'కౌంటర్ కేసు డ్రామాకు తెర తీశారు'
ఏలూరు : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వర్గం కౌంటర్ కేసు డ్రామాకు తెర తీసింది. కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి తనపై దాడి చేశారంటూ డ్వాక్రా మహిళలు ఎదురు కేసు పెట్టారు. ఎమ్మార్వో వనజాక్షితో పాటు అధికారులు తమపై దాడి చేశారని డ్వాక్రా మహిళలు మీసాల కుమారి, నాగలక్ష్మి పెదవేగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం చికిత్స కోసం వారు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేశారు. మహిళల ఫిర్యాదుతో ఎమ్మార్వోతో పాటు అధికారులపై పెదవేగి పోలీసులు మెడికల్ లీగల్ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు. మరోవైపు అధికార దౌర్జన్యాలపై అధికారులు ఆగ్రహంతో వున్నారు. గోదావరి పుష్కరాల విధులను బహిష్కరించాలనే యోచనలో ఉన్నారు.
కాగా ఆదాయం కోసం అక్రమ మార్గాలు పట్టిన టిడిపి నేతల దాష్టీకానికి ఈ దాడి వ్యవహారమే నిదర్శనం. సాక్షాత్తు ప్రభుత్వాధికారిపైనే దాడికి దిగిన సంఘటన ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా ముసునూరు మండలం రంగంపేట ఇసుక రీచ్‌లో అక్రమ తవ్వకాలను అడ్డుకున్న అక్రమంగా ఇసుక తవ్వుకుపోతున్నారంటూ అడ్డుకున్న కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై విచక్షణారహితంగా దాడికి దిగారు.
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అతని 50 మంది అనుచరులు తనపై దాడి చేశారని, మహిళ అని కూడా చూడకుండా ఈడ్చేపారేశారంటూ ఎమ్మార్వో కన్నీళ్లపర్యంతమయ్యారు. ఎమ్మెల్యే చింతమనేని సెక్యూరిటీ సిబ్బంది తన ఫోన్‌ను కూడా లాగేసుకున్నారని, తనను కొట్టి 25 ట్రాక్టర్ల ఇసుకను తరలించుకుపోయారని ఆమె ఆరోపించారు. జరిగిన సంఘటనపై కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానని చెప్పారు.