సాక్షి, కొత్తగూడెం: జిల్లా కాంగ్రెస్‌లో నిన్న మొన్నటివరకు అంతర్గతంగా సాగుతున్న పోరు బహిరంగమై తీవ్రరూపం దాల్చింది. ఎంపీ రేణుకాచౌదరికి చెక్‌పెట్టడానికి ప్రత్యర్థి వర్గం రంగం సిద్ధం చేసింది. రాష్టమ్రంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‘ఆడబిడ్డ’పై వ్యాఖ్యలు చేయడం, ఈనెల 21న జరిగే సభకు రేణుకను ఆహ్వానించే విషయాన్ని మంత్రుల సమన్వయకమిటీ చూసుకుంటుందని ప్రకటించడం చూస్తే జిల్లా రాజకీయాల్లో రేణుక పాత్రను ముగించటానికి పావులు వేగంగానే కదులుతున్నాయనే చర్చ పార్టీ శ్రేణుల్లో నడుస్తోంది.
రానున్న ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ సీట్ల పంపకంపై తన ముద్ర ఉండాలని రేణుకాచౌదరి భావిస్తుండగా... ఆమెను ఎలాగైనా జిల్లాకు దూరం పెట్టాలని ఆమె వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటి పైకి వస్తున్నాయి. గతంలో సమైక్యం వినిపించిన రేణుకకు తెలం‘గానం’తో చెక్ పెట్టేందుకు ఇదే మంచి అదునని, అందుకు తెలంగాణ కృతజ్ఞత సభను వేదికగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం ఆమె ఏంచేస్తున్నా మౌనంగా ఉన్న రాంరెడ్డి...బహిరంగంగా విమర్శలు గుప్పించడం చూస్తే అవసరమైతే హస్తిన స్థాయిలోనైనా అమీతుమీ తేల్చుకునేందుకు రేణుక ప్రత్యర్థివర్గం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి రేణుకపై జిల్లా కాంగ్రెస్ నాయకులలో గూడుకట్టుకున్న వ్యతిరేక భావన గతకొద్ది రోజులుగా బయటపడుతూనే ఉంది.
తెలంగాణ విజయోత్సాహంలో ఉన్న నేతలు ఇటీవల నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విషయంలో రేణుక జోక్యం చేసుకొని ఇప్పుడే సభలెందుకని నాయకులను కట్టడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈపరిస్థితుల్లో.. ఆమె సమైక్యవాదానికి కట్టుబడి ఉందని, తామెందుకు సభలు నిర్వహించవద్దని ద్వితీయ శ్రేణి నాయకులు తమ నేతలను ప్రశ్నిస్తూ వచ్చారు. అయినా సభలు నిర్వహించేందుకు డీసీసీ తరఫున, నియోజకవర్గాల వారీగా నేతలు ముందుకు రాలేదు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌లో భేటీ అయిన సందర్భంగా ఈ సమావేశానికి రేణుకాచౌదరి కూడా హాజరయ్యారు.
సమైక్యవాదం వినిపిస్తున్న ఆమె ఈ సమావేశానికి ఎందుకు వచ్చారని మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు, సూర్యాపేట ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఎంపీ పొన్నం ప్రభాకర్‌లు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె విషయంలో మెత్తబడి ఉంటే రాజకీయంగా భవిష్యత్ ఉండదని తెలంగాణ ప్రజాప్రతినిధులు జిల్లా నేతలకు హితబోధ చేసినట్లు సమాచారం. దీంతో రాజకీయంగా తనకు అడ్డు తగులుతూ ఈ జిల్లా కాకున్నా పెత్తనం చెలాయిస్తున్న రేణుకపై గుర్రుగా ఉన్న మంత్రి రాంరెడ్డి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. కలిసి వచ్చిన తెలంగాణ సభ..
తెలంగాణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో జిల్లాలో తన సత్తాచాటాలన్న ఉద్దేశంతో తెలంగాణ సభ నిర్వహణ బాధ్యతను మంత్రి భూజానకెత్తుకున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 21న ఖమ్మంలో ‘కృతజ్ఞత సభ’ నిర్వహించాలని తలపెట్టారు. జిల్లా నలుమూలల నుంచి భారీ ఎత్తున క్యాడర్‌ను తరలించాలన్న ఉద్దేశంతో గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల బాధ్యులను కలుపుకొని పోతూ... సభను విజయవంతం చేస్తే రాజకీయంగా పునాది బలోపేతం అవుతుందని, మనస్పర్థలు వీడి అందరం ఐక్యంగా ఉంటేనే విజయం సాధిస్తామన్న రీతిలో వారికి నచ్చజెపుతున్నట్లు సమాచారం.
ఇటు పార్టీ పరంగా జిల్లాలో ఈ సభతో తన ఈమేజ్‌ను పెంచుకోవడంతో పాటు.. అటు రేణుకాచౌదరికి చెక్ పెట్టాలన్న వ్యూహంలో మంత్రి ఉన్నట్లు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చజరుగుతోంది. తెలంగాణ సభ అందుకు పూర్తి వేదికవుతుందని, ఈ సభకు వచ్చే నేతలంతా ఏకతాటిపై ఉంటారని, ఇక రేణుకాచౌదరికి కొద్దొగొప్పో ఉన్న అనుచర గణం కూడా ఇటువైపే రావాలని.. లేకుంటేవారికి భవిష్యత్ ఉండదన్నది చర్చనీయాంశంగా మారింది. రేణుకపై నేరుగా విమర్శనాస్త్రాలు..
అధిష్టానం వద్ద లాబీయింగ్ ఉన్న రేణుకాచౌదరిపై పార్టీ నేతలు ఏనాడు విమర్శలు చేయలేదు. ఆమెతో పెట్టుకుంటే తమకు రాజకీయ భవిష్యత్ ఉండదని భావించిన నేతలు.. ఆమె వారిని ఎన్ని అవమానాలకు గురి చేసినా సహించారు.
కానీ మంత్రి వెంకటరెడ్డి ఇప్పుడు అనూహ్య రీతిలో విమర్శనాస్త్రాలు సంధించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘రేణుకాచౌదరి తెలంగాణ వ్యతిరేకి అనే భావన ఉంది.. ఆమెను తమ ఆడపడుచుగా జిల్లా వాసులు గుర్తించడం లేదు.. ఈనెల 21న సభకు ఆమెను ఆహ్వానించే విషయమై నిర్ణయం తీసుకోలేదు’ అంటూ ఆమెపై వ్యతిరేకతను కుండబద్దలు కొట్టారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ నేతలు షాక్‌కు గురయ్యారు. సమైక్యవాదం వినిపించిన రేణుకాచౌదరిని మంత్రి ఎలాగైనా జిల్లా రాజకీయాల నుంచి దూరం చేస్తారని, అందుకు ఆయన మాటలే నిదర్శనమని..ఇందుకు కృతజ్ఞత సభ వేదిక అవుతుందని ఆయన వర్గీయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి కౌంటర్‌గా రేణుక శిబిరం ఎలాంటి ఎత్తుగడ వేస్తుందో చూడాలి.
రేణుకపై మంత్రి రాంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
దమ్మపేట, న్యూస్‌లైన్: ‘ ఈ జిల్లాకు మంచి సంస్కృతి ఉంది..జలగం వెంగళరావును రెండుసార్లు గెలిపించాం..కొండలరావును గెలిపించాం..ఈ ప్రాంత వాసులు కాకపోయినా పీవీ రంగయ్యనాయుడు, నాదెండ్ల భాస్కరరావును, రేణుకాచౌదరిని గెలిపించాం.. కేంద్రమంత్రిని చేశాం..ఇక ఇతర ప్రాంతాల వారిని మోసే శక్తి మా వద్దలేదు..జిల్లా ఆడబిడ్డనని చెప్పుకుంటున్న వారే ఎక్కడి వారో ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది’ అంటూ రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరిని ఉద్దేశించి సంచనల వ్యాఖ్యలు చేశారు. మంగళవారం దమ్మపేట మండలం అంకంపాలెంలో గిరిజన బాలికల జూనియర్ కళాశాల ప్రారంభించిన అనంతరం స్థానిక ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన, ఎంఎల్‌సి పొంగులేటి సుధాకర్‌రెడ్డిలతో కలసి విలేకరులతో మాట్లాడారు.
ఏ గ్రామంలో అయినా జనన, మరణ జాబితాలుంటాయని.., ఈ జిల్లా ఆడబిడ్డగా చెప్పుకుంటున్న వారు ఎక్కడ పుట్టారో చెప్పాలన్నారు. జిల్లాలో లక్షలాది మంది గిరిజన ఆడబిడ్డలున్నారని, ఆమె ఎక్కడి ఆడబిడ్డో చెప్పాలన్నారు. నాడు ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు వలసవాదులను ఆదరించామని, ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఏర్పడుతున్న నేపధ్యంలో ఇతర ప్రాంతాల వారిని తాము మోయలేమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో ఎంపిగా ఎవరిని నిలబెట్టినా పని చేస్తామని, అయితే ఇతర ప్రాంతాల వారి విషయంలో మాత్రం మా వాదనలు అధిష్టానం వద్ద తప్పక వినిపిస్తామన్నారు. పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీని తిట్టి, స్వతంత్రంగా పోటీ చేసి ఓడిపోయిన చాలా మంది తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అలాంటి వారందరూ రెండేళ్లపాటు పార్టీ కోసం పనిచేసిన తర్వాతనే వారి గురించి పార్టీ ఆలోచన చేస్తుందన్నారు. సమావేశంలో డీసీసీ కార్యదర్శి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఏఎంసి చైర్మన్ సున్నం నాగమణి, జిల్లా నాయకులు కట్ల రంగారావు, రామిశెట్టి మనోహర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఎక్కడి ఆడబిడ్డవో చెప్పాలంటూ విసుర్లు
Published Wed, Oct 9 2013 4:14 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement