Ram reddy Venkat Reddy
-
రాంరెడ్డి వెంకటరెడ్డి అంత్యక్రియలు ప్రారంభం
ఖమ్మం: పాలేరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత రాంరెడ్డి వెంకటరెడ్డి అంత్యక్రియలు శనివారం ప్రారంభమైనాయి. జిల్లాలోని ఆయన స్వగ్రామమైన పాత లింగాలలో పూర్తి అధికార లాంఛనాలతో వెంకటరెడ్డి అంత్యక్రియలు జరుగుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారుతోపాటు తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యారు. అలాగే జిల్లాలోని ఆయన అభిమానులతోపాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత, పీఏసీ చైర్మన్ రాంరెడ్డి వెంకట్‌రెడ్డి(72) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్నారు. ఆ క్రమంలో ఆయన్ని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... శుక్రవారం రాంరెడ్డి వెంకటరెడ్డి మరణించిన సంగతి తెలిసిందే. -
రాంరెడ్డి వెంకటరెడ్డికి తుమ్మల పరామర్శ
హైదరాబాద్ : తీవ్ర అనారోగ్యానికి గురైన ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డిని తెలంగాణ రోడ్డు భవనాల శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. శనివారం నగరంలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాంరెడ్డి వెంకట్‌రెడ్డిని తుమ్మల పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆసుపత్రి వైద్యులతో కూడా వెంకట్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై తుమ్మల వాకబు చేశారు. వెంకట్‌రెడ్డి తొందరగా కోలుకోవాలంటూ తుమ్మల ఆకాంక్షించారు. రాంరెడ్డి వెంకటరెడ్డి గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారు. నేపథ్యంలో ఆయన ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైయ్యారు. దీంతో ఆయన్ని కుటుంబ సభ్యులు కిమ్స్ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. -
ముదురుతున్న వర్గపోరు
రసకందాయంలో కాంగ్రెస్ రాజకీయం డీసీసీ అధ్యక్షుడు ఐతం సన్మానానికి ఏర్పాట్లు ఒక వర్గం మోదం.. మరో వర్గం ఖేదం సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరు ముదిరి పాకాన పడుతోంది. జిల్లా కాంగ్రెస్ ఇన్చార్జి అధ్యక్షుడిగా ఐతం సత్యం నియామకంపై కాంగ్రెస్‌లోని పలు వర్గాలు కారాలు మిరియాలు నూరుతుండగా.. ఆయన అనుకూలురు మాత్రం ఐతం సత్యం సన్మానానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక తర్వాత జిల్లాలోని కాంగ్రెస్ రాజకీయాలు మరో మలుపు తిరిగాయి.14 సంవత్సరాలు ఏకచత్రాధిపత్యంగా డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వనమా వెంకటేశ్వరరావు ఆ పదవి నుంచి వైదొలగిన తర్వాత పార్టీలోని వర్గాలు ఎవరికి వారు తమ అనుచరులకు డీసీసీ పట్టాన్ని కట్టబెట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు. ఈ తరుణంలో ఐతం సత్యానికి డీసీసీ ఇన్చార్జి అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం కొందరికి మింగుడు పడలేదు. మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఐతం నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఏఐసీసీకి లేఖాస్త్రం సంధించడంతో జిల్లా కాంగ్రెస్ పా ర్టీలో మరింత వేడి రాజుకుంది. ఈ చర్చ ఇంకా ముగియకముందే డీసీసీ నూతన అధ్యక్షుడికి సన్మానం చేసేందు కు పలువురు నాయకులు సమాయత్తం కావడం గమనార్హం. ఈ కార్యక్ర మం తమ సత్తా చాటుకునేందుకా..? లేక వ్యతిరేక వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకా..? అనేది జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సన్మానంపై సర్వత్రా చర్చ... జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకం సరికాదని, ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని ఒకవైపు బలమై న వాదన వినిపిస్తున్న తరుణంలో ఐ తం సత్యంకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడంపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత డీసీసీ నియామక ప్రక్రియకు పీసీసీ ప్రయత్నం విఫలం కావడంతో ఈ పంచాయితీ ఏఐసీసీ కోర్టులోకి చేరింది. ఈ తరుణంలో అన్ని వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు మాజీమంత్రి రాంరెడ్డి వర్గానికి చెందిన శీలంశెట్టి వీరభద్రం, రేణుకా చౌదరి వ ర్గానికి చెందిన వి.వి.అప్పారావు, పరుచూరి మురళీకృష్ణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి వర్గానికి చెందిన శ్రీనివాసరెడ్డి, అజయ్‌కుమార్ అనుచరుడైన ఎస్ఏఎస్ అయూబ్లతోపాటు ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క సన్నిహితుడిగా పేరున్న ఐతం సత్యంతో కూడిన సమన్వయ కమిటీని నియమించారు. జిల్లా లో అనూహ్యంగా మారిన రాజకీయ పరిణామాల్లో భాగంగా టీడీపీకి చెంది న తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరి రాష్ట్ర మంత్రివర్గంలో కూడా చోటు దక్కించుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించి, ప్రభుత్వం అనుసరించే ప్ర జా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీ సుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలో ధర్నాలు, రాస్తారోకోలతోపాటు పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిపైనే ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో వయసు పై బడిన ఐతం సత్యం నియామకం పై కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి వర్గానికి చెందిన పరుచూరి మురళీ కృష్ణ లేదా మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు శీలంశెట్టి వీరభద్రానికి డీసీసీ పగ్గాలు అప్పగిస్తారని ఎవరికి వారు ధీమాతో ఉండగా.. మధ్యేమార్గంగా భట్టి అనుచరుడు ఐ తం సత్యంకు ఈ పదవి అప్పగించడం గమనార్హం. నియామకం తర్వాత జరి గిన పరిణామాలను చక్కదిద్దేందుకు భట్టి విక్రమార్కతోపాటు పువ్వాడ అజయ్‌కుమార్ సర్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసమే గురువారం భట్టి విక్రమార్క ముఖ్య అనుచరులైన కూల్‌హోం ప్రసాద్, గ్రంథాలయ చైర్మన్ దుర్గాప్రసాద్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు జావెద్ ఆధ్వర్యంలో అభినందన సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. శుక్రవారం పువ్వాడ అజయ్‌కుమార్ అనుచరులైన ఖమ్మం నగర అధ్యక్షుడు పొ న్నం వెంకటేశ్వర్లు, ఖమ్మం నగర మ హిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పద్మతోపాటు పలువురు మాజీ కౌన్సిలర్లతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఐతం సత్యం అభినందనసభను విజ యవంతం చేయాలని కోరారు. అయి తే ఈ పోస్టర్ ఆవిష్కరణ, విలేకరుల సమావేశానికి రాంరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి వర్గాలతోపా టు రేణుకాచౌదరి వర్గానికి చెందిన వా రెవరూ హాజరు కాకపోవడం విశేషం. -
కాంగ్రెస్‌లో కీచులాటలు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : పోలింగ్ ముహూర్తం సమీపిస్తున్న కొద్దీ జిల్లా కాంగ్రెస్‌లో కీచులాటలు ఎక్కువవుతున్నాయి. ఎన్నికల ముందు వరకు గ్రూపు తగాదాలతో సతమతమయిన కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల వేళ కూడా అదే పంథా కొనసాగుతోంది. పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను దెబ్బతీసేందుకు సొంత పార్టీ నేతలే ప్రయత్నిస్తుండడం, ఒకరంటే మరొకరికి గిట్టక వారి అనుచరులు కొట్టుకోవడం, తమ కులానికి టికెట్ ఇవ్వలేదని కొన్ని సామాజిక వర్గాలు గుర్రుగా ఉండడం, తమకు ప్రాధాన్యం లభించడం లేదని మైనార్టీల ఆగ్రహానికి తోడు.. అసలు జిల్లాలో అభ్యర్థుల పక్షాన ప్రచారం నిర్వహించే కీలక సారథి లేకపోవడంతో ఈ ఎన్నికలలో విజయం సాధించేందుకు కాంగ్రెస్ అభ్యర్థులు ఆపసోపాలు పడాల్సి వస్తోంది. దిశానిర్దేశం చేసే వారు లేకపోవడంతో అసలు ఏ నియోజకవర్గంలో కేడర్ ఏం చేస్తోందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఎన్నికల అవగాహన కుదుర్చుకున్న సీపీఐతో కూడా కొన్ని చోట్ల కాంగ్రెస్ శ్రేణులకు పొంతన కుదరడం లేదు. ఇరుపార్టీల నేతల మధ్య సమన్వయం లోపించడంతో కాంగ్రెస్ - సీపీఐ కూటమికి గడ్డుకాలమేననే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. భద్రాద్రి నుంచి ఖమ్మం ఖిల్లా వరకు... అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో అసమ్మతి జ్వాలలు ఎగసిపడే కాంగ్రెస్ పార్టీలో జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో లుకలుకలున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ రేణుకాచౌదరి వర్గాలుగా కార్యకర్తలు విడిపోయి పనిచేస్తున్నారు. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో కూడా ఈ వర్గ విభేదాలుండగా, అక్కడి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న బలరాంనాయక్‌కు ఎమ్మెల్యేలతో విభేదాలున్నాయి. దీంతో రెండు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోనూ అభ్యర్థులకు వ్యతిరేకంగా కేడర్ పనిచేస్తోంది. ఇల్లెందులో అయితే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా అన్ని పార్టీల ప్రతినిధులతో కలిసి జేఏసీ ఏర్పాటు చేయించి వారి ఓటమి కోసం కృషి చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. లంబాడీ సామాజిక వర్గానికి జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదన్న కారణంతో వారంతా కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమి కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇక, భద్రాచలంలో అయితే ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్, ఎమ్మెల్యే అభ్యర్థి సత్యవతి అనుచరులు బహిరంగంగానే కొట్టుకున్నారు. చొక్కాలు చిరిగేలా కొట్టుకుని, చెప్పులు విసురుకోబోయారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఓటమి కోసం ఎంపీ వర్గం, ఎంపీ అభ్యర్థి ఓటమి కోసం ఎమ్మెల్యే వర్గం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వైరా నియోజకవర్గంలో ఇటీవల జరిగిన సమావేశంలోనూ రచ్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా ఓ నాయకుడిని వేదికపైకి పిలవడంతో మరో వర్గం నేతలు గొడవ చేసి కొట్టుకున్నంత పనిచేశారు. ఇక్కడ సీపీఐ అభ్యర్థికి, కాంగ్రెస్ నేతలకు సమన్వయం కుదరడం లేదు. సీపీఐ పోటీ చేస్తున్న మరో స్థానమైన కొత్తగూడెంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మొన్నటివరకు తమ కార్యకర్తలకు వ్యతిరేకంగా పనిచేసిన సీపీఐ అభ్యర్థి కూనంనేనికి తాము సహకరించేది లేదని అక్కడి కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే చెపుతున్నారు. పినపాకలో కూడా సీపీఐ పోటీచేస్తుండగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడి కాంగ్రెస్ నేతలు పక్కపార్టీల వైపు చూస్తున్నారు. సత్తుపల్లిలో పోటీచేస్తున్న సంభాని చంద్రశేఖర్ చాలా రోజులుగా నియోజకవర్గానికి దూరంగా ఉండడంతో ఇక్కడి కాంగ్రెస్ కేడర్ కూడా ఆయనకు పూర్తిగా సహకరించే పరిస్థితి లేదు. మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేస్తున్న పాలేరులో రేణుక వర్గం సహాయ నిరాకరణ చేస్తుండగా, ఖమ్మం నుంచి పోటీచేస్తున్న పువ్వాడ అజయ్‌కుమార్‌కు సహకరించేందుకు రాంరెడ్డి వర్గం ముందుకు రావడం లేదు. ఇక జిల్లాలోని మైనార్టీలు కూడా కాంగ్రెస్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది మైనార్టీ ఓట్లున్నా కనీసం ఒక్క సీటు కూడా ఇవ్వని కాంగ్రెస్ పార్టీ.. తాజాగా ఏర్పాటు చేసిన జిల్లా సమన్వయ కమిటీలోనూ తమకు స్థానం కల్పించలేదని గుర్రుగా ఉన్నారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశాన్ని కూడా అడ్డుకునేందుకు వారు ప్రయత్నించారు. ఈ క్రమంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న కారణంగా టీడీపీకి దూరమైన మైనార్టీ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి కూడా దూరం కానున్నారనే చర్చ జరుగుతోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్, సీపీఐ అభ్యర్థులు ఏటికి ఎదురీదాల్సి వస్తోందని జిల్లా రాజకీయ వర్గాలంటున్నాయి. ఈ పరిస్థితుల్లో గ్రూపు తగాదాలు, కీచులాటలు జిల్లాలోని కాంగ్రెస్ అభ్యర్థులను ఏం చేస్తాయో వేచి చూడాల్సిందే. -
‘సార్వత్రిక’ సెగ..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లా రాజకీయం పూర్తిస్థాయిలో రసకందాయంలో పడింది. సాధారణ ఎన్నికలలో కీలకఘట్టమైన నామినేషన్ల పర్వానికి తెరలేస్తుండడంతో జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల్లో కదలిక వచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వర్గపోరు, అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న ఈ రెండు పార్టీలు కనీసం ఇంతవరకు అధికారికంగా ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేకపోయాయి. సీపీఐతో పొత్తు వ్యవహారం జిల్లాలో కీలకం కావడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థుల ఖరారు ప్రక్రియ ఓ కొలిక్కి రాలేదు. ఇక, బీజేపీతో పొత్తు కుదుర్చుకునే అంశం జిల్లాలో పెద్దగా ప్రభావం చూపనప్పటికీ, నామా, తుమ్మల వర్గాల పోరుతో టీడీపీ ఆశావాహులు కుదేలవుతున్నారు. మిగిలిన రాజకీయ పక్షాలు అభ్యర్థుల ఖరారు, పొత్తుల విషయంలో కొంత మేర ముందుకెళ్లినా, వాటిలో కూడా పూర్తిస్థాయి స్పష్టత రావాల్సి ఉంది. బీసీలకు టికెట్ వచ్చేనా? జిల్లా కాంగ్రెస్‌లో మునుపెన్నడూ లేని విధంగా అసెంబ్లీ, పార్లమెంటు టికెట్ల కోసం ఆశావాహులు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. ఎంపీ రేణుకాచౌదరి, మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి వ ర్గీయులు టికెట్ల కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఇటు హైదరాబాద్, అటు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రమయిన ఖమ్మం అసెంబ్లీ స్థానం ఎవరికివ్వాలన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పినపాక, కొత్తగూడెం అసెంబ్లీ స్థానాల విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. సీపీఐతో పొత్తులో భాగంగా ఆ రెండు స్థానాల్లో ఏ స్థానంలో పోటీచేయాలన్న దానిపై కాంగ్రెస్ పార్టీలో స్పష్టత లేకుండా పోయింది. భద్రాచ లం, అశ్వారావుపేట లాంటి సిట్టింగ్ స్థానాల్లో పాత వారికే టికెట్లిస్తారని చెబుతున్నా ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. మిగిలిన స్థానాల్లో కూడా స్పష్టత లేకపోయినా పాలేరు నుంచి మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, మధిర నుంచి డిప్యూటీ స్పీకర్ మల్లుభట్టివిక్రమార్క పేర్లకు మాత్రం ఢోకాలేదని పార్టీ వర్గాలంటున్నాయి. అయితే, ఖమ్మం అసెంబ్లీ సీటుకు వనమా వెంకటేశ్వరరావు పేరు కొత్తగా తెరపైకి వచ్చింది. సీపీఐతో పొత్తు కుదిరితే కొత్తగూడెంను సిట్టింగ్ కోటాలో సీపీఐకి ఇవ్వాల్సిన పక్షంలో జిల్లాలో మిగిలిన రెండు జనరల్ స్థానాల్లో ఒకటి బీసీకివ్వాలని హైకమాండ్ వద్ద టీపీసీసీ నేతలు గట్టిగా పట్టుబడుతున్నారు. రెండింటిలో పాలేరు నుంచి మంత్రి రాంరెడ్డి బరిలో ఉంటారు కాబట్టి ఇక మిగిలింది ఖమ్మం ఒక్కటే. ఖమ్మంలో ఇప్పటికే పలువురి పేర్లు వినిపిస్తుండగా, అనుహ్య పరిణామాల మధ్య వనమా పేరును కూడా సీరియస్‌గా పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం. ఖచ్చితంగా బీసీలకివ్వాల్సి వస్తే... వనమాకు ఖరారవుతుందని, లేదా మరో బీసీ నాయకుడు వద్దిరాజు రవిచంద్రకు టికెట్ ఖరారవుతుందని ప్రచారం జరుగుతోంది. రేణుక కూడా తన వర్గానికి టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సుల్తాన్ కూడా ఢిల్లీలో తనకున్న పలుకుబడిని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. ఆర్థిక సహకారం లేకపోతే ఎలా? ఇక, జిల్లా టీడీపీ వ్యవహారం అధినేత చంద్రబాబు నివాసానికి చేరింది. మంగళవారం సాయంత్రం పార్టీ జిల్లా నేతలు ఆయన నివాసంలో చంద్రబాబును కలిసి టికెట్ల కేటాయింపుపై చర్చలు జరిపారు. మాజీ మంత్రి తుమ్మల, ఆయన వర్గీయులు సండ్ర వెంకటవీరయ్య, బాలసాని లక్ష్మీనారాయణతో పాటు ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణకు ఇవ్వాల్సిందేనని పార్టీ నేతలు చంద్రబాబును గట్టిగా అడిగినట్టు సమాచారం. తమ వర్గం నాయకులమంతా ఈనెల తొమ్మిదిన నామినేషన్లు వేస్తున్నామని, ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, అశ్వారావుపేట అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు వేస్తామని అధినేతకు వివరించారు. ఇక, ఖమ్మం పార్లమెంటు అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును ఖరారు చేస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని, అయితే తన పార్లమెంటు పరిధిలోకి వచ్చే అసెంబ్లీ అభ్యర్థులందరికీ ఆయన ఆర్థిక సహకారం చేసేలా ఒప్పందం చేయాలని జిల్లా టీడీపీ నేతలు చంద్రబాబును కోరారు. తన వర్గానికి చెందని వారిని పక్కనపెట్టాలని, ఆయా నియోజకవర్గాల్లో తానే సొంతంగా ముందుకెళ్లాలని నామా ప్రణాళిక రూపొందించుకుంటున్నారని, ఇది అసెంబ్లీ ఫలితాలపై ప్రభావం చూపుతుందని వారు వివరించారు. అందుకు నామా అంగీకరించని పక్షంలో తమ పక్షాన తుమ్మల నాగేశ్వరరావు ఎంపీగా బరిలోకి దిగేందుకు సిద్ధమని కూడా వారు ప్రతిపాదించినట్టు సమాచారం. జిల్లా నేతల అభిప్రాయాలను విన్న చంద్రబాబు అన్నీ తాను సర్దుబాటు చేస్తానని హామీ ఇచ్చినట్టు తెలుగుదేశం వర్గాల భోగట్టా. -
కాంగ్రెస్‌లో ‘ఖమ్మం’ లొల్లి!
ఖమ్మం, న్యూస్‌లైన్: ఖమ్మం అసెంబ్లీ టి కెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో లొల్లి తారస్థాయికి చేరింది. రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, మాజీమంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టికెట్ ఆశిస్తున్నవారితోపాటు వారి మద్దతుదారులు కూడా హస్తినలో చేరి ఎవరికి వారు ఎత్తులుపైఎత్తులు వేస్తున్నారు. ఏవర్గానికి ఆవర్గమే తమతమ అభ్యర్థులకు ఉన్న అర్హతలు, ఎదుటివారి బలహీనతలు ఢిల్లీ పెద్దలముందు ఏకరువు పెడుతున్నారు. బయటకు మాకే సీటు ఖాయం అంటూ ఎవరికి వారే చెప్పుకుంటున్నారు. కాగా, ఇంత రభస నడుమ తెరమీదకు వచ్చిన మరో అంశంపై కూడా ఇప్పుడు పార్టీవర్గాల్లో చర్చజరుగుతోంది. విభేదాలతో తలనొప్పి తెస్తున్న జిల్లాకాంగ్రెస్‌లో ఇరువర్గాలు సూచిస్తున్న ఎవరికీ ఇవ్వకుండా ఖమ్మం అసెంబ్లీనుంచి కొత్త అభ్యర్థిని బరిలో దింపాలని తెలంగాణ పీసీసీ భావిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం హాట్‌టాపిక్‌గా మారింది. పార్టీలు మారేవారికి టికెట్ ఇస్తే పలుచన అవుతాం.. సంవత్సరాల తరబడి పార్టీని నమ్ముకున్న వారిని వదిలిపెట్టి నిన్న మొన్న పార్టీలో చేరిన వారికి టికెట్ ఇస్తే ప్రజల మధ్య పలుచన అవుతామని రాంరెడ్డి వర్గీయులు అధిష్టానం ముందు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రేణుకాచౌదరి మద్దతు తెలుపుతున్న పువ్వాడ అజయ్‌కుమార్ పార్టీలు మారి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారని, ఇప్పుడు టికెట్ ఆశించడం ఎంత వరకు సబబని మంత్రి అనుచరులు ప్రశ్నిస్తున్నారు. పొత్తుల్లో భాగంగా ఖమ్మం పార్లమెంట్ సీపీఐకి ఇస్తే ఆ పార్టీ నుంచి పువ్వాడ నాగేశ్వరరావు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని, అదే జరిగితే ఎమ్మెల్యేగా కుమారుడు, ఎంపీగా తండ్రి బరిలో దిగితే పార్టీని నమ్ముకుని పనిచేసిన వారి పరిస్థితి ఏమిటని అంటున్నారు. పార్టీని వెన్నంటి ఉండి, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్న ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్‌కు అవకాశం ఇవ్వాలని రాంరెడ్డి అధిష్టానానికి చెప్పినట్లు తెలిసింది. ఇలా ఉండగా... ఏది ఏమైనా నా అభ్యర్థిగా పువ్వాడ అజయ్‌కుమార్‌కు టికెట్ ఇవ్వాల్సిందే అని రేణుకాచౌదరి అధిష్టానం వద్ద పట్టుపడుతున్నట్లు సమాచారం. అయితే.. తెలంగాణ ఉద్యమాన్ని ఇన్స్టంట్ కాఫీతో పోల్చిన రేణుకాచౌదరిపై ఆగ్రహంతో ఉన్న టీపీసీసీ నాయకులు తెలంగాణలో టికెట్ల కేటాయింపుపై ఆమె పెత్తనం ఏమిటని అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా, ఖమ్మంలో మైనార్టీ ఓట్లు గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయని, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన అనుభం తనకుందని మాజీ ఎమ్మెల్యే యూనస్ సుల్తాన్ కూడా టికెట్‌కోసం తన అనుచరులతో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. మధ్యే మార్గం వైపు టీపీసీసీ చూపు తమ అనుచరుడికే టికెట్ ఇవ్వాలని రేణుకాచౌదరి, కాదు తమ సన్నిహితుడు మానుకొండకే టిక్కెట్ ఇవ్వాలని రాంరెడ్డి... ఇరువురూ పట్టుపట్టడంతో వీరెవరూ కాకుండా మధ్యే మార్గంగా మరొకరికి టికెట్ ఇస్తే బాగుంటుందని టీపీసీసీ అధిష్టానం ముందు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. ఒక వర్గం వారికి టికెట్ ఇస్తే మరొకరు పార్టీ నుంచి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని, అలా కాకుండా మరొకరి పేరును పరిశీలిస్తే బాగుం టుందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఖమ్మం పార్లమెంటు టిక్కెట్ కోసం పోటీ పడిన గ్రానైట్ పరిశ్రమల యజమాని వద్దిరాజు రవి చంద్రకు అసెంబ్లీ టికెట్ ఇస్తే బాగుంటుందని టీపీసీసీ వర్కింగ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి సూచించినట్లు సమాచారం. లేదంటే పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి ఇవ్వాల్సి వస్తే, ఖమ్మంలో బీసీ వర్గానికే చెందిన సీనియర్ నేత వనమా వెంకటేశ్వరరావు పేరును ఆయన ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇరు వర్గాల వారికి కాకుండా బీసీ వర్గానికి చెందిన రవిచంద్ర లేదా వనమా వెంకటేశ్వరరావుకు ఇస్తే బాగుంటుందని, బీసీలకు కూడా న్యాయం చేసినట్లు అవుతుందనే అభిప్రాయంలో ఏఐసీసీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ఈపరిస్థితులలో టికెట్ ఎవరికి వస్తుందో....తర్వాత ఆ ప్రభావం పార్టీలో ఎలా ఉంటుందో అన్న చర్చ జోరుగా సాగుతోంది. -
అబ్బయ్యా.. చెప్పయ్యా...
చేసిన అభివృద్ధేమిటో చెప్పాలని నిలదీసిన తమ్ముళ్లు ప్రశ్నల జడివానతో ఉక్కిరిబిక్కిరైన ఇల్లెందు ఎమ్మెల్యే అర్ధంతరంగా ముగిసిన పార్టీ బూత్ కమిటీల నియామక సమావేశం ఇల్లెందు, న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీకి చెందిన ఇల్లెందు ఎమ్మెల్యే ఊకె అబ్బయ్యకు తన సొంత పార్టీ కార్యకర్తల నుంచి చేదు అనుభవం ఎదురైంది. నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమిటో చెప్పాలంటూ ఆయనను ‘తెలుగు’ తమ్ముళ్లు నిలదీశారు. తమను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహోదగ్రులయ్యారు. తమపై పోలీసు కేసులు బనాయిస్తూ, జైలుపాలు చేయిస్తున్న మంత్రితో.. ఆయన సోదరుడితో చెట్టపట్టాలేసుకుని ఎందుకు తిరుగుతున్నారంటూ ఉగ్రులయ్యారు. ఈ రసవత్తర సన్నివేశానికి.. టీడీపీ ఇల్లెందు నియోజకవర్గ బూత్ కమిటీల నియామక సమావేశం వేదికగా నిలిచింది. ‘తమ్ముళ్ల’ తీరుతో సమావేశం రసాభాసగా మారింది, చివరికి, ఈ సమావేశాన్ని నాయకులు అర్ధాంతరంగా ముగించారు. ఇలా మొదలైంది... టీడీపీ ఇల్లెందు నియోజకవర్గస్థాయి బూత్ కమిటీల నియామక సమావేశం ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య క్యాంపు కార్యాలయం వద్ద శనివా రం ఏర్పాటైంది. తొలుత, అబ్బయ్య లేచి.. సమావేశ ఉద్దేశాన్ని వివరించారు. ఆ తరువా త, శాసనసభలో చోటుచేసుకున్న పరిణామా లు, ఆంధ్ర-రాయలసీమ-తెలంగాణ ప్రాజెక్టులు తదితరాంశాలపై మాట్లాడుతున్నారు. ఈ దశలో కొందరు కార్యకర్తలు, వివిధ మండలాల నాయకులు జోక్యం చేసుకుని... ‘వాటి గురించి మాకెందుకు? గడిచిన ఐదేళ్లలో నియోజకవర్గంలో ఏ మండలంలో ఏమేమి అభివృద్ధి పనులు చేశారో చెబితే సంతోషిస్తాం’ అని, వ్యంగ్య ధోరణిలో ప్రశ్నించారు. వివిధ మండలాల నాయకులు ఒకరి తర్వాత మరొకరు ప్రశ్నల జడివాన కురిపించారు. ప్రశ్నల జడివాన... ‘మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు గోపాలరెడ్డి కలిసి మాపై నిత్యం పోలీసు కేసులు బనాయిస్తూ జైలుపాలు చేయిస్తున్నారు. మీరు మాత్రం వారితో చెట్టపట్టాలేసుకుని తిరుగుతారు. వారు మీకు ఎలా సన్నిహితులయ్యారు..?’ అని, కామేపల్లి మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు ప్రశ్నించారు. ఐదేళ్ల క్రితం.. ఎన్నికల ముందు సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, నియోజకవర్గానికి విడుదలైన నిధులను మండలాలవారీగా కేటాయించే విషయమై ఎందుకు సమావేశం నిర్వహించలేదు? ‘గత ఎన్నికల సమయంలో పార్టీని సమన్వయం చేసి గెలుపునకు కృషి చేసిన నాయకులు ఇప్పుడు ఈ సమావేశంలో ఎందుకు కనిపించడం లేదు...?’ అని, గార్ల మండలానికి చెందిన ఓ నాయకుడు ప్రశ్నించారు. ‘కామేపల్లి, బయ్యారం, ఇల్లెందు పట్టణ కమిటీలకు గత రెండేళ్లుగా ఎన్నికలను ఎం దుకు నిర్వహించలేదు..?’ అని, కామేపల్లి మండల నాయకులు ప్రశ్నించారు. పార్టీ మండల అధ్యక్షులెవరో తమకు తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అబ్బ’య్య... ఉక్కిరిబిక్కిరి.. ఇలా అనూహ్యంగా కురిసిన ప్రశ్నల జడివాన తో ఎమ్మెల్యే అబ్బయ్య ఉక్కిరిబిక్కిరయ్యారు. ఏమ ని జవాబివ్వాలో ఆయనకు కొంతసేపు పాలుపోలేదు. ‘అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతా’నంటూ నచ్చచెప్పేందుకు పదే పదే ప్రయత్నించారు. ఈ దశలో, పార్టీ నియోజకవర్గ బూత్ కమిటీల ఇంచార్జ్ మూడు కృష్ణప్రసాద్ లేచి మాట్లాడేందుకు ప్రయత్నించారు. ‘మీరు కాదు.. మాకు ఎమ్మెల్యే నుంచి స్పష్టమైన సమాధానం కావాలి’ అని, పార్టీ నాయకులు పట్టుబట్టారు. ప్లీజ్... క్షమించండి... అనంతరం, ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య మాట్లాడుతూ... తన వల్ల పొరపాట్లు జరిగితే క్షమించాలని అభ్యర్థించారు. పార్టీ టికెట్ ఎవరికిస్తే వారిని గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడడం పూర్తవగానే సమావేశం నుంచి దాదాపు అందరూ బయటకు వెళ్లిపోయారు. దీంతో, బూత్ కమిటీల నియామకం జరపకుండానే సమావేశాన్ని నిర్వాహకులు అర్ధాంతరంగా ముగించారు. -
రేపు పెన్షనర్స్ డే
ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌లైన్: జాతీయ పెన్షనర్స్ డే సందర్భంగా ఈ నెల 17న ఖమ్మం నెహ్రూనగర్‌లోని సంఘం భవన్లో పెన్షనర్స్ డే జరుగుతుందని విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కల్యాణం కృష్ణయ్య, రవీందర్ తెలిపారు. ఈ కార్యక్రమ ఆహ్వాన పత్రాలను వారు ఆదివారం ఖమ్మంలో ఆవిష్కరించారు. అనంతరం, వారు మాట్లాడుతూ.. ఖమ్మంలో జరిగే ‘పెన్షనర్స్ డే’కు జిల్లాలోని పెన్షనర్లంతా పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. పలువురు పెన్షనర్లను ఈ కార్యక్రమంలో సన్మానించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ఉద్యానవన శాఖ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్, ఎస్పీ ఎవి.రంగనాధ్, జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్, డీఈఓ రవీంద్రనాధ్ రెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీనివాస్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బయ్య, ట్రెజరీ డిప్యూటీ డెరైక్టర్ నీలిమ తదితరులు పాల్గొంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు వెంకటేశ్వరావు, ప్రచార కార్యదర్శి రాధాకృష్ణారావు, కోశాధికారి డికె.శర్మ, సభ్యులు హనుమంతరావు, రాఘవరావు, జనార్ధన్, లక్ష్మారెడ్డి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
తప్పుడు ప్రచారాలు మానుకోవాలి
కూసుమంచి, న్యూస్‌లైన్: కాంగ్రెస్, వైఎస్సార్సీపీ ఒక్కటేనంటూ పాలేరు నియోజకవర్గంలో మంత్రి రాంరెడ్డి, ఆయన అనుచరులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణ వస్తున్నందున వైఎస్సార్సీపీ.. కాంగ్రెస్‌లో కలుస్తుందని మంత్రి, ఆయన అనుచరులు చేస్తున్న ప్రచారాన్ని వారు మానుకోవాలని మచ్చా శ్రీనివాసరావు హెచ్చరించారు. పాలేరు నియోజకవర్గంలో సభ్యత్వ నమోదుపై శుక్రవారం ఆయన స్థానిక నాయకులతో కూసుమంచిలోని పార్టీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మంత్రి, ఆయన అనుచరులు చేస్తున్న వ్యాఖ్యలను పలువురు నాయకులు ఈ సందర్భంగా మచ్చా దృష్టికి తీసుకురాగా తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ మంత్రి గారు మీరు పెద్ద వారు.. రెండు పార్టీలు ఒకటేనని ప్రచారం చేస్తున్నారని తెలిసింది.. వైఎస్ వల్ల ఎంతో లబ్ధిపొందిన మీరు మా పార్టీ(వైఎస్సార్సీపీ)లోకి వస్తే మీ వయసుని గౌరవించి మీ నాయకత్వంలో పని చేసేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం’అని అన్నారు. రాష్ట్రం విడిపోయినా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అందించిన సంక్షేమ ఫలాలు పొందిన ప్రజలు ఆయన తనయుడు స్థాపించిన పార్టీకి అభిమానులుగా ఉంటారని అన్నారు. ప్రాంతాలు, కులాలు, మతాల కతీతంగా ప్రజల సంక్షేమానికి కృషి చేసిన మహానేత వారి హృదయాల్లో సుస్థిరంగా ఉన్నాడని, ప్రాంతాలు వేరు చేసినంత మాత్రాన ప్రజల హృదయాల నుంచి ఆయన్ను వేరు చేయలేరని అన్నారు. వైఎస్ దయతో జిల్లాలో ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రి, డిప్యూటీ స్పీకర్ పదవులు పొందిన వారు మహానేత దూరమయ్యాక జగన్ మీద, ఆయన కుటుంబం మీద బురదజల్లేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీకి ఒక విధి విధానం ఉందని, రాష్ట్ర విభజన జరిగినా పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని అన్నారు. కార్యకర్తల్లో ఆందోళన సృష్టించి వారిని ఇబ్బందులకు గురిచేయవద్దని అన్నారు. కాంగ్రెస్, వైఎస్సార్సీపీ ఒక్కటయ్యే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని మచ్చా శ్రీనివాసరావు హితవు పలికారు. ఈ సమావేశంలో పార్టీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ మందడపు వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు మార్కం లింగయ్యగౌడ్, జిల్లా నాయకులు అశోక్ రెడ్డి, మండల కన్వీనర్ బజ్జూరి వెంకటరెడ్డి, నాయకులు బయ్య లింగయ్యయాదవ్, బారి శ్రీను, వైవీడీరెడ్డి, డవెల్లి పుల్లారెడి, చాట్ల సత్యనారాయణ, ఎండి మజీద్, కొండా నర్సయ్య, రమేష్‌రెడ్డి, ఈగలపాటి నాగేశ్వరరావు, ఆడెపు వీరబాబు పాల్గొన్నారు. -
మంత్రి వర్సెస్ సర్పంచ్
కూసుమంచి, న్యూస్‌లైన్: పాలేరులో కాంగ్రెస్ వర్గ పోరు మరోసారి పొడచూపింది. సర్పంచ్ రామసహాయం మాధవీరెడ్డి, మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి నడుమ చోటుచేసుకున్న విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. మంత్రి సమీప బంధువైన మాధవీరెడ్డి సర్పంచ్ అయ్యేంత వరకూ ఆయన వెన్నంటే ఉన్నారు. ఇటీవల గ్రామంలో రెండుసార్లు రేణుకాచౌదరితో సభలు పెట్టించడం, ఎంపీ నిధులతో నిర్మించిన రోడ్లకు ఆమెతో శంకుస్థాపన చేయిం చడం స్థానికులను విస్మయం కలిగించింది. సభల్లో వెంకటరెడ్డిపై రేణుకాచౌదరి నిప్పులు చెరగడం, ఆ తర్వాత మంత్రి వర్గీయులు ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడం విదితమే. ఈ నేపథ్యంలో మంత్రికి, సర్పంచ్‌కు మధ్య తీవ్ర విభేదాలు చోటుచేసుకున్నాయి. తాజాగా గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ నిర్మాణ పనుల విషయంలోనూ వారి మధ్య మరోసారి విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆలయ నిర్మాణం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపడుతుండడంతో మంత్రితో భూమి పూజ చేయించేందుకు అధికారులుత శుక్రవారం ఉదయం ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలుసుకుని సర్పంచ్ ముందస్తుగానే తెల్లవారుజామున తన అనుచరులతో అక్కడికి చేరుకుని ఆలయ నిర్మాణ స్థలంలో పూజలు చేశారు. అనంతరం మంత్రి కూడా ఆలయ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈసందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తనకు ఎవరిపై ఎలాంటి కోపం లేదని, కొందరు తెలిసీతెలియని రాజకీయాలు చేస్తున్నారని సర్పంచ్‌ను ఉద్దేశిస్తూ అన్నారు. ఓ దశలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ముహూర్తం బాగాలేకనేనట..! ఆలయ పనులకు వేరుగా శంకుస్థాపన ఎందుకు చేశారని, ప్రొటోకాల్ ప్రకారం అధికారులు మిమ్మల్ని ఆహ్వానించలేదా..? అని సర్పంచ్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరింది. దీనిపై ఆమె మాట్లాడుతూ అధికారులు తనను ఆహ్వానించారని, ఉదయం 11 గంటలకు ఖరారు చేసిన మమూర్తం బాగా లేకపోవడం వల్లే తాను ముందస్తుగా భూమి పూజ చేయాల్సి వచ్చిందని చెప్పారు. గ్రామస్తులకు శుభం కలగాలనే కాంక్షతోనే తెల్లవారుజామున 5 గంటలకు పూజలు చేశానని తెలిపారు. -
రాష్ట్ర విభజనతో నష్టం లేదు
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనతో ఏ ప్రాంతానికీ ఎలాంటి నష్టం ఉండదని రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన ఆదివారం రఘునాధపాలెం మండలంలోని బల్లేపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని పార్టీల అభిప్రాయాలను అధ్యయనం చేసిన తరువాతనే కేంద్ర ప్రభుత్వం విభజన నిర్ణయం తీసుకుందని అన్నారు. రాష్ట్ర విభజనపై కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధి కోసం అలర్లు చేస్తున్నాయని తప్పుబట్టారు. ఇరు ప్రాంతాలు అన్నదమ్ముల మాదిరిగా విడిపోతే వచ్చే నష్టమేమీ లేదన్నారు. హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మంచి నిర్ణయమని అన్నారు. తెలంగాణ ఉద్యమం మొట్టమెదటిగా ఖమ్మం జిల్లాలోనే ప్రారంభమైందని అన్నారు. ఇల్లెందుకు చెందిన రవీంధ్రనాధ్, కలిసెట్టి రాందాస్ కలిసి ఈ ఉద్యమం ప్రారంభించారని అన్నారు. సుదీర్ఘ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని అన్నారు. హైదరాబాదులో అన్ని ప్రాంతాల వారు ఉండవచ్చని, దానికి ఎవరూ అడ్డు చెప్పరని అన్నారు. 2014 నాటికి రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా పీసీసీ (ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఏర్పాటవుతాయని అన్నారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం మార్కెట్ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్, నగర కాంగ్రెస్ కన్వీనర్ రాపర్తి రంగారావు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ శీలంశెట్టి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. -
జయహో తెలంగాణ...
ఖమ్మం, న్యూస్‌లైన్: తెలంగాణ నోట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో జిల్లావ్యాప్తంగా శుక్రవారం సంబురాలు ఘనంగా జరిగాయి. తెలంగాణవాదులు మిఠాయిలు పంచుకున్నారు. బాణసంచా పేల్చి వేడుకలు జరుపుకున్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీజేఏసీ నాయకులు కూరపాటి రంగరాజు, వెంకటపతిరాజు, టీజీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు షేక్ ఖాజామియా, తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోడి లింగయ్య, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బుర్రి వినోద్ కుమార్, నాయకులు వెంక టేష్, కృష్ణ, వీరయ్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి రాంరెడ్డి క్యాంప్ కార్యాలయంలో: ఖమ్మంలో రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తలు స్వీట్లు పంచిపెట్టారు. బాణసంచా కాల్చి వేడుకలు జరుపుకున్నారు. పార్టీ కార్యకర్తలకు మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శీలంశెట్టి వీరభద్రం, నగర కాంగ్రెస్ కన్వీనర్ రాపర్తి రంగారావు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో: నగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలో ఉద్యోగులు సంబురాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచుకుని పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. కార్యాలయం గేటు ముందు బాణసంచా కాల్చారు. కార్యక్రమంలో జిల్లా మున్సిపల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కందూకూరి రాము, కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు కె.శ్రీనివాస్, శ్రీనివాసరావు, లాల్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ట్రెజరీ కార్యాలయంలో: ఖమ్మంలోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో సంబురాలు ఘనంగా జరిగాయి. ఉద్యోగులు స్వీట్లు పంచుకున్నారు. కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ ఖాజామియా, తెలంగాణ ట్రెజరీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణారావు, వేలాద్రి, నాయకులు వెంకటేశ్వరరావు, సాగర్, వై.వెంకటేశ్వర్లు, డిప్యూటీ డెరైక్టర్ కె.నీలిమ, మహిళ నాయకులు శైలజ, సౌజన్య, మంజుల, నాగేంద్ర కుమారి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో: జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలోని రోగులకు టీఎన్జీఓస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు తదితరులు పండ్లు పంచిపెట్టారు. జిల్లా గృహనిర్మాణ శాఖ కార్యాలయంలో ఖమ్మంలోని జిల్లా గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో తెలంగాణ సహాయక ఇంజనీర్లు, వర్క్ ఇన్స్పెక్టర్ల సంఘం ఆధ్వర్యంలో సంబురాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ భాస్కర్, సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకయ్య, కోశాధికారి జెఎస్ఎన్.మూర్తి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎల్.కృష్ణారెడ్డి, ఔట్ సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పి.నరేంద్ర నాథ్, హౌసింగ్ మెనేజర్ బిసిహెచ్.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. జల సౌధలో: ఖమ్మంలోగల జల సౌధ భవనంలోని ఐబీ ఈఈ కార్యాలయంలో ఉద్యోగులు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో ఇరి గేషన్ ఈఈ అంకవీడు ప్రసాద్, ఉద్యోగ జేఏసీ చైర్మన్ కూరపాటి రంగరాజు, నాయకులువెల్పుల శ్రీను, రంగారావు, కృష్టమూర్తి, యాదగి రి, వల్లోజి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. డీసీసీ కార్యాలయంలో: ఖమ్మంలోని జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యాలయంలో తెలంగాణ సంబురాలు ఘనంగా జరిగాయి. కార్యాలయ ఆవరణలో కార్యకర్తలు, నాయకులు టపాసులు పేల్చారు. స్వీట్లు పంచుకున్నారు. కార్యక్రమంలో నాయకులు పులిపాటి వెంకయ్య, కోట గురుమూర్తి, ఎండి.జహీర్ అలీ, నాగండ్ల దీపక్ చౌదరి, మందడపు బ్రహ్మా రెడ్డి, కొత్తా సీతారాములు, వివి.అప్పారావు, వడ్డెబోయిన శంకర్, ఆర్వీయస్ ప్రసాద్, కొరివి వెంకటరత్నం, కేసా బిక్షపతి, జింజిరాల రాజేష్, మాదిరాజు వెంకటేశ్వరరావు, ఎండి.గౌస్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పోరిక లక్ష్మీబాయి, నాయకులు మందపల్లి నాగమణి, జొన్నలగడ్డ అరుణ, నారాయణమ్మ, నగర అధ్యక్షురాలు కొల్లు పద్మ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మంలోని మయూరి సెంటర్లో కాంగ్రెస్ నాయకులు రామిశెట్టి మనోహర్ నాయుడు, కట్ల రంగారావు తదితరులు బాణసంచా కాల్చారు. ఇల్లెందులో: తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో జేఏసీ నాయకులు శుక్రవారం సాయంత్రం ఇల్లెందులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, జేఏసీ డివిజన్ చైర్మన్ పేరూరి అప్పారావు, నాయకులు జానీపాషా, ఎర్రబెల్లి కిష్టయ్య, సిలివేరు సత్యనారాయణ, కంభంపాటి కోటేశ్వరరావు, రామచందర్‌నాయక్, కొత్తిమీర శ్రీను, పోషం, బావ్‌సింగ్, ఖాజా, మడత వెంకటగౌడ్, సురేష్ లాహోటీ పాల్గొన్నారు. కొత్తగూడెంలో: తెలంగాణ మహిళ జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో సంబురాలు జరిగాయి. కన్వీనర్ తేజావత్ కమల కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సుమభాను, మాధవి, నాగకుమారి, పిట్టల కమల, జ్యోతిరాణి, రుక్మిణి, కళాశ్రీ, స్వప్న, శాంత, జాను తదితరులు పాల్గొన్నారు. టీవీవీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో జిల్లా అధ్యక్షుడు చార్వాక, నాయకులు పి.వేణు, పి.శ్రీహరి, రాము, అచ్యుత్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పలుచోట్ల: జిల్లాలో పలుచోట్ల సంబురాలు జరిగాయి. చండ్రుగొండలో అఖిలపక్షం ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ జరిగింది. అశ్వారావుపేట నియోజకవర్గవ్యాప్తంగా వివిధ పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీలు జరిగాయి. భద్రాచలం, వాజేడు, వెంకటాపురం, కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ పార్టీల కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. బోనకల్‌లోని తెలంగాణ-ఆంధ్ర సరిహద్దులో ఇటీవల నిర్మించిన అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణవాదులు నివాళులర్పించారు. మణుగూరులో జరిగిన వేడుకల్లో పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పాల్గొన్నారు. సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, అశ్వాపురం, బూర్గంపాడు, వైరా, జూలూరుపాడు మండలాల్లో సంబురాలు జరిగాయి. -
విభేదాలు బట్టబయలు
ఖమ్మం, న్యూస్‌లైన్: జిల్లా కాంగ్రెస్‌లో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, సహకార సంఘాల చైర్మన్లను సన్మానించే కార్యక్రమానికి రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి రావడంతో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు గైర్హాజరయ్యారు. మంగళవారం జిల్లాకాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు...ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజక వర్గం, అనుచరగణం ఎక్కువగా ఉండే ఇల్లెందు నియోజకవర్గం.., ఖమ్మం అర్బన్ మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు రాలేదు. ఇలా కాంగ్రెస్‌లోని వర్గ విభేదాలను చూసిన పలువురు కొత్త సర్పంచ్‌లు కంగుతిన్నారు. సన్మానం చేస్తామని చెప్పినా సగం మంది కూడా సర్పంచ్‌లు, పీఏసీఎస్ చైర్మన్లు రాకపోవడంతో సన్మానసభను తూతూ మంత్రంగానే ముగించాల్సి వచ్చింది. మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరు... కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లలో ఉత్సాహాన్ని నింపేందుకు ఏర్పాటు చేసిన అభినందన సభకు మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు కుంజా సత్యవతి, రేగ కాంతారావు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. వారితోపాటు ఆయా ప్రాంతాల్లో గెలిచిన సర్పంచ్‌లు, పీఏసీఎస్ చైర్మన్లు కూడా రాకపోవడంతో కావాలనే సభను బహిష్కరించినట్లు తెలుస్తోంది. జిల్లాలో రేణుకాచౌదరి తన ప్రాబల్యం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారిని కాకుండా కొత్తవారిని ప్రోత్సహించి వర్గాలకు ఆజ్యం పోస్తున్నారని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. ఖమ్మం నగర ప్రచార కమిటీల్లో తమ అనుచరులకు స్థానం ఇవ్వలేదనే నెపంతో కమిటీని రద్దు చేసి, ఉత్సాహంగా పనిచేస్తున్న కార్యకర్తలను ఆమె వెనక్కు లాగారని మంత్రి అనుచరులు పలువురు బహిరంగంగానే విమర్శించారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రేణుక అనుచరుడు వడ్డెబోయిన శంకర్రావును ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమిస్తే కావాలనే మంత్రి అనుచరులు అడ్డుపడినట్లు ప్రచారం జరిగింది. అదేవిధంగా పార్టీ కార్యక్రమాలకు రేణుకాచౌదరి వస్తే మంత్రి హాజరు కాకపోవడం వంటి సంఘటనలు పరిపాటిగా మారాయి. దీంతోపాటు ప్రత్యేక తెలంగాణ వాదం బలపడిన తరుణంలో రేణుకాచౌదరి సీమాంధ్రులకు అనుకూలంగా మాట్లాడడాన్ని జిల్లాలోని పలువురు కాంగ్రెస్ నాయకులు నిరసించినట్లు తెలిసింది. ఆమె పాల్గొన్న సమావేశానికి వెళ్లి.. అక్కడ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే మౌనంగా ఉండటం కంటే సభకు హాజరు కాకుండా ఉండటమే మేలని పలువురు నాయకులు సర్పంచ్ల అభినందన సభకు రాలేదని సమాచారం. రేణుకాచౌదరి వ్యాఖ్యల మూలంగా ఎన్నికల బరిలో దిగే అభ్యర్థులకు నష్టం కలుగుతుందని పలువురు నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. రేణుకాచౌదరి సమావేశంలో మాట్లాడుతుండగానే ఇల్లెందు, టేకులపల్లి ప్రాంతాలకు చెందిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ నినాదాలు చేశారు. వ్యతిరేక వర్గం కావాలనే ఇలా చేయించిందని రేణుక అనుయాయులు అంటుండగా...అసలే పార్టీ పరిస్థితి క్లిష్టంగా ఉంటే నాయకుల మధ్య విభేదాలు దేనికి దారితీస్తాయోనని కార్యకర్తలు అంటున్నారు.