
ఎమ్మార్వో వనజాక్షి
ఏలూరు: ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పశ్చిమగోదావరి జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విద్యాసాగర్ అన్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను ప్రభుత్వ విప్ పదవి నుంచి తొలగించి శుక్రవారం ఉదయంలోగా అరెస్ట్ చేయకుంటే పుష్కరాల విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఉద్యోగులు తిరగబడితే ప్రభుత్వం కూలుతుందన్నారు.
సాక్షాత్తూ ప్రభుత్వ విప్ దాడికి పాల్పడితే ఉద్యోగులు ఎవరికి మొరపెట్టుకోవాలని ప్రశ్నించారు. 'మీరు చెప్పినట్టు చేస్తున్నాం. మీరు తిడుతుంటే పడుతున్నాం. అలా అని కొడతారా' అని నిలదీశారు. ఈ ప్రభుత్వంలో తమకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. చింతమనేని నేర చరిత్ర గురించి పశ్చిమగోదావరి జిల్లా ప్రజానీకానికి తెలుసునని చెప్పారు. తన సామ్రాజ్యానికి అడ్డొచ్చిన వారిపై దాడులు చేయడం చింతమనేనికి మామూలేనని అన్నారు.
నిన్న సంఘటనా స్థలంలో ఉన్న పోలీసు ఎస్సై చోద్యం చూశారని, ఆయనను ముందుగా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇసుక మాఫియా డబ్బులతోనే ప్రజలను, మహిళలను ఉసిగొల్పి ఈరోజు కలెక్టరేట్ కు ధర్నాగా పంపారని విద్యాసాగర్ ఆరోపించారు.