భారతీయులను అవమానించేలా సీఎం వ్యాఖ్యలు!
అమరావతి: రాజకీయాలను పక్కా వ్యాపారంగా మార్చి అవినీతిని పెంచి పోషించిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. ఇప్పుడు నంగనాచి కబుర్లు చెబుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఎద్దేవా చేశారు. విజయవాడలో గురువారం జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలను వ్యాపారంగా మార్చి, ఇప్పుడేమో రాజకీయాలు అవినీతిమయం అయ్యాయంటూ చంద్రబాబు మహాపతివ్రతలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇసుక మాఫియాను అడ్డుకున్న తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనితో పాటు రైల్వే కాంట్రాక్టర్‌ను రూ.5 కోట్లు ఇవ్వాలని బెదిరించిన టీడీపీ ఎమ్మెల్యేపై క్రమశిక్షణ చర్యలెందుకు తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను రూ.కోట్లు పెట్టి సంతల్లో పశువుల్లా కొనుగోలు చేసింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. తప్పుడు పనులు చేసే చంద్రబాబుతో రాజకీయ అవినీతి, రాష్ట్ర ప్రయోజనాల గురించి నీతులు చెప్పించుకోవడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో డబ్బులు పంచనంటూ శపథం చేయాలని రామకృష్ణ సవాల్ విసిరారు. భారతీయులను చంద్రబాబు అవమానించారు.. పుట్టుక మా చేతుల్లో ఉంటే తాను, వెంకయ్యనాయుడు అమెరికాలో పుట్టి ఉండేవారమని సీఎం చేసిన వ్యాఖ్యలు భారతీయులను తీవ్రంగా అవమానించడమేనన్నారు.
అమెరికాలో పుడితే గొప్పవాళ్లు, భారత్‌లో పుడితే తక్కువ వాళ్లు అనే భావన సరికాదని, మహనీయులు పుట్టిన ఈ గడ్డపై జన్మించడం మన అదృష్టమని రామకృష్ణ హితవు పలికారు. కాగా, అగ్రిగోల్డ్ బాధితుల్ని ఆదుకోకుంటే సీఎం కార్యాలయాన్ని ముట్టడించాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో తీర్మానించినట్లు చెప్పారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సమస్యలపై జిల్లాల వారీగా చైతన్య కార్యక్రమాలు నిర్వహించి, ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించినట్టు సీపీఐ నేత రామకృష్ణ తెలిపారు.