
సాక్షి, పశ్చిమ గోదావరి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దాంతో జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌పై రికార్డు విజయం సాధించిన కొఠారు అబ్బయ్య చౌదరిని అభినందించేందుకు కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ.. తన గెలపుకు కారణమైన దెందులూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. చింతమనేని పదేళ్ల పాలనపై విసుగెత్తి పోయిన దెందులూరు ప్రజలు ఓటు రూపంలో తీర్పునిచ్చారని తెలిపారు.
వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అందరికీ చేరువ చేస్తానని పేర్కొన్నారు. ప్రజలందరికి అందుబాటులో ఉంటానన్నారు. దెందులూరును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.