రేణుక ఖమ్మం జిల్లా ఆడబిడ్డ ఎలా అవుతుంది?
ఖమ్మం : కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరిని మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. రేణుకా చౌదరి ఖమ్మం జిల్లా ఆడబిడ్డ ఎలా అవుతుందో నిరూపించుకోవాలని ఆయన సవాల్ విసిరారు. ఆడబిడ్డల మనోభావాలు దెబ్బతిసే హక్కు ఎవరికీ లేదని రాంరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈనెల 21న ఖమ్మంలో జరిగే సమావేశానికి రేణుకను ఆహ్వానించే విషయంలో తెలంగాణ మంత్రుల కమిటీ నిర్ణయిస్తుందన్నారు.
ఇక ఖమ్మం జిల్లా కాంగ్రెస్లో విభేదాలు పొడచూపుతున్నాయి. ఎంపీ రేణుకాచౌదరి, మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి తమ అనుంగు శిష్యులకు ఖమ్మం సీటు ఇప్పించడానికి అప్పుడే హామీలిస్తున్నారనే చర్చ జోరందుకుంది. అయితే తెలంగాణ విభజన వ్యవహారంలో రేణుకాచౌదరి వ్యవహారం మింగుడు పడని నేతలు ఆమెను జిల్లాకు శాశ్వతంగా దూరంగా పెట్టాలని ప్రయత్నిస్తూ ఆదిశగా పావులు కదుపుతున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీలో చిచ్చుపెడుతున్న రేణుకకు ప్రాధాన్యం ఎందుకు ఇవ్వాలని ద్వితీయ శ్రేణి నాయకులు మరోవైపు తమ ముఖ్యనేతలను ప్రశ్నిస్తున్నారు.