ఖమ్మం రూరల్, న్యూస్‌లైన్ : పాలేరు నియోజకవర్గ టీడీపీలో చెలరేగిన అసంతృప్తితో తాము లబ్ధి పొందేలా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. పాలేరు అసెంబ్లీ టికెట్‌ను ఖమ్మం సిట్టింగ్ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావుకు ఇస్తారని మొదటి నుంచీ ఆయన వర్గీయులు భావించారు. అయితే టికెట్‌ను పార్టీ మహిళా నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారికి కేటాయించడంతో తుమ్మల వర్గీయులు కంగు తిన్నారు. దీంతో తుమ్మల వర్గీయుల్లో అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి.
ఈ నియోజకవర్గంలో ఇప్పటికే వర్గ వైషమ్యాలతో రగిలిపోతున్న టీడీపీ పరిస్థితి.. భవిష్యత్‌లో ప్రశ్నార్ధకంగా మారేలా కనిపిస్తోంది. తుమ్మల వర్గం నేతలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస అభ్యర్థి, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఆయా మండలాల్లో వారితో రహస్య సమావేశాలు నిర్వహిస్తూ తాయిలాలు చూపిస్తూ ‘తమ్ముళ్ల’ను ఆకర్షించే పని మొదలు పెట్టినట్లు తెలిసింది.
ప్రజాప్రతినిధులపైనే గురి...
నియోజకవర్గంలోని 108 గ్రామ పంచాయతీల సర్పంచ్‌లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సర్పంచ్‌లు వీక్‌గా ఉన్నచోట షాడో సర్పంచ్‌ల (అన్నీతానై ముందుండి గ్రామ పాలన నడిపించే నాయకుడు)ను బుట్టలో వేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.
కూసుమంచి మండల టీడీపీ ప్రధాన నాయకుడు, తుమ్మల ముఖ్య అనుచరుడు, మాజీ ఎంపీపీ.జూకూరి గోపాల్‌రావు తన అనుచరులతో మంగళవారం రాంరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అలాగే తిరుమలాయపాలెం మండల టీడీపీ ప్రధాన నాయకుడు, మాజీ ఎంపీపీ, ఆ పార్టీ మాజీ మం డల అధ్యక్షులను కాంగ్రెస్‌లోకి రప్పించేందుకు రాంరెడ్డి ప్రయత్నిస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. కాగా, సదరు మాజీ ఎంపీపీ, టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు తమ అనుచరులతో కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. మరో రెండు మూడు రోజుల్లో వారు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిసింది.
టీడీపీకి తప్పని ఎదురుగాలి...
నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే టీడీపీకి భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వర్గవిభేదాలతో సతమతమవుతున్న ఆపార్టీకి తెలుగు తమ్ముళ్లు ఎవరి దారి వారు చూసుకుంటే ఇక ఆ పార్టీకి ఎన్నికల్లో ఎదురుగాలి తప్పదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే కూసుమంచి మండలం నుంచి తుమ్మల ప్రధాన అనుచరుడు గోపాల్‌రావు కాంగ్రెస్‌లో చేరడంతో టీడీపీ నాయకులు అవాక్కయ్యరు.
ఈ పరిణామాన్ని నామా వర్గీయులు జీర్ణించుకోలేక పోతున్నారు.అంతేకాకుండా ఒకటి రెండు రోజుల్లో తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, కూసుమంచి మండలాలకు చెందిన తుమ్మల వర్గీయులైన నాయకులను కాంగ్రెస్‌లోకి రప్పించేందుకు రాంరెడ్డి ప్రణాళిక ఏర్పాటు చేసినట్లు తెలిసింది. భారీ నజరానాలు ఆశ చూపడంతో తుమ్మల వర్గీయులు టీడీపీని వీడాలనే ఆలోచనకు వచ్చినట్లు నియోజకవర్గంలో విస్త్రత ప్రచారం జరుగుతోంది. అసలే అంతంత మాత్రం బలం ఉన్న టీడీపీ అభ్యర్థి.. ఈ వర్గపోరుతో ఏం చేయాలో తెలియక మథనపడుతున్నట్లు సమాచారం.
ప్రచారానికి దూరంగా తుమ్మల వర్గీయులు
నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించిన ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వర్‌రావు, పాలేరు అసెంబ్లీ అభ్యర్థి స్వర్ణకుమారి వెంట తుమ్మల వర్గీయులు ఏ ఒక్కరూ పాల్గొనకపోవడం గమనార్హం. ఖమ్మం రూరల్ మండలంలో మొదలైన ప్రచారానికి నామా వర్గీయులుగా ఉన్న నేతలే ఒకరిద్దరు అయిష్టంగా వెళుతున్నట్లు సమాచారం. ఖమ్మం రూరల్ మండలానికి చెందిన ఎస్టీసెల్ నాయకుడొకరికి ఇల్లెందు అసెంబ్లీ టికెట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చి, చివరికి మొండిచెయ్యి చూపడంతో ఆయన నామాపై గుర్రుగా ఉన్నట్లు తెలిసింది.
తనను మోసం చేసిన నేతలకు ఈ ఎన్నికల్లో సహకరించేది లేదంటూ నామాకు నిర్మొహమాటంగా చెప్పినట్లు తెలిసింది. అయితే అవన్నీ మనసులో పెట్టుకోకుండా ప్రచారానికి రావాలని స్వయంగా నామా అతని ఇంటికి వెళ్లి బతిమిలాడినట్లు సమాచారం. నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, కూసుమంచి మండలాలకు చెందిన తుమ్మల వర్గీయులు నామా, స్వర్ణకుమారి వెంట ప్రచారానికి వెళ్లకుండా దూరంగా ఉంటున్నారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీకి గడ్డుకాలం తప్పదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
నేతలకు గాలం!
Published Wed, Apr 16 2014 6:34 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 AM
Advertisement
Advertisement