రేణుక ఖమ్మం వీడాలి | Khammam Congress a divided house | Sakshi
Sakshi News home page

రేణుక ఖమ్మం వీడాలి

Published Wed, Oct 16 2013 6:55 AM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM

Khammam Congress a divided house

 భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్ : తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న రేణుకాచౌదరి అండ్ కంపెనీ ఖమ్మం నుంచి వెళ్లిపోవాలని గాంధీపథం జిల్లా కన్వీనర్ బూసిరెడ్డి శంకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్టానానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్న రేణుకాచౌందరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న రేణుకను జిల్లాకు రానిచ్చేలేదంటూ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించడాన్ని తాను ఏకీభవిస్తున్నానన్నారు.
 
 దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలను చేసిన నెహ్రూ కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీతో రేణుక తనను పోల్చుకోవడం పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆమె కారణంగా జిల్లాలో పార్టీ కాంగ్రెస్ అభిమానులు రోజురోజుకు తగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూపు, బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు ఎక్కువయ్యాయని దుయ్యపట్టారు. 1999లో రేణుక  ఖమ్మంలో పోటీ చేసి లక్షా 2వేల ఓట్ల మెజారిటీతో గెల్చారని, 2004లో ఆ మెజారిటీ 56వేలు తగ్గిందని, 2009లో లక్షా 36వేల మెజారిటీ తేడాతో ఓడిపోయారని గుర్తు చేశారు. దీన్నిబట్టి ఆమెకు జిల్లాలో ఏపాటి ప్రజాదరణ ఉందో ఇట్టే అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తిరుగులేని ముఖ్యమంత్రిగా పాలించిన మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డితోనూ రేణుక బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడ్డారని బూసిరెడ్డి మండిపడ్డారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement