కూసుమంచి, న్యూస్‌లైన్: కూసుమంచిలో ఆదివారం రచ్చబండ సభకు వచ్చిన మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డికి తెలంగాణవాదుల నుంచి నిరసన సెగ తగిలింది. కూసుమంచిలోని విజయరామా ఫంక్షన్ హాల్‌లో రచ్చబండ సభలో ముఖ్య అతిధిగా మంత్రి పాల్గొన్నారు. తెలంగాణవాదులు ఆందోళనకు దిగవచ్చని ముందే ఊహించిన పోలీసులు.. వేదిక వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. సభలో మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో బయటి నుంచి న్యూడెమోక్రసీ, టీఆర్‌ఎస్, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు సభాప్రాంగణం వైపు వెళ్లబోయారు. వీరిని గేటు ముందే పోలీసులు అడ్డుకున్నారు. వేదిక పైనున్న ఫ్లెక్సీ నుంచి సీఎం బొమ్మ తొలగించాలని వారు డిమాండ్ చేశారు. వారి వద్దకు కూసుమంచి సీఐ నరేష్‌రెడ్డి వచ్చి, కొందరిని మాత్రమే వేదిక వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వీరు.. ‘జై తెలంగాణ’, ‘సీఎం డౌన్ డౌన్’ అంటూ నినాదాలు ఛేశారు.
దీంతో మంత్రికి కోపమొచ్చింది. ఆయన తీవ్ర స్వరంతో... ‘తెలంగాణ ఇస్తున్నది మేమే’ అన్నారు. సీఎం ఫొటోను ఫ్లెక్సీ నుంచి తొలగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేయగా... ‘ఆయన సీఎం. ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఫొటో ఉండాలి. దానికే మీరు గొడవ చేస్తారా...?’ అంటూ ఆగ్రహించారు. మంత్రి ప్రసంగం పూర్తయ్యేంత వరకు వీరిని పోలీసులు వేదిక కిందనే ఉంచారు. ఆ తరువాత, మంత్రికి వినతిపత్రమిచ్చేందుకు అనుమతించారు. ఆ తరువాత కూడా ఆందోళనకారులు ‘జై తెలంగాణ’ అంటూ నినాదాలు చేస్తుండగా పోలీసులు బయటకు పంపించేశారు. రచ్చబండ ఫ్లెక్సీలో సీఎం ఫొటో ఉంచడాన్ని నిరసిస్తూ ఆందోళనకారులు కూసుమంచి బస్టాండ్ సెంటర్‌లో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.
కారేపల్లి, న్యూస్‌లైన్: కారేపల్లిలో ఆదివారం రచ్చబండ సభకు తెలంగాణ సెగ తగిలింది. సభ ప్రారంభమవగానే తెలంగాణ వాదులు ‘జై తెంగాణ’ నినాదాలతో స్టేజీ పైకి వెళ్లి ఫ్లెక్సీ చించివేశారు. అడ్డుకునేందుకు వస్తున్న పోలీసుల నుంచి తప్పించుకుని, ‘సీఎం డౌన్ డౌన్’ అని నినాదాలు చేస్తూ, ఆ ఫ్లెక్సీతో సమీపంలోని క్రీడా మైదానంలోకి పరుగెత్తి, అందులోని సీఎం బొమ్మను చెప్పులతో కొడుతూ.. తన్నుతూ నిప్పంటించారు. ఆ తరువాత సభ వేదిక వద్దకు తిరిగొచ్చి, భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలంటూ తీర్మానం చేయాలని పట్టుపట్టారు.
సభను బహిష్కరించిన ఎమ్మెల్యే
ఈ సభలో వైరా ఎమ్మెల్యే చంద్రావతి మాట్లాడుతూ.. కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం వివిధ పథకాలకు సంబంధించి కాకి లెక్కల కబుర్లతో కాలక్షేపం చేస్తోందని, రచ్చబండ సభలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని, సర్కారుకు సమస్యలు చెప్పుకుందామని వస్తే భరోసా ఇచ్చేవారే క రువయ్యారని ఆగ్రహించారు. సభను బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పోట్లకు చేదు అనుభవం
ఈ సభలో ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావుకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన మాట్లాడుతుండగా.. ‘ఇది మీ పార్టీ మీటింగు కాదు’ అంటూ, రచ్చబండ కమిటీ సభ్యురాలిగా స్టేజీ పై కూర్చున్న పగడాల మంజుల, కాంగ్రెస్ నాయకుడు తలారి చంద్రప్రకాశ్, ఆ పార్టీకి చెందిన సర్పంచులు భద్రునాయక్, మంగీలా ల్ అడ్డుకున్నారు. వారిపై పోట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ, సభ వేదిక పైనున్న బెంచీలను కింద పడేసి కిందకు దిగి వెళ్లిపోయారు. కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు పరస్పరం దూషించుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
రచ్చబండకు తెలంగాణ సెగ
Published Mon, Nov 25 2013 3:17 AM | Last Updated on Sat, Sep 2 2017 12:57 AM
Advertisement
Advertisement