రాజధానిలో కాంగ్రెస్ నాయకుల రగడ
ఖమ్మం, న్యూస్‌లైన్: ఇప్పటి వరకు జిల్లాకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ లొల్లి ఇప్పుడు రాజధానికి చేరింది. ఆధిపత్య పోరు, అనుచరుల కోసం ఆరాటం, అధిష్టానం నిర్ణయంపై ఆగ్రహం తదితర విషయాలతో సోమవారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ ప్రదేశ్ కమిటీ సమావేశంలో రసాభాసగా మారింది. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తున్నారని, జిల్లాలో దశాబ్దాల తరబడి పార్టీ కోసం పని చేస్తున్న వారిని కాదని ఇటీవల వచ్చిన నాయకుల మాటలకు విలువ ఇవ్వడంతో జిల్లాలో పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీకి వ్యతిరేకంగా, గ్రూపు రాజకీయాలు చేసిన వారికి పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు కూడా తెలియకుండా పదవులు కట్టబెట్టడం, హైదరాబాద్, ఢిల్లీకి వెళ్లి పదవులు తెచ్చుకోవడంతో పార్టీలో పలువురు నాయకులకు పట్టపగ్గాలు లేకుండా పోయాయని.. ఇలా అయితే పార్టీ భవిష్యత్ దెబ్బతింటుందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు.సోమవారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశంలో తెలంగాణలోని పది జిల్లాల్లో సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరఫున ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసి వారి బలాబలాలు, గెలుపోటములపై సమీక్షించారు.
ఈ సమావేశానికి జిల్లా నుంచి మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, కోరం కనకయ్య, వగ్గెల మిత్రసేన, కుంజా సత్యవతి, ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్, పార్టీ జిల్లా ఇన్‌చార్జ్ వట్టి కుసుమ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి జిల్లా పార్టీ వ్యవహారం, నియామకాలపై అగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీలో ఇంతకాలం పని చేసిన వారికి కాకుండా ఎవరో చెప్పిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇటీవల వేసిన జిల్లా సమన్వయ కమిటీని కూడా ఇష్టాను సారంగా వేశారని, దీంతో పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగిందని ఆరోపించినట్లు తెలిసింది.
పార్టీని నమ్ముకొని ఉండే వారికి ప్రాధాన్యం ఇవ్వాలని ఎక్కడి నుంచో వచ్చి ఖమ్మంలో పెత్తనం చేసే వారికి ప్రాధాన్యం ఇస్తే స్థానిక నాయకులను కించపరిచినట్లే అవుతుందని మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అధిష్టానంపై మండిపడినట్లు తెలిసింది. ఇల్లెందు అభ్యర్థి కోరం కనకయ్య మాట్లాడుతూ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లకు కూడా తెలియకుండా పార్టీలోని పదవులను కట్టబెడుతున్నారని, ఢిల్లీ, హైదరాబాద్ వెళ్లి పదవులు తెచ్చుకుంటే స్థానిక నాయకులకు విలువ ఏం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే వారికంటే పార్టీకి నష్టం చేసే వారికే ప్రాధాన్యం ఉంటోందని, ఇలా అయితే పార్టీ అభ్యర్థులు ఎలా గెలుస్తారని టీపీసీసీ నాయకులను ప్రశ్నించినట్లు తెలిసింది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అందరిని కలుపుకుపోయే వారిని నియమించాలని జిల్లా నాయకులు కోరినట్లు సమాచారం. అదేవిధంగా పార్టీ కార్యాలయ నిర్వహణలో కూడా మార్చులు తీసుకురావాలని సూచించినట్లు తెలిసింది. నిర్వాహకులు పులిపాటి వెంకయ్య ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, ఆయన ఒంటెత్తు పోకడతో కార్యకర్తలకు ఇబ్బందిగా ఉందని టీపీసీసీ ముందు పలువురు నాయకులు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆయనను తొలగించాలని పలువురు నాయకులు పట్టుబట్టినట్లు సమాచారం.
ఈనెల 10, 11న సమీక్షా సమావేశాలు
ఈనెల 10, 11 తేదీల్లో పార్టీ నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్‌చార్జ్ వట్టి కుసుమ కుమార్ తెలిపారు. 10వ తేదీన డీసీపీ కార్యాలయంలో ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్, ఏడు నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యే అభ్యర్థులు, అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జెడ్పీటీసీ అభ్యర్థులతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. అదే విధంగా 11వ తేదీ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఆయా ప్రాంతాలకు చెందిన నియోకవర్గ ఇన్‌చార్జ్‌లు, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కౌన్సిలర్లతో ఆయా మున్సిపల్ కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు కుసుమ కుమార్ చెప్పారు.