ఖమ్మం, న్యూస్‌లైన్: జిల్లా కాంగ్రెస్‌లో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, సహకార సంఘాల చైర్మన్లను సన్మానించే కార్యక్రమానికి రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి రావడంతో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు గైర్హాజరయ్యారు. మంగళవారం జిల్లాకాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు...ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజక వర్గం, అనుచరగణం ఎక్కువగా ఉండే ఇల్లెందు నియోజకవర్గం.., ఖమ్మం అర్బన్ మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు రాలేదు. ఇలా కాంగ్రెస్‌లోని వర్గ విభేదాలను చూసిన పలువురు కొత్త సర్పంచ్‌లు కంగుతిన్నారు. సన్మానం చేస్తామని చెప్పినా సగం మంది కూడా సర్పంచ్‌లు, పీఏసీఎస్ చైర్మన్లు రాకపోవడంతో సన్మానసభను తూతూ మంత్రంగానే ముగించాల్సి వచ్చింది.
మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరు...
కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లలో ఉత్సాహాన్ని నింపేందుకు ఏర్పాటు చేసిన అభినందన సభకు మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు కుంజా సత్యవతి, రేగ కాంతారావు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. వారితోపాటు ఆయా ప్రాంతాల్లో గెలిచిన సర్పంచ్‌లు, పీఏసీఎస్ చైర్మన్లు కూడా రాకపోవడంతో కావాలనే సభను బహిష్కరించినట్లు తెలుస్తోంది. జిల్లాలో రేణుకాచౌదరి తన ప్రాబల్యం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారిని కాకుండా కొత్తవారిని ప్రోత్సహించి వర్గాలకు ఆజ్యం పోస్తున్నారని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. ఖమ్మం నగర ప్రచార కమిటీల్లో తమ అనుచరులకు స్థానం ఇవ్వలేదనే నెపంతో కమిటీని రద్దు చేసి, ఉత్సాహంగా పనిచేస్తున్న కార్యకర్తలను ఆమె వెనక్కు లాగారని మంత్రి అనుచరులు పలువురు బహిరంగంగానే విమర్శించారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రేణుక అనుచరుడు వడ్డెబోయిన శంకర్‌రావును ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమిస్తే కావాలనే మంత్రి అనుచరులు అడ్డుపడినట్లు ప్రచారం జరిగింది. అదేవిధంగా పార్టీ కార్యక్రమాలకు రేణుకాచౌదరి వస్తే మంత్రి హాజరు కాకపోవడం వంటి సంఘటనలు పరిపాటిగా మారాయి. దీంతోపాటు ప్రత్యేక తెలంగాణ వాదం బలపడిన తరుణంలో రేణుకాచౌదరి సీమాంధ్రులకు అనుకూలంగా మాట్లాడడాన్ని జిల్లాలోని పలువురు కాంగ్రెస్ నాయకులు నిరసించినట్లు తెలిసింది.
ఆమె పాల్గొన్న సమావేశానికి వెళ్లి.. అక్కడ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే మౌనంగా ఉండటం కంటే సభకు హాజరు కాకుండా ఉండటమే మేలని పలువురు నాయకులు సర్పంచ్‌ల అభినందన సభకు రాలేదని సమాచారం. రేణుకాచౌదరి వ్యాఖ్యల మూలంగా ఎన్నికల బరిలో దిగే అభ్యర్థులకు నష్టం కలుగుతుందని పలువురు నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. రేణుకాచౌదరి సమావేశంలో మాట్లాడుతుండగానే ఇల్లెందు, టేకులపల్లి ప్రాంతాలకు చెందిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ నినాదాలు చేశారు. వ్యతిరేక వర్గం కావాలనే ఇలా చేయించిందని రేణుక అనుయాయులు అంటుండగా...అసలే పార్టీ పరిస్థితి క్లిష్టంగా ఉంటే నాయకుల మధ్య విభేదాలు దేనికి దారితీస్తాయోనని కార్యకర్తలు అంటున్నారు.
విభేదాలు బట్టబయలు
Published Wed, Oct 2 2013 3:53 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement