abbaiah
-
వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించబోతోంది: అబ్బయ్య చౌదరి
సాక్షి,ఏలూరు: దెందులూరు నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలవబోతున్నామని, ఏలూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ క్లీన్‌స్వీప్ చేయబోతోందని దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి కొఠారి అబ్బయ్య చౌదరి అన్నారు. ఏ ఎగ్జిట్ పోల్స్ చూసినా కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభంజనం సృష్టించబోతోందని స్పష్టం చేశారు.‘నేషనల్ మీడియా సంస్థలన్నీ కేంద్రానికి భయపడి తల తోక లేని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇచ్చాయి. గత ఐదేళ్లలో జగన్మోహన్రెడ్డి మంచి చేశారనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ వైసీపీకి అధికారం కట్టబెట్టనున్నారు. రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు అందరూ పడిన కష్టం ఈనెల 4వ తారీఖున వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడంతో ఫలితం దక్కబోతోంది. గతం కంటే కూడా ఈసారి ఎక్కువ మెజార్టీ స్థానాలు రాబోతున్నాయి.రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో వరుసగా రెండవసారి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 9వ తేదీన వైజాగ్ లో ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది’అన్నారు. -
మమత వ్యాఖ్యలపై మౌనమేల బాబు?
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పెగసస్ స్పైవేర్‌ను వినియోగించడం ద్వారా అప్పటి ప్రతిపక్షంలో ఉన్న తమ నాయకుల ఫోన్లను ట్యాప్ చేసి తమను ఇబ్బందులకు గురిచేయడానికి గతంలో చంద్రబాబు ప్రయత్నించారని దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి చెప్పారు. చంద్రబాబు కుట్రను బయటపెట్టిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై పరువునష్టం దావా వేస్తామనిగానీ, ఆమె అవాస్తవాలు చెప్పారనిగానీ చంద్రబాబు, లోకేశ్ ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పెగసస్ స్పైవేర్ సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజల మొబైల్ ఫోన్లలో వారికి తెలియకుండా వారి కదలికలను, గోప్యతలను తెలుసుకోవడం ప్రధాన లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. పెగసస్ స్పైవేర్‌ను చంద్రబాబు వినియోగించడంపై ప్రధాని మోదీని కలిసి వివరిస్తామని, దీనిపై సమగ్ర విచారణ జరిపే వరకూ పోరాడతామన్నారు. ప్రజాస్వామ్య హక్కులను ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడానికి ప్రయత్నించిన తండ్రీ కొడుకులు కటకటాలు లెక్కించడానికి సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. పెగసస్‌ను కొనుగోలు చేయడానికి అప్పటి ప్రభుత్వ అధికారులను ఇజ్రాయెల్‌కు పంపడం, చంద్రబాబు పలు దఫాలు ఇజ్రాయెల్‌కు వెళ్లడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో తన ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారని ప్రశ్నించిన చంద్రబాబు దీనికి ఏమి సమాధానం చెబుతారని నిలదీశారు. గతంలో చంద్రబాబు పీఏకు చెందిన ఓ సాఫ్ట్వేర్ సంస్థ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను ఎందుకు సేకరించాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తండ్రీ కొడుకులిద్దరూ హైదరాబాద్‌లో కూర్చుని రాష్ట్ర ప్రజల వ్యక్తిగత వివరాలను దొంగచాటుగా సేకరిస్తున్నారని ఆరోపించారు. -
‘నా రాకతో నీ రాజకీయ పతనం ప్రారంభమైంది’
సాక్షి, పెదపాడు/పెదవేగి: జైలు నుంచి వచ్చిన చింతమనేని ప్రభాకర్ ఎన్నికల్లో విజయం సాధించిన చందంగా ప్రెస్‌మీట్ పెట్టడం హాస్యాస్పదంగా ఉందని దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి అన్నా రు. పెదవేగి మండలంలోని జానంపేట ఇసుక డంపింగ్‌యార్డు వద్ద ఆయన ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. చింతమనేని న్యాయం, ధర్మం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాల వల్లించినట్లుందన్నారు. అతను మీడియా సోదరులను ఏవిధంగా గౌరవించారో తెలియదా? ఆనాడు మీడియా గుర్తుకురాలేదా అంటూ ప్రశ్నించారు. ‘దమ్ముంటే జగన్, పవన్ తనపై గెలవాలని చింతమనేని సవాల్ విసిరాడు.. నేను ఆనాడే చెప్పాను.. నా రాకతో నీ రాజకీయ పతనం ప్రారంభమైందని.. చెప్పినట్లే ఓడించి అత్యధిక మెజార్టీతో గెలిచాను’ అని ఎమ్మెల్యే కొఠారు అన్నారు. ఈవీఎంలలో మోసాలతో ఓడిపోయానని చింతమనేని చెప్పడం చూస్తుంటే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేదని అర్థమవుతోందన్నారు. ఆయన వెనుక ఎస్సీ సోదరులే ఉంటారని చెబుతున్న చింతమనేని కూచింపూడి గ్రామంలో ఎస్సీ సోదరులపై దాడి చేయలేదా? వారిపై కేసులు పెట్టించలేదా అని ఎమ్మెల్యే కొఠారు ప్రశ్నించారు. 66 రోజులు జైలులో ఉన్నా చింతమనేనిలో పశ్చాత్తాపం కనిపించడం లేదని, ఆయన చేసిన తప్పులపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అంటూ సవాల్ విసిరా రు. ఆయనపై కేసులు పెట్టింది, రౌడీషీట్ ఓపెన్ చేయించింది టీడీపీలోనే కదా.. తమ నాయకుడు జగన్మోహన్రెడ్డికి ఏం సంబంధం, దమ్ముంటే చంద్రబాబును ప్రశ్నించు అని చింతమనేనికి సలహా ఇచ్చారు. తోక బ్యాచ్‌ను వేసుకుని ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో దెందులూరుకు అభివృద్ధిలో ప్రత్యేక స్థానం తీసుకువస్తామని ఎమ్మెల్యే కొఠారు అన్నారు. చేసిన మంచి పనులను అభినందించు చేతకాకపోతే ఏ ఫామ్‌హౌస్‌లోనో, ఇంట్లోనో ప్రశాంతంగా కూర్చో.. తోక జాడిస్తే కట్ చేస్తామని హెచ్చరించారు. దెందులూరు నియోజకవర్గంలో ఉన్నది జగనన్న మిత్రుడు, సైనికుడన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన గేదెలు 500లో 600లో ఉన్నాయి కదా? అవి కాసుకుంటూ జీవనం సాగించు.. పుణ్యమైనా కాస్త దక్కుతుందన్నారు. ఇష్టానుసారం మాట్లాడితే సహించం కొఠారు రామచంద్రరావు మాట్లాడుతూ చింతమనేని తన స్థాయిని మరిచి సీఎం జగన్మోహన్రెడ్డిపై ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదన్నారు. టీడీపీ హయాంలో అనుకూలురైన పోలీసులను అడ్డం పెట్టుకుని ఎంతో మంది మహిళలను చింతమనేని పోలీస్‌స్టేషన్‌లో పెట్టించలేదా? తహసీల్దార్ లీలాప్రసాద్‌ను సీఈఓ ముందు చెంప మీద కొట్టలేదా? మంత్రి వట్టి వసంతకుమార్‌పై దాడిచేయలేదా? అంటూ ప్రశ్నించారు. అక్రమాస్తులు లేవని సెంట్ కూడా ఆక్రమించలేదని చింతమనేని చెబుతున్నారని, 3.50 ఎకరాల ఉన్న చింతమనేని తండ్రికి వేల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చా యని ప్రశ్నించారు. మీ దగ్గరేమైనా మంత్రదండం ఉందా అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీ, హైదరాబాదుతో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను రుజువు చేస్తామని చెప్పారు. -
చింతమనేని..గతాన్ని మరిచిపోయావా..?
సాక్షి, పశ్చిమగోదావరి: జైలు నుంచి బయటకు వచ్చిన చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని దెందులూరు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో మీడియాపై చేసిన దాడులు గుర్తుకు రాలేదా అని నిప్పులు చెరిగారు. ‘నియోజకవర్గంలో దళితులపై దాడులు చేయలేదా..? ఎంత మంది పేదల ఇళ్లు కూల్చారో మారిచిపోయావా.. నీపై అక్రమ కేసులు పెట్టానని అంటున్నావ్ వాటిపై బహిరంగ చర్చకు సిద్ధమా’ అంటూ సవాల్ విసిరారు. చింతమనేనిపై పెట్టిన కేసులన్నీ చంద్రబాబు ప్రభుత్వంలో నమోదు అయినవేనని పేర్కొన్నారు. దెందులూరు నియోజకవర్గంలో జరిగే అభివృద్ధికి సహకరించాలని కోరారు. అభివృద్ధిని అడ్డుకుంటే సహించమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాట్లాడే అర్హత చింతమనేనికి లేదన్నారు. రాష్ట్రంలోనే దెందులూరును మోడల్ నియోజకవర్గం గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఇసుక, మట్టిని విచ్చలవిడిగా దోచుకున్నారు.. సీఎం వైఎస్ జగన్‌ను విమర్శించే స్థాయి చింతమనేనికి లేదని వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు ధ్వజమెత్తారు. నీ తండ్రికి మూడున్నర ఎకరాలు మాత్రమే ఉందని.. నేడు నీకు వేల కోట్లు ఎలా వచ్చాయని చింతమనేనిని ప్రశ్నించారు. అధికారులు, మహిళలపై దాడులకు దిగడంతో పాటు, సమావేశంలో వట్టి వసంతకుమార్‌పై కూడా దాడి చేయలేదా అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక, మట్టి విచ్చలవిడిగా దోచుకున్నారని ధ్వజమెత్తారు. చింతమనేని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాపై 13 తప్పుడు కేసులు పెట్టారన్నారు. -
దారి తప్పి లోకేష్ ఏలూరుకు: అబ్బయ్య చౌదరి
సాక్షి, పశ్చిమ గోదావరి: పాదయాత్రలో పామాయిల్ రైతులు తమ సమస్యలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లారని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్పందించిన సీఎం జగన్ వ్యవసాయశాఖ మంత్రిని పంపించి.. దేశంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. గురువారం అబ్బయ్య చౌదరిని దెందులూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంతో మీడియాతో మాట్లాడుతూ.. ఆయిల్ ఫామ్ రైతులే ఫ్యాక్టరీ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఐదు నెలల్లో నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని వ్యాఖ్యానించారు. నిరక్షరాస్యతలో ఆంద్రప్రదేశ్ చివరి స్థానంలో ఉందని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థను మరింత అభివృద్ధి చేసేందుకు ‘నాడు నేడు’ కార్యక్రమాన్ని చేపట్టామని అబ్బయ్య తెలిపారు. దారి తప్పి టీడీపీ నేత లోకేష్ ఏలూరు వచ్చి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ కేసులు పెడుతున్నారంటూ మాట్లాడటం సిగ్గుచేటు అని మండ్డిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చింతమనేనిపై కేసులు నమోదయ్యాయి అని తెలిపారు. అప్పుడు అధికారంలో ఉండటంతో చింతమనేనిపై చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. అమరావతి అవకతవకలపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. 35 వేల కోట్ల రుపాయలను ఎన్నికల ముందు లూటీ చేశారని ఆరోపించారు. సింగపూర్ కంపెనీలకు ఇక్కడి ఆస్తులను కట్టబెట్టాలనుకున్నారని మండిపడ్డారు. చింతమనేని దెందులూరు నియోజకవర్గంలో అనేక దాడులకు పాల్పడినప్పుడు లోకేష్ ఎందుకు మాట్లాడలేదపని దుయ్యబట్టారు. ఎన్నికలు వచ్చినపుడు మాత్రమే వారికి ప్రజలు గుర్తుకు వస్తారని అన్నారు. ఐదు నెలలో ఎటువంటి అభివృద్ధి జరగడం లేదంటూ లోకేష్ చెప్పే మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మె పరిస్థతిలో లేరని అబ్బయ్య చౌదరి అన్నారు. -
కాంగ్రెస్‌కు మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై
సాక్షి, ఇల్లెందు (భద్రాద్రి కొత్తగూడెం): రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గురువారం మండంలోని హనుమంతులపాడు గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇల్లెందు నియోజకవర్గ అభివృద్ధి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తాను పార్టీని మారాలని నిర్ణయించినట్లు చెప్పారు. రానున్న కాలంలో రాష్ట్రంలో బీజేపీదే అధికారమని ఆ దిశంగా ప్రజలు, నాయకులు చూస్తున్నారని తెలిపారు. దేశంలో నరేంద్ర మోదీ పాలనలో సుస్థిరపాలన అందిస్తున్నారని, రాష్ట్రంలోనూ సుస్థిర పాలన కోరకుంటున్నారని తెలిపారు. ఎన్నికలు జరిగి ఎనిమిది నెలలు కావస్తున్నా సీఎం కేసీఆర్ అభివృద్ధి కోసం పైసా నిధులు కేటాయించలేదని తెలిపారు. ప్రజల వద్దకు రాకుండా వారి కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. సీతారామ ప్రాజెక్ట్ శంకుస్థాపన జరిగి ఏళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభం కాకపోవడం ఆయన పాలనకే చెల్లిందన్నారు. జిల్లా నుంచి సీతారామ ప్రాజెక్ట్ ద్వారా సాగర్‌కు, టెయిల్‌పాండ్‌కు నీటిని తరలించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని, ఈ ప్రాజెక్ట్‌లో ఈ జిల్లా వాటా ఎంత అని ప్రశ్నించారు. విభజన హామీలు అటకెక్కాయని, ఉక్కు పరిశ్రమ అడ్రస్ లేదని, భూగర్భ గనులు, బొగ్గు నిక్షేపాల వెలికితీతలో కేసీఆర్ మాటలు నీటి మూటలుగా మారాయన్నారు. గిరిజన యూనివర్సిటీ అడ్రస్ లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ నెల 18న హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బీజేపీ వర్కింగ్ ప్రసిడెంట్ జెపీ లడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు తెలిపారు. ఈ దిశగా జిల్లా, నియెజకవర్గం నుంచి వివిధ పార్టీల నేతలు బీజేపీలోకి చేరేందుకు సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షులు కోనేరు చిన్ని మాట్లాడుతూ..జిల్లాలో బీజేపీని తిరుగులేని శక్తిగా మారుస్తామని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నాయకులు నాయిని శ్రీనివాస్,భద్రు తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పాదయాత్ర
సాక్షి, దెందులూరు : ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆ పార్టీ దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి పాదయాత్ర చేపట్టారు. శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటలకు ఆయన పెదవేగి మండలం రాట్నాలకుంట రాట్నాలమ్మ తల్లి దేవాలయం నుంచి పాదయాత్రగా ద్వారకా తిరుమల చేరుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంతో పాటు, దెందులూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలకు నా కృతజ్ఞతలు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అయిదేళ్ల పాలన విజయవంతంగా సాగాలంటూ పాదయాత్ర చేశా. ఈ అయిదేళ్లు ప్రజలకు అందుబాటులో ఉంటాను. నియోజకవర్గ ప్రజలకు ‘నవరత్నాలు’ పూర్తి స్థాయిలో అందేలా కృషి చేస్తా.’ అని హామీ ఇచ్చారు. కాగా టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌పై అబ్బయ్య చౌదరి భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. సాఫ్ట్వేర్ రంగంలో సుమారు 17 ఏళ్లు అనుభవం ఉన్న ఆయన...రాజకీయాలపై ఆసక్తితో వైఎస్సార్ సీపీలో చేరారు. దెందులూరు నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. -
‘జనాలు చింతమనేని పాలనపై విసిగిపోయారు’
సాక్షి, పశ్చిమ గోదావరి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దాంతో జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌పై రికార్డు విజయం సాధించిన కొఠారు అబ్బయ్య చౌదరిని అభినందించేందుకు కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ.. తన గెలపుకు కారణమైన దెందులూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. చింతమనేని పదేళ్ల పాలనపై విసుగెత్తి పోయిన దెందులూరు ప్రజలు ఓటు రూపంలో తీర్పునిచ్చారని తెలిపారు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అందరికీ చేరువ చేస్తానని పేర్కొన్నారు. ప్రజలందరికి అందుబాటులో ఉంటానన్నారు. దెందులూరును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. -
చిత్తు చిత్తుగా ఓడిన చింతమనేని
సాక్షి, ఏలూరు: అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడిన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయారు. దెందులూరులో ఎవరు పోటీ చేసినా తానే భారీ మెజార్టీతో గెలుస్తానని తొడలు కొట్టిన చింతమనేనికి గట్టి షాక్ తగిలింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం గట్టిన నియోజకవర్గ ప్రజలు ఓటు హక్కు ద్వారా చింతమనేనికి తగిన బుద్ధి చెప్పారు. చింతమనేనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి విజయం సాధించారు. మహిళలను తూలనాడుతూ.. దాడులు చేస్తూ దుశ్సాసనుడిని మరిపించిన చింతమనేని ప్రభాకర్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి బరిలోకి చింతమనేని ప్రభాకర్ వివాదాస్పద వైఖరితో దెందులూరు నియోజకవర్గం తరచూ వార్తలలో ఉండేది. కోడిపందాలు, జూదం, పందాలంటే చెవి కోసుకునే చింతమనేని.... ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా తన పంథా మార్చుకోలేదు సరికదా బహిరంగంగానే కొనసాగించారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన ఆయనకు ఓటర్లు గట్టిగానే సమాధానం చెప్పారు. ఎంపీపీగా ఉన్న చింతమనేని ప్రభాకర్ తొలిసారి 2009 ఎన్నికలలో దెందులూరు ఎమ్మెల్యేగా 14235 ఓట్ల తేడాతో గెలిచారు. ఆ తర్వాత 2014 ఎన్నికలలో మరోసారి టీడీపీ తరపున పోటీ చేసి 17746 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆ గెలుపు తర్వాత నుంచి చింతమనేని వివాదాస్పద చర్యలు తారాస్ధాయికి చేరుకున్నాయి. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై చింతమనేని దాడి చేయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ వ్యవహారంలో ఎమ్మెల్యే చింతమనేనిపై చర్యలు తీసుకోవాల్సిన సీఎం.. అందుకు విరుద్ధంగా ఎమ్మార్వోను పిలిచి మరీ మందలించడం అధికారవర్గాలలో కలకలం రేపింది. ఇక అక్కడ నుంచి చింతమనేని అక్రమాలకు దెందులూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోనూ ఎదురు లేకుండా పోయింది. తమ్మిలేరులో ఇసుక అక్రమాలు, దెందులూరు నియోజకవర్గంలో నీరు చెట్టు పేరుతో అక్రమాలు, మట్టి దోపిడీ, పోలవరం కుడి కాలువ నుంచి మట్టి అక్రమ తరలింపులతో కోట్ల రూపాయలు వెనకేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. తనకు ఎదురువచ్చిన అటవీ అధికారులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, పాత్రికేయులు, మహిళలు , కార్మికులు, అందరిపై దౌర్జన్యకాండ కొనసాగించారని స్థానికులుచెబుతుంటారు. ఆఖరికి సొంత పార్టీ నేతలపైనా చేయిచేసుకోవడం ,పలుసార్లు తీవ్ర వివాదాస్పదమై తిరుగుబాటుకు కూడా దారితీసింది. 2014కు ముందు అప్పటి మంత్రి వసంత్ కుమార్ పై చేయిచేసుకున్న వైనంపై భీమడోలు కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించినా కూడా చింతమనేనిలో మార్పు రాలేదు. 40 కి పైగా కేసులున్నా కూడా చింతమనేనిని ఒక్క కేసులో కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదంటే పోలీసు శాఖపై ఎంత ఒత్తిడి ఉందో స్పష్టమవుతోంది. ఈ ఎన్నికలలో దెందులూరు నియోజకవర్గంలో 84.70 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని బట్టి దెందులూరు ప్రజలు మార్పును కోరుకున్నట్లు కౌంటింగ్‌కు ముందే స్పష్టమైంది. -
చింతమనేనీ.. దళిత జాతికి క్షమాపణ చెప్పు
పశ్చిమగోదావరి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): దళితులపై చేసిన అనుచిత వ్యాఖ్య లకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అంబే డ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి ఆయన కాళ్లు పట్టుకుని దళిత జాతికి క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ కొవ్వూరు కన్వీనర్ తానేటి వనిత డిమాండ్ చేశారు. ఏలూరు వైఎ స్సార్ సీపీ కార్యాలయంలో దెందులూరు కన్వీనర్ కొఠారు అబ్బయ్యచౌదరితో కలిసి ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడారు. చింతమనేనితో క్షమాపణ చెప్పించే విషయంలో సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవాలన్నారు. దళితుల కుటుంబాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని చంద్రబాబు వ్యాఖ్యానించి దళితులపై దాడులకు పచ్చజెండా ఊపినట్టు అర్థమవుతోందన్నారు. దళితుల్లో ఆత్మస్థైర్యం నింపాల్సింది పోయి వారిని కించపరచడమే లక్ష్యంగా టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేనిపై కొవ్వూరు నియోజకవర్గంలోని పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేసినా ఒక్కచోట కూడా కేసు నమోదుచేయకపోవడం ఈ ప్రభుత్వానికి దళితులపై ఉన్న చిత్తశుద్ధిని తెలుపుతోందన్నారు. వారి అరాచకాలకు పోలీసులను పావులుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. చింతమనేని, తెలుగుదేశం పార్టీ భవిష్యత్‌ను నిర్ణయించేది దళితులేనని, ఓటుతో వారికి బుద్ధి చెబు తామని పిలుపునిచ్చారు. చింతమనేని నోరు అదుపులో పెట్టుకోవాలని, అధికారం శాశ్వ తం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల న్నారు. చింతమనేని దౌర్జన్యానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. చింతమనేని అక్రమాలు, ప్రజావ్యతిరేక విధానాలు పేట్రేగిపోతున్నాయని, అతడిని ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా ఎన్నికల కమిషన్ ప్రకటించాలని కోరారు. ‘దమ్ముంటే నాపై పోటీ చేయాలి’ దమ్ముంటే నాపై పోటీ చెయ్యి చింతమనేనీ అంటూ వైఎస్సార్ సీపీ దెందులూరు కన్వీనర్ కొఠారు అబ్బయ్యచౌదరి సవాల్ విసిరారు. చింతమనేని స్థాయిని మరిచి జగన్‌ను తనపై పోటీచేయమని ఒకసారి, పవన్ కల్యాణ్‌ను తనపై పోటీ చేయమని మరోసారి సవాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వారిద్దరూ కాదని కనీసం తనపైనైనా గెలవడానికి ప్రయత్నించాలని అబ్బయ్యచౌదరి హితవుపలికారు. రాష్ట్రంలో దళితులపై ప్రేమ ఉంటే దళితులను అవమానించిన చింతమనేనిని వెంటనే అరెస్ట్ చేయించు చంద్రబాబూ అని డిమాండ్ చేశారు. దెందులూరు నియోజకవర్గంలో పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉంటూ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన చింతమనేని ఇప్పుడు రాజధాని అమరావతి, విశాఖల్లో వందలాది ఎకరాల భూములు సొంతం చేసుకుని శ్రీమంతుడయ్యారని అన్నారు. తమ్మిలేరులో ఇసుకను, పోలవరం గట్టుపై ఉన్న మట్టిని అమ్ముకుని కోట్లు గడించారన్నారు. నియోజకవర్గంలోని వట్లూరులో వెమ్‌టెక్ అనే సంస్థ పేరిట 300 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్న విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. విజయరాయి గ్రామంలో పెన్షన్ తీసుకోవడానికి వచ్చిన 85 ఏళ్ల వృద్ధుడిని దుర్భాషలాడి అతని కుమారులపై తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. పెదవేగి మండలం గుమ్మడిగుంట గ్రామానికి చెందిన దళితుల భూముల విషయంలో 70 రోజులు ఆందోళన చేస్తే ఒక్కరోజైనా వెళ్లి వారిని పరామర్శించారా అని చింతమనేనిని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అధికారులు, సాధారణ ప్రజలను కూడా వేధిస్తూ చింతమనేని రాక్షస పాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసిన రోజునే కటకటాల వెనక్కి నెట్టాల్సిన నిన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు వదిలి వేయడంతోనే బరితెగించావన్నారు. సొంత పార్టీకి చెందిన నాయకులపైనే దాడి చేసిన నీకు వ్యతిరేకంగా గ్రామమంతా ఏకమై పోరాటం చేసిన విషయం నిజం కాదా అన్నారు. ఇటీవల దళితులపై చింతమనేని చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తుంటే ముఖ్యమంత్రి చంద్ర బాబు మాత్రం చింతమనేనిని వెనకేసుకొస్తూ అది మార్ఫింగ్ చేసిన వీడియో అని ప్రకటించడం దళితులను అవమానించడమేనన్నారు. వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ నాయకులు నూకపెయ్యి సుధీర్‌బాబు, మున్నుల జాన్ గురునాథ్, పల్లెం ప్రసాద్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నాయకుల గృహ నిర్భందం
సాక్షి, దెందులూరు(పశ్చిమ గోదావరి): ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై పోలీసులు వ్యవహరశైలి పలు అనుమానాలకు తావిస్తోంది. అధికార పార్టీకి చెందిన నేతలు హద్దుమీరి ప్రవర్తిస్తున్న కూడా పట్టించుకుని పోలీసులు.. ప్రతిపక్ష పార్టీ నాయకులు నిరసన కూడా తెలుపకముందే వారిని నిర్భందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల తీరు ఇదే విధంగా కొనసాగుతుంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో ఇలాంటి ఘటనే పునరావృతమైంది. స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మంగళవారం జరిగిన ఓ సభలో దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు, మానవ హక్కుల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. చింతమనేనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసులు దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేనిని వదిలివేసి.. వైఎస్సార్సీపీ నాయకులను అసౌకర్యానికి గురిచేస్తున్నారు. వారి కార్యకలాపాలకు అడ్డుపడుతూ ఇబ్బంది కలిగిస్తున్నారు. తద్వారా పార్టీ శ్రేణులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. బుధవారం ఉదయం వైఎస్సార్ సీపీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త అబ్బయ్య చౌదరిని ఏలూరులోని పార్టీ కార్యాలయానికి బయలుదేరుతుండగా పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. సరైన కారణం లేకుండా తనను హౌజ్ అరెస్ట్ చేయడంపై అబ్బయ్య చౌదరి అభ్యంతరం వ్యక్తం చేశారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేని అరెస్ట్ చేయకుండా.. తనను హౌస్ అరెస్ట్ చేయడం ఏమిటని ఆయన పోలీసులను సూటిగా ప్రశ్నించారు. చింతమనేని వ్యాఖ్యలపై తాము ఎటువంటి నిరసనలకు పిలువునివ్వకపోయినప్పటికీ.. ఏదో ఊహించుకుని ఇలా వ్యవహరించడం దారుణమని అన్నారు.(మరోసారి రెచ్చిపోయిన చింతమనేని.. ఉద్రిక్తత) -
చింతమనేనిని వదిలివేసి.. వైఎస్సార్సీపీ నాయకుల నిర్భందం
-
అభివృద్ధికి కృషి చేస్తా
సాక్షి,ఇల్లెందు: ఇల్లెందు నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని, గెలిపిస్తే అభివృద్ధికి కృషి చేస్తానని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, స్వతంత్ర అభ్యర్థి ఊకె అబ్బయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని హనుమంతుపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇల్లెందు నుంచి రెండు దఫాలు ఎమ్మెల్యేగా గెలుపొందానని, తన హయాంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని అన్నారు. వివిధ పార్టీలకు చెందిన పలువురు పదవులకు రాజీనామా చేసి తనతో పని చేస్తామని ప్రకటించారని ఆయన తెలిపారు. గ్యాస్ సిలిండర్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. నాయకులు దళపతి శ్రీనివాసరాజు, రాంప్రసాద్, జక్కుల కృష్ణ, భిక్షపతి యాదవ్, భద్రూ, నామోదర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
చింతమనేని సవాలును స్వీకరిస్తున్నా
పశ్చిమగోదావరి, దెందులూరు/పెదవేగి: నేను చేపట్టిన నిరాహార దీక్షకే భయపడిన చింతమనేని నాకు సవాల్ విసురుతారా? ఆయన గోపన్నపాలెంలో చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నా. తట్ట మట్టినీ తాను అమ్మలేదంటున్న ఆయనకు సీబీసీఐడీ విచారణకు అంగీకరించే దమ్ము, ధైర్యం ఉన్నాయా? ఆయన మట్టి, ఇసుక, గ్రావెల్ అమ్ముకోలేదని క్లీన్‌చీట్ వస్తే తట్టాబుట్టా సర్దుకెళ్లిపోతాను’ అని వైఎస్సార్ సీపీ దెందులూరునియోజకవర్గ కన్వీనర్ కొఠారు అబ్బయ్య చౌదరి పేర్కొన్నారు. ఆదివారం రాత్రి దీక్ష విరమణ అనంతరం ర్యాలీగా గోపన్నపాలెం బస్టాండ్ సెంటర్‌కు చేరిన అబ్బయ్య చౌదరి, వైఎస్సార్ సీపీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ కోటగిరి శ్రీధర్ బహిరంగ సభలో మాట్లాడారు. శనివారం చింతమనేని విసిరిన సవాల్‌కు దీటుగా స్పందించారు. అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో మట్టి, ఇసుక, గ్రావెల్ అమ్ముకోలేదని చింతమనేని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆయన అక్రమంగా మట్టి, ఇసుక, గ్రావెల్ అమ్ముకోని గ్రామం లేదన్నారు. సూర్యారావుపేటలో పేద వ్యక్తి 30 ఏళ్లుగా నివసిస్తుంటే, హైకోర్టు ఆదేశాలు ఉన్నా.. ఇంటిని జేసీబీతో తొలగించాలని యత్నిస్తున్న సమయంలో తాను, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రశ్నించినందుకు తమపై అక్రమ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. కేసులు పెట్టిస్తే భయపడబోమని, ఇక్కడ ఉన్నది కొఠారు అని పేర్కొన్నారు. కార్యకర్తలపై అక్రమంగా పెట్టిన కేసులను పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే తొలగిస్తామన్నారు. చింతమనేనికి ప్రజా క్షేత్రంలోనే గుణపాఠం చెబుతామన్నారు. కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ ప్రజాలారా కోడిపందేలు, సారా దుకాణాలు, పేకాట నిర్వహించే వ్యక్తి కావాలా? విదేశాల్లో చదువుకున్న ఉన్నతమైన విలువలున్న వ్యక్తులు కావాలా అని ప్రశ్నించారు. తట్ట మట్టినీ తరలించలేదని, ఒకవేళ తరలించినట్లు తేలిస్తే చింతమనేని రాజకీయ సన్యాసం చేస్తానన్నారని, కానీ ఆయన రాజకీయ సన్యాసం చేయరని, తాము గెలిచి అతనిచేత రాజకీయ సన్యానం చేయిస్తామని పేర్కొన్నారు. చింతమనేని అరాచకాలు ఇంకా ఆరు నెలలేనని అన్నారు. పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కొండేటి గంగాధరరావు బాబు, జిల్లా కార్యదర్శి తోట పద్మారావు, గ్రామ పార్టీ అధ్యక్షులు వీరంకి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ బహిరంగ సభ జరిగింది. ఏలూరు పార్లమెంట్ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ సతీష్ చౌదరి నాయకత్వంలో కన్వీనర్ నిరా హార దీక్షకు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. దీక్షతో శ్రేణుల్లో ఉత్సాహం చింతమనేని అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా అబ్బయ్యచౌదరి చేపట్టిన రెండు రోజుల నిరాహారదీక్ష ఆదివారం సాయంత్రం ముగిసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్, గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు అబ్బయ్య చౌదరికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చింతమనేని అక్రమాలపై పోరాటం ఆపేదిలేదనీ స్పష్టం చేశారు. అబ్బయ్య చౌదరి దీక్షకు నియోజకవర్గ ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. నాలుగేళ్లుగా ఎమ్మెల్యే చింతమనేని దౌర్జన్యాలతో విసిగిన ప్రజలు అబ్బయ్య చౌదరికి మద్దతు తెలిపారు. దీక్షా శిబిరం వద్దకు భారీగా వచ్చారు. మహిళలు బొట్టుపెట్టి మరీ అబ్బయ్య చౌదరిని ఆశీర్వదించారు. హారతులు పట్టారు. తరలివచ్చిన వైఎస్సార్ సీపీ శ్రేణులు దీక్షాశిబిరాన్ని వైఎస్సార్ సీపీ నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, తణుకు కన్వీనర్ కారుమూరి నాగేశ్వరరావు, తాడేపల్లిగూడెం కన్వీనర్ కొట్టు సత్యనారాయణ, గన్నవరం కన్వీనర్ యార్లగడ్డ వెంకట్రావు, జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావుతోపాటు వైఎస్సార్ సీపీ శ్రేణులు సందర్శించారు. ఈ సందర్భంగా వారంతా మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ నేతల అక్రమాలు, అరాచకాలపై ధ్వజ మెత్తారు. తెలుగుదేశం నేతలు ఆలీబాబా అందరూ దొంగలే అన్న చందాన ఉన్నారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలే బుద్ధిచెబుతా రని అన్నా రు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం జనరల్సెక్రటరీ కామిరెడ్డి నాని, ఎస్సీ సెల్‌రాష్ట్ర ప్రధాన కార్యదిర్శ పల్లెం ప్రసాద్, జిల్లా కార్యదర్శి కొండే లాజరు, జిల్లా కమిటీ సభ్యులు యలమర్తి రామకృష్ణ, ఏలూరు పార్లమెంట్ కార్యదర్శి చల్లా మేరీరాజు, పార్టీ పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షులు ఎన్.సూర్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమ్మ శివరామకృష్ణ, రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి లక్ష్మీకుమార్, ఏలూ రు పార్లమెంటరీ కార్యనిర్వాహక సభ్యుడు చట్టుమాల మరియ దాసు, నేతలు సప్పా మోహనమురళి, వీరమాచినేని నాగబాబు, తోట పద్మారావు, కట్టా ఏసుబాబు,బట్టు జయరాజు పాల్గొన్నారు. -
అబ్బయ్యా.. చెప్పయ్యా...
చేసిన అభివృద్ధేమిటో చెప్పాలని నిలదీసిన తమ్ముళ్లు ప్రశ్నల జడివానతో ఉక్కిరిబిక్కిరైన ఇల్లెందు ఎమ్మెల్యే అర్ధంతరంగా ముగిసిన పార్టీ బూత్ కమిటీల నియామక సమావేశం ఇల్లెందు, న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీకి చెందిన ఇల్లెందు ఎమ్మెల్యే ఊకె అబ్బయ్యకు తన సొంత పార్టీ కార్యకర్తల నుంచి చేదు అనుభవం ఎదురైంది. నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమిటో చెప్పాలంటూ ఆయనను ‘తెలుగు’ తమ్ముళ్లు నిలదీశారు. తమను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహోదగ్రులయ్యారు. తమపై పోలీసు కేసులు బనాయిస్తూ, జైలుపాలు చేయిస్తున్న మంత్రితో.. ఆయన సోదరుడితో చెట్టపట్టాలేసుకుని ఎందుకు తిరుగుతున్నారంటూ ఉగ్రులయ్యారు. ఈ రసవత్తర సన్నివేశానికి.. టీడీపీ ఇల్లెందు నియోజకవర్గ బూత్ కమిటీల నియామక సమావేశం వేదికగా నిలిచింది. ‘తమ్ముళ్ల’ తీరుతో సమావేశం రసాభాసగా మారింది, చివరికి, ఈ సమావేశాన్ని నాయకులు అర్ధాంతరంగా ముగించారు. ఇలా మొదలైంది... టీడీపీ ఇల్లెందు నియోజకవర్గస్థాయి బూత్ కమిటీల నియామక సమావేశం ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య క్యాంపు కార్యాలయం వద్ద శనివా రం ఏర్పాటైంది. తొలుత, అబ్బయ్య లేచి.. సమావేశ ఉద్దేశాన్ని వివరించారు. ఆ తరువా త, శాసనసభలో చోటుచేసుకున్న పరిణామా లు, ఆంధ్ర-రాయలసీమ-తెలంగాణ ప్రాజెక్టులు తదితరాంశాలపై మాట్లాడుతున్నారు. ఈ దశలో కొందరు కార్యకర్తలు, వివిధ మండలాల నాయకులు జోక్యం చేసుకుని... ‘వాటి గురించి మాకెందుకు? గడిచిన ఐదేళ్లలో నియోజకవర్గంలో ఏ మండలంలో ఏమేమి అభివృద్ధి పనులు చేశారో చెబితే సంతోషిస్తాం’ అని, వ్యంగ్య ధోరణిలో ప్రశ్నించారు. వివిధ మండలాల నాయకులు ఒకరి తర్వాత మరొకరు ప్రశ్నల జడివాన కురిపించారు. ప్రశ్నల జడివాన... ‘మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు గోపాలరెడ్డి కలిసి మాపై నిత్యం పోలీసు కేసులు బనాయిస్తూ జైలుపాలు చేయిస్తున్నారు. మీరు మాత్రం వారితో చెట్టపట్టాలేసుకుని తిరుగుతారు. వారు మీకు ఎలా సన్నిహితులయ్యారు..?’ అని, కామేపల్లి మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు ప్రశ్నించారు. ఐదేళ్ల క్రితం.. ఎన్నికల ముందు సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, నియోజకవర్గానికి విడుదలైన నిధులను మండలాలవారీగా కేటాయించే విషయమై ఎందుకు సమావేశం నిర్వహించలేదు? ‘గత ఎన్నికల సమయంలో పార్టీని సమన్వయం చేసి గెలుపునకు కృషి చేసిన నాయకులు ఇప్పుడు ఈ సమావేశంలో ఎందుకు కనిపించడం లేదు...?’ అని, గార్ల మండలానికి చెందిన ఓ నాయకుడు ప్రశ్నించారు. ‘కామేపల్లి, బయ్యారం, ఇల్లెందు పట్టణ కమిటీలకు గత రెండేళ్లుగా ఎన్నికలను ఎం దుకు నిర్వహించలేదు..?’ అని, కామేపల్లి మండల నాయకులు ప్రశ్నించారు. పార్టీ మండల అధ్యక్షులెవరో తమకు తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అబ్బ’య్య... ఉక్కిరిబిక్కిరి.. ఇలా అనూహ్యంగా కురిసిన ప్రశ్నల జడివాన తో ఎమ్మెల్యే అబ్బయ్య ఉక్కిరిబిక్కిరయ్యారు. ఏమ ని జవాబివ్వాలో ఆయనకు కొంతసేపు పాలుపోలేదు. ‘అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతా’నంటూ నచ్చచెప్పేందుకు పదే పదే ప్రయత్నించారు. ఈ దశలో, పార్టీ నియోజకవర్గ బూత్ కమిటీల ఇంచార్జ్ మూడు కృష్ణప్రసాద్ లేచి మాట్లాడేందుకు ప్రయత్నించారు. ‘మీరు కాదు.. మాకు ఎమ్మెల్యే నుంచి స్పష్టమైన సమాధానం కావాలి’ అని, పార్టీ నాయకులు పట్టుబట్టారు. ప్లీజ్... క్షమించండి... అనంతరం, ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య మాట్లాడుతూ... తన వల్ల పొరపాట్లు జరిగితే క్షమించాలని అభ్యర్థించారు. పార్టీ టికెట్ ఎవరికిస్తే వారిని గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడడం పూర్తవగానే సమావేశం నుంచి దాదాపు అందరూ బయటకు వెళ్లిపోయారు. దీంతో, బూత్ కమిటీల నియామకం జరపకుండానే సమావేశాన్ని నిర్వాహకులు అర్ధాంతరంగా ముగించారు. -
నిరసన గళం... గందరగోళం...
ఇల్లెందు, న్యూస్‌లైన్ : ఇల్లెందులో శుక్రవారం మూడోవిడత రచ్చబండ సభ వివిధ పార్టీల ఆందోళనలతో ఆద్యంతం రసాభాసగా మారింది. పలుమార్లు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానిక ఫారెస్ట్ గ్రౌండ్లో ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య అధ్యక్షతన సభ ప్రారంభమైంది. ఈ సభలో ఒకటి తరువాత ఒకటిగా వరుస ఘటనలు ఇలా జరిగాయి... వేదిక పైకి ఎమ్మెల్యే రాగానే.. బ్యానర్ నుంచి సీమాంధ్ర సీఎం ఫొటో తొలగించాలని టీఆర్ఎస్ నాయకులు పట్టుబట్టారు. వారికి డీఎస్పీ కె.కృష్ణ నచ్చచెబుతుండగా... కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దాస్యం ప్రమోద్ కుమార్ తదితరులు వేదిక పైకి వెళ్లి సీఎం ఫొటో తొలగించారు. రచ్చబండ కార్యక్రమ రూపకర్తయిన దివంగత సీఎం వైఎస్సార్ ఫొటో ఎందుకు పెట్టలేదంటూ వైఎస్ఆర్ సీపీ మండల కన్వీనర్ పులి సైదులు, నాయకులు దొడ్డా డానియేల్, కోండ్రు భద్రయ్య తదితరులు ఆందోళనకు దిగారు. వీరిని పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి తొలగించారు. బయ్యారంలో ఉక్కు, మామిడిగుండాలలో ల్యాటరైట్ పరిశ్రమ నెలకొల్పాలని; తుపాను బాధిత రైతులను ఆదుకోవాలని, ఇల్లెందులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని, మార్కెట్‌ను తెరిపించాలని, గత రెండు రచ్చబండల్లో ప్రజలు ఇచ్చిన దరఖాస్తుల్లో ఎన్నింటిని పరిష్కరించారో లెక్క చెప్పాలని తదితర డిమాండ్లతో న్యూడెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి ఎన్.రాజు, పట్టణ కార్యదర్శి టి.నాగేశ్వరరావు తదితరుల ఆధ్వర్యంలో కార్యకర్తలు చేపట్టిన ఆందోళ న ఉద్రిక్తంగా మారింది. నాయకులపై ఒకానొక దశలో పోలీసులు చేయి చేసుకున్నారు. దీనిని నిరసిస్తూ సభావేదిక ముందు న్యూడెమోక్రసీ నాయకులు బైఠాయించారు. వారిని తొలగించేందుకు పోలీసులు యత్నించారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో నాయకులు తూలి కింద పడిపోయారు. కౌంటర్లలో ఇచ్చిన అర్జీలకు రసీదులు ఇవ్వాలంటూ టీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. వారిని పోలీసలు అడ్డుకున్నారు. ఇల్లెందు సింగరేణి 21 ఏరియా కాలనీ సమస్యలు పరిష్కరించాలంటూ సర్పంచ్ ఎస్.పార్వతి, ఉప సర్పంచ్ రెంటాల లక్ష్మి, పీఏసీఎస్ అధ్యక్షుడు ఆవుల కిరణ్ ఆధ్వర్యంలో స్థానికులు సభావేదిక ముందు బైఠాయించారు. సమస్యలపై కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌తో చర్చిద్దాంటూ వారిని ఎమ్మెలే ఊకె అబ్బయ్య శాంతింపచేశారు. తుపానుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, అర్హులైన పోడు భూములకు పట్టాలివ్వాలని, మామిడిగుండాలలో ల్యాటరైట్ పరిశ్రమను ప్రభుత్వం నెలకొల్పాలని, ఇల్లెందుకు బస్ డిపో మంజూరు చేయాలని, ప్యాసింజర్ రైలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం డివిజన్ కార్యదర్శి మెరుగు సత్యనారాయణ, నాయకులు దేవులపల్లి యాకయ్య, నబీ తదితరులు ఆందోళనకు దిగారు. మున్నూరు కాపు కులస్తులకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆ సంఘం నాయకులు పులి సైదులు, పోషం వెంకటేశ్వర్లు, పాలెపు ఆనంద్, సతీష్ తదితరులు ఆందోళన నిర్వహించారు. వారిని పోలీసులు తొలగించారు. చివరిగా, ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య మాట్లాడుతూ.. బస్ డిపో ఏర్పాటు, మామిడిగుండాల సీలింగ్ భూములు, పోడు భూములకు హక్కులు, ల్యాటరైట్ ఖనిజ పరిశ్రమ ఏర్పాటు తదితరాంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నట్టు చెప్పారు. భద్రాచలం తెలంగాణలో భాగమేనంటూ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు.