potla nageswara rao
-
మృతదేహంతో..
ఇల్లెందు : తమ కుమారుడి ఆత్మహత్యకు కారకుడైన దుకాణం యజమానిపై చర్యలు తీసుకోవాలంటూ మృతదేహంతో కుటుంబీకులు ఆదివారం ఆందోళనకు దిగారు. ఇల్లెందులోని 17వ వార్డుకు చెందిన కొమ్ము వెంకటేష్(23) శనివారం సాయంత్రం తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడు గత 12 ఏళ్లుగా ఇల్లెందులోని ఇద్దరు వ్యాపారుల వద్ద షాపు గుమస్తాగా పనిచేస్తున్నాడు. అనివార్య కారణాలతో వారం రోజులపాటు షాపుకు వెళ్లలేదు. శనివారం వెళ్లాడు. అతనిని యజమానులు దూషించడంతో ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహంతో కుటుంబీకులు నేరుగా జగదాంబ సెంటర్లో వెళ్లి అక్కడ రాస్తారోకోకు దిగారు. వీరికి సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ సంఘీభావం తెలిపాయి. కాంగ్రెస్ జిల్లాల అధ్యక్షులు ఐతా సత్యం, పోట్ల నాగేశ్వరావు వివరాలు తెలుకున్నారు. ఆందోళన కారులను సీఐ సారంగపాణి శాంతింపచేశారు. -
ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి షాక్
-
తెలంగాణలో వలసల పర్వం..
సాక్షి, ఖమ్మం : తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలు మరో సంవత్సరంలో రానుండటం, ఈ లోపు ముందస్తుగా జమిలి ఎన్నికలు రానున్నాయనే ప్రచారంతో...తెలంగాణలో వలసలు ఊపందుకున్నాయి. ఖమ్మం జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీ నుండి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం మొదలైంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన పోట్ల నాగేశ్వరరావు సోమవారం అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన ఇటీవలే ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నవిషయం తెలిసిందే. కాంగ్రెస్‌లో చేరిన అనంతరం తొలిసారి ఖమ్మంకు వచ్చిన ఆయన కాంగ్రెస్ శ్రేణులు, పోట్ల అనుచరులు, అభిమానులు కోలాహలం మధ్య ర్యాలీగా కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా పోట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ...టీఆర్ఎస్ పార్టీలో ఇమడలేకే రాజీనామా చేశానని, అధికార పార్టీలో కుటుంబ నియంతృత్వ పాలన కొనసాగుతుందన్నారు. టీఆర్ఎస్ కలగూర గంపగా మారిన నేపథ్యంలో విసుగు చెంది,కాంగ్రెస్‌లోకి వచ్చానన్నారు. ఫిబ్రవరిలో జిల్లా రాజకీయాలలో ఆశ్చర్యకరమైన పరిణామాలు సంభవిస్తాయని, ఇంకా అనేక మంది నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్, టీడీపీ పార్టీల నుండి కాంగ్రెస్‌లోకి వస్తారని జోస్యం చెప్పారు. వారంతా ఇప్పటికే తనతో సంప్రదింపులు జరిపినారని, ఈ విషయమై అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు పోట్ల నాగేశ్వరరావు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి ఆశీసులతోనే తాను కాంగ్రెస్‌లో చేరానని, పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు. తనతోపాటు కాంగ్రెస్‌లోకి వచ్చిన నాయకులకు ,కార్యకర్తలకు, అభిమానులకు పోట్ల ధన్యవాదాలు తెలిపారు. 2019 ఎన్నికలో పార్టీ గెలుపే థేయ్యంగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని పటిష్టపరిచేందుకు ముందుకు వెళతానని హామీ ఇచ్చారు. -
కేసీఆర్ విధానాలు నచ్చకే రాజీనామా
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కేసీఆర్ నియంతృత్వ విధానాలు నచ్చకే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు మాజీ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నేత పోట్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం వినియోగించాల్సిన అధికారం కేవలం కొందరు వ్యక్తులకే పరిమితమైందన్నారు. కేసీఆర్ నియంతృత్వ ధోరణి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలనే లక్ష్యంతోనే త్వరలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో మితిమీరిన నియంతృత్వ విధానాలతో ఇమడలేక పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి జిల్లా పార్టీ అధ్యక్షుడు బేగ్‌కు పంపించినట్లు ఆయన చెప్పారు. రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో ఢిల్లీలో పార్టీలో చేరనున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఖమ్మం శాసనసభ నియోజకవర్గంపై దృష్టి కేంద్రీకరించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలను కలుపుకుపోయి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని, ఎంపీ రేణుకా చౌదరి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్కల సహకారంతో పార్టీ పురోభివృద్ధికి తోడ్పడతానన్నారు. తనతోపాటు మరికొందరు నేతలు కాంగ్రెస్ట్‌లో చేరుతారని, త్వరలో పేర్లు వెల్లడిస్తామని పోట్ల చెప్పారు. ఈ సమావేశంలో పోట్ల నాగేశ్వరరావుతో పాటు టీఆర్ఎస్కు రాజీనామా చేసిన పంతంగి వెంకటేశ్వర్లు ఉన్నారు. -
టీఆర్ఎస్లో ఇమడలేకపోతున్నా
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా అధికార టీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ఆయనే స్వయంగా చెప్పారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ పార్టీలో ఇమడలేకపోతున్నానని వాపోయారు. కేసీఆర్ పాలన నిజాం ఏలుబడిని తలపిస్తోందని విమర్శించారు. సచివాలయానికి రాకుండా ఉన్న ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి.. కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ప్రోత్సాహంతో పోట్ల నాగేశ్వరరావు పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. గత ఐదారురోజులుగా వీరిద్దరితో ఆయన భేటీ అయ్యారు. పోట్ల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరితే పార్టీ పరంగా జిల్లాస్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ఆయన అనుచరులు భావిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2009లో స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన పోట్ల 2015 వరకు టీడీపీ తరఫున కొనసాగారు. 2016లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీడీపీలో సీనియర్ నాయకుడిగా, పలుసార్లు సుజాతనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన పార్టీలో రాష్ట్రస్థాయి పదవులు పొందారు. -
కాంగ్రెస్ గూటికి పోట్ల.. టీఆర్ఎస్కు షాక్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రేవంత్‌రెడ్డి రాజీనామా వ్యవహారం రాష్ట్రంలోని టీడీపీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుండగా.. జిల్లాలోని అధికార టీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేత రేవంత్‌రెడ్డితో జిల్లా టీడీపీ నాయకుల అనుబంధాన్ని పరిగణనలోకి తీసుకుని అనేక మంది నేతలు ఆయన బాటలో నడుస్తారని భావించినప్పటికీ టీడీపీ ముఖ్య నేతలు మాత్రం తమ నిర్ణయాన్ని ప్రకటించకుండా పార్టీలోనే కొనసాగుతున్నారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నేత పోట్ల నాగేశ్వరరావు ఆదివారం కొడంగల్‌లోని రేవంత్‌రెడ్డి నివాసంలో ఆయనతో భేటీ కావడంతో అధికార పార్టీలో చర్చనీయాంశమైంది. కొంతకాలంగా టీఆర్ఎస్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పోట్ల పార్టీలో సరైన గుర్తింపు లేదని మథన పడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2009లో స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన పోట్ల 2015 వరకు టీడీపీ తరఫున కొనసాగారు. జిల్లాలో సంభవించిన అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2016 ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలో సీనియర్ నాయకుడిగా, పలుసార్లు సుజాతనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నేతగా..పార్టీలో రాష్ట్రస్థాయి పదవులు చేపట్టిన నేతగా పేరొందిన పోట్ల కాంగ్రెస్ వైపు చూడటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆదివారం రేవంత్‌రెడ్డిని కలిసిన పోట్ల నాగేశ్వరరావు ఆయనతో జిల్లా రాజకీయ అంశాలు చర్చించినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో చేరే జాబితాలో పోట్ల నాగేశ్వరరావు పేరును చేరుస్తున్నారని రేవంత్‌రెడ్డి నేరుగా పోట్లతో చెప్పినా.. పోట్ల మాత్రం తాను నిర్ణయం తీసుకునేందుకు సమయం కావాలని కోరినట్లు సమాచారం. రేవంత్‌రెడ్డిని కలిసిన 24 గంటల్లోపే పోట్ల నాగేశ్వరరావు సోమవారం సాయంత్రం కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరిని కలిశారు. ఆమెతో సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. బుజ్జగింపు యత్నాలు కాగా.. పోట్ల నాగేశ్వరరావు టీఆర్ఎస్ను వీడుతున్న అంశం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. దీంతో సోమవారం హైదరాబాద్‌లో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మె ల్యే పువ్వాడ అజయ్‌కుమా ర్ పోట్లను బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు తెలు స్తోంది. అయితే పార్టీలోకి వచ్చాక తనకు ఎటువంటి ప్రాధాన్యత లభించడం లేదని, పార్టీలో చేరినప్పుడు గుర్తింపు ఇస్తామని చెప్పినా.. పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. సోమవారం సాయంత్రం పోట్ల హైదరాబాద్‌లో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరిని కలిసి జిల్లాలో రాజకీయ పరిస్థితులు, పార్టీ పరిస్థితుల గురించి, తన రాజకీయ భవిష్యత్ గురించి సమగ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో రేణుకా చౌదరి కలిసికట్టుగా కాంగ్రెస్‌ను బలోపేతం చేద్దామని, పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చినట్లు పోట్ల వర్గీయుల ద్వారా ప్రచారం జరుగుతోంది. అయితే స్నేహితుడిగా, టీడీపీలో సహచరుడిగా రేవంత్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరే అంశంపై సమాలోచన జరిపినా.. ఆయనతోపాటు మాత్రం కాంగ్రెస్‌లో చేరకుండా .. కొంత సమయం తీసుకోవాలని నిర్ణయించారు. ఒకటి, రెండు తేదీల్లో తన అనుచరులతో పార్టీ మారే అంశంపై సమాలోచనలు చేసి వారి అభీష్టం మేరకు కాంగ్రెస్‌లో చేరే అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈనెల 9న అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మహబూబాబాద్‌లో జరిగే గిరిజన సదస్సులో పాల్గొనే అవకాశం ఉంది. ఈలోపే పోట్ల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక టీడీపీలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు పలువురు అధికార పార్టీవైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కల్లూరుకు చెందిన వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ యాదయ్య, తల్లాడకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఒకరు, ఖమ్మంకు చెందిన టీడీపీ జిల్లా మాజీ కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. పోట్ల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరితే పార్టీ పరంగా జిల్లాస్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు పోట్ల అనుచరులు భావిస్తున్నారు. ఈ అంశంపై మాజీ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నేత పోట్ల నాగేశ్వరరావుతో ప్రస్తావించగా.. టీఆర్ఎస్ పార్టీ పట్ల తనకు అసంతృప్తి ఉన్న మాట వాస్తవమని, కాంగ్రెస్‌లో చేరే అంశాన్ని తన సహచరులు, అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ఖమ్మంలో తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. -
టీఆర్ఎస్లోకి టీడీపీ అధికార ప్రతినిధి
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలనుంది. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు వరుసగా సైకిల్ దిగి.. కారు ఎక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా టీడీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా టీఆర్ఎస్లో చేరనున్నట్లు పోట్ల నాగేశ్వరరావు ఆదివారమిక్కడ ప్రకటించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మంతనాలు జరిగిన అనంతరం పోట్ల నాగేశ్వరరావు తన రాజకీయ భవిష్యత్‌పై ప్రకటన చేశారు. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు చెప్పారు. తెలంగాణలో పటిష్టమైన నాయకత్వాన్ని టీడీపీ తయారు చేయలేకపోయిందని, అందుకు నిదర్శనం గ్రేటర్ ఎన్నికల ఫలితాలేనని పోట్ల వ్యాఖ్యానించారు. -
కేసీఆర్ పాలనలో ప్రగతి శూన్యం
ఖమ్మం స్పోర్ట్స్ : కేసీఆర్ పాలనలో ప్రగతి శూన్యమని ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు వ్యా ఖ్యానించారు. వంద రోజుల్లో అంగుళం కూడా అభివృద్ధి జరగలేదన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బంగారు తెలంగాణ నిర్మిస్తామని చెబుతున్న కేసీఆర్ ఉద్యోగుల ఇంక్రిమెంట్లు తప్ప మరే విషయంలోనూ నిర్ణయం తీసుకోలేదని విమర్శిం చారు. సాగునీరు ప్రధాన వనరులైన ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టులు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు పనులను ఎప్పుడు మొదలు పెడుతారో చెప్పాలన్నారు. అర్హులను కూడా అనర్హులుగా చిత్రీకరించేందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర సర్వే నిర్వహిం చిందని విమర్శించారు. అధికార దాహంతోనే తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కొండబాల కోటేశ్వరరావు తదితరులు టీడీపీ వీడీ టీఆర్ఎస్లో చేరారని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందే పార్టీని వీడాల్సిందన్నారు. ఎన్నికల్లో పోటీచేసి ఓడిన తర్వాత పార్టీని వీడటం సరికాదన్నారు. జడ్పీ చైర్పర్సన్ పదవిని కవితకు కట్టాబెట్టాలనే దురుద్దేశంతో టీడీపీలోనే ఉంటానని పార్టీ అధినేత చంద్రబాబును తుమ్మల మోసం చేశారని విమర్శించారు. విలేకరుల సమావేశంలో టీడీపీ జిల్లా నాయకులు మందడపు రామకృష్ణ, కొడకంటి ఆంజనేయులు, ఎం. హనుమంతరెడ్డి, మందనపు భాస్కరరావు, మార్కంపుడి వెంకటేశ్వర్లు, షరీఫ్, ఎస్.కె. పాషా పాల్గొన్నారు. -
‘సార్వత్రిక’ సెగ..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లా రాజకీయం పూర్తిస్థాయిలో రసకందాయంలో పడింది. సాధారణ ఎన్నికలలో కీలకఘట్టమైన నామినేషన్ల పర్వానికి తెరలేస్తుండడంతో జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల్లో కదలిక వచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వర్గపోరు, అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న ఈ రెండు పార్టీలు కనీసం ఇంతవరకు అధికారికంగా ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేకపోయాయి. సీపీఐతో పొత్తు వ్యవహారం జిల్లాలో కీలకం కావడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థుల ఖరారు ప్రక్రియ ఓ కొలిక్కి రాలేదు. ఇక, బీజేపీతో పొత్తు కుదుర్చుకునే అంశం జిల్లాలో పెద్దగా ప్రభావం చూపనప్పటికీ, నామా, తుమ్మల వర్గాల పోరుతో టీడీపీ ఆశావాహులు కుదేలవుతున్నారు. మిగిలిన రాజకీయ పక్షాలు అభ్యర్థుల ఖరారు, పొత్తుల విషయంలో కొంత మేర ముందుకెళ్లినా, వాటిలో కూడా పూర్తిస్థాయి స్పష్టత రావాల్సి ఉంది. బీసీలకు టికెట్ వచ్చేనా? జిల్లా కాంగ్రెస్‌లో మునుపెన్నడూ లేని విధంగా అసెంబ్లీ, పార్లమెంటు టికెట్ల కోసం ఆశావాహులు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. ఎంపీ రేణుకాచౌదరి, మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి వ ర్గీయులు టికెట్ల కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఇటు హైదరాబాద్, అటు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రమయిన ఖమ్మం అసెంబ్లీ స్థానం ఎవరికివ్వాలన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పినపాక, కొత్తగూడెం అసెంబ్లీ స్థానాల విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. సీపీఐతో పొత్తులో భాగంగా ఆ రెండు స్థానాల్లో ఏ స్థానంలో పోటీచేయాలన్న దానిపై కాంగ్రెస్ పార్టీలో స్పష్టత లేకుండా పోయింది. భద్రాచ లం, అశ్వారావుపేట లాంటి సిట్టింగ్ స్థానాల్లో పాత వారికే టికెట్లిస్తారని చెబుతున్నా ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. మిగిలిన స్థానాల్లో కూడా స్పష్టత లేకపోయినా పాలేరు నుంచి మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, మధిర నుంచి డిప్యూటీ స్పీకర్ మల్లుభట్టివిక్రమార్క పేర్లకు మాత్రం ఢోకాలేదని పార్టీ వర్గాలంటున్నాయి. అయితే, ఖమ్మం అసెంబ్లీ సీటుకు వనమా వెంకటేశ్వరరావు పేరు కొత్తగా తెరపైకి వచ్చింది. సీపీఐతో పొత్తు కుదిరితే కొత్తగూడెంను సిట్టింగ్ కోటాలో సీపీఐకి ఇవ్వాల్సిన పక్షంలో జిల్లాలో మిగిలిన రెండు జనరల్ స్థానాల్లో ఒకటి బీసీకివ్వాలని హైకమాండ్ వద్ద టీపీసీసీ నేతలు గట్టిగా పట్టుబడుతున్నారు. రెండింటిలో పాలేరు నుంచి మంత్రి రాంరెడ్డి బరిలో ఉంటారు కాబట్టి ఇక మిగిలింది ఖమ్మం ఒక్కటే. ఖమ్మంలో ఇప్పటికే పలువురి పేర్లు వినిపిస్తుండగా, అనుహ్య పరిణామాల మధ్య వనమా పేరును కూడా సీరియస్‌గా పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం. ఖచ్చితంగా బీసీలకివ్వాల్సి వస్తే... వనమాకు ఖరారవుతుందని, లేదా మరో బీసీ నాయకుడు వద్దిరాజు రవిచంద్రకు టికెట్ ఖరారవుతుందని ప్రచారం జరుగుతోంది. రేణుక కూడా తన వర్గానికి టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సుల్తాన్ కూడా ఢిల్లీలో తనకున్న పలుకుబడిని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. ఆర్థిక సహకారం లేకపోతే ఎలా? ఇక, జిల్లా టీడీపీ వ్యవహారం అధినేత చంద్రబాబు నివాసానికి చేరింది. మంగళవారం సాయంత్రం పార్టీ జిల్లా నేతలు ఆయన నివాసంలో చంద్రబాబును కలిసి టికెట్ల కేటాయింపుపై చర్చలు జరిపారు. మాజీ మంత్రి తుమ్మల, ఆయన వర్గీయులు సండ్ర వెంకటవీరయ్య, బాలసాని లక్ష్మీనారాయణతో పాటు ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణకు ఇవ్వాల్సిందేనని పార్టీ నేతలు చంద్రబాబును గట్టిగా అడిగినట్టు సమాచారం. తమ వర్గం నాయకులమంతా ఈనెల తొమ్మిదిన నామినేషన్లు వేస్తున్నామని, ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, అశ్వారావుపేట అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు వేస్తామని అధినేతకు వివరించారు. ఇక, ఖమ్మం పార్లమెంటు అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును ఖరారు చేస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని, అయితే తన పార్లమెంటు పరిధిలోకి వచ్చే అసెంబ్లీ అభ్యర్థులందరికీ ఆయన ఆర్థిక సహకారం చేసేలా ఒప్పందం చేయాలని జిల్లా టీడీపీ నేతలు చంద్రబాబును కోరారు. తన వర్గానికి చెందని వారిని పక్కనపెట్టాలని, ఆయా నియోజకవర్గాల్లో తానే సొంతంగా ముందుకెళ్లాలని నామా ప్రణాళిక రూపొందించుకుంటున్నారని, ఇది అసెంబ్లీ ఫలితాలపై ప్రభావం చూపుతుందని వారు వివరించారు. అందుకు నామా అంగీకరించని పక్షంలో తమ పక్షాన తుమ్మల నాగేశ్వరరావు ఎంపీగా బరిలోకి దిగేందుకు సిద్ధమని కూడా వారు ప్రతిపాదించినట్టు సమాచారం. జిల్లా నేతల అభిప్రాయాలను విన్న చంద్రబాబు అన్నీ తాను సర్దుబాటు చేస్తానని హామీ ఇచ్చినట్టు తెలుగుదేశం వర్గాల భోగట్టా.