అమానుష ఘటనపై ఎన్ హెచ్ఆర్సీ నోటీసులు
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ లోని అమానవీయ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్సీ) ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. బెర్హంపూర్ లోని 430 పడకల మానసిక వ్యాధిగ్రస్థుల ఆస్పత్రిలో రోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఓ ఎన్జీవో సంస్థ ఫిర్యాదును సుమోటో గా తీసుకున్న కమిషన్ ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.
అంజలి మెంటల్ హెల్త్ ఎన్జీవో సభ్యులు అగస్టు 15 న బెర్హంపూర్ లోని మెంటల్ ఆస్పత్రిని సందర్శించారు. అక్కడ కట్టు బట్టలు కూడా లేకుండా ఉన్న రోగుల దయనీయ స్థితి వారి కంట పడింది. మురికిగా ఉన్న వారి పరుపులు, తీవ్ర దుర్వాసనతో కూడిన టాయిలెట్లను ఫోటోలు తీసి ఎన్ హెచ్ఆర్సీ కి పంపారు. దీనిపై స్పందించడానికి హాప్పిటల్ సూపరింటిండెంట్, వైద్య శాఖ అధికారులు నిరాకరించారు.