సాక్షి, కొత్తగూడెం : కాంగ్రెస్‌పార్టీలో ఆశావహులు అప్పుడే సీట్ల కోసం తహతహలాడుతున్నారు. రానున్నది ఎన్నికల సీజన్ కావడంతో ఎవరికివారు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎంపీ రేణుకాచౌదరి, మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి తమ అనుంగు శిష్యులకు ఖమ్మం సీటు ఇప్పించడానికి అప్పుడే హామీలిస్తున్నారనే చర్చ జోరందుకుంది. అయితే రేణుకాచౌదరి ఈ వ్యవహారంలో ఒకడుగు ముందుకేయడంతో పార్టీలో ప్రధాననేతలు ఆమెపై మండిపడుతున్నారని కాంగ్రెస్ శ్రేణులే గుసగుసలాడుతున్నాయి.
జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో ఏడు రిజర్వుకాగా మిగతా జనరల్ స్థానాలు ఖమ్మం, పాలేరు, కొత్తగూడెంలో అభ్యర్థుల ఎంపిక పార్టీలకు తలకుమించిన భారమే. కాంగ్రెస్ పార్టీలో ఈ విషయంలో ప్రతిసారి విభేదాలు భగ్గుమంటున్నాయి. ప్రధానంగా ఖమ్మం విషయంలో రేణుకాచౌదరి అధిపత్యానికి చెక్ పెట్టాలని ఆపార్టీ ముఖ్యనేతలు ప్రయత్నించి విఫలమవుతున్నారు. గతంలో తనకు అనుకూలంగా ఉన్న యూనిస్‌సుల్తాన్‌కు సీటు ఇప్పించడంతో.. పార్టీ శ్రేణులు అంతర్గంగా ఆమె తీరుని వ్యతిరేకించారు. దీంతో ఆమె అభ్యర్థిగా బరిలోకి దిగిన యూనిస్‌సుల్తాన్‌కు డిపాజిట్ కూడా దక్కలేదు. ఈ ప్రభావం స్వయంగా తనపై కూడా పడడంతో ఆమె కూడా ఓటమి పాలయ్యారు. ఆతర్వాత ఎలాగైనా ఖమ్మంలో పట్టుకోసం ఆమె పడరాని పాట్లు పడ్డారు.
రాజ్యసభ కోటాలో ఎంపీ పదవి దక్కించుకొన్న రేణుక మళ్లీ జిల్లాలో చక్రం తిప్పాలనే ఆలోచనతో తరచూ జిల్లాకు వస్తూ తన అనుచర గణంలో పదవుల ఆశ చూపుతూ వచ్చారు. ఈ తరుణంలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో పువ్వాడ అజయ్‌కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరి రేణుక శిబిరంలో నేతగా కొనసాగుతున్నారు. ఖమ్మం సీటును ఇప్పిస్తానని రేణుకాచౌదరి హామీ ఇవ్వడంతోనే అజయ్ పార్టీలోకి వచ్చారని ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. మొన్నటి వరకు తనకు గాఢ్ ఫాదర్‌గా ఉన్న రేణుకాచౌదరి చేయివ్వడంతో యూనిస్‌సుల్తాన్ నిరాశకు గురయ్యారు. మళ్లీ ఎలాగైనా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న ఆయన గతంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి.. ప్రస్తుత కేంద్ర మంత్రి ఆజాద్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మైనార్టీ కోటాలో తనకు ఖమ్మం నుంచి పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని సుల్తాన్ తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో తన ఆధిపత్యం కొనసాగాలని, తన మాట వినేవారు ఉంటే.. ఏదైనా సాధించవచ్చన్న రీతిలో రేణుక వ్యవహరిస్తున్నారని ఆపార్టీ నేతలు రుసరుసలాడుతున్నారు.
ఖమ్మం సీటుపై మంత్రాంగం..
రాజకీయంగా ఎప్పటి నుంచో తన అనుచరునిగా ఉండి, ప్రస్తుతం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఉన్న మానుకొండ రాధాకిషోర్‌కు ఈసారి ఖమ్మం సీటు ఇప్పించాలన్న యోచనలో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ఉన్నట్లు సమాచారం. తాను పాలేరు నుంచి బరిలో నిలిచి విజయం సాధిస్తానని, మానుకొండ ఖమ్మంలో విజయం సాధిస్తే.. తన వర్గ బలం పెరుగుతుందన్న భావనలో మంత్రి ఉన్నారు. అయితే ఖమ్మం సీటు విషయంలో రేణుకాచౌదరి కొరకరాని కొయ్యగా మారడంతో ఏంచేయాలో మంత్రి పాలుపోలేని స్థితిలో ఉన్నారు. మరోవైపు.. రేణుక హామీ ఇవ్వడం వల్లే పువ్వాడ అజయ్‌కుమార్ కాంగ్రెస్‌పార్టీలోకి వచ్చారని, నిన్నగాక మొన్న వచ్చిన వారికి టికెట్ ఇప్పిస్తానని ఎలా హామీ ఇస్తారని మానుకొండ ఆమెపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. ఇటీవల జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమానికి మంత్రి, మానుకొండ గైర్హాజరు కావడంతో పాటు రాంరెడ్డి అనుచర సర్పంచ్‌లు ఎవ్వరూ ఈ కార్యక్రమానికి రాకపోవడం..రేణుక, మంత్రి మధ్య అగాధం మరింత పెరిగిందనడానికి నిదర్శనమని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మొత్తంగా రేణుకకు చెక్ పెట్టి తన శిష్యుడు మానుకొండకు టికెట్ ఖరారు చేయించుకోవాలని, ఇప్పటి నుంచే మానుకొండను రంగంలోకి దింపితే ఇటు తనకు, అటు అతనికి ప్రయోజనకరంగా ఉంటుందన్న ఆలోచనలో మంత్రి ఉన్నట్లు సమాచారం.
ఇక దూరం పెట్టాల్సిందే..
తెలంగాణ విభజన వ్యవహారంలో రేణుకాచౌదరి వ్యవహారం మింగుడు పడని నేతలు ఆమెను జిల్లాకు శాశ్వతంగా దూరంగా పెట్టాలని ప్రయత్నిస్తూ ఆదిశగా పావులు కదుపుతున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీలో చిచ్చుపెడుతున్న రేణుకకు ప్రాధాన్యం ఎందుకు ఇవ్వాలని ద్వితీయ శ్రేణి నాయకులు మరోవైపు తమ ముఖ్యనేతలను ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడో వచ్చి ఆర్భాటం చేస్తున్న ఆమెకు ఎందుకు ఘనంగా స్వాగతం పలకాలని, ఆసలు ఆమె మాటే వినవద్దని, ప్రజాబలం లేని ఆమెను పట్టించుకోకుంటేనే జిల్లాలో మళ్లీ తమ సత్తా చాటవచ్చని నాయకులు గుసగుసలాడుతున్నారు. ఇటీవల సర్పంచ్ ఎన్నికల సమయంలో పార్టీకి ఎలాంటి సహకారం ఇవ్వలేదని, తామే ఉన్నంతలో ఖర్చు చేసి సర్పంచ్‌లను గెలిపించుకున్నామని, సన్మానం చేయడానికి ఆమె ఎవరని నేతలు బహాటంగానే ప్రశ్నిస్తున్నారు. ఇలా జరగబోయే ఎన్నికల్లో ఆధిపత్యం చాటేందుకు జిల్లా కాంగ్రెస్ నేతలు పడుతున్న పాట్లు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
టార్గెట్ ‘ఖమ్మం’
Published Tue, Oct 8 2013 5:20 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement