నంబూరు రైతు భరోసా కేంద్రం వద్ద ట్రాక్టర్ నడుపుతున్న సంతోష్ మెహ్రా
పెదకాకాని(పొన్నూరు): ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలో అమలు చేస్తున్న సచివాలయ వ్యవస్థ సేవలు, సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని ఎన్‌హెచ్‌ఆర్‌సీ డైరెక్టర్ జనరల్ సంతోష్ మెహ్రా (ఇన్వెస్టిగేషన్) ప్రశంసించారు. గుంటూరు జిల్లా పెదకాకాని సచివాలయం, నంబూరు రైతు భరోసా కేంద్రాన్ని మంగళవారం జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు డాక్టర్ గోచిపాతల శ్రీనివాసరావుతో కలసి సందర్శించారు.
ఈ బృందానికి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ రాజకుమారి స్వాగతం పలికారు. సచివాలయాల పనితీరు, ప్రభుత్వ పథకాలపై జేసీ రాజకుమారి సంతోష్ మెహ్రాకు వివరించారు. సచివాలయం ఉద్యోగులు, వలంటీర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో సంతోష్ మెహ్రా మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు అమలు విజయవంతం కావడమే లక్ష్యంగా రాష్ట్రంలో పరిపాలన సాగుతుందన్నారు.
రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ పనితీరుపై నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. అంగన్‌వాడీ సెంటర్ల ద్వారా చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు, కిశోర బాలికలకు పోషకాహారం అందించడం, ప్రతి నెలా 1వ తేదీనే ఇంటింటికీ వెళ్లి పింఛన్ అందజేయడంపై ప్రశంసల జల్లు కురిపించారు.
రైతు భరోసా కేంద్రాల సేవలు భేష్
ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు రైతులకు చాలా ప్రయోజనకరంగా ఉన్నాయని సంతోష్ మెహ్రా అన్నారు. నంబూరు గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఏడీ వెంకటేశ్వర్లు వ్యవస్థ అమలు తీరును వివరించారు. ఆర్డీవో ప్రభాకరరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ హరిహరనాథ్ , గ్రామ సచివాలయ జిల్లా అధికారి కావూరి గీతారాణి, ఎంపీడీవో టీవీ విజయలక్ష్మి, ఎంపీపీ తుల్లిమిల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment