ఖమ్మం, న్యూస్‌లైన్: జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రోజుకో తీరుగా మారుతోంది. ప్రధానంగా రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి మధ్య ప్రచ్ఛన్నయుద్ధం సాగుతోంది. ఒకరి ప్రాబల్యం తగ్గించేందుకు మరొకరు ఎత్తులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే అనివార్యంగా ఖాళీ అవుతున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలను తమ అనుచరులకు దక్కించుకునేలా నాయకులు కసరత్తు చేస్తున్నారు. ఈ విషయమై పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణతో చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలో అశావహులు ముందస్తు ప్రయత్నాలు మొదలుపెట్టారు. నేతలు కూడా ఎవరికి వారు తమ అనుచరులకు, బంధువులకు పార్టీ పగ్గాలు అప్పగించే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో ప్రత్యర్థి వర్గాలను దెబ్బతీయడంతోపాటు తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
- అనివార్యంగా ఖాళీ కానున్న డీసీసీ పీఠం
గత దశాబ్ధకాలంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న వనమా వెంకటేశ్వరరావు ఆ పదవిని అనివార్యంగా వదిలిపెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. తన పదవికి రాజీనామా చేస్తానని వనమా తన అనుచరులతో చెప్పినట్లు తెలిసింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి పోటీలో నిలవాలనే ఉద్దేశంతో జోడు పదవులు ఉంటే టికెట్ రావడం కష్టమని భావించి ముందుగానే డీసీసీ పీఠాన్ని వదులుకుంటున్నట్లు సమాచారం. అయితే ఇటీవల జిల్లాలో చోటు చేసుకున్న వర్గ రాజకీయాల్లో భాగంగా డీసీసీ పీఠంపై తమ అనుచరులనే ఎక్కించాలని జిల్లా నాయకులు ఎవరికి వారు తాపత్రయ పడటం, ఇటీవల భద్రాచలం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుని ఎంపిక సందర్భంగా వనమాకు షోకాజ్ నోటీసు జారీ కావడంతో ఆయనను డీసీసీ నుండి తప్పిస్తున్నారని జిల్లాలో చర్చనీయాంశమైంది. ఏది ఏమైనా తెలంగాణ హడావుడి అయిన తర్వాత వనమా డీసీసీ అధ్యక్ష పదవి నుంచి వెళ్లడం తథ్యమని స్పష్టమవుతోంది.
అనుచరుల కోసం నేతల కసరత్తు...
జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పీఠం తమ గుప్పిట్లో ఉంచుకోవాలని, అందుకోసం తమ విధేయులను, లేదా బంధువులను ఆ పీఠంపై కూర్చోబెట్టాలని జిల్లాలోని కాంగ్రెస్ దిగ్గజాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇంతకాలం రేణుకాచౌదరికి విధేయుడుగా ఉన్న వనమా వెంకటేశ్వరరావు అధ్యక్షుడిగా ఉండటంతో పార్టీ కార్యాలయంలో తమకు ప్రాధాన్యత తగ్గిందని మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి వర్గీయులు భావించారు. ఇటీవల రేణుకాచౌదరికి వ్యతిరేకంగా విలేకరుల సమావేశం పెట్టేందుకు డీసీసీ కార్యాలయానికి వెళ్తే తమను చిన్నచూపు చూశారని, మైకు, కుర్చీలు కూడా ఇవ్వలేదని మంత్రి వర్గీయులు మండిపడ్డారు. దీనిని దృష్టిలో పెట్టుకొనే భద్రాచలం విషయంపై మంత్రి పట్టుబట్టి వనమాకు షోకాజ్ నోటీసు ఇప్పించారనే ప్రచారం జరిగింది. అందుకోసం డీసీసీ అధ్యక్షునిగా తన సోదరుడు కృష్ణారెడ్డిని కానీ, ముఖ్య అనుచరుడు శీలంశెట్టి వీరభద్రాన్ని కానీ నియమించాలని మంత్రి భావించి పీసీసీకి వారి పేర్లు సూచించినట్లు తెలిసింది. అదేవిధంగా ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కూడా తన తమ్ముడు శ్రీనివాస్‌రెడ్డి, రాపర్తి రంగారావు పేర్లను సూచించనట్లు సమాచారం.
ఇటు రేణుకాచౌదరి వర్గీయులకు, అటు మంత్రి అనుచరులకు కాకుండా.. తాను సూచించిన వారికి డీసీసీ అప్పగిస్తే జిల్లాలో అందరినీ కలుపుకొని పోతామని, వర్గాలు లేకుండా చూస్తామని ఉపసభాపతి మల్లు భట్టివిక్రమార్క అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. ఇందుకోసం తన అనుచరులైన సీనియర్ నాయకులు సోమ్లానాయక్, నాగబండి రాంబాబుల పేర్లు పరిగణలోకి తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. కాగా, వనమా వెంకటేశ్వర్‌రావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పోరిక లక్ష్మీబాయిలకు అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేయడం, ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేణుకాచౌదరి సూచించిన వడ్డెబోయిన శంకర్‌రావుకు రాకుండా అడ్డుపడటం వంటి వరుస పరాభవాలు చవిచూసిన రేణుక వర్గీయులు డీసీసీ అధ్యక్షపీఠాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం రేణుకాచౌదరి విధేయుడు పరుచూరి మురళితోపాటు మరొకరి పేరును పీసీసీకి సూచించి, వారికే డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని పట్టుబట్టినట్టు సమాచారం.
ఇలా ఎవరికి వారు తమ అనుచరులను డీసీసీ పీఠంపై ఎక్కించి తమ సత్తా చాటుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం. ఇటువంటి పరిస్థితిలో డీసీసీ పీఠం ఎవరి వర్గీయులకు దక్కుతుందో... లేదా ప్రస్తుత అధ్యక్షులు వనమా వెంకటేశ్వరరావునే మరికొంత కాలం కొనసాగిస్తారా..? అనేది జిల్లాలో చర్చనీయాంశమైంది.
అధ్యక్ష పదవికి వనమా రాజీనామా అనివార్యం!
Published Thu, Nov 14 2013 3:03 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement