మహిళా తహసిల్దార్లపై టీడీపీ నేతల రాజకీయం
బుట్టాయగూడెం తహసిల్దార్ ఆసిఫాపై
బదిలీ వేటు వేసేందుకు యత్నాలు
రెవెన్యూ రికార్డుల తారుమారును అడ్డుకున్న ఫలితం
అక్రమార్కులకు టీడీపీ నేత అండ
ఏలూరు : ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేయాలని చూసిన కృష్ణాజిల్లా తహసిల్దార్ వనజాక్షిపై దాడిచేసి.. ఆనక తప్పంతా ఆమెపైనే నెట్టేసిన టీడీపీ నేతలు ఇప్పుడు మరో మహిళా తహసిల్దార్‌పైనా అలాంటి రాజకీయాలే ప్రయోగిస్తున్నారు. రెవెన్యూ రికార్డులు తారుమారు చేసిన అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. అక్రమాలను వెలుగులోకి తెచ్చిన బుట్టాయగూడెం తహసిల్దార్ ఆసిఫాను బదిలీ చేయించేందుకు కుట్రలు పన్నుతున్నారు. బుట్టాయగూడెంలో రెండు నెలల క్రితం బయటపడిన నకిలీ పాస్ పుస్తకాల కుంభకోణంలో పాత్రధారులు, సూత్రధారులకు అండగా నిలుస్తూ తహసిల్దార్‌ను బలి చేసేందుకు పావులు కదుపుతున్నారు.
నకిలీ పాస్ పుస్తకాలు, రెవెన్యూ రికార్డులు సృష్టిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో బుట్టాయగూడెంలో బాజీ అనే యువకుడి ఇంటిపై ఏప్రిల్ 30న తహసల్దార్ ఆసిఫా ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు దాడులు చేపట్టారు. రెవెన్యూ కార్యాలయంలో ఉండాల్సిన రికార్డులన్నీ గతంలో వీఆర్‌ఏగా పనిచేసిన బలాల్ సాహెబ్ కుమారుడైన బాజీ ఇంట్లో లభ్యమయ్యాయి. అతని ఇంటినుంచి జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, సివిల్ సప్లయ్స్ రిజిస్టర్‌లు, పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై నిష్కర్షగా విచారణ జరిపిన తహసిల్దార్ ఆసీఫా తెరవెనుక సూత్రధారులపై కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు.
సూత్రధారి మాజీ ఎమ్మార్వోనే
కుంభకోణంలో పాత్రధారి బాజీ కాగా.. ప్రధాన సూత్రధారి బుట్టాయగూడెంలోనే పనిచేసిన ఓ మాజీ ఎమ్మార్వోనేనని అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. మాజీ ఎమ్మార్వో, ప్రస్తుతం తహసిల్దార్ కార్యాలయంలో కీలక విభాగంలో పనిచేస్తున్న ఆయన బంధువు అండతోనే బాజీ ఇష్టారాజ్యాంగా రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారన్న వాదనలు ఉన్నాయి. ఈ ముగ్గురూ కలసి విలువైన భూముల రికార్డులను మాయం చేశారన్న ఆరోపణలున్నాయి. సదరు మాజీ ఎమ్మార్వో ఇక్కడ పనిచేస్తున్న కాలంలోనే అవినీతి ఆరోపణలు రావడంతో సీబీసీఐడీ విచారణ ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆయన సతీమణి టీడీపీ తరఫున స్థానికసంస్థల ప్రజాప్రతినిధిగా ఉండటంతో అడ్డూఅదుపు లేకుండా తహసిల్దార్ కార్యాలయాన్ని అక్రమాల అడ్డాగా మార్చివేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వీరి ఆగడాలకు చెక్ పెట్టాలని చూస్తున్న తహసిల్దార్ బదలీ కోరుతూ ఏలూరుకు టీడీపీ నేతను ఆశ్రయించినట్టు తెలిసింది.
రెండు నెలలైనా చర్యల్లేవ్
బాజీ భాగోతం వెలుగులోకి వచ్చి రెండు నెలలైనా ఉన్నతాధికారులు కనీస మాత్రంగానైనా స్పందించకపోవడం వెనుక ఏలూరుకు చెందిన టీడీపీ సీనియర్ నేత ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ కుంభకోణంలో పాత్రధారులు, సూత్రధారులను వెనకేసుకుని వస్తున్న టీడీపీ నేత ఇప్పుడు అక్కడి తహసిల్దార్ ఆసిఫాను బదిలీ చేయాలంటూ ఉన్నతాధికారుల వద్ద పట్టుబడుతున్నట్టు సమాచారం. పక్కా ఆధారాలతో అక్రమాలు బయటపెట్టిన తహసిల్దార్ లక్ష్యంగా టీడీపీ నేతలు చేస్తున్న రాజకీయం ఎటువైపు వెళ్తుందో చూడాలి.
అక్కడ వనజాక్షి.. ఇక్కడ ఆసిఫా
Published Sat, Aug 1 2015 3:01 AM | Last Updated on Thu, Apr 4 2019 2:48 PM
Advertisement