వారంతా సీనియర్ నాయకులే. అనేక యుద్ధముల ఆరితేరినవారే. పలుసార్లు విజయం సాధించినవారే. ఇప్పుడందరికీ తాజా ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా మారాయి. ఈ ఎన్నికల్లో ఓడితే వారి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందనే ఆందోళన కనిపిస్తోంది.
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కీలక నేతలకు తాజా ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయనే చెప్పాలి. ఓడినవారికి రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కీలక నేతలకు ఈ ఎన్నికలు రాజకీయంగా డూ ఆర్ డై అనే చెప్పాలి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తున్నారు. గత ఎన్నికల్లో తుమ్మల పాలేరు నుంచి బీఆర్ఎస్ తరుపున పోటి చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి కూడ ఓడితే పొలిటికల్‌గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో గెలిచి తన 40 ఏళ్ల రాజకీయాలకు ఘనంగా వీడ్కోలు పలకాలనే ఉద్దేశ్యంతో గెలుపే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇవే చివరి ఎన్నికలు అని చెప్పి ప్రచారంకు వెళ్లుతున్నారు తుమ్మల.
ఇక జిల్లాలో మరో కీలక నేత మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. బీఆర్ఎస్ నుంచి ఖమ్మం అసెంబ్లీ బరిలో దిగారు. మూడవసారి గెలిచి ఖమ్మం గడ్డపై హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతో దూకుడుగా ముందుకు వెళ్లుతున్నారు. అంతేకాదు తనకు ఇవే చివరి ఎన్నికలు కావచ్చని..ఈసారి గెలిస్తే మిగిలిపోయిన అభివృద్ది ఏమైనా ఉంటే పూర్తి చేస్తానని ఈ ఒక్కసారి తనను ఆశీర్వాదించాలని ఖమ్మం ప్రజలను కోరుతున్నారు. లోకల్ ఫీలింగ్ తీసుకు వస్తూ ఓటర్లకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో పొటీ చేసి ఓడిపోయి.. పక్క నియోజకవర్గంకు వెళ్ళి అక్కడా ఓడిపోయిన నేత ఇప్పుడు మళ్ళీ ఖమ్మం వచ్చారంటూ తుమ్మల నాగేశ్వరరావు పేరెత్తకుండా సెటైర్లు వేస్తున్నారు పువ్వాడ అజయ్. ఖమ్మం ప్రజలు విజ్ణతతో ఆలోచించాలని కోరుతున్నారు మంత్రి అజయ్ కుమార్. ఖమ్మం నియోజకవర్గంలో 2 వేల కోట్ల విలువైన అభివృద్ది పనులు చేశానని చెప్పుకుంటున్నారు. ఖమ్మం నియోజకవర్గం అటు తుమ్మలకు..ఇటు పువ్వాడకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారయని చెప్పాలి.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఎదిగారు. మొదటి సారి అసెంబ్లీ బరిలో నిలుస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి..పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఏమాత్రం తేడా వచ్చినా అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉండటంతో..పాలేరు నియోజకవర్గంలో విజయం కోసం తన సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు. ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు. పొంగులేటికి తోడుగా ఆయన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కూడ పాలేరు ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వెళ్లుతున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందిన కందాల ఉపేందర్‌రెడ్డి తర్వాత గులాబీ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు కందాల బీఆర్ఎస్ తరపున పాలేరు బరిలో దిగారు. 2018లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన తుమ్మల నాగేశ్వరరావు ఓటమి చెంది...ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు..ఇప్పటికే మొదటి విడత ప్రచారం సైతం పూర్తి చేశారు..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మరో సీనియర్ నేత, సీఎల్‌పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేస్‌లో ఉండే నేత భట్టి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి భారీ మెజారిటీతో విజయం సాధించాలనే లక్ష్యంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. మధిర నుంచి ఇప్పటికే మూడుసార్లు గెలిచిన విక్రమార్క నాలుగోసారి గెలవడం పెద్ద కష్టమేమీ కాదనుకుంటున్నారు. కాని భారీ మెజారిటీ సాధించడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు.
భట్టి విక్కమార్కకు గతంలో చేసిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర బాగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. మరో వైపు మధిరలో భట్టిపై పోటీ చేసి ఇప్పటికి మూడుసార్లు ఓడిపోయిన ఖమ్మం జిల్లా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ కు ఈ ఎన్నికలు చావో రేవోగా మారాయి. మూడు సార్లు ఓడినా గులాబీ బాస్ నాలుగోసారి టిక్కెట్ ఇచ్చారు. ఈసారి కూడా కమల్ రాజ్ ఓడితే ఇక ఆయన రాజకీయ జీవితం ముగిసినట్లే అవుతుంది. అందుకే లింగాల కనకరాజ్ గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. నాలుగోసారైనా గెలిపించండని ప్రజల్ని ప్రాధేయపడుతున్నారు.
మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు సీనియర్ నేతలకు ఈ ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా తయారయ్యాయని చెప్పాలి. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీల్లోని ఆ నేతలు గెలుపు కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నారు. మరి ప్రజలు ఎవరిని అందలం ఎక్కిస్తారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment