనలు చూస్తోంటే.. ప్రభుత్వ మహిళా అధికారులకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల మాటేమిటీ అనే ప్రశ్నకు జవాబు మాత్రం దొరకదు. సోమవారం వరకు ప్రభాకర్‌పై చర్య తీసుకోకపోతే ఉద్యమం చేస్తామని రెవెన్యూ అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. అంటే పోలీసులకి సోమవారం వరకు వెసులు బాటు ఉందన్నమాట...చేసింది తప్పుకానే కాదని ఎమ్మెల్యే ప్రభాకర్ ధైర్యంగా ఉన్నట్టున్నారు. తన అనుయాయులతో రెవెన్యూ అధికారులకు వ్యతిరేకంగా పోటీ ధర్నాలు చేయిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాలపై చింతమనేని యూత్ అని స్పష్టంగా పెద్ద అక్షరాలతో రాసి ఉంది. ఇసుక అమ్ముకునే హక్కు కల్పించిన నాయకుడి పట్ల ఆ మాత్రం స్వామి భక్తి లేకపోతే ఎలా...అందుకే ఇసుకాసురులు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఏ చిన్న విషయంపైన అయినా ఒంటి కాలిమీద లేచి నానా యాగి చేసే అధికారపార్టీ నాయకులు మాత్రం..ఈ విషయం పై వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. 'బాస్ జపాన్ నుంచి వచ్చిన తర్వాతే చర్యలుంటాయి' అని లీకులు మాత్రం ఇస్తున్నారు. చర్యలంటే ప్రభాకర్‌ను అరెస్ట్ చేస్తారని ఆశపడటం తప్పేమో.. బహుశా ఎమ్మెల్యేకు ఎదురు తిరిగినందుకు వనజాక్షిని ఏదో ఒక లూప్ లైన్ పోస్ట్‌కి బదిలీ చేస్తారేమో.. -
'నాపట్ల అసభ్యంగా మాట్లాడుతున్నారు'
విజయవాడ : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ....ఓ మహిళను కించపరిచేలా ప్రయ్నతించటం దారుణమని ఎమ్మార్వో వనజాక్షి కన్నీటిపర్యంతమయ్యారు. ఇలా అయితే మహిళా ఉద్యోగులు ఎవ్వరూ బతకలేరని, ఆత్మహత్యలు చేసుకోవాల్సిందేనని ఆమె అన్నారు. విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రెవిన్యూ ఉద్యోగులు గురువారం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో వనజాక్షి మాట్లాడుతూ ఎమ్మెల్యే చింతమనేని ప్రెస్‌మీట్ పెట్టి తన ఫ్యామీలి గురించి చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎమ్మెల్యేకి తన పర్సనల్ విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. నిజాయితీగా విధులు నిర్వహిస్తే.. ఎలాంటి రక్షణ కూడా ఉండదని, వ్యవస్థ ఇలా ఉంటే...మేం బతకలేమని, మహిళ ఉద్యోగులంతా ఆందోళనకు దిగుతామని ఆమె తెలిపారు. -
'కౌంటర్ కేసు డ్రామాకు తెర తీశారు'
ఏలూరు : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వర్గం కౌంటర్ కేసు డ్రామాకు తెర తీసింది. కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి తనపై దాడి చేశారంటూ డ్వాక్రా మహిళలు ఎదురు కేసు పెట్టారు. ఎమ్మార్వో వనజాక్షితో పాటు అధికారులు తమపై దాడి చేశారని డ్వాక్రా మహిళలు మీసాల కుమారి, నాగలక్ష్మి పెదవేగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం చికిత్స కోసం వారు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేశారు. మహిళల ఫిర్యాదుతో ఎమ్మార్వోతో పాటు అధికారులపై పెదవేగి పోలీసులు మెడికల్ లీగల్ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు. మరోవైపు అధికార దౌర్జన్యాలపై అధికారులు ఆగ్రహంతో వున్నారు. గోదావరి పుష్కరాల విధులను బహిష్కరించాలనే యోచనలో ఉన్నారు. కాగా ఆదాయం కోసం అక్రమ మార్గాలు పట్టిన టిడిపి నేతల దాష్టీకానికి ఈ దాడి వ్యవహారమే నిదర్శనం. సాక్షాత్తు ప్రభుత్వాధికారిపైనే దాడికి దిగిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా ముసునూరు మండలం రంగంపేట ఇసుక రీచ్‌లో అక్రమ తవ్వకాలను అడ్డుకున్న అక్రమంగా ఇసుక తవ్వుకుపోతున్నారంటూ అడ్డుకున్న కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై విచక్షణారహితంగా దాడికి దిగారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అతని 50 మంది అనుచరులు తనపై దాడి చేశారని, మహిళ అని కూడా చూడకుండా ఈడ్చేపారేశారంటూ ఎమ్మార్వో కన్నీళ్లపర్యంతమయ్యారు. ఎమ్మెల్యే చింతమనేని సెక్యూరిటీ సిబ్బంది తన ఫోన్‌ను కూడా లాగేసుకున్నారని, తనను కొట్టి 25 ట్రాక్టర్ల ఇసుకను తరలించుకుపోయారని ఆమె ఆరోపించారు. జరిగిన సంఘటనపై కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. -
'ఎమ్మార్వో వనజాక్షిపై దాడి అమానుషం'
హైదరాబాద్: కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఎమ్మార్వోపై దాడి అమానుషమని ఆ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు అన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విలేకర్లతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అధికార యంత్రాంగం స్వేచ్ఛగా విధులు నిర్వహించే వాతావరణం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ఇప్పటి వరకు సీఎం, డిప్యూటీ సీఎంలు స్పందించకపోవడం దారుణమన్నారు. ఎమ్మార్వో వనజాక్షికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలుపుతోందని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ఈ దాడికి కారణమైన ఎమ్మెల్యే సహా బాధ్యలందరిపై తీవ్ర చర్యలు తీసుకోవాలని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు... చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
దోచుకోవడం..దాచుకోవడమే..
అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పై ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రఘవీరా రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనంతపురంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం, అవినీతి రాజ్యం నడుస్తోందన్నారు. జన్మభూమి కమిటీ సభ్యుడి నుంచి మొదలుకొని సీఎం చంద్రబాబు వరకు దోచుకోవడం..దాచుకోవడమే సింగిల్ ఎజెండా గా పెట్టుకున్నారన్నారు. వారు చేసే పనికి ఎవరు అడ్డొచ్చినా ఖాతరు చేయడంలేదన్నారు. తాజాగా దెందులూరులో మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేసిన ఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క టీడీపీ ఎమ్మెల్యే ఈ విధంగానే ఉన్నారని విమర్శించారు. అవినీతి, దౌర్జన్యాలపై ఆదేశాలు జారీ చేస్తే ప్రభుత్వ అధికారులకు తలనొప్పి ఉండదన్నారు. ఏపీ కి ప్రత్యేక హోదాపై ప్రశ్నించే హక్కు పవన్‌కే కాదు ఎవరికైనా ఉందని తెలిపారు. హంద్రీనీవా ప్రాజెక్ట్ కు మాజీ ఎంపీ అనంతవెంకటరెడ్డి పేరును తొలగించడం దారుణమన్నారు.ఈ నెల 24 న కాంగ్రె స్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురంలో పర్యటిస్తారని తెలియజేశారు. -
టీడీపీ ఎమ్మెల్యే పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు
నూజివీడు: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్‌తోపాటు ఆయన గన్‌మెన్‌తో సహా 52 మందిపై కృష్ణాజిల్లా ముసునూరు పోలీస్ స్టేషన్లో నాన్‌బెయిలబుల్ కేసులు నమోదయింది. వారిపై 353, 334, 379 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్వార్వో వనజాక్షి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. బుధవారం కృష్ణాజిల్లా నూజివీడు తాలుకా ముసునూరు మండలం రంగంపేట ఇసుకరేవులో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమ ఇసుక తవ్వుతున్న వారిని ఎమ్మార్వో వనజాక్షి, ఆమె వెంట ఉన్న సిబ్బంది ప్రశ్నించారు. దాంతో ఆగ్రహించిన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ చింతంనేని ప్రభాకర్... వనజాక్షిపై తన అనుచరులతో దాడిచేయించి ఇసుకలో ఈడ్చికొట్టారు. ఆయనతోపాటు తీసుకొచ్చిన ఆరుగురు మహిళలు తహశీల్దార్‌పై దాడిచేసి గోళ్లతో ఆమె ముఖంపై రక్కారు. ఇసుక తవ్వుకుంటాం... ఎవడడ్డొస్తాడో చూస్తా..నంటూ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వీరంగం సృష్టించారు. 25 ట్రక్కుల ఇసుక, పొక్లెయిన్లు తీసుకొని వెళ్లిపోతూ ఎమ్మెల్యే చింతంనేని తహశీల్దార్‌ను అసభ్య పదజాలంతో దుర్భాషలాడారు. దానికి ఆమె తీవ్ర మనస్తాపం చెందారు. ఎమ్మెల్యే గన్మెన్లు కూడా తహశీల్దార్‌పై దాడి చేశారు. అంతేకాకుండా ఆమెతో పాటు ఆర్ఐ, ముగ్గురు వీఆర్వోలు, ముగ్గురు వీఆర్ఏలు, కంప్యూటర్ ఆపరేటర్లపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసి కొట్టారని తహశీల్దార్ వనజాక్షి ముసునూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. దాంతో గురువారం ఎమ్మెల్యే ఆయన అనుచరులపై ముసునూరు పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఎమ్మార్వో వనజాక్షిపై జరిగిన దాడిని రెవెన్యూ సంఘాలు మాత్రం తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఈ దాడిపై చంద్రబాబు ప్రభుత్వం స్పందించకుంటే గోదావరి పుష్కరాలు, పోలవరం, పట్టిసీమ ప్రాజెక్ట్ విధులకు దూరంగా ఉండాలని రెవెన్యూ అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. -
తొడగొట్టిన రౌడీ రాజ్యం
మహిళా తహసీల్దార్‌పై ఎమ్మెల్యే చింతమనేని దాడి ముసునూరు: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ రెచ్చిపోయారు. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు ఆర్ఐపై దౌర్జన్యం చేసి నిర్బంధించారు. ఈ విషయం తెలుసుకుని వచ్చిన మహిళా తహసీల్దార్‌పై విచక్షణారహితంగా దాడి చేయించారు. అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న ట్రాక్టర్లకు అడ్డంగా నిల్చున్న ఆమెను దుర్బాషలాడారు. ఆమెను తీవ్రంగా కొట్టించి, ఇసుకలో లాగించి పక్కన పడేయించారు. ఆమె సెల్‌ఫోన్‌ను ధ్వంసం చేయించారు. అడ్డువచ్చిన ఇతర అధికారులను కూడా చితకబాదించారు. ఏదైనా ఉంటే కలెక్టర్‌కు లెటర్ రాసుకో... నేనిప్పుడు ఇసుక తోలుకెళ్తున్నానంటూ దౌర్జన్యంగా ఇసుక తోలుకెళ్లారు. ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్న సాక్షి విలేకరిని ఎమ్మెల్యే అనుచరులు తీవ్రంగా కొట్టి, కెమెరా లాక్కొని మెమరీ కార్డును తీసుకుని ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే దౌర్జన్యంతో మనస్తాపం చెందిన మహిళాధికారి ఈ విషయమై సీఎంకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. వివరాల్లోకి వెళితే... కృష్ణాజిల్లా ముసునూరు మండలం రంగంపేట వద్ద తమ్మిలేరు నుంచి ఇసుకను చింతమనేని వందలాది ట్రాక్టర్లలో తరలిస్తున్నారన్న సమాచారం మేరకు తహశీల్దారు వనజాక్షి రెవెన్యూ ఇన్స్పెక్టర్(ఆర్ఐ) మరియన్నను సంఘటనాస్థలానికి పంపించారు. అక్కడకు వెళ్లిన ఆర్ఐని ఎమ్మెల్యే మనుషులు అడ్డుకొని దౌర్జన్యం చేసి నిర్బంధించారు. ఆయన ఈ విషయాన్ని తహశీల్దారుకు, ముసునూరు పోలీసులకు ఫోన్లో తెలియజేశారు. ముసునూరు ఎస్ఐ పి.విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు తమ్మిలేరుకు చేరుకున్నారు. రికార్డులుంటే చూపించి మాట్లాడాలని పోలీసుల సమక్షంలోనే ఆర్ఐని ప్రభాకర్ నిలదీశారు. సరిహద్దుకు సంబంధించిన రికార్డులు తనవద్ద లేకపోవడంతో ఆర్ఐ మిన్నకుండిపోయారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు ట్రాక్టర్లలో యధేచ్ఛగా ఇసుక రవాణాను కొనసాగించారు. ఈ విషయం తెలుసుకున్న ముసునూరు తహశీల్దారు వనజాక్షి మధ్యాహ్నం మూడు గంటల వేళ అక్కడకు చేరుకుని ఇసుక రవాణాను ఆపాలని కోరారు. ఎమ్మెల్యే అనుచరులు ఖాతరు చేయకపోవడంతో వాహనాలకు అడ్డంగా కూర్చున్నారు. అక్కడినుంచే కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్లో విషయం తెలిపారు. అనంతరం ఘటనాస్థలం వద్దకు వచ్చిన ఎమ్మెల్యే చింతమనేని... మీకు ఫోన్లో విషయం తెలిపినప్పటికీ ట్రాక్టర్లకు అడ్డంగా ఎందుకు కూర్చున్నారంటూ తహసీల్దార్‌ను దుర్భాషలాడారు. ఇసుక తరలిస్తున్న ప్రదేశం ముసునూరు మండలానికి సంబంధించింది కాబట్టి తరలించడానికి తాను ఒప్పుకోనని అమె అక్కడే బైఠాయించారు. రేపు సర్వేయర్ వచ్చి హద్దులు నిర్దేశించాక మీదైతే తోలుకోవచ్చని స్పష్టంచేశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే ఆమెపై తన అనుచరులను ఉసిగొల్పారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు, డ్వాక్రా మహిళలు మూకుమ్మడిగా మహిళా తహశీల్దారుపై దాడి చేశారు. ఆమెకు తీవ్రంగా గాయపరిచి ఇసుకలో లాగి పక్కన పడేశారు. దాడిని అడ్డుకున్న తహశీల్దారు కార్యాలయ సిబ్బందిని ఎమ్మెల్యే అనుచరులు చితకబాదారు. విషయం తెలిసి అధికారులతోపాటు అక్కడికి వెళ్లిన ‘సాక్షి’ విలేకరి కర్రా నవీన్‌కుమార్ తహశీల్దార్‌పై దాడి దృశ్యాలను తన కెమెరాలో బంధిస్తుండటం చూసిన ప్రభాకర్ అనుచరులు మూకుమ్మడిగా వచ్చి పిడిగుద్దులు గుద్దుతూ వాగులో పడేసి కొట్టారు. అతడి దగ్గరున్న సెల్‌ఫోన్‌ను, కెమెరాను లాక్కొన్నారు. ఆ తర్వాత పొక్లెయిన్‌తో ఇసుక తవ్వుకుని అక్రమంగా తరలించారు. ఈ దాడి సమాచారం అందుకున్న రెవెన్యూ,పోలీసు ఉన్నతాధికారులు అక్కడకు వచ్చి పరిస్థితులను తెలుసుకున్నారు. పుష్కర విధుల బహిష్కరణ కాకినాడ సిటీ: చింతమనేని, ఆయన అనుచరుల తీరు అమానుషమని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పితాని త్రినాథరావుఅన్నారు. నిందితులను 48 గంటల్లో అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పుష్కర సేవలను బహిష్కరిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సూసైడ్ చేసుకోవాలనిపిస్తోంది * ఎమ్మెల్యే దాడిలో గాయపడిన మహిళా తహశీల్దార్ ‘‘బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే మహిళనని కూడా చూడకుండా నోటికొచ్చినట్లు తిట్టడమేమిటి? వారి ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు అనుచరులతో దాడి చేయించడమేమిటి? అందరిముందూ ఇంత అవమానం జరిగాక బతకాలనిపించడంలేదు. సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది’’ అని ముసునూరు తహశీల్దార్ వనజాక్షి వాపోయారు. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరుల దాడిలో బుధవారం తీవ్రగాయాలపాలైన ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఎమ్మెల్యేపై కేసు పెడతామని, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోనని స్పష్టంచేశారు. రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్‌లో మాట్లాడాక భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యేనే అనుచరులతో మమ్మల్ని కొట్టిస్తే మాకు విలువేముంటుందని ప్రశ్నించారు. ఇంత జరిగాక బతకాలనిపించడంలేదని, సూసైడ్ చేసుకోవాలనిపిస్తోందని ఆమె కన్నీరు మున్నీరయ్యారు. -
'ప్రభాకర్ ను తక్షణమే అరెస్ట్ చేయాలి'
ఏలూరు/నూజివీడు: మహిళా తహశీల్దార్ వనజాక్షిపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన ఘటనపై మంత్రి పీతల సుజాత స్పందించారు. సంఘటన తన దృష్టికి రాలేదని, విచారణంగా ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహిళా తహశీల్దార్ దాడి చేయడాన్ని నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ఖండించారు. ఎమ్మార్వో వనజాక్షిపై దాడికి కారకులైన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని రెవెన్యూ సిబ్బంది డిమాండ్ చేశారు. మహిళా తహశీల్దార్ దాడిని వైఎస్సార్ సీపీ నాయకడు కె. పార్థసారధి ఖండించారు. దాడికి పాల్పడిన ఎమ్మెల్యే, అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
నన్ను ఈడ్చేశారు.. ఫోను లాక్కున్నారు: ఎమ్మార్వో
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు తనపై దాడి చేశారని, తనను ఇసుకలో ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని ముసునూరు మహిళా ఎమ్మార్వో వనజాక్షి తెలిపారు. తన ఫోను కూడా లాక్కుని విసిరేశారన్నారు. దాడి ఘటన అనంతరం ఆమె 'సాక్షి టీవీ'తో ప్రత్యేకంగా మాట్లాడారు. తన ఫోనును ఎమ్మెల్యే వ్యక్తిగత భద్రతా సిబ్బందే లాగేసుకున్నారని ఆమె చెప్పారు. తనను కొట్టి 25 ట్రాక్టర్ల ఇసుక అక్కడి నుంచి తీసుకెళ్లారన్నారు. జరిగిన ఘటనపై తాను కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానని, వాళ్లు అంతా వస్తున్నారని ఆమె తెలిపారు. ప్రభుత్వ డ్యూటీమీద వచ్చిన తమపై ఇలా దౌర్జన్యం చేయకూడదని.. ఆయనకు నిజంగా పర్మిట్లు ఉంటే, సర్వే చేసేవరకు ఆగి చెప్పాలి గానీ, తమను కొట్టి ట్రాక్టర్లు తీసుకెళ్లడం సరికాదని అన్నారు. విషయం తెలిసిన తర్వాత అక్కడకు ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చారని.. అయితే ఎమ్మెల్యే అనుచరులు 50 మందికి పైగా ఉండటంతో వీళ్లు ఏమీ చేయలేకపోయారని ఎమ్మార్వో వనజాక్షి వివరించారు. జరిగిన దాడిని తమ ఉద్యోగుల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లానని, వాళ్లు కూడా దీంట్లో కలగజేసుకుంటున్నారని తెలిపారు. ఇలా దాడులు చేస్తే ఇక విధులు ఎలా నిర్వహిస్తామని ప్రశ్నించారు. మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేటునే ఇలా చేస్తే వీఆర్వో, ఆర్ఐ లాంటివాళ్లకు తగిన అధికారాలు కూడా ఉండవని.. వాళ్లు ఏమీ చేయలేరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ దృష్టికి కూడా ఈ దాడి విషయాన్ని తీసుకెళ్లానని, ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా చెప్పారని అన్నారు. -
కట్న దాహానికి నవవధువు బలి
హత్య చేసి, ఆపై నిప్పంటించిన భర్త? రాజేంద్రనగర్: కట్నం దాహానికి నవవధువు బలైపోయింది. భర్తే ఆమెను హత్య చేసి, ఆపై కిరోసిన్ పోసి నిప్పంటించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే అసలు విషయం తెలుస్తుందంటున్నారు. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... మొయినాబాద్‌కు చెందిన వనజ (21)కు ఖానాపూర్‌కు చెందిన నవీన్‌తో ఆరు నెలల క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో రూ. 50 వేల నగదు, 10 తులాల బంగారం, 20 తులాల వెండి, బైక్, ఇతర సామగ్రి కట్నంగా ఇచ్చారు. కాగా, పెళ్లైనప్పటి నుంచి లక్ష రూపాయలు అదనపు కట్నం తీసుకురావాలని వనజను నవీన్ వేధిస్తున్నాడు. జులాయిగా తిరిగే అతను కొన్ని రోజులుగా తాగివచ్చి చితక బాదుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం 1 గంటకు నవీన్ ఇంటి నుంచి పొగ వస్తుండటంతో స్థానికులు తలుపుతీసి చూడగా వనజ మంటల్లో కాలిపోతూ కనిపించింది. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే వనజ మృతి చెందింది. ఉదయం భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని, మధ్యాహ్నాం బయట నుంచి తలుపు గొళ్లెంపెట్టి నవీన్ బయటకు వెళ్లాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. ఈ నేపథ్యంలో అతడే ముందుగా భార్యను హత్య చేసి, తర్వాత మృతదేహంపై కిరోసిన్ పోసి నిప్పంటించి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పసిపాపలతో పట్టాలపై...
ముగ్గురు కూతుళ్లతో రైలు కింద పడిన తల్లి చివరి నిమిషంలో పెద్దకుమార్తెను పక్కకు తోసేసిన ‘కన్న మనసు’ తల్లి సహా ఇద్దరు కూతుళ్లు మృతి భువనగిరి: ఓ తల్లి ఇద్దరు కూతుళ్లు సహా రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. చివరి నిమిషంలో తన పెద్ద కుమార్తెను పక్కకు తోసేయడంతో ఆ చిన్నారి బతికిపోయింది. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం నల్లగొండ జిల్లా భువనగిరి శివారులోని జగ్దేవ్పూర్ రైల్వేగేట్ వద్ద జరిగింది. ప్రాణాలతో బయటపడిన చిన్నారి వనజ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం చేగూరు శివారు ఎంకమ్మగూడేనికి చెందిన అరుణమ్మ (35)కు కుమార్తెలు వనజ (9), మౌనిక (3), పూజ (6 నెలలు) కు ఉన్నారు. కొద్ది నెలల క్రితం భర్త చనిపోవడంతో పుట్టింటికి చేరిన అరుణమ్మ కూలీనాలీ చేసుకుని జీవిస్తోంది. ఆమెకు సోదరులు నర్సింహ, కిష్టయ్య, యాదయ్య, పెంటయ్య ఉన్నారు. ఆదివారం వారితో గొడవ పడిన అరుణమ్మ తన ముగ్గురు పిల్లలను తీసుకుని హైదరాబాద్ బస్‌స్టేషన్‌కు చేరుకుంది. రాత్రి అక్కడే నిద్రపోయిన నలుగురు సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సులో భువనగిరి చేరుకున్నారు. అక్కడి నుంచి నడుచుకుంటూ జగ్దేవ్పూర్ గేట్ వద్దకు చేరుకున్నారు. ముగ్గురు కూతుళ్లను ఒళ్లో కూర్చోబెట్టుకుని పట్టాలపై ఆఫ్‌లైన్‌లో కూర్చుంది. విశాఖపట్నం నుంచి షిర్డీ వెళ్తున్న రైలు దగ్గరకు రాగానే ఆ తల్లి హృదయం కరిగిందో తెలియదు కానీ... తన ఒడిలోని పెద్ద కుమార్తె వనజను పక్కకు నెట్టేసింది. రైలు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో తల్లి అరుణమ్మ, మౌనిక, పూజ అక్కడికక్కడే మృతిచెందారు. కొద్దిసేపటి దాకా వనజకు ఏమి జరిగిందో అర్థం కాలేదు. కొద్దిసేపటి తర్వాత రోదిస్తూ సమీపంలోని గేట్‌మన్ వద్దకు వెళ్లి ‘మా అమ్మ, చెల్లెళ్లు రైలుకింద పడి చనిపోయారు’ అని చెప్పింది. రైల్వే పోలీసులు మృతదేహాలకు పంచనామా నిర్వహించి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
బిటెక్ లవ్‌స్టోరీ మూవీ స్టిల్స్
-
ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తి
కలెక్టరేట్, : వీఆర్వో పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన మంగళవా రం సాయంత్రానికి పూర్తయింది. మొత్తం 62మంది అభ్యర్థుల్లో మాజీ సైనికుల కోటాలో వచ్చిన ఇద్దరిని అధికారులు తిరస్కరించారు. వీరిలో ఒకరు గతంలో వీఆర్ఏగా కొంతకాలం పనిచేసి మానేశారు. దాన్ని ఎక్స్ సర్వీస్‌మెన్ కోటాగా చెప్పడం వల్ల, మరొకరు ఇప్పటికీ విధుల్లో కొనసాగుతూ శాఖాపరమైన అనుమతి లేకుండా పరీక్ష రాసినందున అధికారులు తిరస్కరించారు. వీరిని జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారి వనజ అనర్హులుగా తేల్చారు. వీరిపై కేసులు నమోదు చేయాలంటూ ఆదేశించారు. ఒకటి రెండు రోజుల్లో ఎంపిక జాబితా ప్రదర్శిస్తామని అధికారులు తెలిపారు. -
విద్యుత్ సబ్‌స్టేషన్ ముందు రైతుల ధర్నా
గోపవరం (ముసునూరు), న్యూస్‌లైన్ : అప్రకటిత విద్యుత్ కోతల వల్ల పంటలన్నీ ఎండిపోతున్నాయంటూ రెతులు కన్నెర్ర చేశారు. గోపవరం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో విద్యుత్ సరపరా నిలిపివేసి సబ్‌స్టేషన్ ముందు శనివారం తెల్లవారుజామునుంచి ధర్నా నిర్వహించారు. రైతులకిచ్చే త్రీపేజ్ విద్యుత్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితిలో నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పగలు మూడు, నాలుగు విడతలుగా గంట నుంచి3 గంటల పాటు విద్యుత్నిస్తున్నారని రాత్రి ఇచ్చే రెండు గంటలు సైతం రెండు మూడు విడతలుగా ఇస్తూ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. త్రీపేజ్ విద్యుత్‌ని ఏడు గంటలు పగలే నిరాటంకంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సబ్‌స్టేషన్ ముందు ఆందోళన చేస్తునట్లు సమాచారం అందుకున్న ముసునూరు ఏఈ పిచ్చేశ్వరరావు గోపవరం సబ్‌స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్న రైతులతో చర్చిండానికి ప్రయత్నించగా రైతులు ఆయన తో తీవ్ర వాదోపవాదాలకు దిగారు. నూజివీడు ట్రాన్స్‌కో డీఈ వచ్చి సమస్య పరిష్కరిస్తానని లిఖిత పూర్వకహామీ ఇచ్చేవరకు ధర్నా విరమించేది లేదని భీష్మించారు. ఉద్రిక్త పరిస్తితులకు దారి తీస్తుందనే భావనతో నూజివీడు డీఎస్పీ ఏ శంకరరెడ్డి, నూజివీడు సీఐ. సీహెచ్‌వీ మురళీకృష్ణ , నూజివీడు రురల్, ఎస్ఐ ఆదిప్రసాద్, ముసునూరు ఎస్ఐ గుడివాడ అనీల్‌కుమార్, పోలీసు బృందం గోపవరం చేరుకున్నారు. మధ్యాహ్నం గోపవరానికి చేరుకున్న నూజివీడు ట్రాన్స్‌కో డీఈ వెంకటేశ్వర్లు ధర్నా చేస్తున్న రైతులు డీఎస్పీ.సీఐ, కృష్ణారావు సమక్షంలో చర్చలు జరిపారు. పగటి వేళల్లో ఏడు గంటలు నిరాటకంగా త్రీపేజ్ విద్యుత్ ఇవ్వాల్సిందేనని రైతులు పట్టుబట్టారు. ట్రాన్స్‌కో ఉన్నతాధికారులతో పోన్లో మాట్లాడిన డీఈ వెంకటేశ్వర్లు రైతుల డిమాండ్ నెరవేర్చడానికి సానుకూలంగా స్పందించడంతో రైతులు సాయంత్రం ధర్నా విరమించారు. ఈ ధర్నాలో గోపవరం, వేల్పుచర్ల, వెంకటాపురం, కాట్రేనిపాడుకి, చెందిన రెండు వందలకి పైగా రైతులు హజరయ్యారు. కాంగ్రెస్ నాయకుడు ముత్తంశెట్టి కృష్ణారావు, నందిగం సత్యనారాయణ. నందిగం గంగాధరరావు, బొల్లినేని బుజ్జి, వల్లభనేని గోపాలకృష్ణ, మూతినేని రాదాకృష్ణ. తుమ్మల నాగేశ్వరరావు, నందిగం నవీన్, వాసు, ప్రవీణ్, మాకినేని నాగర్జున పాల్గొన్నారు.