Renuka Choudhary
-
ఆ.... 15 ఏళ్లుగా..అంటూనే ఉన్నారు!
జిల్లా వదిలిపెట్టే ప్రసక్తే లేదు త్వరలో వస్తున్నా...ఖమ్మంలోనే మకాం వేస్తా పార్టీ నేతలతో ఎంపీ రేణుకాచౌదరి సాక్షి ప్రతినిధి, ఖమ్మం ‘నేను జిల్లా వదిలి వెళతానని 15 ఏళ్లుగా అంటూనే ఉన్నారు... నేనెక్కడికీ వెళ్లేది లేదు... ఖమ్మం జిల్లాలోనే ఉంటా... త్వరలోనే జిల్లాకు వస్తా.... ఖమ్మంలోనే మకాం వేస్తా... గ్రామ గ్రామాన పర్యటిస్తా.... మీరు ధైర్యంగా ఉండండి’ అని ఎంపీ రేణుకాచౌదరి తన వర్గీయులకు భరోసా ఇచ్చారు. నాయకులంతా మరింత పట్టుదలతో పనిచేయాలని సూచించారు. సోమవారం ఖమ్మం రూరల్ మండలానికి చెందిన ఆరుగురు సర్పంచ్‌లు తమ అనుచరులతో కలిసి హైదరాబాద్‌లోని రేణుక నివాసంలో ఆమెను కలిసినపుడు పైవిధంగా సంభాషించినట్లు సమాచారం. మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి తమను పట్టించుకోవడం లేదని, అభివృద్ధి నిధుల కోసం వెళితే మొండిచేయి చూపుతున్నారని, తమ మండలాభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని సర్పంచ్‌లు కోరారని సమాచారం. ఇదే సందర్భంలో.. మీరు జిల్లా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారని ప్రస్తావించగా రేణుక తీవ్రంగానే స్పందించినట్టు సమాచారం. తానెక్కడికీ వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ఆమె ఎన్ని అడ్డంకులు ఎదురయినా ఇక్కడే పనిచేస్తానని, మున్ముందు మరింత పట్టుదలతో ముందుకెళతానని చెప్పినట్లు సమావేశంలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ నాయకుడొకరు ‘సాక్షి’కి చెప్పారు. తాను ఖమ్మం రాగానే రైతులతో పెద్ద ఎత్తున సదస్సు నిర్వహిద్దామని, ఢిల్లీ నుంచి వ్యవసాయ నిపుణులను అక్కడకు తీసుకువస్తానని ఆమె చెప్పినట్లు సమాచారం. పాలేరు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం 37 పనులకు గాను ఎంపీ లాడ్స్ కింద 1.78 కోట్లు కేటాయిస్తానని ఆమె హామీ ఇచ్చినట్లు సమాచారం. అలాగే సోమవారం రేణుక నివాసంలో జిల్లాకు చెందిన వైరా, కొణిజర్ల, కొత్తగూడెం ప్రాంతాలకు చెందిన నేతలు కూడా కలిసి ఆమెతో జిల్లా రాజకీయాల గురించి చర్చించారు. -
సీఎం కిరణ్‌తో రేణుక భేటీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకాచౌదరి మంగళవారం భేటీ అయ్యారు. వారి మధ్య చర్చలో రాష్ట్ర విభజన, భద్రాచలం, హైదరాబాద్ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. భద్రాచలాన్ని ఏ ప్రాంతంలో ఉంచాలనే అంశంపై కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) ఎలాంటి సిఫార్సు చేస్తుందనేదానిపై వారు చర్చించినట్లు తెలిసింది. చిత్తూరు జిల్లాలో నేడు సీఎం పర్యటన ముఖ్యమంత్రి కిరణ్ బుధవారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తిరిగి గురువారం ఉదయం 10.50 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. కాగా.. ముఖ్యమంత్రి ఈ నెల 24న అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. సింగనమల నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నెల 21నే ఈ కార్యక్రమం జరగాల్సి ఉన్నా జీవోఎం అదే రోజు తెలంగాణ ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్‌కు సమర్పించనున్నట్లు సమాచారం ఉండడంతో సీఎం ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసుకున్నారు. మంత్రి శైలజానాథ్ మంగళవారం సీఎంతో భేటీ అయిన తరువాత మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి కూడా కిరణ్‌కుమార్‌రెడ్డిని కలసి జిల్లా పర్యటనపై చర్చించారు. -
అధ్యక్ష పదవికి వనమా రాజీనామా అనివార్యం!
ఖమ్మం, న్యూస్‌లైన్: జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రోజుకో తీరుగా మారుతోంది. ప్రధానంగా రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి మధ్య ప్రచ్ఛన్నయుద్ధం సాగుతోంది. ఒకరి ప్రాబల్యం తగ్గించేందుకు మరొకరు ఎత్తులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే అనివార్యంగా ఖాళీ అవుతున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలను తమ అనుచరులకు దక్కించుకునేలా నాయకులు కసరత్తు చేస్తున్నారు. ఈ విషయమై పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణతో చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలో అశావహులు ముందస్తు ప్రయత్నాలు మొదలుపెట్టారు. నేతలు కూడా ఎవరికి వారు తమ అనుచరులకు, బంధువులకు పార్టీ పగ్గాలు అప్పగించే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో ప్రత్యర్థి వర్గాలను దెబ్బతీయడంతోపాటు తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. - అనివార్యంగా ఖాళీ కానున్న డీసీసీ పీఠం గత దశాబ్ధకాలంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న వనమా వెంకటేశ్వరరావు ఆ పదవిని అనివార్యంగా వదిలిపెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. తన పదవికి రాజీనామా చేస్తానని వనమా తన అనుచరులతో చెప్పినట్లు తెలిసింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి పోటీలో నిలవాలనే ఉద్దేశంతో జోడు పదవులు ఉంటే టికెట్ రావడం కష్టమని భావించి ముందుగానే డీసీసీ పీఠాన్ని వదులుకుంటున్నట్లు సమాచారం. అయితే ఇటీవల జిల్లాలో చోటు చేసుకున్న వర్గ రాజకీయాల్లో భాగంగా డీసీసీ పీఠంపై తమ అనుచరులనే ఎక్కించాలని జిల్లా నాయకులు ఎవరికి వారు తాపత్రయ పడటం, ఇటీవల భద్రాచలం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుని ఎంపిక సందర్భంగా వనమాకు షోకాజ్ నోటీసు జారీ కావడంతో ఆయనను డీసీసీ నుండి తప్పిస్తున్నారని జిల్లాలో చర్చనీయాంశమైంది. ఏది ఏమైనా తెలంగాణ హడావుడి అయిన తర్వాత వనమా డీసీసీ అధ్యక్ష పదవి నుంచి వెళ్లడం తథ్యమని స్పష్టమవుతోంది. అనుచరుల కోసం నేతల కసరత్తు... జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పీఠం తమ గుప్పిట్లో ఉంచుకోవాలని, అందుకోసం తమ విధేయులను, లేదా బంధువులను ఆ పీఠంపై కూర్చోబెట్టాలని జిల్లాలోని కాంగ్రెస్ దిగ్గజాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇంతకాలం రేణుకాచౌదరికి విధేయుడుగా ఉన్న వనమా వెంకటేశ్వరరావు అధ్యక్షుడిగా ఉండటంతో పార్టీ కార్యాలయంలో తమకు ప్రాధాన్యత తగ్గిందని మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి వర్గీయులు భావించారు. ఇటీవల రేణుకాచౌదరికి వ్యతిరేకంగా విలేకరుల సమావేశం పెట్టేందుకు డీసీసీ కార్యాలయానికి వెళ్తే తమను చిన్నచూపు చూశారని, మైకు, కుర్చీలు కూడా ఇవ్వలేదని మంత్రి వర్గీయులు మండిపడ్డారు. దీనిని దృష్టిలో పెట్టుకొనే భద్రాచలం విషయంపై మంత్రి పట్టుబట్టి వనమాకు షోకాజ్ నోటీసు ఇప్పించారనే ప్రచారం జరిగింది. అందుకోసం డీసీసీ అధ్యక్షునిగా తన సోదరుడు కృష్ణారెడ్డిని కానీ, ముఖ్య అనుచరుడు శీలంశెట్టి వీరభద్రాన్ని కానీ నియమించాలని మంత్రి భావించి పీసీసీకి వారి పేర్లు సూచించినట్లు తెలిసింది. అదేవిధంగా ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కూడా తన తమ్ముడు శ్రీనివాస్‌రెడ్డి, రాపర్తి రంగారావు పేర్లను సూచించనట్లు సమాచారం. ఇటు రేణుకాచౌదరి వర్గీయులకు, అటు మంత్రి అనుచరులకు కాకుండా.. తాను సూచించిన వారికి డీసీసీ అప్పగిస్తే జిల్లాలో అందరినీ కలుపుకొని పోతామని, వర్గాలు లేకుండా చూస్తామని ఉపసభాపతి మల్లు భట్టివిక్రమార్క అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. ఇందుకోసం తన అనుచరులైన సీనియర్ నాయకులు సోమ్లానాయక్, నాగబండి రాంబాబుల పేర్లు పరిగణలోకి తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. కాగా, వనమా వెంకటేశ్వర్రావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పోరిక లక్ష్మీబాయిలకు అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేయడం, ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేణుకాచౌదరి సూచించిన వడ్డెబోయిన శంకర్రావుకు రాకుండా అడ్డుపడటం వంటి వరుస పరాభవాలు చవిచూసిన రేణుక వర్గీయులు డీసీసీ అధ్యక్షపీఠాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం రేణుకాచౌదరి విధేయుడు పరుచూరి మురళితోపాటు మరొకరి పేరును పీసీసీకి సూచించి, వారికే డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని పట్టుబట్టినట్టు సమాచారం. ఇలా ఎవరికి వారు తమ అనుచరులను డీసీసీ పీఠంపై ఎక్కించి తమ సత్తా చాటుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం. ఇటువంటి పరిస్థితిలో డీసీసీ పీఠం ఎవరి వర్గీయులకు దక్కుతుందో... లేదా ప్రస్తుత అధ్యక్షులు వనమా వెంకటేశ్వరరావునే మరికొంత కాలం కొనసాగిస్తారా..? అనేది జిల్లాలో చర్చనీయాంశమైంది. -
రేణుకా చౌదరి తెలంగాణ బిడ్డా?: పొన్నం
హైదరాబాద్ : ఏఐసీసీ అధికారి ప్రతినిధి రేణుకా చౌదరిపై కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ బిడ్డనని చెప్పుకునేందుకు రేణుకా చౌదరికి అర్హత లేదని ఆయన అన్నారు. మంగళవారమిక్కడ సీఎల్పీ కార్యాయలంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పనిలో పనిగా పొన్నం.... ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. సీమాంధ్ర జేఏసీ కన్వీనర్లా కిరణ్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబునాయుడుకు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని పొన్నం వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన అప్రజాస్వామికంగా జరుగుతుందంటున్న సీమాంధ్ర టీడీపీ నేతల వ్యాఖ్యలపై ఎందుకు స్పందించటం లేదని ఆయన ప్రశ్నించారు. మునిగే నావలో తోక పట్టుకుని ఈదవద్దని పొన్నం సూచించారు. -
కాంగ్రెస్‌ది అహంకార ధోరణి: వెంకయ్యనాయుడు
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సభలకు వస్తున్న జన సందోహాన్ని సర్కస్ ప్రదర్శనలకు వెళ్లే జనంతో పోల్చుతూ కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత వెంకయ్య నాయుడు ఆదివారం తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు వారి అహంకార ధోరణికి నిదర్శనంగా నిలుస్తున్నాయని విమర్శించారు. మోడీ సభలకు జనం వస్తుండటంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి శనివారం మాట్లాడుతూ, సర్కస్ ప్రదర్శనలకూ జనం గుంపులుగా వస్తారని వ్యాఖ్యానించారు. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు మానుకోవాలని వెంకయ్య హితవు పలికారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మోడీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి కాంగ్రెస్ నాయకత్వానికి ఏం చేయాలో పాలుపోవడం లేదన్నారు. మోడీ లేవనెత్తుతున్న అంశాలకు రాజకీయంగా సమాధానం చెప్పే సత్తా కాంగ్రెస్‌కు లేదన్నారు. మోడీ సభలకు వస్తున్న జనంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు నిజానికి ప్రజల వివేచనను అవమానించేలా ఉన్నాయన్నారు. -
హస్తినకు ‘పంచాయితీ’!
సాక్షి, కొత్తగూడెం: జిల్లా కాంగ్రెస్‌లో రాజుకున్న చిచ్చు ఇంకా ఆరలేదు. వర్గాల మధ్య పంచాయితీ ఢిల్లీలోని పార్టీ అధిష్టానం పెద్దల వద్దకు చేరింది. బోధన్‌లో నిర్వహించిన తెలంగాణ జైత్రయాత్ర సభకు హాజరైన మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరిపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో ఆమె కూడా ఈ వ్యవహారంపై అమీతుమీ తేల్చుకునేందుకు సోనియాగాంధీని ఆశ్రయించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో ఇరువురు ప్రధాననేతల మధ్య విభేదాలు ఇప్పుడు జిల్లా, రాష్ట్రస్థాయిని దాటి హ స్తినకు చేరుకున్నాయి. మంత్రి రాంరెడ్డికి మద్దతుగా టీ మంత్రుల బృందం రేణుకపై రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేస్తే.. రేణుకాచౌదరి నేరుగా సోనియాగాంధీకే ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. తెలంగాణ జైత్రయాత్ర పేరుతో బోధన్‌లో నిర్వహించిన తొలి సభకు జిల్లా నుంచి మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సభ సమయానికి కొన్ని గంటల ముందే రాంరెడ్డి, పొంగులేటి నిజామాబాద్ చేరుకుని రేణుక విషయమై టీ మంత్రులు, ఎంపీలతో చర్చించారు. ఈ బృందమంతా వారికి బాసటగా నిలవడంతో పాటు ఈ వ్యవహారంలో దేనికైనా సిద్ధంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఆమె విషయమై ఎంపీలు మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్ కూడా రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సమైక్యవాదిగా ఉంటూ తెలంగాణ జిల్లాల నేతల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారని, తెలంగాణలో ఏ జిల్లాలో జైత్రయాత్ర నిర్వహించినా ఆమెను ఆహ్వానించబోమని, ఖమ్మంలో కూడా ఇదే నిర్ణయం ఉంటుందని ఎంపీలు రాహుల్‌కు చెప్పినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన మంత్రికి కొండంత ధైర్యం వచ్చి బోధన్ జైత్రయాత్ర సభలో.. ‘ఈ ప్రాంతంలో పుట్టకున్నా తెలంగాణ ఆడబిడ్డగా చెప్పుకోవడం మన సంస్కృతికి వ్యతిరేకం, ఏ గ్రామంలో పుట్టావో చెప్పాలి’ అని రేణుకనుద్దేశించి మరోసారి ఘాటుగా వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ జిల్లా శ్రేణులు తీవ్రంగా చర్చించుకుంటున్నాయి. కాగా, మంత్రి తనపై కావాలనే వ్యాఖ్యలు చేస్తూ జిల్లా పార్టీ నేతల మధ్య చీలిక తెస్తున్నారని ఆరోపిస్తూ బోధన్ సభలో ఆయన చేసిన విమర్శలను సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్లేందుకు రేణుక సిద్ధమవుతున్నారని తెలిసింది. రేణుక జిల్లా పర్యటన ఎప్పుడో...? ఈ నెల 13, 14 తేదీల్లో రేణుక జిల్లాకు వస్తారని ఊహించిన ఆమె అనుచర నేతలు ఇప్పుడు డీలా పడ్డారు. ఇంత రభస జరుగుతున్నా ఆమె జిల్లాకు రాకపోవడం చర్చనీయాంశమైంది. మంత్రి రాంరెడ్డి తొలుత ప్రకటించినట్లుగా ఈనెల 21న జిల్లాలో జరగాల్సిన తెలంగాణ సభను రేణుకాచౌదరే రద్దు చేయించారని అమె అనుచరులు ప్రచారం చేశారు. అయితే మంత్రి బోధన్ జైత్రయాత్రలో రేణుకపై చేసిన వ్యాఖ్యలతో మళ్లీ కలకలం రేగింది. కాగా, మంత్రి విషయమై తాడోపేడో తేల్చుకునేందుకు రేణుక పావులు కదుపుతున్నారని, త్వరలో ఆమె జిల్లాకు వస్తారని అనుచరులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా రేణుక వర్గంలోని కొందరు నేతలు ఇప్పటికే రాంరెడ్డి గూటికి చేరేందుకు ఆయన అనుచరులతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. -
రేణుక ఖమ్మం వీడాలి
భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్ : తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న రేణుకాచౌదరి అండ్ కంపెనీ ఖమ్మం నుంచి వెళ్లిపోవాలని గాంధీపథం జిల్లా కన్వీనర్ బూసిరెడ్డి శంకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్టానానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్న రేణుకాచౌందరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న రేణుకను జిల్లాకు రానిచ్చేలేదంటూ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించడాన్ని తాను ఏకీభవిస్తున్నానన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలను చేసిన నెహ్రూ కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీతో రేణుక తనను పోల్చుకోవడం పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆమె కారణంగా జిల్లాలో పార్టీ కాంగ్రెస్ అభిమానులు రోజురోజుకు తగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూపు, బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు ఎక్కువయ్యాయని దుయ్యపట్టారు. 1999లో రేణుక ఖమ్మంలో పోటీ చేసి లక్షా 2వేల ఓట్ల మెజారిటీతో గెల్చారని, 2004లో ఆ మెజారిటీ 56వేలు తగ్గిందని, 2009లో లక్షా 36వేల మెజారిటీ తేడాతో ఓడిపోయారని గుర్తు చేశారు. దీన్నిబట్టి ఆమెకు జిల్లాలో ఏపాటి ప్రజాదరణ ఉందో ఇట్టే అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తిరుగులేని ముఖ్యమంత్రిగా పాలించిన మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డితోనూ రేణుక బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడ్డారని బూసిరెడ్డి మండిపడ్డారు. -
ఎక్కడి ఆడబిడ్డవో చెప్పాలంటూ విసుర్లు
సాక్షి, కొత్తగూడెం: జిల్లా కాంగ్రెస్‌లో నిన్న మొన్నటివరకు అంతర్గతంగా సాగుతున్న పోరు బహిరంగమై తీవ్రరూపం దాల్చింది. ఎంపీ రేణుకాచౌదరికి చెక్‌పెట్టడానికి ప్రత్యర్థి వర్గం రంగం సిద్ధం చేసింది. రాష్టమ్రంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‘ఆడబిడ్డ’పై వ్యాఖ్యలు చేయడం, ఈనెల 21న జరిగే సభకు రేణుకను ఆహ్వానించే విషయాన్ని మంత్రుల సమన్వయకమిటీ చూసుకుంటుందని ప్రకటించడం చూస్తే జిల్లా రాజకీయాల్లో రేణుక పాత్రను ముగించటానికి పావులు వేగంగానే కదులుతున్నాయనే చర్చ పార్టీ శ్రేణుల్లో నడుస్తోంది. రానున్న ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ సీట్ల పంపకంపై తన ముద్ర ఉండాలని రేణుకాచౌదరి భావిస్తుండగా... ఆమెను ఎలాగైనా జిల్లాకు దూరం పెట్టాలని ఆమె వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటి పైకి వస్తున్నాయి. గతంలో సమైక్యం వినిపించిన రేణుకకు తెలం‘గానం’తో చెక్ పెట్టేందుకు ఇదే మంచి అదునని, అందుకు తెలంగాణ కృతజ్ఞత సభను వేదికగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం ఆమె ఏంచేస్తున్నా మౌనంగా ఉన్న రాంరెడ్డి...బహిరంగంగా విమర్శలు గుప్పించడం చూస్తే అవసరమైతే హస్తిన స్థాయిలోనైనా అమీతుమీ తేల్చుకునేందుకు రేణుక ప్రత్యర్థివర్గం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి రేణుకపై జిల్లా కాంగ్రెస్ నాయకులలో గూడుకట్టుకున్న వ్యతిరేక భావన గతకొద్ది రోజులుగా బయటపడుతూనే ఉంది. తెలంగాణ విజయోత్సాహంలో ఉన్న నేతలు ఇటీవల నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విషయంలో రేణుక జోక్యం చేసుకొని ఇప్పుడే సభలెందుకని నాయకులను కట్టడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈపరిస్థితుల్లో.. ఆమె సమైక్యవాదానికి కట్టుబడి ఉందని, తామెందుకు సభలు నిర్వహించవద్దని ద్వితీయ శ్రేణి నాయకులు తమ నేతలను ప్రశ్నిస్తూ వచ్చారు. అయినా సభలు నిర్వహించేందుకు డీసీసీ తరఫున, నియోజకవర్గాల వారీగా నేతలు ముందుకు రాలేదు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌లో భేటీ అయిన సందర్భంగా ఈ సమావేశానికి రేణుకాచౌదరి కూడా హాజరయ్యారు. సమైక్యవాదం వినిపిస్తున్న ఆమె ఈ సమావేశానికి ఎందుకు వచ్చారని మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు, సూర్యాపేట ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఎంపీ పొన్నం ప్రభాకర్‌లు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె విషయంలో మెత్తబడి ఉంటే రాజకీయంగా భవిష్యత్ ఉండదని తెలంగాణ ప్రజాప్రతినిధులు జిల్లా నేతలకు హితబోధ చేసినట్లు సమాచారం. దీంతో రాజకీయంగా తనకు అడ్డు తగులుతూ ఈ జిల్లా కాకున్నా పెత్తనం చెలాయిస్తున్న రేణుకపై గుర్రుగా ఉన్న మంత్రి రాంరెడ్డి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. కలిసి వచ్చిన తెలంగాణ సభ.. తెలంగాణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో జిల్లాలో తన సత్తాచాటాలన్న ఉద్దేశంతో తెలంగాణ సభ నిర్వహణ బాధ్యతను మంత్రి భూజానకెత్తుకున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 21న ఖమ్మంలో ‘కృతజ్ఞత సభ’ నిర్వహించాలని తలపెట్టారు. జిల్లా నలుమూలల నుంచి భారీ ఎత్తున క్యాడర్‌ను తరలించాలన్న ఉద్దేశంతో గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల బాధ్యులను కలుపుకొని పోతూ... సభను విజయవంతం చేస్తే రాజకీయంగా పునాది బలోపేతం అవుతుందని, మనస్పర్థలు వీడి అందరం ఐక్యంగా ఉంటేనే విజయం సాధిస్తామన్న రీతిలో వారికి నచ్చజెపుతున్నట్లు సమాచారం. ఇటు పార్టీ పరంగా జిల్లాలో ఈ సభతో తన ఈమేజ్‌ను పెంచుకోవడంతో పాటు.. అటు రేణుకాచౌదరికి చెక్ పెట్టాలన్న వ్యూహంలో మంత్రి ఉన్నట్లు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చజరుగుతోంది. తెలంగాణ సభ అందుకు పూర్తి వేదికవుతుందని, ఈ సభకు వచ్చే నేతలంతా ఏకతాటిపై ఉంటారని, ఇక రేణుకాచౌదరికి కొద్దొగొప్పో ఉన్న అనుచర గణం కూడా ఇటువైపే రావాలని.. లేకుంటేవారికి భవిష్యత్ ఉండదన్నది చర్చనీయాంశంగా మారింది. రేణుకపై నేరుగా విమర్శనాస్త్రాలు.. అధిష్టానం వద్ద లాబీయింగ్ ఉన్న రేణుకాచౌదరిపై పార్టీ నేతలు ఏనాడు విమర్శలు చేయలేదు. ఆమెతో పెట్టుకుంటే తమకు రాజకీయ భవిష్యత్ ఉండదని భావించిన నేతలు.. ఆమె వారిని ఎన్ని అవమానాలకు గురి చేసినా సహించారు. కానీ మంత్రి వెంకటరెడ్డి ఇప్పుడు అనూహ్య రీతిలో విమర్శనాస్త్రాలు సంధించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘రేణుకాచౌదరి తెలంగాణ వ్యతిరేకి అనే భావన ఉంది.. ఆమెను తమ ఆడపడుచుగా జిల్లా వాసులు గుర్తించడం లేదు.. ఈనెల 21న సభకు ఆమెను ఆహ్వానించే విషయమై నిర్ణయం తీసుకోలేదు’ అంటూ ఆమెపై వ్యతిరేకతను కుండబద్దలు కొట్టారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ నేతలు షాక్‌కు గురయ్యారు. సమైక్యవాదం వినిపించిన రేణుకాచౌదరిని మంత్రి ఎలాగైనా జిల్లా రాజకీయాల నుంచి దూరం చేస్తారని, అందుకు ఆయన మాటలే నిదర్శనమని..ఇందుకు కృతజ్ఞత సభ వేదిక అవుతుందని ఆయన వర్గీయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి కౌంటర్‌గా రేణుక శిబిరం ఎలాంటి ఎత్తుగడ వేస్తుందో చూడాలి. రేణుకపై మంత్రి రాంరెడ్డి సంచలన వ్యాఖ్యలు దమ్మపేట, న్యూస్‌లైన్: ‘ ఈ జిల్లాకు మంచి సంస్కృతి ఉంది..జలగం వెంగళరావును రెండుసార్లు గెలిపించాం..కొండలరావును గెలిపించాం..ఈ ప్రాంత వాసులు కాకపోయినా పీవీ రంగయ్యనాయుడు, నాదెండ్ల భాస్కరరావును, రేణుకాచౌదరిని గెలిపించాం.. కేంద్రమంత్రిని చేశాం..ఇక ఇతర ప్రాంతాల వారిని మోసే శక్తి మా వద్దలేదు..జిల్లా ఆడబిడ్డనని చెప్పుకుంటున్న వారే ఎక్కడి వారో ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది’ అంటూ రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరిని ఉద్దేశించి సంచనల వ్యాఖ్యలు చేశారు. మంగళవారం దమ్మపేట మండలం అంకంపాలెంలో గిరిజన బాలికల జూనియర్ కళాశాల ప్రారంభించిన అనంతరం స్థానిక ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన, ఎంఎల్‌సి పొంగులేటి సుధాకర్‌రెడ్డిలతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఏ గ్రామంలో అయినా జనన, మరణ జాబితాలుంటాయని.., ఈ జిల్లా ఆడబిడ్డగా చెప్పుకుంటున్న వారు ఎక్కడ పుట్టారో చెప్పాలన్నారు. జిల్లాలో లక్షలాది మంది గిరిజన ఆడబిడ్డలున్నారని, ఆమె ఎక్కడి ఆడబిడ్డో చెప్పాలన్నారు. నాడు ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు వలసవాదులను ఆదరించామని, ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఏర్పడుతున్న నేపధ్యంలో ఇతర ప్రాంతాల వారిని తాము మోయలేమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో ఎంపిగా ఎవరిని నిలబెట్టినా పని చేస్తామని, అయితే ఇతర ప్రాంతాల వారి విషయంలో మాత్రం మా వాదనలు అధిష్టానం వద్ద తప్పక వినిపిస్తామన్నారు. పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీని తిట్టి, స్వతంత్రంగా పోటీ చేసి ఓడిపోయిన చాలా మంది తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అలాంటి వారందరూ రెండేళ్లపాటు పార్టీ కోసం పనిచేసిన తర్వాతనే వారి గురించి పార్టీ ఆలోచన చేస్తుందన్నారు. సమావేశంలో డీసీసీ కార్యదర్శి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఏఎంసి చైర్మన్ సున్నం నాగమణి, జిల్లా నాయకులు కట్ల రంగారావు, రామిశెట్టి మనోహర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
టార్గెట్ ‘ఖమ్మం’
సాక్షి, కొత్తగూడెం : కాంగ్రెస్‌పార్టీలో ఆశావహులు అప్పుడే సీట్ల కోసం తహతహలాడుతున్నారు. రానున్నది ఎన్నికల సీజన్ కావడంతో ఎవరికివారు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎంపీ రేణుకాచౌదరి, మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి తమ అనుంగు శిష్యులకు ఖమ్మం సీటు ఇప్పించడానికి అప్పుడే హామీలిస్తున్నారనే చర్చ జోరందుకుంది. అయితే రేణుకాచౌదరి ఈ వ్యవహారంలో ఒకడుగు ముందుకేయడంతో పార్టీలో ప్రధాననేతలు ఆమెపై మండిపడుతున్నారని కాంగ్రెస్ శ్రేణులే గుసగుసలాడుతున్నాయి. జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో ఏడు రిజర్వుకాగా మిగతా జనరల్ స్థానాలు ఖమ్మం, పాలేరు, కొత్తగూడెంలో అభ్యర్థుల ఎంపిక పార్టీలకు తలకుమించిన భారమే. కాంగ్రెస్ పార్టీలో ఈ విషయంలో ప్రతిసారి విభేదాలు భగ్గుమంటున్నాయి. ప్రధానంగా ఖమ్మం విషయంలో రేణుకాచౌదరి అధిపత్యానికి చెక్ పెట్టాలని ఆపార్టీ ముఖ్యనేతలు ప్రయత్నించి విఫలమవుతున్నారు. గతంలో తనకు అనుకూలంగా ఉన్న యూనిస్సుల్తాన్కు సీటు ఇప్పించడంతో.. పార్టీ శ్రేణులు అంతర్గంగా ఆమె తీరుని వ్యతిరేకించారు. దీంతో ఆమె అభ్యర్థిగా బరిలోకి దిగిన యూనిస్సుల్తాన్కు డిపాజిట్ కూడా దక్కలేదు. ఈ ప్రభావం స్వయంగా తనపై కూడా పడడంతో ఆమె కూడా ఓటమి పాలయ్యారు. ఆతర్వాత ఎలాగైనా ఖమ్మంలో పట్టుకోసం ఆమె పడరాని పాట్లు పడ్డారు. రాజ్యసభ కోటాలో ఎంపీ పదవి దక్కించుకొన్న రేణుక మళ్లీ జిల్లాలో చక్రం తిప్పాలనే ఆలోచనతో తరచూ జిల్లాకు వస్తూ తన అనుచర గణంలో పదవుల ఆశ చూపుతూ వచ్చారు. ఈ తరుణంలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో పువ్వాడ అజయ్‌కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరి రేణుక శిబిరంలో నేతగా కొనసాగుతున్నారు. ఖమ్మం సీటును ఇప్పిస్తానని రేణుకాచౌదరి హామీ ఇవ్వడంతోనే అజయ్ పార్టీలోకి వచ్చారని ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. మొన్నటి వరకు తనకు గాఢ్ ఫాదర్‌గా ఉన్న రేణుకాచౌదరి చేయివ్వడంతో యూనిస్‌సుల్తాన్ నిరాశకు గురయ్యారు. మళ్లీ ఎలాగైనా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న ఆయన గతంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి.. ప్రస్తుత కేంద్ర మంత్రి ఆజాద్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మైనార్టీ కోటాలో తనకు ఖమ్మం నుంచి పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని సుల్తాన్ తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో తన ఆధిపత్యం కొనసాగాలని, తన మాట వినేవారు ఉంటే.. ఏదైనా సాధించవచ్చన్న రీతిలో రేణుక వ్యవహరిస్తున్నారని ఆపార్టీ నేతలు రుసరుసలాడుతున్నారు. ఖమ్మం సీటుపై మంత్రాంగం.. రాజకీయంగా ఎప్పటి నుంచో తన అనుచరునిగా ఉండి, ప్రస్తుతం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఉన్న మానుకొండ రాధాకిషోర్‌కు ఈసారి ఖమ్మం సీటు ఇప్పించాలన్న యోచనలో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ఉన్నట్లు సమాచారం. తాను పాలేరు నుంచి బరిలో నిలిచి విజయం సాధిస్తానని, మానుకొండ ఖమ్మంలో విజయం సాధిస్తే.. తన వర్గ బలం పెరుగుతుందన్న భావనలో మంత్రి ఉన్నారు. అయితే ఖమ్మం సీటు విషయంలో రేణుకాచౌదరి కొరకరాని కొయ్యగా మారడంతో ఏంచేయాలో మంత్రి పాలుపోలేని స్థితిలో ఉన్నారు. మరోవైపు.. రేణుక హామీ ఇవ్వడం వల్లే పువ్వాడ అజయ్‌కుమార్ కాంగ్రెస్పార్టీలోకి వచ్చారని, నిన్నగాక మొన్న వచ్చిన వారికి టికెట్ ఇప్పిస్తానని ఎలా హామీ ఇస్తారని మానుకొండ ఆమెపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. ఇటీవల జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమానికి మంత్రి, మానుకొండ గైర్హాజరు కావడంతో పాటు రాంరెడ్డి అనుచర సర్పంచ్‌లు ఎవ్వరూ ఈ కార్యక్రమానికి రాకపోవడం..రేణుక, మంత్రి మధ్య అగాధం మరింత పెరిగిందనడానికి నిదర్శనమని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మొత్తంగా రేణుకకు చెక్ పెట్టి తన శిష్యుడు మానుకొండకు టికెట్ ఖరారు చేయించుకోవాలని, ఇప్పటి నుంచే మానుకొండను రంగంలోకి దింపితే ఇటు తనకు, అటు అతనికి ప్రయోజనకరంగా ఉంటుందన్న ఆలోచనలో మంత్రి ఉన్నట్లు సమాచారం. ఇక దూరం పెట్టాల్సిందే.. తెలంగాణ విభజన వ్యవహారంలో రేణుకాచౌదరి వ్యవహారం మింగుడు పడని నేతలు ఆమెను జిల్లాకు శాశ్వతంగా దూరంగా పెట్టాలని ప్రయత్నిస్తూ ఆదిశగా పావులు కదుపుతున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీలో చిచ్చుపెడుతున్న రేణుకకు ప్రాధాన్యం ఎందుకు ఇవ్వాలని ద్వితీయ శ్రేణి నాయకులు మరోవైపు తమ ముఖ్యనేతలను ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడో వచ్చి ఆర్భాటం చేస్తున్న ఆమెకు ఎందుకు ఘనంగా స్వాగతం పలకాలని, ఆసలు ఆమె మాటే వినవద్దని, ప్రజాబలం లేని ఆమెను పట్టించుకోకుంటేనే జిల్లాలో మళ్లీ తమ సత్తా చాటవచ్చని నాయకులు గుసగుసలాడుతున్నారు. ఇటీవల సర్పంచ్ ఎన్నికల సమయంలో పార్టీకి ఎలాంటి సహకారం ఇవ్వలేదని, తామే ఉన్నంతలో ఖర్చు చేసి సర్పంచ్‌లను గెలిపించుకున్నామని, సన్మానం చేయడానికి ఆమె ఎవరని నేతలు బహాటంగానే ప్రశ్నిస్తున్నారు. ఇలా జరగబోయే ఎన్నికల్లో ఆధిపత్యం చాటేందుకు జిల్లా కాంగ్రెస్ నేతలు పడుతున్న పాట్లు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. -
విభేదాలు బట్టబయలు
ఖమ్మం, న్యూస్‌లైన్: జిల్లా కాంగ్రెస్‌లో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, సహకార సంఘాల చైర్మన్లను సన్మానించే కార్యక్రమానికి రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి రావడంతో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు గైర్హాజరయ్యారు. మంగళవారం జిల్లాకాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు...ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజక వర్గం, అనుచరగణం ఎక్కువగా ఉండే ఇల్లెందు నియోజకవర్గం.., ఖమ్మం అర్బన్ మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు రాలేదు. ఇలా కాంగ్రెస్‌లోని వర్గ విభేదాలను చూసిన పలువురు కొత్త సర్పంచ్‌లు కంగుతిన్నారు. సన్మానం చేస్తామని చెప్పినా సగం మంది కూడా సర్పంచ్‌లు, పీఏసీఎస్ చైర్మన్లు రాకపోవడంతో సన్మానసభను తూతూ మంత్రంగానే ముగించాల్సి వచ్చింది. మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరు... కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లలో ఉత్సాహాన్ని నింపేందుకు ఏర్పాటు చేసిన అభినందన సభకు మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు కుంజా సత్యవతి, రేగ కాంతారావు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. వారితోపాటు ఆయా ప్రాంతాల్లో గెలిచిన సర్పంచ్‌లు, పీఏసీఎస్ చైర్మన్లు కూడా రాకపోవడంతో కావాలనే సభను బహిష్కరించినట్లు తెలుస్తోంది. జిల్లాలో రేణుకాచౌదరి తన ప్రాబల్యం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారిని కాకుండా కొత్తవారిని ప్రోత్సహించి వర్గాలకు ఆజ్యం పోస్తున్నారని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. ఖమ్మం నగర ప్రచార కమిటీల్లో తమ అనుచరులకు స్థానం ఇవ్వలేదనే నెపంతో కమిటీని రద్దు చేసి, ఉత్సాహంగా పనిచేస్తున్న కార్యకర్తలను ఆమె వెనక్కు లాగారని మంత్రి అనుచరులు పలువురు బహిరంగంగానే విమర్శించారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రేణుక అనుచరుడు వడ్డెబోయిన శంకర్రావును ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమిస్తే కావాలనే మంత్రి అనుచరులు అడ్డుపడినట్లు ప్రచారం జరిగింది. అదేవిధంగా పార్టీ కార్యక్రమాలకు రేణుకాచౌదరి వస్తే మంత్రి హాజరు కాకపోవడం వంటి సంఘటనలు పరిపాటిగా మారాయి. దీంతోపాటు ప్రత్యేక తెలంగాణ వాదం బలపడిన తరుణంలో రేణుకాచౌదరి సీమాంధ్రులకు అనుకూలంగా మాట్లాడడాన్ని జిల్లాలోని పలువురు కాంగ్రెస్ నాయకులు నిరసించినట్లు తెలిసింది. ఆమె పాల్గొన్న సమావేశానికి వెళ్లి.. అక్కడ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే మౌనంగా ఉండటం కంటే సభకు హాజరు కాకుండా ఉండటమే మేలని పలువురు నాయకులు సర్పంచ్ల అభినందన సభకు రాలేదని సమాచారం. రేణుకాచౌదరి వ్యాఖ్యల మూలంగా ఎన్నికల బరిలో దిగే అభ్యర్థులకు నష్టం కలుగుతుందని పలువురు నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. రేణుకాచౌదరి సమావేశంలో మాట్లాడుతుండగానే ఇల్లెందు, టేకులపల్లి ప్రాంతాలకు చెందిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ నినాదాలు చేశారు. వ్యతిరేక వర్గం కావాలనే ఇలా చేయించిందని రేణుక అనుయాయులు అంటుండగా...అసలే పార్టీ పరిస్థితి క్లిష్టంగా ఉంటే నాయకుల మధ్య విభేదాలు దేనికి దారితీస్తాయోనని కార్యకర్తలు అంటున్నారు. -
జిల్లా అవతరణ వేడుకలు పదికాలాలు గుర్తుండాలి...
ఖమ్మం కల్చరల్, న్యూస్‌లైన్: జిల్లా అవతరణ వేడుకలు పదికాలాల పాటు చక్కగా గుర్తుండేలా నిర్వహించేందుకు జిల్లా ప్రజలు సహకరించాలని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ కోరారు. జిల్లా ఏర్పాటై 60 సంవత్సరా లు పూర్తై సందర్భంగా ఖమ్మంలోని స్తంభాద్రి గుట్టపై శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయంలో మంగళవారం అవతరణ వేడులు ప్రారంభిం చారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అవతరణ వేడుకలను వచ్చే జనవరి 26వ తేదీ వరకు నిర్వహిం చనున్నట్లు తెలిపారు. అవతరణ వేడుకలను జిల్లా స్థాయిలోనే కాకుండా డివిజన్, మండల, గ్రామ స్థాయిలో నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఆవిర్భావం నుంచి నేటి వరకు జిల్లా అభివృద్ధికి సహకరించిన ప్రముఖులను ఈ సందర ్భంగా సత్కరించనున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి సమాచారం సేకరిం చేందుకు కృషి చేస్తున్నామని, అందులో భాగంగా ప్రజలు తమ అభిప్రాయాలు తెలిపేందుకు వీలుగా జుజ్చిఝఝ్చఝ60డ్ఛ్చటటఃజఝ్చజీ.ఛిౌఝను ఏర్పాటు చేశామని అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యురాలు గారపాటి రేణుకాచౌదరి మాట్లాడుతూ ఖమ్మంజిల్లా జ్యోతిని దేశమంతా ప్రతిబింబించేలా అవతరణ వేడుకలు నిర్వహిస్తామని అన్నారు. ప్రజలందరికీ జిల్లా చరిత్ర తెలిసేలా సమగ్ర సమాచారంతో ఒక సావనీర్‌ను రూపొందించనున్నట్లు తెలిపారు. జిల్లాకు వచ్చే రహదారులపై ప్రవేశమార్గాలలో 60 వసంతాల చిహ్నాలతో ద్వారాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఖమ్మంను గ్రేటర్ ఖమ్మంగా తీర్చిదిద్దడానికి నిర్ణయించామని అన్నారు. దీనికోసం జిల్లాలోని అన్ని పార్టీల ప్రజా ప్రతినిధుల సలహాలు, సూచనలు తీసుకుంటామని, సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని జిల్లా అధికార యంత్రాంగానికి సూచించారు. శాసనసభ ఉపసభాపతి మల్లుభట్టివిక్రమార్క మాట్లాడుతూ గత 60 ఏళ్ల కాలంలో ఖమ్మంజిల్లా వివిధ రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిందని, జిల్లాలోని సహ జవనరులను సమర్ధవంతంగా వినియోగించుకుని మరింత వడివడిగా అభివృద్ధి చెందాలని అన్నారు. జనవరి 26 వరకు నిర్వహించే ఈ వేడుకల్లో భాగంగా దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరిం చుకుని మధిరలో ‘మధిరోత్సవాలను’ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన, జిల్లా ఎస్పీ రంగనాధ్, జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్, అడిషనల్ జాయింట్ కలెక్టర్ బాబురావు, మెప్మా పీడీ వేణుమనోహర్, డీఈఓ రవీంద్రనాధ్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ చేకూరి కాశయ్య, జిల్లా సాంస్కృతికమండలి సభ్యులు వీవీ అప్పారావు, నాగబత్తిని రవి, వివిధ శాఖల అధికారులు, పలువురు కవులు, కళాకారులు, రచయితలు, వివిధ వర్గాల ప్రముఖులు పాల్గొన్నారు. ఎంపీ రేణుకాచౌదరి జ్యోతి ప్రజ్వలనచేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె 60 వసంతాల కేక్‌ను కట్‌చేశారు. ఘనస్వాగతం: అవతరణ వేడుకల కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీస్తంభాద్రి గుట్టకు వచ్చిన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులకు ఘన స్వాగతం లభించింది. దేవాలయ కమిటీ చైర్మన్ శనగవరపు ప్రసాద్, కార్యనిర్వహణాధికారి కొత్తూరు జగన్మోహన్రావు, అర్చకులు నరహరి నరసింహాచార్యులు, కృష్ణమాచార్యులు, శ్రీనివాసాచార్యులు నేతృత్వంలో వారికి ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భం గా అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రీలక్ష్మినరసింహస్వామికి, శ్రీలక్ష్మి అమ్మవారికి పూజలు చేశారు. జిల్లా అవతరణ వేడుకల ప్రారంభ సూచికగా ఎంపీ రేణుకచౌదరి, డిప్యూటీ స్పీకర్ భట్టివిక్రమార్క, ఎమ్మెల్యే మిత్రసేన తదితరు లు బెలూన్లను గాలిలో ఎగురవేశారు. కళాకారులు మొగిలి వెంకటేశ్వర్లు, మిమిక్రీ సుధాకర్, కిన్నెర జాన్, ఫైర్ రవి తమ ఆట పాటలతో అలరించారు.