సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లా రాజకీయం పూర్తిస్థాయిలో రసకందాయంలో పడింది. సాధారణ ఎన్నికలలో కీలకఘట్టమైన నామినేషన్ల పర్వానికి తెరలేస్తుండడంతో జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల్లో కదలిక వచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వర్గపోరు, అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న ఈ రెండు పార్టీలు కనీసం ఇంతవరకు అధికారికంగా ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేకపోయాయి.
సీపీఐతో పొత్తు వ్యవహారం జిల్లాలో కీలకం కావడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థుల ఖరారు ప్రక్రియ ఓ కొలిక్కి రాలేదు. ఇక, బీజేపీతో పొత్తు కుదుర్చుకునే అంశం జిల్లాలో పెద్దగా ప్రభావం చూపనప్పటికీ, నామా, తుమ్మల వర్గాల పోరుతో టీడీపీ ఆశావాహులు కుదేలవుతున్నారు. మిగిలిన రాజకీయ పక్షాలు అభ్యర్థుల ఖరారు, పొత్తుల విషయంలో కొంత మేర ముందుకెళ్లినా, వాటిలో కూడా పూర్తిస్థాయి స్పష్టత రావాల్సి ఉంది.
బీసీలకు టికెట్ వచ్చేనా?
జిల్లా కాంగ్రెస్‌లో మునుపెన్నడూ లేని విధంగా అసెంబ్లీ, పార్లమెంటు టికెట్ల కోసం ఆశావాహులు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. ఎంపీ రేణుకాచౌదరి, మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి వ ర్గీయులు టికెట్ల కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఇటు హైదరాబాద్, అటు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రమయిన ఖమ్మం అసెంబ్లీ స్థానం ఎవరికివ్వాలన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పినపాక, కొత్తగూడెం అసెంబ్లీ స్థానాల విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. సీపీఐతో పొత్తులో భాగంగా ఆ రెండు స్థానాల్లో ఏ స్థానంలో పోటీచేయాలన్న దానిపై కాంగ్రెస్ పార్టీలో స్పష్టత లేకుండా పోయింది. భద్రాచ లం, అశ్వారావుపేట లాంటి సిట్టింగ్ స్థానాల్లో పాత వారికే టికెట్లిస్తారని చెబుతున్నా ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు.
మిగిలిన స్థానాల్లో కూడా స్పష్టత లేకపోయినా పాలేరు నుంచి మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, మధిర నుంచి డిప్యూటీ స్పీకర్ మల్లుభట్టివిక్రమార్క పేర్లకు మాత్రం ఢోకాలేదని పార్టీ వర్గాలంటున్నాయి. అయితే, ఖమ్మం అసెంబ్లీ సీటుకు వనమా వెంకటేశ్వరరావు పేరు కొత్తగా తెరపైకి వచ్చింది. సీపీఐతో పొత్తు కుదిరితే కొత్తగూడెంను సిట్టింగ్ కోటాలో సీపీఐకి ఇవ్వాల్సిన పక్షంలో జిల్లాలో మిగిలిన రెండు జనరల్ స్థానాల్లో ఒకటి బీసీకివ్వాలని హైకమాండ్ వద్ద టీపీసీసీ నేతలు గట్టిగా పట్టుబడుతున్నారు. రెండింటిలో పాలేరు నుంచి మంత్రి రాంరెడ్డి బరిలో ఉంటారు కాబట్టి ఇక మిగిలింది ఖమ్మం ఒక్కటే. ఖమ్మంలో ఇప్పటికే పలువురి పేర్లు వినిపిస్తుండగా, అనుహ్య పరిణామాల మధ్య వనమా పేరును కూడా సీరియస్‌గా పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం. ఖచ్చితంగా బీసీలకివ్వాల్సి వస్తే... వనమాకు ఖరారవుతుందని, లేదా మరో బీసీ నాయకుడు వద్దిరాజు రవిచంద్రకు టికెట్ ఖరారవుతుందని ప్రచారం జరుగుతోంది. రేణుక కూడా తన వర్గానికి టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సుల్తాన్ కూడా ఢిల్లీలో తనకున్న పలుకుబడిని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు.
ఆర్థిక సహకారం లేకపోతే ఎలా?
ఇక, జిల్లా టీడీపీ వ్యవహారం అధినేత చంద్రబాబు నివాసానికి చేరింది. మంగళవారం సాయంత్రం పార్టీ జిల్లా నేతలు ఆయన నివాసంలో చంద్రబాబును కలిసి టికెట్ల కేటాయింపుపై చర్చలు జరిపారు. మాజీ మంత్రి తుమ్మల, ఆయన వర్గీయులు సండ్ర వెంకటవీరయ్య, బాలసాని లక్ష్మీనారాయణతో పాటు ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణకు ఇవ్వాల్సిందేనని పార్టీ నేతలు చంద్రబాబును గట్టిగా అడిగినట్టు సమాచారం. తమ వర్గం నాయకులమంతా ఈనెల తొమ్మిదిన నామినేషన్లు వేస్తున్నామని, ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, అశ్వారావుపేట అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు వేస్తామని అధినేతకు వివరించారు.
ఇక, ఖమ్మం పార్లమెంటు అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును ఖరారు చేస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని, అయితే తన పార్లమెంటు పరిధిలోకి వచ్చే అసెంబ్లీ అభ్యర్థులందరికీ ఆయన ఆర్థిక సహకారం చేసేలా ఒప్పందం చేయాలని జిల్లా టీడీపీ నేతలు చంద్రబాబును కోరారు. తన వర్గానికి చెందని వారిని పక్కనపెట్టాలని, ఆయా నియోజకవర్గాల్లో తానే సొంతంగా ముందుకెళ్లాలని నామా ప్రణాళిక రూపొందించుకుంటున్నారని, ఇది అసెంబ్లీ ఫలితాలపై ప్రభావం చూపుతుందని వారు వివరించారు. అందుకు నామా అంగీకరించని పక్షంలో తమ పక్షాన తుమ్మల నాగేశ్వరరావు ఎంపీగా బరిలోకి దిగేందుకు సిద్ధమని కూడా వారు ప్రతిపాదించినట్టు సమాచారం. జిల్లా నేతల అభిప్రాయాలను విన్న చంద్రబాబు అన్నీ తాను సర్దుబాటు చేస్తానని హామీ ఇచ్చినట్టు తెలుగుదేశం వర్గాల భోగట్టా.
‘సార్వత్రిక’ సెగ..
Published Wed, Apr 2 2014 2:44 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement