నాపైనే దాడి జరిగితే సామాన్యులకేది రక్షణ..? | Tahasildar Vanajakshi Special Interview on Lok Sabha Election | Sakshi
Sakshi News home page

నాపైనే దాడి జరిగితే సామాన్యులకేది రక్షణ

Published Thu, Apr 4 2019 8:26 AM | Last Updated on Thu, Apr 4 2019 1:20 PM

Tahasildar Vanajakshi Special Interview on Lok Sabha Election - Sakshi

స్వప్రయోజనాలు ఆశించే ఏ నాయకత్వమైనా బాధితులకు, ఉద్యోగులకు న్యాయం చేస్తుందని ఎలా అనుకోగలం?  ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి పట్ల ఒక మంత్రి వ్యవహార శైలిని రాష్ట్ర పెద్ద దృష్టికి తీసుకెళితే ఏం జరిగింది?మహిళలు, యువతులు, ముక్కుపచ్చలారని బాలికలపై వెలుగు చూడని అకృత్యాలెన్నో..  మహిళలపై ప్రజాప్రతినిధుల నేరాల్లో మన రాష్ట్రం టాప్‌లో ఉందని పలు నివేదికల్లో వెల్లడైంది..

ఇసుక దోపిడిని అడ్డుకునేందుకు వచ్చినతహశీల్దార్‌పై దాడి... ఈ రాష్ట్ర రైతన్నలపై..ఈ రాష్ట్ర పంటలపై.. ఈ రాష్ట్ర జలవనరులపై..ఈ రాష్ట్ర పర్యావరణంపై.. ఈ రాష్ట్ర భావితరాలపైదాడి! ఇసుక దోపిడీతో రాష్ట్రంలోని కొందరులక్షలు, కోట్లు కొల్లగొట్టుకుంటూరాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీస్తున్నారు.భావితరాలకు తప్పనిసరైననీటి వనరులు ఎండిపోతే.. పంటలుపండకపోతే.. పర్యావరణ సమతుల్యతదెబ్బతింటే.. 70 శాతం వ్యవసాయంపైఆధారపడి జీవిస్తున్న రైతన్నలు ఏం కావాలి?కరవు కాటకాలతో ఏటేటా అల్లాడుతున్నఆంధ్రప్రదేశ్‌ ఏమవ్వాలి..? అనేది పాలకులు,ఇసుక దోపిడీదారులు ఒక్క క్షణమైనాఆలోచిస్తున్నారా? అన్నదే ఈనాటి సూటి ప్రశ్న .

ప్రజాప్రతినిధులేఇష్టానుసారంవ్యవహరిస్తుంటే.. వారినిసరిదిద్దలేని ముఖ్యులు అయిదుకోట్ల మంది రక్షణ బాధ్యతకుఏం భరోసా ఇవ్వగలరు?ఈ కోణంలో ప్రజలుఆలోచించరని అనుకుంటేఎలా? తప్పులు చేసిన వారిపైనచర్యలు తీసుకుంటే..మరొకరు అలా దురుసుగా,బాధ్యతారహితంగాప్రవర్తించగలరా?

నాగా వెంకటరెడ్డి, సాక్షి ప్రత్యేక ప్రతినిధి:ఇసుకను ట్రాక్టర్లలో అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆ రోజు ఫోన్‌ వచ్చింది. విజయవాడలో కలెక్టరుగారి మీటింగ్‌లో ఉన్నా. అడ్డుకుని పోలీస్‌ స్టేషన్‌కు అప్పగించాలని ఆర్‌ఐ, వీఆర్వోకు సూచించా. వారిపై దాడి జరిగిందని కలెక్టర్, జేసీల దృష్టికి తీసుకెళ్లగానే.. మీరు వెళ్లి ఆపేయండన్నారు. సంఘటనా స్థలానికి వెళ్లి ఇసుక తీసుకెళ్లొద్దని, హద్దుల తేడాలుంటే.. సర్వేయర్ల ద్వారా నిర్ధారించుకున్న తరువాత నిర్ణయానికి వద్దామని కోరా. వాదనలు జరుగుతున్నప్పుడే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ డ్వాక్రా మహిళలతో సహా మందీ మార్బలంతో వచ్చారు. ఎమ్మెల్యే ఆదేశాలతో
ఇసుకతో నింపిన ట్రాక్టర్లు కదిలాయి. అక్కడే వాటికి అడ్డంగా కూర్చోవడంతో పరుష పదజాలంతో దాన్ని ఈడ్చిపారేయండిరా అంటూ.. మహిళలను ఎమ్మెల్యే గారు ఉసిగొల్పారు. అన్నింటికన్నా అత్యంత బాధాకరమైన అంశం ఏంటంటే.. ఆ రోజంతా అక్కడ ఎస్‌ఐ ఉన్నారు. ప్రేక్షకపాత్ర పోషించారు.   

ఇసుక ట్రాక్టర్లను అడ్డుకోవడం నాకు కొత్తేమీ కాదు
ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్లను అడ్డుకోవడం నాకు ఆ రోజు కొత్తేమీ కాదు. అర్ధరాత్రి వేళల్లో కూడా పదులసార్లు వెళ్లి పదుల సంఖ్యలో ట్రాక్టర్లను స్టేషన్‌కు చేర్చి రెండన్నర లక్షల రూపాయలు ఫైన్‌ వేసి రాబట్టా. ఇసుక విషయంలో అంత గట్టిగా ఉండటానికి బలమైన కారణాలు ఉన్నాయి. ముసునూరు మండలంలోని 16 గ్రామాల్లో 11 గ్రామాలు డార్క్‌ ఏరియాలోకి చేరాయి. 800 నుంచి 1000 అడుగులు లోతు బోర్లు వేస్తేగాని భూగర్భ జలాలు అందని పరిస్థితి. తమ్మిలేరు హద్దుగా మండలం ఉందనేగాని నీటి జాడ తక్కువ. నీళ్లు లేక నష్టపోయామనే రైతుల కన్నీటి ఆవేదన దాదాపు ప్రతిరోజూ వినాల్సి వచ్చేది. తమ్మిలేరుతో సహా పరిసరాల్లోని జలవనరుల్లో నీటి చెమ్మ కనిపించేది కాదు. ఇసుక ఇంకా ఇంకా తోడేస్తుంటే.. చివరకు తాగడానికి కూడా ఆ ప్రాంత ప్రజలకు నీళ్లుండవని గ్రహించా. సాధ్యమైనంత వరకు ఇసుక రవాణాను నియంత్రించాలనేది నా ఆలోచన.

మహిళలపై ప్రజాప్రతినిధుల నేరాల్లో రాష్ట్రం టాప్‌
రాష్ట్రంలో మహిళల పరిస్థితి గురించి నేను చెప్పేది, చెప్పాల్సింది ఏముంది?ఒక రిషితేశ్వరి, ఒక వనజాక్షి... కాల్‌మనీ కేసులు... ఇంతకన్నా ఇంకేం చెప్పాలి. 2018 మార్చి2వ తేదీ ఐక్యరాజ్య సమితి కమిటీ విడుదల చేసిన నివేదికప్రకారం–మహిళల అక్రమ రవాణాలో దేశంలోనే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ ఉంది. ఏడీఆర్‌ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం–మహిళలపై నేరాలకు పాల్పడుతున్న  ప్రజా ప్రతినిధులున్న రాష్ట్రాల్లో మన రాష్ట్రం టాప్‌లో ఉందని చూశాను. ఇతర నివేదికలు ఇంతకన్నా ఎక్కువ గణాంకాలతోనే వివరిస్తున్నాయి. నా సంగతి అలా ఉంచండి.  ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి పట్ల ఒక మంత్రి వ్యవహారశైలిని రాష్ట్ర పెద్ద దృష్టికి తీసుకెళితే ఏం జరిగింది? ఒక పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ అధికారిని విజయవాడ నడిబొడ్డున ప్రభుత్వ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు బెదిరిస్తే, గన్‌మెన్‌పై చేయిచేసుకుంటే.. పరిస్థితి ఏంటో మీడియాలో చూశాం. ఇక మహిళలు, యువతులు, ముక్కుపచ్చలారని బాలికలపై ఎన్నెన్ని అకృత్యాలు జరుగుతున్నాయో.. వాటిలో అసలు ఎన్ని వెలుగుచూస్తున్నాయి? బాధితుల పట్ల బాధ్యత తీసుకుని వాటిని వెలుగులోకి తీసుకొచ్చి న్యాయం జరిగేంత వరకు కృషి చేయాల్సిన మీడియా.. ఎంతవరకు ఆ పని చేస్తుందనేది వారి మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. సోషల్‌ మీడియా యాక్టివ్‌గా ఉంది కాబట్టి సరిపోతోంది.

నాలుగున్నరేళ్లలో 5 బదిలీలు
గడచిన నాలుగన్నరేళ్లలో అయిదు బదిలీలు అయ్యాయి.ముసునూరు తహశీల్దారుగా 2014 జూన్‌ నుంచి 2016 జూన్‌ వరకు పనిచేశా. ఈ సమయంలోనే తమ్మిలేరు వద్ద ఇసుక రగడ జరిగింది. ఆ తర్వాత నూజివీడు తహశీల్దారుగా బదిలీ చేశారు. తరువాతనూజివీడు సబ్‌ కలెక్టరు కార్యాలయానికి మార్చారు. ఎన్నికల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి తహశీల్దారుగా బదిలీ అయ్యా. అక్కడ కేవలం 11 రోజులే పనిచేశా. ఎన్నికల సమయంలో మాకు ఈ తహశీల్దారు వద్దని అధికారపార్టీ నాయకుడు చెప్పడంతో.. కాకినాడ కలెక్టరేట్‌కు బదిలీ అయింది.  నూజివీడులో ఉన్నప్పుడు ఏసీబీ దాడులు చేయించడానికి విశ్వప్రయత్నాలు జరిగాయి. ఫలించక మౌనం వహించారు. ఇతరులతో ఫిర్యాదులు చేయించారు. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుకు యోచించారు కూడా. తమ్ముడు వేలేరులో ఇల్లు కట్టుకుంటే.. అభ్యంతరం చెప్పారట. ఇసుక దోపిడీని అడ్డుకోవడమంటే అది ప్రభుత్వ వ్యతిరేక చర్యనా? 

ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలా? లేదా?  
నేను ఒక్కదాన్ని అడ్డుకుంటేనే ఇసుక అక్రమ రవాణా ఆగిపోదు. కానీ ఎవరో ఒకరు అడుగు ముందుకు వేయాలి కదా. నాది తహశీల్దారు స్థాయే. కానీ రాష్ట్రంలో నా కన్నా పై స్థాయిలో ఆర్డీవోలు, జాయింట్‌ కలెక్టర్లు, కలెక్టర్లు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు, ప్రభుత్వ పెద్దలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారు సరైన నిర్ణయాలు తీసుకుంటే.. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుపడుతుందనేది నా ఆలోచన. కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార.. ఇలా రాష్ట్రంలోని నదులు, వాగులు, వంకలు అన్నింటి నుంచి వందల సంఖ్యలో ట్రాక్టర్లు, లారీల్లో ఇసుక తరలిపోతుంటే జలవనరులు ఏమవ్వాలి? భూగర్భ జలాలు ఎంత లోతుకు పడిపోతాయి? ఈ విషయాలను ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలా? లేదా? 

ఇంకెన్ని ఆపాదించేవారో
ప్రజలకు సేవ చేయాలని రెవెన్యూ సర్వీస్‌కు వచ్చా. వచ్చే సంపాదనతో హాయిగా గడిపేద్దామనేఆలోచన నాకు లేదు. నాకు సబ్‌రిజిస్ట్రార్, ఏసీటీవో, ఎక్సైజ్, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌... తదితర విభాగాలకు కూడా ఆప్షన్‌ ఉన్నా ఆలా చూడలేదు. మాది కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరు గ్రామం. ముగ్గురం ఆడపిల్లల్లో నేనే పెద్దదాన్ని. ఒక తమ్ముడు. నన్ను ఐఏఎస్‌ అధికారిగా చూడాలని అమ్మ కోరుకునేది. కానీ పదో తరగతితోనే చదువు చాలని నాన్న కట్టడి చేశారు. పెళ్లయ్యాక చాలా కాలానికి చదువు ఆరంభించి ఉద్యోగం సంపాదించుకున్నా. ఇక్కడో విషయం స్పష్టం చేయాలి.. నేను మరేదైనా సామాజికవర్గానికి చెందిన అధికారిణై ఉంటే ఇంకెన్ని ఆపాదించేవారో!

ఎన్నో బెదిరింపులు,హెచ్చరికలు వచ్చాయి. ఆకాశరామన్న ఉత్తరాలు రాశారు. పార్టీపై పిచ్చి అభిమానంతో కొందరు వాస్తవాలు తెలుసుకోకుండా.. ఫేస్‌బుక్‌లో, వాట్సాప్‌ల్లో ఏవేవో కామెంట్లు. మీ కామెంట్లకు మీరు నిలబడతారా? అని నా తరఫు వాళ్లు ప్రశ్నించడంతో.. ఆ తరువాత వెనక్కు తగ్గారు. నేనేమీ పెద్దఆఫీసర్‌ను కాదు. నాయకురాలిని కూడా కాదు. ఒకవేళ నాకు పలుకుబడి ఉంటే.. నాలుగన్నరేళ్లలో అయిదు బదిలీలు కావు కదా? నేనేమైనా సంపాదించానా? కోట్లుకూడపెట్టుకున్నానా?

కుటుంబంఅండగా నిలిచింది
ఇదంతా చూసి ఒక్క క్షణం బాధ అనిపించింది. నేనేం తప్పు చేశానని భయపడాలి. ఎందుకు ఆందోళన చెందాలి? నిజాయితీగా, ముక్కుసూటిగా ఉన్నప్పుడు ఇలాంటివి తప్పవని, కాసే చెట్టుకే రాళ్లు పడతాయని నాకు నేను సర్దిచెప్పుకున్నా. నా భర్త, కుటుంబం ధైర్యం చెప్పారు. ముఖ్యంగాఖరగ్‌పూర్‌ ఐఐటీలో చదువుకుంటున్న నా ఒకే ఒక్క కుమారుడు సంఘటన గురించి తెలియగానేనా వద్దకు వచ్చేశాడు. అప్పుడు ఇక్కడే ఉన్నాడు. ఏం ఫర్వాలేదమ్మా. ఇలాగే పనిచెయ్‌. నిజాయితీగా ఉండు. ఏమైతే అదే కానీయ్‌ చూద్దాం.. అంటూ ధైర్యం చెప్పాడు. నాతోనే ఉన్నాడు. కుటుంబసభ్యులు అందరు, కొందరు సహచర ఉద్యోగులు నాకు అండగా నిలిచారు. చట్టం ప్రకారం వెళదామన్నారు.  

భావితరాల భవిష్యత్తేంటి?
ఎక్కువగా ఇసుక తోడేయడం వలన, నీటిలభ్యత తగ్గుతుంది.భూగర్భ జలాలు అడుగంటుతాయి. ముసునూరు మండల రైతులకన్నీళ్లను, వారి బాధలను నేరుగా చూశా. నేను ఒక రైతు బిడ్డను. ప్రకృతి ప్రేమికురాలిని. పర్యావరణం బాగుండాలని కోరుకునేదాన్ని. మనం అన్నీ సంపాదించుకోవచ్చు. పర్యావరణం పాడైపోతే భవిష్యత్తు ఏమవుతుంది? భావితరాల భవిష్యత్తేంటి?  అంతెందుకు సీఎం గారి నివాసం పక్కన కృష్ణా నదిలో ఇసుకను దారుణంగా తోడేస్తున్నారని, ఇది పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తుందని, ఇసుక రవాణాను నిలిపేయాలని ప్రముఖ పర్యావరణవేత్త మేథాపాట్కర్‌ డిమాండ్‌ చేశారు. ఆమె అక్కడ నేరుగా చూసిన తరువాతే.. రాబోయే ప్రమాదాన్ని గుర్తించే  చెప్పారు.

అదేవిధంగా నీటివనరుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణఉద్యమకారులు రాజేంద్రసింగ్‌ రాజధాని ప్రాంతంలో, కృష్ణా,గోదావరి నదులను చూశారు. ఇసుకను ఇష్టానుసారం తోడేయడాన్ని తప్పుపట్టారు. రాష్ట్రంలోని ఇతర నదులు, వాగులు, వంకలు..అన్ని చోట్లా జరుగుతున్న ఇసుక దందా అంతా ఇంతా కాదు.

రూల్‌ ప్రకారం వెళితే ఏమీ కాదుఉద్యోగస్తులు ఎవరికీ అనుకూలం,ఎవరికీ వ్యతిరేకం కాదు. మనం ఏదో ఒకవైపు పనిచేస్తున్నామని రూఢీ అయితే ఎదుటి పక్షం నుంచి తిప్పలు తప్పవు. రూల్‌ ప్రకారం వెళితే ఏమీ కాదు. మహా అయితే బదిలీలు. ప్రజల నుంచి మన్ననలు. మహిళలు ఏ విషయాల్లోనూ, ఏ పరిస్థితుల్లోనూ దేనికీ లొంగవద్దు. కుంగిపోవద్దు.ఆదర్శప్రాయంగా ఉండాలి. ప్రతితల్లి తన బిడ్డకు మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ ఇప్పించాలి. తనను రక్షించుకునే శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. సమాజం మనల్ని గౌరవించే స్థితిలోకి చేరుకోవాలి.

వృద్ధాశ్రమంప్రారంభించాలని ఉంది
రాజకీయాల్లోకి ఆహ్వానించారు. కాని వాటికి ఇప్పుడు ఓ నమస్కారం. నిరాదరణకు గురవుతున్న వృద్ధులకు ప్రకృతి ఒడిలో సేదతీరేలా మంచి వృద్ధాశ్రమం నిర్మించి నిర్వహించాలనే ఆశ ఉంది. ఇప్పటికి మాత్రం నాకు చేతనైనంతలో అయిదుగురు ఆడబిడ్డల చదువుకు సహకరిస్తున్నా. ఇద్దరు జీవితంలో సెటిల్‌ అయ్యేలా చదువు, శిక్షణ ఇప్పించా. ఒకరిని దత్తత తీసుకున్నా... ఏది ఏమైనా మనం సంపాదించింది మనం మాత్రమే తినకూడదు. ఎంతో కొంత అవసరమైన వారికి ఉపయోగపడేలా.. అలా ముందుకు.. మున్ముందుకు.. అంతే.

ప్రజాప్రతినిధులేఇష్టానుసారంవ్యవహరిస్తుంటే
రాజ్యాంగ వ్యవస్థలో ఒకబాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నప్పుడు తప్పులను సరిదిద్దడం బాధ్యత. ఇక్కడ హోదా,  కులం, మతం... అవన్నీ అప్రస్తుతం. నేను మహిళను. ఉద్యోగిని. చట్టం అమలుకు నాకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చానా? లేదా? అన్నది చూడాలి. అందులో తప్పులుంటే చర్యలు తీసుకోవాలి. లేదంటే బాధ్యులను సరిదిద్దాలి. ప్రజాప్రతినిధులే ఇష్టానుసారం వ్యవహరిస్తుంటే.. వారిని సరిదిద్దలేని ముఖ్యులు అయిదు కోట్ల మంది రక్షణ బాధ్యతకు ఏం భరోసాఇవ్వగలరు? ఈ కోణంలో ప్రజలు ఆలోచించరని అనుకుంటే ఎలా? తప్పులు చేసిన వారిపైన చర్యలు తీసుకుంటే.. మరొకరు అలాదురుసుగా, బాధ్యతారహితంగాప్రవర్తించగలరా? అన్ని కోణాల్లో ఆలోచించాల్సింది, చూడాల్సింది మాత్రం పెద్దలే. ఇక కొందరు ఉద్యోగ సంఘాల నాయకుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో. స్వప్రయోజనాలు ఆశించే ఏ నాయకత్వమైనాబాధితులకు, ఉద్యోగులకు న్యాయం చేస్తుందని ఎలా అనుకోగలం?! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement