చేసిన అభివృద్ధేమిటో చెప్పాలని నిలదీసిన తమ్ముళ్లు
ప్రశ్నల జడివానతో ఉక్కిరిబిక్కిరైన ఇల్లెందు ఎమ్మెల్యే
అర్ధంతరంగా ముగిసిన పార్టీ బూత్ కమిటీల నియామక సమావేశం
ఇల్లెందు, న్యూస్‌లైన్:
తెలుగుదేశం పార్టీకి చెందిన ఇల్లెందు ఎమ్మెల్యే ఊకె అబ్బయ్యకు తన సొంత పార్టీ కార్యకర్తల నుంచి చేదు అనుభవం ఎదురైంది. నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమిటో చెప్పాలంటూ ఆయనను ‘తెలుగు’ తమ్ముళ్లు నిలదీశారు. తమను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహోదగ్రులయ్యారు. తమపై పోలీసు కేసులు బనాయిస్తూ, జైలుపాలు చేయిస్తున్న మంత్రితో.. ఆయన సోదరుడితో చెట్టపట్టాలేసుకుని ఎందుకు తిరుగుతున్నారంటూ ఉగ్రులయ్యారు. ఈ రసవత్తర సన్నివేశానికి.. టీడీపీ ఇల్లెందు నియోజకవర్గ బూత్ కమిటీల నియామక సమావేశం వేదికగా నిలిచింది. ‘తమ్ముళ్ల’ తీరుతో సమావేశం రసాభాసగా మారింది, చివరికి, ఈ సమావేశాన్ని నాయకులు అర్ధాంతరంగా ముగించారు.
ఇలా మొదలైంది...
టీడీపీ ఇల్లెందు నియోజకవర్గస్థాయి బూత్ కమిటీల నియామక సమావేశం ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య క్యాంపు కార్యాలయం వద్ద శనివా రం ఏర్పాటైంది. తొలుత, అబ్బయ్య లేచి.. సమావేశ ఉద్దేశాన్ని వివరించారు. ఆ తరువా త, శాసనసభలో చోటుచేసుకున్న పరిణామా లు, ఆంధ్ర-రాయలసీమ-తెలంగాణ ప్రాజెక్టులు తదితరాంశాలపై మాట్లాడుతున్నారు. ఈ దశలో కొందరు కార్యకర్తలు, వివిధ మండలాల నాయకులు జోక్యం చేసుకుని... ‘వాటి గురించి మాకెందుకు? గడిచిన ఐదేళ్లలో నియోజకవర్గంలో ఏ మండలంలో ఏమేమి అభివృద్ధి పనులు చేశారో చెబితే సంతోషిస్తాం’ అని, వ్యంగ్య ధోరణిలో ప్రశ్నించారు. వివిధ మండలాల నాయకులు ఒకరి తర్వాత మరొకరు ప్రశ్నల జడివాన కురిపించారు.
ప్రశ్నల జడివాన...
‘మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు గోపాలరెడ్డి కలిసి మాపై నిత్యం పోలీసు కేసులు బనాయిస్తూ జైలుపాలు చేయిస్తున్నారు. మీరు మాత్రం వారితో చెట్టపట్టాలేసుకుని తిరుగుతారు. వారు మీకు ఎలా సన్నిహితులయ్యారు..?’ అని, కామేపల్లి మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు ప్రశ్నించారు.
ఐదేళ్ల క్రితం.. ఎన్నికల ముందు సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, నియోజకవర్గానికి విడుదలైన నిధులను మండలాలవారీగా కేటాయించే విషయమై ఎందుకు సమావేశం నిర్వహించలేదు?
‘గత ఎన్నికల సమయంలో పార్టీని సమన్వయం చేసి గెలుపునకు కృషి చేసిన నాయకులు ఇప్పుడు ఈ సమావేశంలో ఎందుకు కనిపించడం లేదు...?’ అని, గార్ల మండలానికి చెందిన ఓ నాయకుడు ప్రశ్నించారు.
‘కామేపల్లి, బయ్యారం, ఇల్లెందు పట్టణ కమిటీలకు గత రెండేళ్లుగా ఎన్నికలను ఎం దుకు నిర్వహించలేదు..?’ అని, కామేపల్లి మండల నాయకులు ప్రశ్నించారు. పార్టీ మండల అధ్యక్షులెవరో తమకు తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
‘అబ్బ’య్య... ఉక్కిరిబిక్కిరి..
ఇలా అనూహ్యంగా కురిసిన ప్రశ్నల జడివాన తో ఎమ్మెల్యే అబ్బయ్య ఉక్కిరిబిక్కిరయ్యారు. ఏమ ని జవాబివ్వాలో ఆయనకు కొంతసేపు పాలుపోలేదు. ‘అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతా’నంటూ నచ్చచెప్పేందుకు పదే పదే ప్రయత్నించారు. ఈ దశలో, పార్టీ నియోజకవర్గ బూత్ కమిటీల ఇంచార్జ్ మూడు కృష్ణప్రసాద్ లేచి మాట్లాడేందుకు ప్రయత్నించారు. ‘మీరు కాదు.. మాకు ఎమ్మెల్యే నుంచి స్పష్టమైన సమాధానం కావాలి’ అని, పార్టీ నాయకులు పట్టుబట్టారు.
ప్లీజ్... క్షమించండి...
అనంతరం, ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య మాట్లాడుతూ... తన వల్ల పొరపాట్లు జరిగితే క్షమించాలని అభ్యర్థించారు. పార్టీ టికెట్ ఎవరికిస్తే వారిని గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడడం పూర్తవగానే సమావేశం నుంచి దాదాపు అందరూ బయటకు వెళ్లిపోయారు. దీంతో, బూత్ కమిటీల నియామకం జరపకుండానే సమావేశాన్ని నిర్వాహకులు అర్ధాంతరంగా ముగించారు.
అబ్బయ్యా.. చెప్పయ్యా...
Published Sun, Feb 2 2014 2:44 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM
Advertisement