Ramreddy Venkata Reddy
-
సారీ.. సీఎంకు సమయం లేదు!
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు దివంగత కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నేతలు తాజాగా చేసిన ప్రయత్నం ఫలించలేదు. పాలేరు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని నిలిపే విషయంలో పునరాలోచించాలని రాంరెడ్డి కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు భావించారు. అందులో భాగంగా వారు సోమవారం సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోరగా... ముఖ్యమంత్రికి సమయం లేదని సీఎం కార్యాలయ వర్గాల నుంచి సమాధానం వచ్చింది. గతంలోనూ ఓ సారి రాంరెడ్డి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని కలవాలని ప్రయత్నించగా... అప్పుడు కూడా సీఎంకు సమయం లేదంటూ సమాధానం లభించిన విషయం విధితమే. అయితే నామినేషన్ల ఘట్టం త్వరలో ముగియనుండగా, పాలేరు ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా సహకరించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, దివంగత ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి సతీమణి సుచరితారెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కోరారు. ఖమ్మం జిల్లాకు తన భర్త చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని పోటీ నుంచి విరమించేలా నిర్ణయం తీసుకోవాలని ఆమె అభ్యర్థించారు. ఈ మేరకు సుచరిత ఆదివారం సీఎంకు ఒక లేఖ రాసిన సంగతి తెలిసిందే. రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణంతో అనివార్యమైన పాలేరు ఉప ఎన్నికల్లో పలు విపక్షపార్టీలు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. చనిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో పోటీకి దిగొద్దని, ఏకగ్రీవానికి సహకరించాలని కాంగ్రెస్ పార్టీ విపక్షాలను అభ్యర్థించింది. ఆ మేరకు వైఎస్సార్ సీపీ, టీడీపీ, సీసీఐ, సీపీఎంలు పోటీకి దిగబోమని ప్రకటించాయి. ఇదే విషయాన్ని సీఎంకు రాసిన లేఖలో ప్రస్తావించిన సుచరితారెడ్డి టీఆర్ఎస్ కూడా ఏకగ్రీవానికి సహకరిస్తుందనే ఆశాభావం వ్యక్తంచేశారు. -
రాజధానిలో కాంగ్రెస్ నాయకుల రగడ
ఖమ్మం, న్యూస్‌లైన్: ఇప్పటి వరకు జిల్లాకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ లొల్లి ఇప్పుడు రాజధానికి చేరింది. ఆధిపత్య పోరు, అనుచరుల కోసం ఆరాటం, అధిష్టానం నిర్ణయంపై ఆగ్రహం తదితర విషయాలతో సోమవారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ ప్రదేశ్ కమిటీ సమావేశంలో రసాభాసగా మారింది. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తున్నారని, జిల్లాలో దశాబ్దాల తరబడి పార్టీ కోసం పని చేస్తున్న వారిని కాదని ఇటీవల వచ్చిన నాయకుల మాటలకు విలువ ఇవ్వడంతో జిల్లాలో పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా, గ్రూపు రాజకీయాలు చేసిన వారికి పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు కూడా తెలియకుండా పదవులు కట్టబెట్టడం, హైదరాబాద్, ఢిల్లీకి వెళ్లి పదవులు తెచ్చుకోవడంతో పార్టీలో పలువురు నాయకులకు పట్టపగ్గాలు లేకుండా పోయాయని.. ఇలా అయితే పార్టీ భవిష్యత్ దెబ్బతింటుందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు.సోమవారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశంలో తెలంగాణలోని పది జిల్లాల్లో సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరఫున ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసి వారి బలాబలాలు, గెలుపోటములపై సమీక్షించారు. ఈ సమావేశానికి జిల్లా నుంచి మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, కోరం కనకయ్య, వగ్గెల మిత్రసేన, కుంజా సత్యవతి, ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్, పార్టీ జిల్లా ఇన్చార్జ్ వట్టి కుసుమ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి జిల్లా పార్టీ వ్యవహారం, నియామకాలపై అగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీలో ఇంతకాలం పని చేసిన వారికి కాకుండా ఎవరో చెప్పిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇటీవల వేసిన జిల్లా సమన్వయ కమిటీని కూడా ఇష్టాను సారంగా వేశారని, దీంతో పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగిందని ఆరోపించినట్లు తెలిసింది. పార్టీని నమ్ముకొని ఉండే వారికి ప్రాధాన్యం ఇవ్వాలని ఎక్కడి నుంచో వచ్చి ఖమ్మంలో పెత్తనం చేసే వారికి ప్రాధాన్యం ఇస్తే స్థానిక నాయకులను కించపరిచినట్లే అవుతుందని మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అధిష్టానంపై మండిపడినట్లు తెలిసింది. ఇల్లెందు అభ్యర్థి కోరం కనకయ్య మాట్లాడుతూ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లకు కూడా తెలియకుండా పార్టీలోని పదవులను కట్టబెడుతున్నారని, ఢిల్లీ, హైదరాబాద్ వెళ్లి పదవులు తెచ్చుకుంటే స్థానిక నాయకులకు విలువ ఏం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే వారికంటే పార్టీకి నష్టం చేసే వారికే ప్రాధాన్యం ఉంటోందని, ఇలా అయితే పార్టీ అభ్యర్థులు ఎలా గెలుస్తారని టీపీసీసీ నాయకులను ప్రశ్నించినట్లు తెలిసింది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అందరిని కలుపుకుపోయే వారిని నియమించాలని జిల్లా నాయకులు కోరినట్లు సమాచారం. అదేవిధంగా పార్టీ కార్యాలయ నిర్వహణలో కూడా మార్చులు తీసుకురావాలని సూచించినట్లు తెలిసింది. నిర్వాహకులు పులిపాటి వెంకయ్య ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, ఆయన ఒంటెత్తు పోకడతో కార్యకర్తలకు ఇబ్బందిగా ఉందని టీపీసీసీ ముందు పలువురు నాయకులు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆయనను తొలగించాలని పలువురు నాయకులు పట్టుబట్టినట్లు సమాచారం. ఈనెల 10, 11న సమీక్షా సమావేశాలు ఈనెల 10, 11 తేదీల్లో పార్టీ నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చార్జ్ వట్టి కుసుమ కుమార్ తెలిపారు. 10వ తేదీన డీసీపీ కార్యాలయంలో ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్, ఏడు నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యే అభ్యర్థులు, అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జెడ్పీటీసీ అభ్యర్థులతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. అదే విధంగా 11వ తేదీ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఆయా ప్రాంతాలకు చెందిన నియోకవర్గ ఇన్‌చార్జ్‌లు, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కౌన్సిలర్లతో ఆయా మున్సిపల్ కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు కుసుమ కుమార్ చెప్పారు. -
నేతలకు గాలం!
ఖమ్మం రూరల్, న్యూస్‌లైన్ : పాలేరు నియోజకవర్గ టీడీపీలో చెలరేగిన అసంతృప్తితో తాము లబ్ధి పొందేలా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. పాలేరు అసెంబ్లీ టికెట్‌ను ఖమ్మం సిట్టింగ్ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావుకు ఇస్తారని మొదటి నుంచీ ఆయన వర్గీయులు భావించారు. అయితే టికెట్‌ను పార్టీ మహిళా నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారికి కేటాయించడంతో తుమ్మల వర్గీయులు కంగు తిన్నారు. దీంతో తుమ్మల వర్గీయుల్లో అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే వర్గ వైషమ్యాలతో రగిలిపోతున్న టీడీపీ పరిస్థితి.. భవిష్యత్‌లో ప్రశ్నార్ధకంగా మారేలా కనిపిస్తోంది. తుమ్మల వర్గం నేతలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస అభ్యర్థి, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఆయా మండలాల్లో వారితో రహస్య సమావేశాలు నిర్వహిస్తూ తాయిలాలు చూపిస్తూ ‘తమ్ముళ్ల’ను ఆకర్షించే పని మొదలు పెట్టినట్లు తెలిసింది. ప్రజాప్రతినిధులపైనే గురి... నియోజకవర్గంలోని 108 గ్రామ పంచాయతీల సర్పంచ్‌లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సర్పంచ్‌లు వీక్‌గా ఉన్నచోట షాడో సర్పంచ్ల (అన్నీతానై ముందుండి గ్రామ పాలన నడిపించే నాయకుడు)ను బుట్టలో వేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. కూసుమంచి మండల టీడీపీ ప్రధాన నాయకుడు, తుమ్మల ముఖ్య అనుచరుడు, మాజీ ఎంపీపీ.జూకూరి గోపాల్‌రావు తన అనుచరులతో మంగళవారం రాంరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అలాగే తిరుమలాయపాలెం మండల టీడీపీ ప్రధాన నాయకుడు, మాజీ ఎంపీపీ, ఆ పార్టీ మాజీ మం డల అధ్యక్షులను కాంగ్రెస్‌లోకి రప్పించేందుకు రాంరెడ్డి ప్రయత్నిస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. కాగా, సదరు మాజీ ఎంపీపీ, టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు తమ అనుచరులతో కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. మరో రెండు మూడు రోజుల్లో వారు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిసింది. టీడీపీకి తప్పని ఎదురుగాలి... నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే టీడీపీకి భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వర్గవిభేదాలతో సతమతమవుతున్న ఆపార్టీకి తెలుగు తమ్ముళ్లు ఎవరి దారి వారు చూసుకుంటే ఇక ఆ పార్టీకి ఎన్నికల్లో ఎదురుగాలి తప్పదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే కూసుమంచి మండలం నుంచి తుమ్మల ప్రధాన అనుచరుడు గోపాల్‌రావు కాంగ్రెస్‌లో చేరడంతో టీడీపీ నాయకులు అవాక్కయ్యరు. ఈ పరిణామాన్ని నామా వర్గీయులు జీర్ణించుకోలేక పోతున్నారు.అంతేకాకుండా ఒకటి రెండు రోజుల్లో తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, కూసుమంచి మండలాలకు చెందిన తుమ్మల వర్గీయులైన నాయకులను కాంగ్రెస్‌లోకి రప్పించేందుకు రాంరెడ్డి ప్రణాళిక ఏర్పాటు చేసినట్లు తెలిసింది. భారీ నజరానాలు ఆశ చూపడంతో తుమ్మల వర్గీయులు టీడీపీని వీడాలనే ఆలోచనకు వచ్చినట్లు నియోజకవర్గంలో విస్త్రత ప్రచారం జరుగుతోంది. అసలే అంతంత మాత్రం బలం ఉన్న టీడీపీ అభ్యర్థి.. ఈ వర్గపోరుతో ఏం చేయాలో తెలియక మథనపడుతున్నట్లు సమాచారం. ప్రచారానికి దూరంగా తుమ్మల వర్గీయులు నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించిన ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వర్రావు, పాలేరు అసెంబ్లీ అభ్యర్థి స్వర్ణకుమారి వెంట తుమ్మల వర్గీయులు ఏ ఒక్కరూ పాల్గొనకపోవడం గమనార్హం. ఖమ్మం రూరల్ మండలంలో మొదలైన ప్రచారానికి నామా వర్గీయులుగా ఉన్న నేతలే ఒకరిద్దరు అయిష్టంగా వెళుతున్నట్లు సమాచారం. ఖమ్మం రూరల్ మండలానికి చెందిన ఎస్టీసెల్ నాయకుడొకరికి ఇల్లెందు అసెంబ్లీ టికెట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చి, చివరికి మొండిచెయ్యి చూపడంతో ఆయన నామాపై గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. తనను మోసం చేసిన నేతలకు ఈ ఎన్నికల్లో సహకరించేది లేదంటూ నామాకు నిర్మొహమాటంగా చెప్పినట్లు తెలిసింది. అయితే అవన్నీ మనసులో పెట్టుకోకుండా ప్రచారానికి రావాలని స్వయంగా నామా అతని ఇంటికి వెళ్లి బతిమిలాడినట్లు సమాచారం. నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, కూసుమంచి మండలాలకు చెందిన తుమ్మల వర్గీయులు నామా, స్వర్ణకుమారి వెంట ప్రచారానికి వెళ్లకుండా దూరంగా ఉంటున్నారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీకి గడ్డుకాలం తప్పదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
జెడ్పీ పీఠమే లక్ష్యం
సాక్షి, ఖమ్మం: పురపోరు ముగియడంతో ఇప్పుడు అన్ని పార్టీల కన్ను జడ్పీ పీఠంపైనే పడింది. ప్రధానంగా టీడీపీ, కాంగ్రెస్ నేతలు అడ్డదారుల్లోనైనా సరే జెడ్పీపై జెండా ఎగురవేయాలనే దిశగా పావులు కదుపుతున్నారు. అయితే ఎస్సీ మహిళలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో వలస నేతలను బరిలోకి దింపడంతో స్థానిక నాయకత్వం వారిపై గుర్రుమంటోంది. కాంగ్రెస్, టీడీపీ నాయకులు మాత్రం వర్గాల వారీగా తమ అభ్యర్థులను బరిలోకి దింపారు. ప్రస్తుతం ఎమ్మెల్యే టికెట్ల వేటలో ఉన్న నేతలు ఇప్పుడు జెడ్పీ పీఠం ఏ వర్గం వారికి దక్కుతుందోననే ఆందోళనలో ఉన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. ఏజెన్సీలోని వాజేడు, వెంకటాపురం, చర్ల, పినపాక జెడ్పీటీసీ స్థానాలు ఎస్సీ మహిళలకు రిజర్వు అయ్యాయి. అలాగే అశ్వాపురం, ఏన్కూరు, భద్రాచలం, కొత్తగూడెం ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. ఎస్సీ మహిళకు కేటాయించిన స్థానాల్లో కాంగ్రెస్, టీడీపీ జెడ్పీ పీఠం లక్ష్యంగా వర్గాల వారీగా అభ్యర్థులను బరిలోకి దింపి విజయం కోసం పాకులాడుతున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అనుచర నేతగా, నేలకొండపల్లికి చెందిన సోడెపొంగు లక్ష్మి వాజేడు నుంచి, వెంకటాపురం మండలం నుంచి డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క అనుచర అభ్యర్థిగా వైరాకు చెందిన నంబూరి సుజాత నామినేషన్ వేశారు. అలాగే పినపాక జెడ్పీటీసీ స్థానానికి హైదరాబాద్‌లో స్థిరపడిన జాడి జుమనతో రేగా కాంతారావు వ్యూహాత్మకంగా నామినేషన్ వేయించారు. టీడీపీ నుంచి వెంకటాపురం జెడ్పీటీసీ స్థానానికి ఎమ్మెల్యే తుమ్మల వర్గం నేత, కొత్తగూడెంనకు చెందిన గడిపల్లి కవిత నామినేషన్ వేశారు. చర్ల అభ్యర్థి తోటమల్ల హరిత కూడా తుమ్మల వర్గం అభ్యర్థిగా ప్రచారం జరుగుతోంది. మణుగూరు చెందిన జాడి వాణి టీడీపీ తరఫున పినపాక జెడ్పీటీసీ బరిలో ఉన్నారు.. ఈమెను ఎంపీ నామా నాగేశ్వరరావు తన అభ్యర్థిగా బరిలోకి దించారని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అలాగే అశ్వాపురంలో టీడీపీ తరఫున నామా వర్గం అభ్యర్థిగా తోకల లత బరిలో ఉన్నారు. ఇలా ఎవరికి వారు వర్గాల వారీగా తమ అభ్యర్థులను బరిలోకి దింపి.. జెడ్పీ పీఠం తమ వర్గానికే దక్కాలని ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. అసంతృప్తిలో ద్వితీయ శ్రేణి నాయకులు... ప్రధానంగా కాంగ్రెస్, టీడీపీలు ఆయా మండలాల వారిని కాకుండా స్థానికేతరులను జెడ్పీటీసీ బరిలోకి దింపి, జెడ్పీ పీఠం కైవసం చేసుకునేందుకు ఎత్తులు వేస్తుండగా.. స్థానికంగా ఉండే ద్విత్రీయ శ్రేణి నాయకత్వం వీరిపై అంతర్గతంగా నిరసన వ్యక్తం చేస్తోంది. లోకల్ అభ్యర్థులు లేరని, ఇతరులను బరిలోకి దింపుతారా..? అని ఎవరికి వారు గుర్రుగా ఉన్నారు. ఎంత సర్దుబాటు చేస్తున్నా లోకల్ ఫిలింగ్ నాన్‌లోకల్ నేతలను ఏమి చేస్తుందోనని నేతలు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలకు మరో రెండు రోజులే గడువు ఉండడంతో నయానో..భయానో వారు పూర్తిస్థాయిలో సహకరించేందుకు, లోకల్ నేతల కు నజరానాలు ప్రకటించేందుకు కూడా ఆయా పార్టీల నేతలు సిద్ధమయ్యారు. మరోవైపు లోకల్ ఫీలింగ్ తమ కొంప ముంచుతుందోమో, ఖర్చు తడిసి మోపడైతే తమ పరిస్థితి ఏంటి.? అని ఇక్కడి అభ్యర్థులు హైరానా పడుతున్నారు. అయితే నేతలు మాత్రం ‘అంతా మేము చూసుకుంటాం.. ఖర్చు పెట్టండి’ అని పైకి చెపుతున్నా.. ఏమి జరుగుతుందోనన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది. ఓట్లకు నోట్లపైనే ఆశలు.. స్థానిక కేడర్ సహకరించినా, సహకరించకపోయినా ఓట్లకు నోట్లు ఎరవేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్, టీడీపీలు అడుగులేస్తున్నాయి. వర్గాల వారీగా నేతల అనుచరులు వాజేడు, వెంకటాపురం, చర్ల, పినపాక మండలాల్లో పాగా వేసి తమ నేతలు బరిలో దింపిన అభ్యర్థి విజయం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. స్థానిక పోలింగ్‌కు రెండురోజుల సమయం ఉండ డం, అనుచర నేతలు అంతా ఢిల్లీ, హైదరాబాద్‌లో టికెట్ల వేట లో మునగడంతో ఓటుకు నోట్ల పంపిణీ బాధ్యతలను వారే భుజానికెత్తుకున్నట్లు సమాచారం. ప్రధానంగా ఎస్సీ మహిళలకు రిజ ర్వు అయిన జెడ్పీటీసీ స్థానాలలోనే.. ఇటు టీడీపీ, అటు కాం గ్రెస్ నేతలు జెడ్పీ పీఠం దక్కించుకోవడమే ధ్యేయం గా అడ్డుదారులు వెతుకుతున్నారు. జెడ్పీ పీఠం దక్కితే.. జిల్లా లో తమ వర్గం బలం పెంచుకోవాలన్న వ్యూహంలో కాంగ్రెస్, టీడీపీ నేతలున్నారు. ప్రధాన అనుచరులంతా ఈ నాలుగు చోట్ల పదిహేను రోజులుగా మకాం వేసి ఎప్పటికప్పుడు రాజకీయ సమీకరణలు, గెలుపోటములను ప్రభావితం చేసే అంశాలను అగ్రనేతలకు చేరవేస్తున్నారు. ఏంచేసినా విజయం సాధించి తీరాలని వారు హుకుం జారీ చేయడంతో అడ్డదారులు తొక్కయినా సరే.. గెలుపు కోసం అనుచర నేతలు అపసోపాలు పడుతున్నారు. -
ఆ.... 15 ఏళ్లుగా..అంటూనే ఉన్నారు!
జిల్లా వదిలిపెట్టే ప్రసక్తే లేదు త్వరలో వస్తున్నా...ఖమ్మంలోనే మకాం వేస్తా పార్టీ నేతలతో ఎంపీ రేణుకాచౌదరి సాక్షి ప్రతినిధి, ఖమ్మం ‘నేను జిల్లా వదిలి వెళతానని 15 ఏళ్లుగా అంటూనే ఉన్నారు... నేనెక్కడికీ వెళ్లేది లేదు... ఖమ్మం జిల్లాలోనే ఉంటా... త్వరలోనే జిల్లాకు వస్తా.... ఖమ్మంలోనే మకాం వేస్తా... గ్రామ గ్రామాన పర్యటిస్తా.... మీరు ధైర్యంగా ఉండండి’ అని ఎంపీ రేణుకాచౌదరి తన వర్గీయులకు భరోసా ఇచ్చారు. నాయకులంతా మరింత పట్టుదలతో పనిచేయాలని సూచించారు. సోమవారం ఖమ్మం రూరల్ మండలానికి చెందిన ఆరుగురు సర్పంచ్‌లు తమ అనుచరులతో కలిసి హైదరాబాద్‌లోని రేణుక నివాసంలో ఆమెను కలిసినపుడు పైవిధంగా సంభాషించినట్లు సమాచారం. మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి తమను పట్టించుకోవడం లేదని, అభివృద్ధి నిధుల కోసం వెళితే మొండిచేయి చూపుతున్నారని, తమ మండలాభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని సర్పంచ్‌లు కోరారని సమాచారం. ఇదే సందర్భంలో.. మీరు జిల్లా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారని ప్రస్తావించగా రేణుక తీవ్రంగానే స్పందించినట్టు సమాచారం. తానెక్కడికీ వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ఆమె ఎన్ని అడ్డంకులు ఎదురయినా ఇక్కడే పనిచేస్తానని, మున్ముందు మరింత పట్టుదలతో ముందుకెళతానని చెప్పినట్లు సమావేశంలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ నాయకుడొకరు ‘సాక్షి’కి చెప్పారు. తాను ఖమ్మం రాగానే రైతులతో పెద్ద ఎత్తున సదస్సు నిర్వహిద్దామని, ఢిల్లీ నుంచి వ్యవసాయ నిపుణులను అక్కడకు తీసుకువస్తానని ఆమె చెప్పినట్లు సమాచారం. పాలేరు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం 37 పనులకు గాను ఎంపీ లాడ్స్ కింద 1.78 కోట్లు కేటాయిస్తానని ఆమె హామీ ఇచ్చినట్లు సమాచారం. అలాగే సోమవారం రేణుక నివాసంలో జిల్లాకు చెందిన వైరా, కొణిజర్ల, కొత్తగూడెం ప్రాంతాలకు చెందిన నేతలు కూడా కలిసి ఆమెతో జిల్లా రాజకీయాల గురించి చర్చించారు. -
రచ్చబండకు తెలంగాణ సెగ
కూసుమంచి, న్యూస్‌లైన్: కూసుమంచిలో ఆదివారం రచ్చబండ సభకు వచ్చిన మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డికి తెలంగాణవాదుల నుంచి నిరసన సెగ తగిలింది. కూసుమంచిలోని విజయరామా ఫంక్షన్ హాల్లో రచ్చబండ సభలో ముఖ్య అతిధిగా మంత్రి పాల్గొన్నారు. తెలంగాణవాదులు ఆందోళనకు దిగవచ్చని ముందే ఊహించిన పోలీసులు.. వేదిక వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. సభలో మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో బయటి నుంచి న్యూడెమోక్రసీ, టీఆర్ఎస్, ఏఐఎస్ఎఫ్ నాయకులు సభాప్రాంగణం వైపు వెళ్లబోయారు. వీరిని గేటు ముందే పోలీసులు అడ్డుకున్నారు. వేదిక పైనున్న ఫ్లెక్సీ నుంచి సీఎం బొమ్మ తొలగించాలని వారు డిమాండ్ చేశారు. వారి వద్దకు కూసుమంచి సీఐ నరేష్‌రెడ్డి వచ్చి, కొందరిని మాత్రమే వేదిక వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వీరు.. ‘జై తెలంగాణ’, ‘సీఎం డౌన్ డౌన్’ అంటూ నినాదాలు ఛేశారు. దీంతో మంత్రికి కోపమొచ్చింది. ఆయన తీవ్ర స్వరంతో... ‘తెలంగాణ ఇస్తున్నది మేమే’ అన్నారు. సీఎం ఫొటోను ఫ్లెక్సీ నుంచి తొలగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేయగా... ‘ఆయన సీఎం. ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఫొటో ఉండాలి. దానికే మీరు గొడవ చేస్తారా...?’ అంటూ ఆగ్రహించారు. మంత్రి ప్రసంగం పూర్తయ్యేంత వరకు వీరిని పోలీసులు వేదిక కిందనే ఉంచారు. ఆ తరువాత, మంత్రికి వినతిపత్రమిచ్చేందుకు అనుమతించారు. ఆ తరువాత కూడా ఆందోళనకారులు ‘జై తెలంగాణ’ అంటూ నినాదాలు చేస్తుండగా పోలీసులు బయటకు పంపించేశారు. రచ్చబండ ఫ్లెక్సీలో సీఎం ఫొటో ఉంచడాన్ని నిరసిస్తూ ఆందోళనకారులు కూసుమంచి బస్టాండ్ సెంటర్లో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. కారేపల్లి, న్యూస్‌లైన్: కారేపల్లిలో ఆదివారం రచ్చబండ సభకు తెలంగాణ సెగ తగిలింది. సభ ప్రారంభమవగానే తెలంగాణ వాదులు ‘జై తెంగాణ’ నినాదాలతో స్టేజీ పైకి వెళ్లి ఫ్లెక్సీ చించివేశారు. అడ్డుకునేందుకు వస్తున్న పోలీసుల నుంచి తప్పించుకుని, ‘సీఎం డౌన్ డౌన్’ అని నినాదాలు చేస్తూ, ఆ ఫ్లెక్సీతో సమీపంలోని క్రీడా మైదానంలోకి పరుగెత్తి, అందులోని సీఎం బొమ్మను చెప్పులతో కొడుతూ.. తన్నుతూ నిప్పంటించారు. ఆ తరువాత సభ వేదిక వద్దకు తిరిగొచ్చి, భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలంటూ తీర్మానం చేయాలని పట్టుపట్టారు. సభను బహిష్కరించిన ఎమ్మెల్యే ఈ సభలో వైరా ఎమ్మెల్యే చంద్రావతి మాట్లాడుతూ.. కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం వివిధ పథకాలకు సంబంధించి కాకి లెక్కల కబుర్లతో కాలక్షేపం చేస్తోందని, రచ్చబండ సభలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని, సర్కారుకు సమస్యలు చెప్పుకుందామని వస్తే భరోసా ఇచ్చేవారే క రువయ్యారని ఆగ్రహించారు. సభను బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోట్లకు చేదు అనుభవం ఈ సభలో ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావుకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన మాట్లాడుతుండగా.. ‘ఇది మీ పార్టీ మీటింగు కాదు’ అంటూ, రచ్చబండ కమిటీ సభ్యురాలిగా స్టేజీ పై కూర్చున్న పగడాల మంజుల, కాంగ్రెస్ నాయకుడు తలారి చంద్రప్రకాశ్, ఆ పార్టీకి చెందిన సర్పంచులు భద్రునాయక్, మంగీలా ల్ అడ్డుకున్నారు. వారిపై పోట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ, సభ వేదిక పైనున్న బెంచీలను కింద పడేసి కిందకు దిగి వెళ్లిపోయారు. కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు పరస్పరం దూషించుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. -
'భద్రాద్రి రాముడు లేని తెలంగాణను ఊహించలేం'
న్యూఢిల్లీ: భద్రాచలం తెలంగాణలో అంతర్భాగంగానే ఉండాలని కేంద్ర మంత్రి బలరాం నాయక్, రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. భద్రాచలానికి చారిత్రక నేపథ్యం ఉందని, భద్రాద్రి రాముడు లేని తెలంగాణను ఊహించలేమని చెప్పారు. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసిన తర్వాత బలరాం, రాంరెడ్డి విలేకరులతో మాట్లాడారు. భద్రాచలంను తెలంగాణ రాష్ట్రంలోనే ఉంచాలనే డిమాండ్‌తో ఈ నెల 19న జిల్లా బంద్‌కు పిలుపునిచ్చామని తెలిపారు. ఇతర ప్రాంతాలకు ముంపు లేకుండా పోలవరం ప్రాజెక్టు కట్టుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు. రేపు జీఓఎం సమావేశంలోనూ ఇదే చెప్తామన్నారు. మరోవైపు భద్రాచలం డివిజన్లో జర్నలిస్టు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మూడు రోజూ బంద్ కొనసాగుతోంది. -
రాంరెడ్డి, రేణుక వర్గీయులకు ఎస్పీ హెచ్చరిక
ఇల్లెందు: గ్రూపు రాజకీయాలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని మంత్రి రాంరెడ్డి వెంకట రెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి వర్గీయులను ఎస్పీ ఎ.వి.రంగనాథ్ హెచ్చరించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఫారెస్టు గ్రౌండ్లో ఏర్పా టు చేసిన సభలో రేణుకను ఉద్దేశించి రాంరెడ్డి వర్గీయులు మడత వెంకట్‌గౌడ్, కొక్కు నాగేశ్వరరావు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమె వర్గీయులు గోచికొండ సత్యనారాయణ, సురేష్‌లాహోటీ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఎస్పీ ఆదివారం ఇల్లెందుకు వచ్చారు. ఇరు వర్గాలకు చెందిన నాయకులను డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి వేర్వేరుగా విచారణ చేశారు. ఉత్సవాల్లో రాంరెడ్డి వర్గీయులు చేసిన వ్యాఖ్యల గురించి ఆరా తీశారు. తమపై ప్రజలు దాడికి పాల్పడే విధంగా రాంరెడ్డి వర్గీయులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారంటూ సురేష్లాహోటి, గోచికొండ సత్యనారయణ, పద్మావతి తదితరులు ఎస్పీకి వివరించారు. రేణుక వర్గీయుల వైఖరి గురించి మడత వెంకట్‌గౌడ్ కూడా ఎస్పీ క్షుణ్ణంగా వివరించారు. ఇరువర్గాల వాదోపవాదనలను విన్న ఎస్పీ శాంతి భద్రతలను పరిరక్షించాలని కోరారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. ఇరువర్గాల మధ్య ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పలు సూచనలు చేసినట్లు చెప్పా రు. ప్రజల స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలిగించినా సహిం చేది లేదన్నారు. అల్లర్లను సష్టిస్తే ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకుంటామన్నారు. -
హస్తినకు ‘పంచాయితీ’!
సాక్షి, కొత్తగూడెం: జిల్లా కాంగ్రెస్‌లో రాజుకున్న చిచ్చు ఇంకా ఆరలేదు. వర్గాల మధ్య పంచాయితీ ఢిల్లీలోని పార్టీ అధిష్టానం పెద్దల వద్దకు చేరింది. బోధన్‌లో నిర్వహించిన తెలంగాణ జైత్రయాత్ర సభకు హాజరైన మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరిపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో ఆమె కూడా ఈ వ్యవహారంపై అమీతుమీ తేల్చుకునేందుకు సోనియాగాంధీని ఆశ్రయించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో ఇరువురు ప్రధాననేతల మధ్య విభేదాలు ఇప్పుడు జిల్లా, రాష్ట్రస్థాయిని దాటి హ స్తినకు చేరుకున్నాయి. మంత్రి రాంరెడ్డికి మద్దతుగా టీ మంత్రుల బృందం రేణుకపై రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేస్తే.. రేణుకాచౌదరి నేరుగా సోనియాగాంధీకే ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. తెలంగాణ జైత్రయాత్ర పేరుతో బోధన్‌లో నిర్వహించిన తొలి సభకు జిల్లా నుంచి మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సభ సమయానికి కొన్ని గంటల ముందే రాంరెడ్డి, పొంగులేటి నిజామాబాద్ చేరుకుని రేణుక విషయమై టీ మంత్రులు, ఎంపీలతో చర్చించారు. ఈ బృందమంతా వారికి బాసటగా నిలవడంతో పాటు ఈ వ్యవహారంలో దేనికైనా సిద్ధంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఆమె విషయమై ఎంపీలు మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్ కూడా రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సమైక్యవాదిగా ఉంటూ తెలంగాణ జిల్లాల నేతల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారని, తెలంగాణలో ఏ జిల్లాలో జైత్రయాత్ర నిర్వహించినా ఆమెను ఆహ్వానించబోమని, ఖమ్మంలో కూడా ఇదే నిర్ణయం ఉంటుందని ఎంపీలు రాహుల్‌కు చెప్పినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన మంత్రికి కొండంత ధైర్యం వచ్చి బోధన్ జైత్రయాత్ర సభలో.. ‘ఈ ప్రాంతంలో పుట్టకున్నా తెలంగాణ ఆడబిడ్డగా చెప్పుకోవడం మన సంస్కృతికి వ్యతిరేకం, ఏ గ్రామంలో పుట్టావో చెప్పాలి’ అని రేణుకనుద్దేశించి మరోసారి ఘాటుగా వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ జిల్లా శ్రేణులు తీవ్రంగా చర్చించుకుంటున్నాయి. కాగా, మంత్రి తనపై కావాలనే వ్యాఖ్యలు చేస్తూ జిల్లా పార్టీ నేతల మధ్య చీలిక తెస్తున్నారని ఆరోపిస్తూ బోధన్ సభలో ఆయన చేసిన విమర్శలను సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్లేందుకు రేణుక సిద్ధమవుతున్నారని తెలిసింది. రేణుక జిల్లా పర్యటన ఎప్పుడో...? ఈ నెల 13, 14 తేదీల్లో రేణుక జిల్లాకు వస్తారని ఊహించిన ఆమె అనుచర నేతలు ఇప్పుడు డీలా పడ్డారు. ఇంత రభస జరుగుతున్నా ఆమె జిల్లాకు రాకపోవడం చర్చనీయాంశమైంది. మంత్రి రాంరెడ్డి తొలుత ప్రకటించినట్లుగా ఈనెల 21న జిల్లాలో జరగాల్సిన తెలంగాణ సభను రేణుకాచౌదరే రద్దు చేయించారని అమె అనుచరులు ప్రచారం చేశారు. అయితే మంత్రి బోధన్ జైత్రయాత్రలో రేణుకపై చేసిన వ్యాఖ్యలతో మళ్లీ కలకలం రేగింది. కాగా, మంత్రి విషయమై తాడోపేడో తేల్చుకునేందుకు రేణుక పావులు కదుపుతున్నారని, త్వరలో ఆమె జిల్లాకు వస్తారని అనుచరులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా రేణుక వర్గంలోని కొందరు నేతలు ఇప్పటికే రాంరెడ్డి గూటికి చేరేందుకు ఆయన అనుచరులతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. -
ఎక్కడి ఆడబిడ్డవో చెప్పాలంటూ విసుర్లు
సాక్షి, కొత్తగూడెం: జిల్లా కాంగ్రెస్‌లో నిన్న మొన్నటివరకు అంతర్గతంగా సాగుతున్న పోరు బహిరంగమై తీవ్రరూపం దాల్చింది. ఎంపీ రేణుకాచౌదరికి చెక్‌పెట్టడానికి ప్రత్యర్థి వర్గం రంగం సిద్ధం చేసింది. రాష్టమ్రంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‘ఆడబిడ్డ’పై వ్యాఖ్యలు చేయడం, ఈనెల 21న జరిగే సభకు రేణుకను ఆహ్వానించే విషయాన్ని మంత్రుల సమన్వయకమిటీ చూసుకుంటుందని ప్రకటించడం చూస్తే జిల్లా రాజకీయాల్లో రేణుక పాత్రను ముగించటానికి పావులు వేగంగానే కదులుతున్నాయనే చర్చ పార్టీ శ్రేణుల్లో నడుస్తోంది. రానున్న ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ సీట్ల పంపకంపై తన ముద్ర ఉండాలని రేణుకాచౌదరి భావిస్తుండగా... ఆమెను ఎలాగైనా జిల్లాకు దూరం పెట్టాలని ఆమె వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటి పైకి వస్తున్నాయి. గతంలో సమైక్యం వినిపించిన రేణుకకు తెలం‘గానం’తో చెక్ పెట్టేందుకు ఇదే మంచి అదునని, అందుకు తెలంగాణ కృతజ్ఞత సభను వేదికగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం ఆమె ఏంచేస్తున్నా మౌనంగా ఉన్న రాంరెడ్డి...బహిరంగంగా విమర్శలు గుప్పించడం చూస్తే అవసరమైతే హస్తిన స్థాయిలోనైనా అమీతుమీ తేల్చుకునేందుకు రేణుక ప్రత్యర్థివర్గం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి రేణుకపై జిల్లా కాంగ్రెస్ నాయకులలో గూడుకట్టుకున్న వ్యతిరేక భావన గతకొద్ది రోజులుగా బయటపడుతూనే ఉంది. తెలంగాణ విజయోత్సాహంలో ఉన్న నేతలు ఇటీవల నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విషయంలో రేణుక జోక్యం చేసుకొని ఇప్పుడే సభలెందుకని నాయకులను కట్టడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈపరిస్థితుల్లో.. ఆమె సమైక్యవాదానికి కట్టుబడి ఉందని, తామెందుకు సభలు నిర్వహించవద్దని ద్వితీయ శ్రేణి నాయకులు తమ నేతలను ప్రశ్నిస్తూ వచ్చారు. అయినా సభలు నిర్వహించేందుకు డీసీసీ తరఫున, నియోజకవర్గాల వారీగా నేతలు ముందుకు రాలేదు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌లో భేటీ అయిన సందర్భంగా ఈ సమావేశానికి రేణుకాచౌదరి కూడా హాజరయ్యారు. సమైక్యవాదం వినిపిస్తున్న ఆమె ఈ సమావేశానికి ఎందుకు వచ్చారని మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు, సూర్యాపేట ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఎంపీ పొన్నం ప్రభాకర్‌లు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె విషయంలో మెత్తబడి ఉంటే రాజకీయంగా భవిష్యత్ ఉండదని తెలంగాణ ప్రజాప్రతినిధులు జిల్లా నేతలకు హితబోధ చేసినట్లు సమాచారం. దీంతో రాజకీయంగా తనకు అడ్డు తగులుతూ ఈ జిల్లా కాకున్నా పెత్తనం చెలాయిస్తున్న రేణుకపై గుర్రుగా ఉన్న మంత్రి రాంరెడ్డి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. కలిసి వచ్చిన తెలంగాణ సభ.. తెలంగాణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో జిల్లాలో తన సత్తాచాటాలన్న ఉద్దేశంతో తెలంగాణ సభ నిర్వహణ బాధ్యతను మంత్రి భూజానకెత్తుకున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 21న ఖమ్మంలో ‘కృతజ్ఞత సభ’ నిర్వహించాలని తలపెట్టారు. జిల్లా నలుమూలల నుంచి భారీ ఎత్తున క్యాడర్‌ను తరలించాలన్న ఉద్దేశంతో గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల బాధ్యులను కలుపుకొని పోతూ... సభను విజయవంతం చేస్తే రాజకీయంగా పునాది బలోపేతం అవుతుందని, మనస్పర్థలు వీడి అందరం ఐక్యంగా ఉంటేనే విజయం సాధిస్తామన్న రీతిలో వారికి నచ్చజెపుతున్నట్లు సమాచారం. ఇటు పార్టీ పరంగా జిల్లాలో ఈ సభతో తన ఈమేజ్‌ను పెంచుకోవడంతో పాటు.. అటు రేణుకాచౌదరికి చెక్ పెట్టాలన్న వ్యూహంలో మంత్రి ఉన్నట్లు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చజరుగుతోంది. తెలంగాణ సభ అందుకు పూర్తి వేదికవుతుందని, ఈ సభకు వచ్చే నేతలంతా ఏకతాటిపై ఉంటారని, ఇక రేణుకాచౌదరికి కొద్దొగొప్పో ఉన్న అనుచర గణం కూడా ఇటువైపే రావాలని.. లేకుంటేవారికి భవిష్యత్ ఉండదన్నది చర్చనీయాంశంగా మారింది. రేణుకపై నేరుగా విమర్శనాస్త్రాలు.. అధిష్టానం వద్ద లాబీయింగ్ ఉన్న రేణుకాచౌదరిపై పార్టీ నేతలు ఏనాడు విమర్శలు చేయలేదు. ఆమెతో పెట్టుకుంటే తమకు రాజకీయ భవిష్యత్ ఉండదని భావించిన నేతలు.. ఆమె వారిని ఎన్ని అవమానాలకు గురి చేసినా సహించారు. కానీ మంత్రి వెంకటరెడ్డి ఇప్పుడు అనూహ్య రీతిలో విమర్శనాస్త్రాలు సంధించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘రేణుకాచౌదరి తెలంగాణ వ్యతిరేకి అనే భావన ఉంది.. ఆమెను తమ ఆడపడుచుగా జిల్లా వాసులు గుర్తించడం లేదు.. ఈనెల 21న సభకు ఆమెను ఆహ్వానించే విషయమై నిర్ణయం తీసుకోలేదు’ అంటూ ఆమెపై వ్యతిరేకతను కుండబద్దలు కొట్టారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ నేతలు షాక్‌కు గురయ్యారు. సమైక్యవాదం వినిపించిన రేణుకాచౌదరిని మంత్రి ఎలాగైనా జిల్లా రాజకీయాల నుంచి దూరం చేస్తారని, అందుకు ఆయన మాటలే నిదర్శనమని..ఇందుకు కృతజ్ఞత సభ వేదిక అవుతుందని ఆయన వర్గీయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి కౌంటర్‌గా రేణుక శిబిరం ఎలాంటి ఎత్తుగడ వేస్తుందో చూడాలి. రేణుకపై మంత్రి రాంరెడ్డి సంచలన వ్యాఖ్యలు దమ్మపేట, న్యూస్‌లైన్: ‘ ఈ జిల్లాకు మంచి సంస్కృతి ఉంది..జలగం వెంగళరావును రెండుసార్లు గెలిపించాం..కొండలరావును గెలిపించాం..ఈ ప్రాంత వాసులు కాకపోయినా పీవీ రంగయ్యనాయుడు, నాదెండ్ల భాస్కరరావును, రేణుకాచౌదరిని గెలిపించాం.. కేంద్రమంత్రిని చేశాం..ఇక ఇతర ప్రాంతాల వారిని మోసే శక్తి మా వద్దలేదు..జిల్లా ఆడబిడ్డనని చెప్పుకుంటున్న వారే ఎక్కడి వారో ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది’ అంటూ రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరిని ఉద్దేశించి సంచనల వ్యాఖ్యలు చేశారు. మంగళవారం దమ్మపేట మండలం అంకంపాలెంలో గిరిజన బాలికల జూనియర్ కళాశాల ప్రారంభించిన అనంతరం స్థానిక ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన, ఎంఎల్‌సి పొంగులేటి సుధాకర్‌రెడ్డిలతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఏ గ్రామంలో అయినా జనన, మరణ జాబితాలుంటాయని.., ఈ జిల్లా ఆడబిడ్డగా చెప్పుకుంటున్న వారు ఎక్కడ పుట్టారో చెప్పాలన్నారు. జిల్లాలో లక్షలాది మంది గిరిజన ఆడబిడ్డలున్నారని, ఆమె ఎక్కడి ఆడబిడ్డో చెప్పాలన్నారు. నాడు ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు వలసవాదులను ఆదరించామని, ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఏర్పడుతున్న నేపధ్యంలో ఇతర ప్రాంతాల వారిని తాము మోయలేమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో ఎంపిగా ఎవరిని నిలబెట్టినా పని చేస్తామని, అయితే ఇతర ప్రాంతాల వారి విషయంలో మాత్రం మా వాదనలు అధిష్టానం వద్ద తప్పక వినిపిస్తామన్నారు. పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీని తిట్టి, స్వతంత్రంగా పోటీ చేసి ఓడిపోయిన చాలా మంది తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అలాంటి వారందరూ రెండేళ్లపాటు పార్టీ కోసం పనిచేసిన తర్వాతనే వారి గురించి పార్టీ ఆలోచన చేస్తుందన్నారు. సమావేశంలో డీసీసీ కార్యదర్శి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఏఎంసి చైర్మన్ సున్నం నాగమణి, జిల్లా నాయకులు కట్ల రంగారావు, రామిశెట్టి మనోహర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
రేణుక ఖమ్మం జిల్లా ఆడబిడ్డ ఎలా అవుతుంది?
ఖమ్మం : కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరిని మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. రేణుకా చౌదరి ఖమ్మం జిల్లా ఆడబిడ్డ ఎలా అవుతుందో నిరూపించుకోవాలని ఆయన సవాల్ విసిరారు. ఆడబిడ్డల మనోభావాలు దెబ్బతిసే హక్కు ఎవరికీ లేదని రాంరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈనెల 21న ఖమ్మంలో జరిగే సమావేశానికి రేణుకను ఆహ్వానించే విషయంలో తెలంగాణ మంత్రుల కమిటీ నిర్ణయిస్తుందన్నారు. ఇక ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌లో విభేదాలు పొడచూపుతున్నాయి. ఎంపీ రేణుకాచౌదరి, మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి తమ అనుంగు శిష్యులకు ఖమ్మం సీటు ఇప్పించడానికి అప్పుడే హామీలిస్తున్నారనే చర్చ జోరందుకుంది. అయితే తెలంగాణ విభజన వ్యవహారంలో రేణుకాచౌదరి వ్యవహారం మింగుడు పడని నేతలు ఆమెను జిల్లాకు శాశ్వతంగా దూరంగా పెట్టాలని ప్రయత్నిస్తూ ఆదిశగా పావులు కదుపుతున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీలో చిచ్చుపెడుతున్న రేణుకకు ప్రాధాన్యం ఎందుకు ఇవ్వాలని ద్వితీయ శ్రేణి నాయకులు మరోవైపు తమ ముఖ్యనేతలను ప్రశ్నిస్తున్నారు. -
టార్గెట్ ‘ఖమ్మం’
సాక్షి, కొత్తగూడెం : కాంగ్రెస్‌పార్టీలో ఆశావహులు అప్పుడే సీట్ల కోసం తహతహలాడుతున్నారు. రానున్నది ఎన్నికల సీజన్ కావడంతో ఎవరికివారు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎంపీ రేణుకాచౌదరి, మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి తమ అనుంగు శిష్యులకు ఖమ్మం సీటు ఇప్పించడానికి అప్పుడే హామీలిస్తున్నారనే చర్చ జోరందుకుంది. అయితే రేణుకాచౌదరి ఈ వ్యవహారంలో ఒకడుగు ముందుకేయడంతో పార్టీలో ప్రధాననేతలు ఆమెపై మండిపడుతున్నారని కాంగ్రెస్ శ్రేణులే గుసగుసలాడుతున్నాయి. జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో ఏడు రిజర్వుకాగా మిగతా జనరల్ స్థానాలు ఖమ్మం, పాలేరు, కొత్తగూడెంలో అభ్యర్థుల ఎంపిక పార్టీలకు తలకుమించిన భారమే. కాంగ్రెస్ పార్టీలో ఈ విషయంలో ప్రతిసారి విభేదాలు భగ్గుమంటున్నాయి. ప్రధానంగా ఖమ్మం విషయంలో రేణుకాచౌదరి అధిపత్యానికి చెక్ పెట్టాలని ఆపార్టీ ముఖ్యనేతలు ప్రయత్నించి విఫలమవుతున్నారు. గతంలో తనకు అనుకూలంగా ఉన్న యూనిస్సుల్తాన్కు సీటు ఇప్పించడంతో.. పార్టీ శ్రేణులు అంతర్గంగా ఆమె తీరుని వ్యతిరేకించారు. దీంతో ఆమె అభ్యర్థిగా బరిలోకి దిగిన యూనిస్సుల్తాన్కు డిపాజిట్ కూడా దక్కలేదు. ఈ ప్రభావం స్వయంగా తనపై కూడా పడడంతో ఆమె కూడా ఓటమి పాలయ్యారు. ఆతర్వాత ఎలాగైనా ఖమ్మంలో పట్టుకోసం ఆమె పడరాని పాట్లు పడ్డారు. రాజ్యసభ కోటాలో ఎంపీ పదవి దక్కించుకొన్న రేణుక మళ్లీ జిల్లాలో చక్రం తిప్పాలనే ఆలోచనతో తరచూ జిల్లాకు వస్తూ తన అనుచర గణంలో పదవుల ఆశ చూపుతూ వచ్చారు. ఈ తరుణంలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో పువ్వాడ అజయ్‌కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరి రేణుక శిబిరంలో నేతగా కొనసాగుతున్నారు. ఖమ్మం సీటును ఇప్పిస్తానని రేణుకాచౌదరి హామీ ఇవ్వడంతోనే అజయ్ పార్టీలోకి వచ్చారని ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. మొన్నటి వరకు తనకు గాఢ్ ఫాదర్‌గా ఉన్న రేణుకాచౌదరి చేయివ్వడంతో యూనిస్‌సుల్తాన్ నిరాశకు గురయ్యారు. మళ్లీ ఎలాగైనా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న ఆయన గతంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి.. ప్రస్తుత కేంద్ర మంత్రి ఆజాద్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మైనార్టీ కోటాలో తనకు ఖమ్మం నుంచి పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని సుల్తాన్ తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో తన ఆధిపత్యం కొనసాగాలని, తన మాట వినేవారు ఉంటే.. ఏదైనా సాధించవచ్చన్న రీతిలో రేణుక వ్యవహరిస్తున్నారని ఆపార్టీ నేతలు రుసరుసలాడుతున్నారు. ఖమ్మం సీటుపై మంత్రాంగం.. రాజకీయంగా ఎప్పటి నుంచో తన అనుచరునిగా ఉండి, ప్రస్తుతం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఉన్న మానుకొండ రాధాకిషోర్‌కు ఈసారి ఖమ్మం సీటు ఇప్పించాలన్న యోచనలో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ఉన్నట్లు సమాచారం. తాను పాలేరు నుంచి బరిలో నిలిచి విజయం సాధిస్తానని, మానుకొండ ఖమ్మంలో విజయం సాధిస్తే.. తన వర్గ బలం పెరుగుతుందన్న భావనలో మంత్రి ఉన్నారు. అయితే ఖమ్మం సీటు విషయంలో రేణుకాచౌదరి కొరకరాని కొయ్యగా మారడంతో ఏంచేయాలో మంత్రి పాలుపోలేని స్థితిలో ఉన్నారు. మరోవైపు.. రేణుక హామీ ఇవ్వడం వల్లే పువ్వాడ అజయ్‌కుమార్ కాంగ్రెస్పార్టీలోకి వచ్చారని, నిన్నగాక మొన్న వచ్చిన వారికి టికెట్ ఇప్పిస్తానని ఎలా హామీ ఇస్తారని మానుకొండ ఆమెపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. ఇటీవల జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమానికి మంత్రి, మానుకొండ గైర్హాజరు కావడంతో పాటు రాంరెడ్డి అనుచర సర్పంచ్‌లు ఎవ్వరూ ఈ కార్యక్రమానికి రాకపోవడం..రేణుక, మంత్రి మధ్య అగాధం మరింత పెరిగిందనడానికి నిదర్శనమని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మొత్తంగా రేణుకకు చెక్ పెట్టి తన శిష్యుడు మానుకొండకు టికెట్ ఖరారు చేయించుకోవాలని, ఇప్పటి నుంచే మానుకొండను రంగంలోకి దింపితే ఇటు తనకు, అటు అతనికి ప్రయోజనకరంగా ఉంటుందన్న ఆలోచనలో మంత్రి ఉన్నట్లు సమాచారం. ఇక దూరం పెట్టాల్సిందే.. తెలంగాణ విభజన వ్యవహారంలో రేణుకాచౌదరి వ్యవహారం మింగుడు పడని నేతలు ఆమెను జిల్లాకు శాశ్వతంగా దూరంగా పెట్టాలని ప్రయత్నిస్తూ ఆదిశగా పావులు కదుపుతున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీలో చిచ్చుపెడుతున్న రేణుకకు ప్రాధాన్యం ఎందుకు ఇవ్వాలని ద్వితీయ శ్రేణి నాయకులు మరోవైపు తమ ముఖ్యనేతలను ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడో వచ్చి ఆర్భాటం చేస్తున్న ఆమెకు ఎందుకు ఘనంగా స్వాగతం పలకాలని, ఆసలు ఆమె మాటే వినవద్దని, ప్రజాబలం లేని ఆమెను పట్టించుకోకుంటేనే జిల్లాలో మళ్లీ తమ సత్తా చాటవచ్చని నాయకులు గుసగుసలాడుతున్నారు. ఇటీవల సర్పంచ్ ఎన్నికల సమయంలో పార్టీకి ఎలాంటి సహకారం ఇవ్వలేదని, తామే ఉన్నంతలో ఖర్చు చేసి సర్పంచ్‌లను గెలిపించుకున్నామని, సన్మానం చేయడానికి ఆమె ఎవరని నేతలు బహాటంగానే ప్రశ్నిస్తున్నారు. ఇలా జరగబోయే ఎన్నికల్లో ఆధిపత్యం చాటేందుకు జిల్లా కాంగ్రెస్ నేతలు పడుతున్న పాట్లు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. -
రాంరెడ్డి వెంకట్‌రెడ్డి కారు దగ్ధం
భువనగిరి, న్యూస్‌లైన్: రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదివారం రాత్రి కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణం సింగన్నగూడెం చౌరస్తావద్ద జాతీయ రహదారిపై రాత్రి 8.30గంటల ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు షార్ట్‌సర్క్యూట్‌కు గురైంది. మంత్రితో పాటు ఆయన తమ్ముడు కృష్ణారెడ్డి, పీఏ నవీన్, డ్రైవర్ కృష్ణ, గన్మెన్లు ఎల్లయ్య, హరినారాయణ, రాంబాబు, సుబ్బారావులు కారులో ఉన్నారు. వరంగల్ జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని హైదరాబాద్‌కు వెళ్తూ సింగన్నగూడెం వద్దకు రాగానే డ్యాష్‌బోర్డు నుంచి పొగలు రావడాన్ని గమనించారు. వెంటనే కారాపి అందరూ కిందికి దిగారు. డ్రైవర్ కారు బోయ్నెట్నుఎత్తి వైర్లను సరిచేస్తుండగానే పెద్దఎత్తున మంటలు లేచాయి. డీజిల్‌ట్యాంకు పగిలిపోయింది.