తహశీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
న్యూఢిల్లీ: తహశీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించింది. ఎన్హెచ్ఆర్సీ ఈ కేసును సుమోటాగా తీసుకుంది.
కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. రెవెన్యూ సంఘాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వనజాక్షికి మద్దతుగా నిలిచి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అయితే ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అంతేగాక ఈ కేసులో రాజీపడాలని ప్రభుత్వ పెద్దలు వనజాక్షిపై ఒత్తిడి తీసుకువచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి.