హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుపతి శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్పై ఇప్పటివరకూ జ్యూడిషియల్ ఎంక్వైరీ ఎందుకు వేయలేదని ప్రశ్నించింది. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసుల వివరాలు ఇవ్వాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. అలాగే పోలీసులు ఉపయోగించిన సెల్ నంబర్లు ఇవ్వాలని సూచించింది. అలాగే సమీపంలోని సెల్ టవర్ నుంచి వెళ్లిన అన్ని ఫోన్ కాల్స్ వివరాలను సమర్పించాలని పేర్కొంది. కాగా ఎన్కౌంటర్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అడిషనల్ డీజీ లీగల్ ఎఫైర్స్ వినయ్ రంజన్ ఈరోజు ఎన్హెచ్ఆర్సీ బృందానికి నివేదిక సమర్పించారు.
కాగా శేషాచలం అడవుల్లో ఈనెల 7న జరిగిన ఎన్‌కౌంటర్‌పై పోలీసులపై ఉచ్చు బిగుస్తోంది. ఎన్‌కౌంటర్‌లో 20 మంది కూలీలను పోలీసులు కాల్చిచంపడం, దీనిపై జాతీయ మానవ హక్కుల సంఘం, సుప్రీం కోర్టు, రాష్ట్ర హై కోర్టు తీవ్రంగా పరిగణించడం తెలిసిందే. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన ఆరుగురు కూలీలకు రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించిన రీపోస్టుమార్టం నివేదిక బుధవారం న్యాయస్థానం వద్దకు సీల్డు కవర్‌లో చేరడంతో పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పోస్టుమార్టం నివేదికలో ఎలాంటి విషయాలు వచ్చాయోనని పోలీసు బాసులు అంతర్మథనంలో ఉన్నారు.
ఏపీ ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం
Published Thu, Apr 23 2015 11:47 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM
Advertisement
Advertisement