సాక్షి, ఖమ్మం: పురపోరు ముగియడంతో ఇప్పుడు అన్ని పార్టీల కన్ను జడ్పీ పీఠంపైనే పడింది. ప్రధానంగా టీడీపీ, కాంగ్రెస్ నేతలు అడ్డదారుల్లోనైనా సరే జెడ్పీపై జెండా ఎగురవేయాలనే దిశగా పావులు కదుపుతున్నారు. అయితే ఎస్సీ మహిళలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో వలస నేతలను బరిలోకి దింపడంతో స్థానిక నాయకత్వం వారిపై గుర్రుమంటోంది. కాంగ్రెస్, టీడీపీ నాయకులు మాత్రం వర్గాల వారీగా తమ అభ్యర్థులను బరిలోకి దింపారు. ప్రస్తుతం ఎమ్మెల్యే టికెట్ల వేటలో ఉన్న నేతలు ఇప్పుడు జెడ్పీ పీఠం ఏ వర్గం వారికి దక్కుతుందోననే ఆందోళనలో ఉన్నారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఎస్సీ మహిళకు రిజర్వు అయింది.
ఏజెన్సీలోని వాజేడు, వెంకటాపురం, చర్ల, పినపాక జెడ్పీటీసీ స్థానాలు ఎస్సీ మహిళలకు రిజర్వు అయ్యాయి. అలాగే అశ్వాపురం, ఏన్కూరు, భద్రాచలం, కొత్తగూడెం ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. ఎస్సీ మహిళకు కేటాయించిన స్థానాల్లో కాంగ్రెస్, టీడీపీ జెడ్పీ పీఠం లక్ష్యంగా వర్గాల వారీగా అభ్యర్థులను బరిలోకి దింపి విజయం కోసం పాకులాడుతున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అనుచర నేతగా, నేలకొండపల్లికి చెందిన సోడెపొంగు లక్ష్మి వాజేడు నుంచి, వెంకటాపురం మండలం నుంచి డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క అనుచర అభ్యర్థిగా వైరాకు చెందిన నంబూరి సుజాత నామినేషన్ వేశారు. అలాగే పినపాక జెడ్పీటీసీ స్థానానికి హైదరాబాద్‌లో స్థిరపడిన జాడి జుమనతో రేగా కాంతారావు వ్యూహాత్మకంగా నామినేషన్ వేయించారు.
టీడీపీ నుంచి వెంకటాపురం జెడ్పీటీసీ స్థానానికి ఎమ్మెల్యే తుమ్మల వర్గం నేత, కొత్తగూడెంనకు చెందిన గడిపల్లి కవిత నామినేషన్ వేశారు. చర్ల అభ్యర్థి తోటమల్ల హరిత కూడా తుమ్మల వర్గం అభ్యర్థిగా ప్రచారం జరుగుతోంది. మణుగూరు చెందిన జాడి వాణి టీడీపీ తరఫున పినపాక జెడ్పీటీసీ బరిలో ఉన్నారు.. ఈమెను ఎంపీ నామా నాగేశ్వరరావు తన అభ్యర్థిగా బరిలోకి దించారని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అలాగే అశ్వాపురంలో టీడీపీ తరఫున నామా వర్గం అభ్యర్థిగా తోకల లత బరిలో ఉన్నారు. ఇలా ఎవరికి వారు వర్గాల వారీగా తమ అభ్యర్థులను బరిలోకి దింపి.. జెడ్పీ పీఠం తమ వర్గానికే దక్కాలని ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు.
అసంతృప్తిలో ద్వితీయ శ్రేణి నాయకులు...
ప్రధానంగా కాంగ్రెస్, టీడీపీలు ఆయా మండలాల వారిని కాకుండా స్థానికేతరులను జెడ్పీటీసీ బరిలోకి దింపి, జెడ్పీ పీఠం కైవసం చేసుకునేందుకు ఎత్తులు వేస్తుండగా.. స్థానికంగా ఉండే ద్విత్రీయ శ్రేణి నాయకత్వం వీరిపై అంతర్గతంగా నిరసన వ్యక్తం చేస్తోంది. లోకల్ అభ్యర్థులు లేరని, ఇతరులను బరిలోకి దింపుతారా..? అని ఎవరికి వారు గుర్రుగా ఉన్నారు. ఎంత సర్దుబాటు చేస్తున్నా లోకల్ ఫిలింగ్ నాన్‌లోకల్ నేతలను ఏమి చేస్తుందోనని నేతలు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలకు మరో రెండు రోజులే గడువు ఉండడంతో నయానో..భయానో వారు పూర్తిస్థాయిలో సహకరించేందుకు, లోకల్ నేతల కు నజరానాలు ప్రకటించేందుకు కూడా ఆయా పార్టీల నేతలు సిద్ధమయ్యారు. మరోవైపు లోకల్ ఫీలింగ్ తమ కొంప ముంచుతుందోమో, ఖర్చు తడిసి మోపడైతే తమ పరిస్థితి ఏంటి.? అని ఇక్కడి అభ్యర్థులు హైరానా పడుతున్నారు. అయితే నేతలు మాత్రం ‘అంతా మేము చూసుకుంటాం.. ఖర్చు పెట్టండి’ అని పైకి చెపుతున్నా.. ఏమి జరుగుతుందోనన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది.
ఓట్లకు నోట్లపైనే ఆశలు..
స్థానిక కేడర్ సహకరించినా, సహకరించకపోయినా ఓట్లకు నోట్లు ఎరవేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్, టీడీపీలు అడుగులేస్తున్నాయి. వర్గాల వారీగా నేతల అనుచరులు వాజేడు, వెంకటాపురం, చర్ల, పినపాక మండలాల్లో పాగా వేసి తమ నేతలు బరిలో దింపిన అభ్యర్థి విజయం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. స్థానిక పోలింగ్‌కు రెండురోజుల సమయం ఉండ డం, అనుచర నేతలు అంతా ఢిల్లీ, హైదరాబాద్‌లో టికెట్ల వేట లో మునగడంతో ఓటుకు నోట్ల పంపిణీ బాధ్యతలను వారే భుజానికెత్తుకున్నట్లు సమాచారం. ప్రధానంగా ఎస్సీ మహిళలకు రిజ ర్వు అయిన జెడ్పీటీసీ స్థానాలలోనే.. ఇటు టీడీపీ, అటు కాం గ్రెస్ నేతలు జెడ్పీ పీఠం దక్కించుకోవడమే ధ్యేయం గా అడ్డుదారులు వెతుకుతున్నారు. జెడ్పీ పీఠం దక్కితే.. జిల్లా లో తమ వర్గం బలం పెంచుకోవాలన్న వ్యూహంలో కాంగ్రెస్, టీడీపీ నేతలున్నారు. ప్రధాన అనుచరులంతా ఈ నాలుగు చోట్ల పదిహేను రోజులుగా మకాం వేసి ఎప్పటికప్పుడు రాజకీయ సమీకరణలు, గెలుపోటములను ప్రభావితం చేసే అంశాలను అగ్రనేతలకు చేరవేస్తున్నారు. ఏంచేసినా విజయం సాధించి తీరాలని వారు హుకుం జారీ చేయడంతో అడ్డదారులు తొక్కయినా సరే.. గెలుపు కోసం అనుచర నేతలు అపసోపాలు పడుతున్నారు.
జెడ్పీ పీఠమే లక్ష్యం
Published Fri, Apr 4 2014 1:46 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement