నేరానికి హద్దుల ముసుగేస్తారా?
పరిధి దాటి పోతే దొంగను వదిలేయాలా?
ముసునూరు వ్యవహారంలో ముఖ్యమంత్రి వింత భాష్యాలు
అయినా తహశీల్దారు ‘హద్దు’ దాటలేదు
దాడి జరిగిన ప్రాంతం ముసునూరు పరిధిలోనిదే..
శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి పచ్చి అబద్దం
ఎమ్మెల్యేని కాపాడుకునేందుకే హద్దులపై అవాస్తవాలు
ఎన్నో ఏళ్లుగా వివాదంలో బలివె ఇసుక రేవు
తాత్కాలిక హద్దుల ప్రకారం ఇసుక క్రయవిక్రయాల అధికారం ముసునూరుకే..
నాటి గొడవపై ఐఎఎస్ విచారణ నివేదికా అందలేదు
అయినా తహశీల్దారు వనజాక్షిదే తప్పిదమని తేల్చేసిన సీఎం
సాక్షి, హైదరాబాద్: ఆ తహశీల్దారు ఒక మహిళ. ఒక ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతుండగా తెలిసి ప్రాణాలకు తెగించి అడ్డుకుని ప్రజాధనాన్ని దోచుకుపోకుండా కాపాడడానికి ఆమె ప్రయత్నించారు. మహిళ అయినా ధైర్యంగా వ్యవహరించిన ఆ అధికారిణిని మెచ్చుకోవలసింది పోయి ఆ ప్రాంతం నీ పరిధిలో లేదంటూ ఆమెను ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుబట్టడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి చెప్పేది ఎలా ఉందంటే... దొంగను పట్టుకోవడానికి వెంటాడే పోలీసు తన పరిధి దాటగానే ఆగిపోవాలన్నట్లుంది. పరిధుల గురించి ముఖ్యమంత్రి మాట్లాడడం చూస్తుంటే ఆయన చట్టాన్ని గౌరవిస్తున్నారా.. లేక దొంగకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారా అన్న సందేహం రావడం సహజమే.
తహశీల్దారు ద్రోణవల్లి వనజాక్షి తన పరిధిలో లేని ప్రాంతానికి వెళ్లి తప్పిదం చేశారని ముఖ్యమంత్రి శాసనసభ సాక్షిగా అభాండాలు వేయడం ఈ కోవలోకే వస్తుంది. నిజంగానే తహశీల్దారు తన పరిధిలో లేని ప్రాంతానికి వెళ్లారా.. అని చూస్తే.. అది కూడా అబద్దమేనని తేలింది. ఇసుక అక్రమంగా తవ్వుతూ ప్రజాధనానికి గండి కొట్టడమే కాక తహశీల్దారుపై దాడి చేసిన తన పార్టీ ఎమ్మెల్యేని కాపాడుకోవడం కోసం తమ్మిలేరులో హద్దులను తన అబద్దాలతో చెరిపేయడానికి ముఖ్యమంత్రి ప్రయత్నించడం గమనార్హం.
అది ముసునూరు పరిధిలోనిదే...
కృష్ణా జిల్లా ముసునూరు మండలం బలివె పంచాయతిలోని రంగంపేట, పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం విజయరాయి మధ్య తమ్మిలేరులో సరిహద్దు వివాదం దశాబ్దాలుగా నలుగుతోంది. సారా పాటలు, ఇసుక రేవు అంశాల్లో ఇరు ప్రాంతాల మధ్య విభేదాలు ఉన్నాయి. గతంలో ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు హయాంలో సారా పాటలు జరిగాయి. ప్రస్తుతం ఇసుక వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచిన హద్దుకు సుమారు రెండు వందల మీటర్ల అవతల (పశ్చిమగోదావరి జిల్లా) వరకు రంగంపేట పరిధి (అంటే ముసునూరు మండలం పరిధి)లోకి వస్తుందని గతంలోనే అధికారులు నిర్ణయానికి వచ్చారు. దాన్నే తాత్కాలిక హద్దుగా నిర్ణయించారు. ఆ ప్రాంతంలోని ఇసుక విక్రయాలకు సంబంధించిన ఆదాయం స్థానిక సంస్థల వాటా కింద ముసునూరు మండలానికే ఎపుడూ అందుతుందని స్థానిక నాయకులు, అధికారులు స్పష్టంగా చెపుతున్నారు.
అయితే వనజాక్షి వివాదం తర్వాత కృష్ణాజిల్లా రంగంపేట (బలివె), పశ్చిమగోదావరి జిల్లా విజయరాయి గ్రామాల మధ్య సరిహద్దును ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చేసి చెబుతున్నది. బలివె గ్రామంలో సర్వేనెంబర్లు 201, 202, 203 ఉన్నాయి. ఇందులో సర్వేనెంబరు 203 స్మశానవాటికగా రంగంపేట గ్రామస్తులు ఎన్నో ఏళ్లుగా వినియోగిస్తున్నారు. ఆ స్మశాన ప్రాంతం విజయరాయి గ్రామానికి చెందిందని ప్రభుత్వం తాజాగా చెబుతోంది. దీన్ని రంగంపేట గ్రామస్తులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.
అసలు ఆ రోజు ఏం జరిగిందంటే...
ముసునూరు మండలం రంగంపేట వద్ద తమ్మిలేరు నుంచి ఇసుక అక్రమంగా తరలించుకుపోతున్నారని తహశీల్దారుకు జులై 8వ తేదీ ఉదయం 9.30 గంటల సమయంలో స్థానికుల నుంచి ఫోన్లో ఫిర్యాదులు అందాయి. విజయవాడలోని కలెక్టరు క్యాంపు కార్యాలయంలో అటవీ భూములపై ఉమ్మడి సర్వేకి సంబంధించి రెవెన్యూ, అటవీశాఖల సమావేశంలో పాల్గొనేందుకు తహశీల్దారు మార్గమద్యంలో ఉన్నారు. తనతో పాటు ఉన్న సర్వేయరుతో చర్చించగా ఆ ప్రాంతం ముసునూరు పరిధిలోకి వస్తుందని, గత మాసంలో నిర్వహించిన సర్వేలో తాత్కాలిక నిర్ణయం జరిగిందని వివరించారు.
దీంతో ఇసుక అక్రమ రవాణాను నిలిపివేయాలని వీఆర్వో, ఆర్‌ఐలను వనజాక్షి ఆదేశించారు. మీరెవరు చెప్పడానికంటూ ఇసుకాసురులు దౌర్జన్యం చేసి వారిని ఓ గదిలో నిర్భందించారు. విజయవాడలో సమావేశం ముగిసిన తరువాత అక్కడ జరిగిన సంఘటనలు తెలుసుకున్న తహశీల్దారు కలెక్టరుకు పరిస్థితిని వివరించారు. కలెక్టరు సూచనలతో సంఘటనా స్థలానికి చేరుకుని తమ సిబ్బందికి ఆమె మద్దతుగా నిలిచారు. అప్పుడే ఇసుకాసురులు తహశీల్దారుపై దౌర్జన్యానికి దిగారు.
కమిటీ ఏం చెప్పకున్నా చంద్రబాబు అత్యుత్సాహం..
ఇసుక వివాదంపై విచారించి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి జేసీ శర్మ నేతత్వంలో కమిటీని ప్రభుత్వం నియమించింది. కమిటి సభ్యునిగా సెర్ప్ సీఈవో సాల్మన్ ఆరోగ్యరాజ్ కూడా విచారణకు వెళ్లారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, తహశీల్దారు వనజాక్షి సహా 25 మందిని విచారించారు. అయితే ఆ కమిటీ ప్రభుత్వానికి ఇంకా నివేదిక ఇవ్వలేదు. కానీ చంద్రబాబు మాత్రం తహశీల్దారుదే తప్పంటూ తీర్పు చెప్పేశారు.