జిల్లా వదిలిపెట్టే ప్రసక్తే లేదు
త్వరలో వస్తున్నా...ఖమ్మంలోనే మకాం వేస్తా
పార్టీ నేతలతో ఎంపీ రేణుకాచౌదరి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం
‘నేను జిల్లా వదిలి వెళతానని 15 ఏళ్లుగా అంటూనే ఉన్నారు... నేనెక్కడికీ వెళ్లేది లేదు... ఖమ్మం జిల్లాలోనే ఉంటా... త్వరలోనే జిల్లాకు వస్తా.... ఖమ్మంలోనే మకాం వేస్తా... గ్రామ గ్రామాన పర్యటిస్తా.... మీరు ధైర్యంగా ఉండండి’ అని ఎంపీ రేణుకాచౌదరి తన వర్గీయులకు భరోసా ఇచ్చారు. నాయకులంతా మరింత పట్టుదలతో పనిచేయాలని సూచించారు. సోమవారం ఖమ్మం రూరల్ మండలానికి చెందిన ఆరుగురు సర్పంచ్‌లు తమ అనుచరులతో కలిసి హైదరాబాద్‌లోని రేణుక నివాసంలో ఆమెను కలిసినపుడు పైవిధంగా సంభాషించినట్లు సమాచారం. మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి తమను పట్టించుకోవడం లేదని, అభివృద్ధి నిధుల కోసం వెళితే మొండిచేయి చూపుతున్నారని, తమ మండలాభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని సర్పంచ్‌లు కోరారని సమాచారం. ఇదే సందర్భంలో.. మీరు జిల్లా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారని ప్రస్తావించగా రేణుక తీవ్రంగానే స్పందించినట్టు సమాచారం. తానెక్కడికీ వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ఆమె ఎన్ని అడ్డంకులు ఎదురయినా ఇక్కడే పనిచేస్తానని, మున్ముందు మరింత పట్టుదలతో ముందుకెళతానని చెప్పినట్లు సమావేశంలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ నాయకుడొకరు ‘సాక్షి’కి చెప్పారు.
తాను ఖమ్మం రాగానే రైతులతో పెద్ద ఎత్తున సదస్సు నిర్వహిద్దామని, ఢిల్లీ నుంచి వ్యవసాయ నిపుణులను అక్కడకు తీసుకువస్తానని ఆమె చెప్పినట్లు సమాచారం. పాలేరు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం 37 పనులకు గాను ఎంపీ లాడ్స్ కింద 1.78 కోట్లు కేటాయిస్తానని ఆమె హామీ ఇచ్చినట్లు సమాచారం. అలాగే సోమవారం రేణుక నివాసంలో జిల్లాకు చెందిన వైరా, కొణిజర్ల, కొత్తగూడెం ప్రాంతాలకు చెందిన నేతలు కూడా కలిసి ఆమెతో జిల్లా రాజకీయాల గురించి చర్చించారు.
ఆ.... 15 ఏళ్లుగా..అంటూనే ఉన్నారు!
Published Tue, Jan 28 2014 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM
Advertisement