సారీ.. సీఎంకు సమయం లేదు!
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు దివంగత కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నేతలు తాజాగా చేసిన ప్రయత్నం ఫలించలేదు. పాలేరు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థిని నిలిపే విషయంలో పునరాలోచించాలని రాంరెడ్డి కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు భావించారు.
అందులో భాగంగా వారు సోమవారం సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోరగా... ముఖ్యమంత్రికి సమయం లేదని సీఎం కార్యాలయ వర్గాల నుంచి సమాధానం వచ్చింది. గతంలోనూ ఓ సారి రాంరెడ్డి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని కలవాలని ప్రయత్నించగా... అప్పుడు కూడా సీఎంకు సమయం లేదంటూ సమాధానం లభించిన విషయం విధితమే.
అయితే నామినేషన్ల ఘట్టం త్వరలో ముగియనుండగా, పాలేరు ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా సహకరించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, దివంగత ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి సతీమణి సుచరితారెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కోరారు. ఖమ్మం జిల్లాకు తన భర్త చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని పోటీ నుంచి విరమించేలా నిర్ణయం తీసుకోవాలని ఆమె అభ్యర్థించారు. ఈ మేరకు సుచరిత ఆదివారం సీఎంకు ఒక లేఖ రాసిన సంగతి తెలిసిందే.
రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణంతో అనివార్యమైన పాలేరు ఉప ఎన్నికల్లో పలు విపక్షపార్టీలు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. చనిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో పోటీకి దిగొద్దని, ఏకగ్రీవానికి సహకరించాలని కాంగ్రెస్ పార్టీ విపక్షాలను అభ్యర్థించింది. ఆ మేరకు వైఎస్సార్ సీపీ, టీడీపీ, సీసీఐ, సీపీఎంలు పోటీకి దిగబోమని ప్రకటించాయి. ఇదే విషయాన్ని సీఎంకు రాసిన లేఖలో ప్రస్తావించిన సుచరితారెడ్డి టీఆర్ఎస్ కూడా ఏకగ్రీవానికి సహకరిస్తుందనే ఆశాభావం వ్యక్తంచేశారు.