కృష్ణయ్య కుటుంబీకులను పరామర్శిస్తున్న తుమ్మల నాగేశ్వరరావు, నాయకులు
సాక్షి, ఖమ్మం రూరల్: జిల్లాలోని తెల్దారుపల్లిలో ఇటీవల హత్యకు గురైన టీఆర్‌ఎస్ నాయకుడు తమ్మినేని కృష్ణయ్య హత్యను ఎవరైనా సమర్థిస్తే వారు అంతరాత్మను మోసం చేసుకున్నట్లేనని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. పలువురు నాయకులతో కలిసి సోమవారం ఆయన కృష్ణయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఘాతుకానికి పాల్పడడం దురదృష్టకరమని పేర్కొన్నారు. హత్యకు పాల్పడిన వారిని కఠి నంగా శిక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారని.. ఈ విషయంలో పోలీసులు తమ బాధ్యతను పకడ్బందీగా నెరవేర్చి హంతకులకు శిక్ష పడేలా చూడాలని కోరారు.
తద్వారా న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించాలని సూచించారు. ఏది ఏమైనా ఇలాంటి హత్యలను ప్రభుత్వం ప్రోత్సహించదని స్పష్టంచేశారు. హత్య కేసులో దోషులకు శిక్ష పడేంత వరకు తన శాయశక్తులా కృషిచేస్తానని తుమ్మల వెల్ల డించారు. తొలుత కృష్ణయ్య చిత్రపటం వద్ద నివాళులర్పించడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్ల మల వెంకటేశ్వరరావు, నాయకులు సాధు రమేష్‌రెడ్డి, మద్ది మల్లారెడ్డి, బండి జగదీష్, శాఖమూరి రమేష్, కనకమేడల సత్యనారాయణ, చిత్తారు సింహాద్రియాదవ్, వెంకట్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
సీపీఎంకు కృష్ణయ్య సోదరుల రాజీనామా
ఇటీవల దారుణ హత్యకు గురైన తెల్దారుపల్లికి చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు తమ్మినేని కృష్ణయ్య సోదరులు తమ్మినేని వెంకటేశ్వరరావు, బుచ్చయ్య సీపీఎం పార్టీ ప్రాథమిక సభ్యత్వం, పదవులకు రాజీనామా చేశారు. ఈమేరకు సోమవారం తెల్దారుపల్లిలో వారు విలేకరులతో మాట్లాడారు.
తమ సోదరుడితో పాటు తాము సీపీఎం అభివృద్ధికి అంకితభావంతో పనిచేశామని.. కానీ ఆ పార్టీ నాయకులే తమ సోదరుడిని హత్య చేయడం కలిచివేసిందని పేర్కొన్నారు. నలభై ఏళ్ల పాటు సీపీఎంలో కొనసాగిన కృష్ణయ్యను హత్య చేయడంతో తాము పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. సీపీఎం పార్టీ నేతలు చేసిన హత్యకు నైతిక బాధ్యతగా, తమ సోదరుడు కృష్ణయ్య కుటుంబానికి అండగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment