
చంద్రబాబుతో ఉద్యోగ సంఘాల భేటీ
హైదరాబాద్: కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి పంచాయితీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. ఈ అంశంపై ఏపీ రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలతోపాటు బాధితురాలు వనజాక్షి శనివారం ఉదయం చంద్రబాబుతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. దాడికి చోటుచేసుకున్న పరిణామాలను వనజాక్షి స్వయంగా చంద్రబాబుకు వివరించారని సమాచారం. అనంతరం రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన దిగిన వైనంపై కూడా ఉద్యోగ సంఘాల నేతలు బాబుకు వివరించారు.
ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను అరెస్ట్ చేయాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలోపాటు వనజాక్షి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే ప్రభాకర్ను అరెస్ట్ చేసేంత వరకు విధులను బహిష్కరిస్తామని రెవెన్యూ ఉద్యోగులు ఇప్పటికే ప్రభుత్వాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు బాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఎమ్మెల్యే ప్రభాకర్కు ప్రభుత్వం షోకాజ్ నోటిసులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు ఎమ్మెల్యే చింతమనేని కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.