ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొద్ది రోజుల క్రితం ఒక కీలక ప్రకటన చేశారు. ఖమ్మంలో తన గెలుపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా మలుపు అవుతుందన్నారు. ఖమ్మం సరిహద్దు గ్రామాల నుంచి, ఖమ్మం నుంచి వచ్చిన టీడీపీ అభిమానుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. అంతకుముందు కూడా ఆయన ఖమ్మం టీడీపీ ఆఫీస్‌కు వెళ్లి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.
అలాగే ఇప్పుడు ఏకంగా టీడీపీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించి తన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడారు. తనకు ఎన్టీ రామారావే మంత్రి పదవి ఇచ్చారని, కేసీఆర్‌కు కూడా తానే చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి పదవి ఇప్పించానని చెప్పారు. కేసీఆర్ తనకు పదవి ఇచ్చేదేంటని ప్రశ్నించారు. తనకు పదవులు ముఖ్యం కాదంటూనే తాను చేసిన సేవల గురించి కూడా చెప్పుకొచ్చారు.
తన మెడలో వేసుకున్న పచ్చ కండువాను చూపుతూ, దీనివల్లే తాను పైకి వచ్చానన్నారు. ఇలాంటి విషయాలు ఎన్ని చెప్పినా ఫర్వాలేదు.. కానీ ఆయన గెలిస్తే ఏపీ రాజకీయాలపై ఎందుకు ప్రభావం పడుతుంది? అక్కడ ఎందుకు మలుపు వస్తుంది? అన్నదాని గురించి వివరించి ఉంటే బాగుండేది.
కాంగ్రెస్ సభల్లో టీడీపీ జెండాలు
తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీచేయకుండా దూరంగా ఉంది. దాంతో ఆ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తనదారి తాను చూసుకున్నారు. కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడం కోసమే అలా చేశారని ఆయన రహస్యం చెప్పేశారు. దానిని నిజం చేస్తూ తుమ్మల మరికొందరు ప్రకటనలు చేయడం, టీడీపీ జెండాలు కూడా మెడలో వేసుకుని సభల్లో పాల్గొంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు, చంద్రబాబుకు శిష్యుడుగా పేరొందిన రేవంత్ రెడ్డి కూడా టీడీపీవారు మద్దతు ఇస్తే స్వాగతిస్తామన్నారు. అలాగే చంద్రబాబును ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కొన్నిసార్లు పొగుడుతూ తన స్వామి భక్తి చూపుతున్నారు.
కోదాడలో జరిగిన కాంగ్రెస్ ర్యాలీలో కూడా టీడీపీ జెండాలు కనిపించాయి. ఇలా ఆయా చోట్ల ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ టీడీపీవారు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఆయన ఓపెన్ గానే కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చి ఉండొచ్చు. గతసారి కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జనసమితితో పొత్తు పెట్టుకుని చంద్రబాబు ప్రచారం చేశారు. రాహుల్ గాం«దీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అయినా జనం ఆదరించకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గాలికి వదిలివేశారు.
బీజేపీ కన్నెర్ర చేస్తుందని..
2023 తెలంగాణ ఎన్నికల్లో కొత్త వ్యూహంతో ఎన్నికల్లో పోటీచేయకుండా చంద్రబాబు కాంగ్రెస్‌కు పరోక్షంగా సహకరిస్తున్నారు. నేరుగా కాంగ్రెస్‌కు అండగా ఉన్నానని చెబితే బీజేపీ ఎక్కడ కన్నెర్ర చేస్తుందో అన్న భయం కావచ్చు. తెలంగాణలో బీఆర్‌ఎస్ కాకుండా కాంగ్రెస్ గెలిస్తే తనకు ప్రయోజనం ఉంటుందని ఆయన ఆశిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇక్కడ చక్రం తిప్పి, ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్నది ఆయన ఆలోచన అని చాలా మంది భావిస్తున్నారు. మరోవైపు తన మిత్రుడో లేక వైసీపీ నేతలు విమర్శిస్తున్నట్లు ఆయన దత్తపుత్రుడో కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నారు. అంటే అటు బీజేపీతో కూడా రాయబారం జరపడానికి ఏర్పాటు చేసుకున్నారన్నమాట.
ఈ విన్యాసాలు ఎన్ని చేసినా ఆయన ఇష్టం. కానీ తుమ్మల చేసిన ప్రకటనను పరిశీలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కనుక, ఏపీలో టీడీపీకి ఉపయోగపడతామని చెబుతున్నట్లు అనుకోవాలా? రాష్ట్ర విభజన తర్వాత తుమ్మల టీడీపీలో ఓడిపోయి రాజకీయంగా వెనుకబడితే కేసీఆర్ ఆయనను దగ్గరకు తీసి ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చారు. పాలేరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికకు అభ్యర్థిని చేసి గెలిపించారు. కానీ సాధారణ ఎన్నికల్లో తుమ్మల ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో ఆయన హవా తగ్గింది. దాంతో ఆయన అసంతృప్తి చెంది కాంగ్రెస్ జెండా కప్పుకున్నారు.
నాడు కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తి...
తుమ్మల పదవులపై ఆసక్తి లేదంటూనే తనను ఆదరించిన బీఆర్‌ఎస్‌ను కాదని ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో దిగారు. గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఒకటి తప్ప అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. దానిని కూడా దృష్టిలో ఉంచుకునే తుమ్మల కాంగ్రెస్‌లోకి జంప్ చేసి ఉండాలి. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. 2018 ఎన్నికల సమయంలో తుమ్మల టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసినప్పుడు కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తుతూ ప్రసంగించిన వీడియో వింటే ఆశ్చర్యం కలుగుతుంది. కేసీఆర్ తెలంగాణను పచ్చని బంగారు రాష్ట్రంగా మార్చారంటూ గంభీరంగా ప్రసంగించారు.
ఇప్పుడు అదే తుమ్మల కేసీఆర్ పాలన అంత దరిద్రపు పాలన చూడలేదని అంటున్నారు. అంతేకాదు, 2018లో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, జనసమితి పార్టీల కూటమిని మాయ కూటమిగా అభివర్ణించారు. తెలంగాణ అభివృద్ధికి, ప్రత్యేకించి ఖమ్మం అభివృద్ధిని అడ్డుకుంటున్న పార్టీగా టీడీపీని, అప్పట్లో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును విమర్శిస్తూ మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను, భద్రాచలం చుట్టుపక్కల ఉన్న ఐదు పంచాయతీలను అన్యాయంగా లాక్కున్న పార్టీ టీడీపీ అని ఆయన ధ్వజమెత్తారు.
ఖమ్మం ప్రాజెక్టులకు వ్యతిరేకంగా 30 లేఖలు రాసిన సీఎం చంద్రబాబు అని ఆ రోజున ఆరోపించారు. ఈ రోజేమో టీడీపీ వల్లే తాను అది సాధించాను.. ఇది సాధించాను అంటూ స్పీచ్‌లు ఇస్తున్నారు. అదేదో చెప్పుకుంటే సరే అనుకుంటే, ఇప్పుడు ఏకంగా తన గెలుపు ఏపీ రాజకీయాలకు మలుపు అవుతుందని అంటున్నారు. అంటే ఏమిటి అర్థం? ఏపీలోని జగన్ ప్రభుత్వాన్ని తామంతా కలిసి ఇబ్బంది పెడతామని చెబుతున్నారా? గతంలో ఎన్‌టీ రామారావుకు వ్యతిరేకంగా కుట్ర చేసి ఆయనను పదవీచ్యుతుడిని చేసి చంద్రబాబుతో కలిసి అందలం ఎక్కిన అనుభవాన్ని గుర్తు చేసుకుని అలా ఏపీలో మళ్లీ చేయాలని ఆలోచిస్తున్నారా?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందో, రాదో తెలియక ముందే తుమ్మల వంటి సీనియర్లు ఇలా మాట్లాడితే ఎలా విశ్లేషించాలి? కాంగ్రెస్‌లో చేరిన మాజీ టీడీపీ నేతలు వ్యూహాత్మకంగానే చంద్రబాబుతో సంబంధాలు కొనసాగిస్తూ, భవిష్యత్తు ఏపీ ఎన్నికల్లో ఆయనకు సహకరించాలని, అక్కడి వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని అనుకుంటున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. టీడీపీ అప్పట్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పెట్టిన పార్టీ. ఎన్టీఆర్ తన అల్లుడు చంద్రబాబు కాంగ్రెస్ నుంచి రాగానే, కొన్ని బాధ్యతలు అప్పగించి చివరికి ఆయన తన కొంప తానే ముంచుకున్నారు.
ఇతర రాష్ట్రాల రాజకీయాల్లో వేలు పెడితే...
కొంతకాలం క్రితం వరకు కాంగ్రెస్ అంటేనే తుమ్మలకు పడేది కాదు. వారితో ఖమ్మం జిల్లాలో అనేక రాజకీయ పోరాటాలు చేశారు. చివరికి తానే కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఆయన తన సొంత రాజకీయం కోసం ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఇతర రాష్ట్రాల రాజకీయాల్లో కూడా వేలుపెడతామని చెబితే ఆయనకే నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. పైగా చంద్రబాబుతో కాంగ్రెస్ కుమ్మక్కయిన సంగతి ఇట్టే తెలిసిపోతుంది. దీనివల్ల అంతిమంగా కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందో, లాభం జరుగుతుందో కానీ, ఇప్పటికైతే తుమ్మల చేసిన ప్రకటన ద్వారా వైసీపీ ప్రభుత్వం అప్రమత్తమవ్వాల్సిన అవసరాన్ని తెలియచేసింది.
ఎన్టీఆర్ మాదిరి జగన్ అమాయకపు రాజకీయ నేత కాదు. ఆయన ఇప్పటికే అనేక డక్కాముక్కీలు తిన్న నేత. చంద్రబాబు వేసిన అనేక కుట్రలను ఛేదించిన నాయకుడు. తిరుగులేని ఆధిక్యంతో 151 సీట్లను గెలిచి ఏపీలో పాలనా పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి. తాను ఇచ్చిన హామీలను నెరవేర్చిన శూరుడు. చంద్రబాబో, తుమ్మలో, మరొకరో వేసే ఎత్తుగడలను జగన్ తేలికగానే తిప్పికొట్టగలరని వేరే చెప్పనవసరం లేదు.
- కొమ్మినేని శ్రీనివాసరావు
Comments
Please login to add a commentAdd a comment