సాక్షి, కొత్తగూడెం: జిల్లా కాంగ్రెస్‌లో రాజుకున్న చిచ్చు ఇంకా ఆరలేదు. వర్గాల మధ్య పంచాయితీ ఢిల్లీలోని పార్టీ అధిష్టానం పెద్దల వద్దకు చేరింది. బోధన్‌లో నిర్వహించిన తెలంగాణ జైత్రయాత్ర సభకు హాజరైన మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరిపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో ఆమె కూడా ఈ వ్యవహారంపై అమీతుమీ తేల్చుకునేందుకు సోనియాగాంధీని ఆశ్రయించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో ఇరువురు ప్రధాననేతల మధ్య విభేదాలు ఇప్పుడు జిల్లా, రాష్ట్రస్థాయిని దాటి హ స్తినకు చేరుకున్నాయి. మంత్రి రాంరెడ్డికి మద్దతుగా టీ మంత్రుల బృందం రేణుకపై రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేస్తే.. రేణుకాచౌదరి నేరుగా సోనియాగాంధీకే ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
తెలంగాణ జైత్రయాత్ర పేరుతో బోధన్‌లో నిర్వహించిన తొలి సభకు జిల్లా నుంచి మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సభ సమయానికి కొన్ని గంటల ముందే రాంరెడ్డి, పొంగులేటి నిజామాబాద్ చేరుకుని రేణుక విషయమై టీ మంత్రులు, ఎంపీలతో చర్చించారు. ఈ బృందమంతా వారికి బాసటగా నిలవడంతో పాటు ఈ వ్యవహారంలో దేనికైనా సిద్ధంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఆమె విషయమై ఎంపీలు మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్ కూడా రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సమైక్యవాదిగా ఉంటూ తెలంగాణ జిల్లాల నేతల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారని, తెలంగాణలో ఏ జిల్లాలో జైత్రయాత్ర నిర్వహించినా ఆమెను ఆహ్వానించబోమని, ఖమ్మంలో కూడా ఇదే నిర్ణయం ఉంటుందని ఎంపీలు రాహుల్‌కు చెప్పినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన మంత్రికి కొండంత ధైర్యం వచ్చి బోధన్ జైత్రయాత్ర సభలో.. ‘ఈ ప్రాంతంలో పుట్టకున్నా తెలంగాణ ఆడబిడ్డగా చెప్పుకోవడం మన సంస్కృతికి వ్యతిరేకం, ఏ గ్రామంలో పుట్టావో చెప్పాలి’ అని రేణుకనుద్దేశించి మరోసారి ఘాటుగా వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ జిల్లా శ్రేణులు తీవ్రంగా చర్చించుకుంటున్నాయి. కాగా, మంత్రి తనపై కావాలనే వ్యాఖ్యలు చేస్తూ జిల్లా పార్టీ నేతల మధ్య చీలిక తెస్తున్నారని ఆరోపిస్తూ బోధన్ సభలో ఆయన చేసిన విమర్శలను సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్లేందుకు రేణుక సిద్ధమవుతున్నారని తెలిసింది.
రేణుక జిల్లా పర్యటన ఎప్పుడో...?
ఈ నెల 13, 14 తేదీల్లో రేణుక జిల్లాకు వస్తారని ఊహించిన ఆమె అనుచర నేతలు ఇప్పుడు డీలా పడ్డారు. ఇంత రభస జరుగుతున్నా ఆమె జిల్లాకు రాకపోవడం చర్చనీయాంశమైంది. మంత్రి రాంరెడ్డి తొలుత ప్రకటించినట్లుగా ఈనెల 21న జిల్లాలో జరగాల్సిన తెలంగాణ సభను రేణుకాచౌదరే రద్దు చేయించారని అమె అనుచరులు ప్రచారం చేశారు. అయితే మంత్రి బోధన్ జైత్రయాత్రలో రేణుకపై చేసిన వ్యాఖ్యలతో మళ్లీ కలకలం రేగింది. కాగా, మంత్రి విషయమై తాడోపేడో తేల్చుకునేందుకు రేణుక పావులు కదుపుతున్నారని, త్వరలో ఆమె జిల్లాకు వస్తారని అనుచరులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా రేణుక వర్గంలోని కొందరు నేతలు ఇప్పటికే రాంరెడ్డి గూటికి చేరేందుకు ఆయన అనుచరులతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.
హస్తినకు ‘పంచాయితీ’!
Published Sun, Oct 20 2013 6:12 AM | Last Updated on Fri, Sep 1 2017 11:49 PM
Advertisement
Advertisement